Menu

నవతరంగం ఎప్పుడు? ఎలా?

కళ్ళముందే కాలం పరుగెడుతోంది. మనకోసం ఒక్క క్షణమైనా ఆగదని తెలిసిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి జీవితమంతా హడవుడి, గందరగోళం.కాసేపాగి ప్రపంచాన్ని ఆస్వాదిద్దామంటె ఈ బతుకు బాటలో వెనక్కిపడిపోతామేమోమోనని అనుమానం, భయం. క్షణాల్లో అమెరికాలో జరుగుతున్న విష్యాలను సైతం తెలుసుకోగలిగినంతగా కమ్యూనికేషన్ వ్యవ్యస్థ అబివృధ్ధి చెందినప్పటికీ పక్కింటివాడితో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేని దీనస్థితి మనది. దేనికీ టైము లేదు. ఉన్న టైములో ఏం చేస్తున్నామో తెలియదు. నెలకు మూడువేల జీతంతో జీవితాన్ని నెట్టుకొచ్చిన రోజులు పోయి ఇప్పుడు రోజుకు మూడువేల జీతమొచ్చినా బతుకు భారమైన పరిస్థితి మనది. ఎంత కాదన్నా మన జీవితాలు గత పదేళ్ళతో పోలిస్తే చాలా మారిపోయాయి. కనీసం పక్క రాష్ట్రపు సరిహద్దులైనా దాటని వాళ్ళు సప్త సముద్రాలు దాటి ఒక రోజు ఇంగ్లాండులో వున్నవాడు తెల్లవారితే అమెరికాలో ప్రత్యక్షమయ్యే స్థాయికి మన జీవితాలు మారిపోయాయి. మొన్న మొన్నటి వరకూ అమెరికా ఒక స్వప్నమే! నేడు ఇంటికొకరు అమెరికాలో తిష్టవేస్తున్నారు. డాలర్స్ గురించి డ్రీంస్ అవసరం లేదు. ఎంచక్కా కట్టలు కట్టలు ఇంటికి పంపనూ వచ్చు. ఇక్కడ మన దేశంలో కోట్లకు పడగలెత్తనూ వచ్చు. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ గత 10 ఏళ్ళ ముందుతో పోలిస్తే పరిస్థితి సులభతరమైదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. లక్షకెన్ని సున్నాలుంటాయో కూడా తెలియని వాళ్ళు తమ బ్యాంకు ఖాతాల్లో ఎన్ని కోట్లున్నాయో తెలియనంతగా ఎదిగిపోయారు. ప్రపంచంలోని అన్ని పట్టణాలకు ధీటుగా మన పట్టణాలూ హంగు, ఆర్భాటాలు కొని తెచ్చుకున్నాయి. తాగాడానికి నీళ్ళు లేని మారిమూల గ్రామాల్లో సైతం పెప్సీ, కోక్‌లకు ఢోకా లేదు. మనుషులు మొబైల్ ఫోన్లలో తప్పితే మాట్లాడడం మానేసారు.

కాలాని గిర్రున పాతికేళ్ళకు వెనక్కి తిప్పితే మనమేనా ఇలా మారిపోయింది! అనిపిస్తుంది. ఇంపోర్టెడ్ కార్లు, అద్దాల భవనాలు, మల్టిప్లెక్స్‌లు, బడా షాపింగ్ మాల్‌లు పరుగెట్టే జీవితాలు, క్షణం తీరికలేని జీవితాలు. చూస్తుండగానే కాలం మారిపోయింది పట్టణపోల్లకి. ఈ పట్టణపు పోకడలు పల్లెటూళ్ళకు ఇప్పుడిప్పుడే సోకుతున్నాయి. మన జీవితాలన్నీ మార్పు దిశగా పయనిస్తున్నాయి. మనతోపాటే మనకు సంబంధించిన విషయాలన్నీ మారిపోతున్నాయి.

ప్రపంచంలో ఏ మూలనుంచో నేను రాస్తున్న ఈ వ్యాసం ఇండియాలోని మారుమూల గ్రామంలోనైనా ఇంకో కొద్ది గంటల్లో చదవగలిగే అవకాశం కలుగుతుందంటే ఒక ఐదేళ్ళ క్రితం నమ్మశక్యం కాని విషయం, ఇప్పుడు మన కళ్ళముందు ఋజువైన సత్యం.టెక్నాలజీతో అన్నీ మారిపోతున్నాయి.బ్యాంకులు మారాయి, బారులు మారాయి, బడులు మారాయి, కాలేజీలు మారాయి. బస్సులు మారాయి, రైళ్ళు మారాయి. ఫోన్లు మారాయి, పోస్టాఫీసులూ మారాయి. ఇళ్ళూ మారాయి, ఇంట్లో హంగూలూ మారాయి. TV లు మారాయి, సినిమా హాళ్ళూ మారాయి. TV చానళ్ళు మారాయి కానీ సినిమాలు మారలేదు. ఇన్నిమారినా సినిమాలు మాత్రం ఎందుకు మారలేదు? ఇది కష్టమైన ప్రశ్నే కదూ! ఒక వేళ మారాయేమో మనం గమనించలేదోమో! ఏమో!

గత ఇరవై ఐదేళ్ళగా యగ్నం లా సినిమాలు చూస్తున్న నాకు మన సినిమాలు మారాయి అని మాతరం అనిపించటం లేదు. ఒక వేల ఏమైనా మార్పు కనిపిస్తుంది అంటే అది సినిమాల నాణ్యత దిగజారడంలోనే కానీ ఏమాత్రం ఎదుగుదల మాత్రం కానరావటంలేదు. ఇప్పటికే సినిమాల్లో నిలదొక్కుకున్న టెక్నీషియన్స్, నటులు, నిర్మాతలు ఈ పరిస్థితికి కారణం మూలాన, తమ తప్పులు తామే ఒప్పుకునే మనస్తత్వం అందరికీ సాధ్యం కాదు కనక ఈ మార్పు తేవడం కొత్తవారివల్లనే సాధ్యమని నా అభిప్రాయం.

కానీ ఎవరీ కొత్త వాళ్ళు? ఎక్కడినుంచి వస్తారు వీళ్ళు? మనలోనుంచే! ఈ రోజు Orkut లో వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది తెలుగు సినిమా ఔత్సాహికులు ఎంతమందో! నాకు తెలిసిన ఒక వంద మంది భవిష్యత్ ప్రణాళికల్లో కనీసం ఇరవై మందైనా సినిమా తీయాలనే ఆలోచనల్లో వున్నారంటే మన వాళ్ళు చాలా మందే అవకాశం దొరికితే సినిమాలు తీసి మనమీదకొదల్డానికి సిధ్ధమైపోయారన్న్నమాట. కానీ వీరిలో చాలమందికి సినిమాలమీద ఆసక్తి తప్పితే సినిమా అనే ప్రక్రియ గురించి సరైన అవగాహన, పరిజ్ఞానం లేదన్నది దయనీయ సత్యం. ఇప్పుడున్న సినిమా దర్శకులు, నటులు, టెక్నీషియన్స్ అనుభవిస్తున్న star status ని తాము కూడా అనుభవిద్దామనే తపన లోలోపల వీరిలో కనిపిస్తుంది. అసలు సినిమా అంటె ఏంటి? సినిమాలకూ జీవితానికున్న సంబంధమేంటి? సినిమాలు మన జీవితంలో వహిస్తున్న పాత్ర ఏంటి? సినిమా ఎలా తీయాలి? తీయడానికి కావలసిన భాష, నేర్పు, సినిమా భాషకున్న వ్యాకరణం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మంది ఔత్సాహిక దర్శకుల్లో లోపించడమే అసలైన తప్పు. ఇదే ప్రస్తుత సినిమాల దుస్థితికి మూలకారణం. ఎందుకు ఈ తప్పు జరుగుతోంది అంటే అందుకు కారణాలు అనేకం.

1) అతి త్వరగా డబ్బులు సంపాదించడానికి సులువైన మార్గం సినిమా
2) ఊరూ పేరూ లేని అనామకుడైనా అసమానమైన కీర్తి పర్తిష్టలు గడించడానికి వంతెన సినిమా
3) రంభ, ఊర్వశులను తలదన్నే అందగత్తెలతో సరస సల్లాపాలు జరపాలనుకునే కలను నిజం చేసే సాధనం సినిమా
4) చేతిళో నాలుగు రాళ్ళుంటే మొహానికి రంగేసుకుని నేనూ “హీరో” నని మురిసిపోవడానికి అనువైన మార్గం సినిమా
5) అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుతం వస్తున్న సినిమాలు చూసి “ఈ మాత్రం సినిమాలు మేమూ తీయగలం” అనుకునే ఒక ధీమా సినిమా.

నిజానికి ఇది మన అలోచనా విధానంలో దొర్లిన తప్పు కాదు. సినిమాల గురించి చిన్నప్పటినుంచీ మన మనసుల్లో అలాంటి చిత్రాన్ని ముద్రించిన మీడియా, ప్రజలు ఈ తప్పులో ముఖ్య భాగస్వాములు.

సినిమాలు తీయాగలమనుకునేంత సులభమైన విషయం కాదు. సినిమా తీయాలనుకునేంత సులభంగా ఒక పుస్తకం రాయాలనో, ఒక పెయింటింగ్ చేయాలనో, ఒక శిల్పం చెక్కాలనో మనకనిపించదు. దీన్ని బట్టిచూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. సినిమాలు తీయాలనుకునే చాలామందిలో కళలపై ఏమాత్రం ఆసక్తి లేకపోవడమే! అందుకే సినిమానో కళ లా చూడడం మనకి కలగానే మిగిలిపోయింది. ఒక రాంగోపాల్ వర్మ శివ తీసి ఎక్కడికో వెళ్ళిపోయాడని మనమూ అలానే అయిపోదామనే తపన తప్పితే ఆయన English సినిమాలను టెక్స్టుబుక్కులాగా చదివి అవగాహన చేసుకున్నారన్న విషయం చాలామందికి జ్ఞప్తికి రాదు. అదీకాక మిగిలిన కళలమాదిరి సినిమాకి పెద్దగా శ్రమా, సృజనాత్మకతా అవసరంలేదు. నాలుగు ఇంగ్లీషు సినిమాలు చూస్తే స్క్రిప్ట్ రెడీ, నలుగురు అసిస్టెంట్లు వుంటే సినిమా దాని పాటికదే తయారయిపోతుంది. కామెడీ ట్రాక్ రాసే వాళ్ళూ వుండనే వున్నారు. రెండర్థాలతో జింగుచక జింగిచకా అని పాటలు రాసేసే వాళ్ళూ వేలమంది, ఫైటుమాస్టర్లూ, డ్యాన్స్ డైరెక్టర్లూ వుండగా తెలుగు సినిమాకి దర్శకత్వం చేయడం పెద్ద ఘనతేమీ కాదు. పడవలిసిన కష్టమల్లా ఒక చాన్స్ దొరకబుచ్చుకోవడమే! అదృష్టం బావుంది ఛాన్స్ దొరికిందా ఇంకేముంది సెలెబ్రిటి స్టేటస్, డబ్బుకు డబ్బు, పేరుకు పేరు. ఇవన్నీ కోరుకోవడంలో తప్పులేదు. జీవితంలో ఎవరి priorities వారికుంటాయి. కానీ మంచి సినిమా తీయగా వచ్చిన ఫలితం ఆ సుఖమైతే ఫర్వాలేదుగానీ ఈ సుఖాల్ని పొందడానికి సినిమానొక మార్గంగా ఎన్నుకోవడం తప్పని నా అభిప్రాయం. అది కళకు ఒక కళకారుడు తలపెట్టిన ద్రోహం అవుతుంది.

ప్రస్తుత మన జనాభా, నానాటికీ పెరుగుతున్న శాటిలైట్ చానళ్ళు మరియు సినిమా హాళ్ళు, విస్తృతంగా ఎదుతుతున్న ఇంటర్నెట్ సౌకర్యం, దృష్టిలో పెట్టుకుని చూస్తే ఒక రకంగా మన సినీ పరిశ్రమకు సినిమా దర్శకుల కొరత ఏర్పడిందనే చెప్పాలి. అంతే కాకుండా కొత్తగా వచ్చిన డిజిటల్ వీడియో విప్లవంతో సినిమాలు తీయడం అనేది అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనికాదని నిరూపణ అయిపోయింది. కళాతక దృష్టితో సినిమాలు తీయాలనుకునే వాళ్ళకిది మంచి తరుణం.సినిమాల ద్వారా మన జీవితాలను ప్రతిబింబింప చేయడానికి ఇది ఒక సదవకాశం.

సినిమా జీవితం యొక్క ప్రతిబింబం. అలాగే జీవితం కూడా ఒక్కోసారి సినిమాలను ప్రతిబింబిస్తుంది. మారుతున్న సమాజాన్ని దృష్టిలో పెట్టుకోకపోవడమే నేటి మన సినిమా యొక్క ఘోర తప్పిదం. రాబోయే కాలానికి కాబోయే దర్శకులు ఈ విష్యాన్ని గమనించాలి. మన సినిమాల్లో మార్పు తేవాలి. మన సినిమాలు ఇప్పుడు మారకపోతే ఇంకెప్పుడూ మారవన్నది ఘోర సత్యం.

అయితే ఈ మార్పు ఒక్కరి వల్ల సాధ్యం కాదు. కొత్తగా సినిమాలు తీయాలనుకునే వారిలో ఒక చైతన్యం రావాలి. తమ ఆలోచనా శైళిని మార్చుకోవాలి. ప్రతివక్కరూ తమని తాము ప్ర్శ్నించుకోవాలి. అసలు సినిమా ఎందుకు తీయాలి? సినిమా ఎలా తీయాలి? అన్న ప్రశనలకు సమాధానాలు వెతుక్కోవాలి. కొంతమంది ఆధిపత్య చట్రంలో ఇరుక్కుపోయిన సినిమాకి మళ్ళీ కొత్త కాంతులు తేవాలి. మరో జన్మ నివ్వాలి. వినడానికి, చదవడానికి ఇదంతా అసాధ్యంగా తోచినప్పటికీ ప్రపంచ దేశలెన్నింటిలోనో ఇలాంటి మార్పులు సంభవించాయి. ఇంగ్లాండ్, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, చిలీ, ఇరాన్, తైవాన్, హాంగ్‌కాంగ్ లాంటి ఎన్నో దేశాల్లో New Wave పేరుతో కొత్త తరహా సినిమాలు వెల్లువడ్డాయి.ఈ దేశల్లో జరిగిన ఈ సినీ వుద్యమాల గురించి నవ యువ దర్శకులు తెలుసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఫ్రాన్స్ దేశంలో ఎగిసిన నవ సినీ కెరటం “La Nouvelle Vague” అనే సినీ వుద్యమం గురించి, ఆ వుద్యమ పుట్టు పూర్వోత్తరాల గురించి, ఆ వుద్యమం ద్వారా వెలువడిన సినిమాలు, నవీన దర్శకులు, వారి దర్శకత్వ శైలి గురించి తెలుసుకోవడం మనకెంతో మార్గదర్శకమవుతుందని నా వుద్దేశం.

తెలుగు ప్రేక్షకులకు French New Wave Cinema, Italian neo-realism తోపాటు మిగిలిన దేశాల్లో వచ్చిన సినీ ఉద్యమాలతో పాటు ఆ ఉద్యమాల ఫలితంగా రూపొందించబడిన సినిమాలని వివరంగా తెలియచెప్పే ప్రయత్నం త్వరలో నవతరంగంలో మొదలుకాబోతుంది. వేచిచూడండి.

6 Comments
  1. bhanu prakash May 28, 2008 /
  2. విష్ణుభొట్ల లక్ష్మన్న May 28, 2008 /
  3. Desi May 29, 2008 /
  4. Uttara May 30, 2008 /
  5. Uttara May 30, 2008 /