Menu

నవతరంగం

తెలుగు సినిమా పరిశ్రమ మొదలయ్యి ఇప్పటికి 75 సంవత్సరాలు అయ్యింది. సినిమా అనే ప్రక్రియ ఉన్న ప్రతిదేశం లోనూ సినిమాతోపాటు, సినిమాకి సంబంధించిన వ్యాసంగ రచన కూడా బాగానే జరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో 75 సంవత్సరాల చరిత్రలో సినిమా గురించి ఎన్ని మంచి పుస్తకాలు ప్రచురించబడ్డాయో తెలియదు కానీ తెలుగు చిత్రసీమ లో సినిమా గురించి వ్రాసిన విశ్లేషణా వ్యాసంగం యొక్క కొరత మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చాలా చోట్ల (పత్రికల్లో, బ్లాగుల్లో, వెబ్‌సైట్లలో) సినిమాల గురించి వ్రాయబడుతున్నప్పటికీ అంతా మొక్కుబడి వ్యవహారం లానే అనిపిస్తుంది. ప్రపంచంలోని ఎన్నో దేశాలకు చెందిన సినిమాలు నానాటికీ నవీన పధ్ధతులతో వికసిస్తున్నాయి. మన తెలుగు సినిమా కూడా విశ్వ విఖ్యాతి గాంచాలంటే మనకి మంచి సినిమాలతో పాటు ప్రపంచ సినిమాలో నేడు ఏరపడుతున్న నవీన పధ్ధతులను తెలియచేసే పత్రిక అవసరం ఎంతో వుంది.అలాగే గతంలో వచ్చిన అధ్భుత కళాఖండాలను పరిచయంచేస్తూ వాటి ద్వారా నేర్చుకోగలిగిన అంశాలను తెలియచేసే పత్రిక యొక్క ఆవశ్యకత ఇప్పుడు వుంది.

పది పదిహేనేళ్ళక్రితం కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే అందుబాటులో వుండే ఎన్నో సదుపాయాలు నేడు సగటు మనిషికీ లభ్యమవుతున్నాయి. ఆ రోజుల్లో ఒక జాపనీస్ సినిమానో, లేక ఇటాలియన్ సినిమానో చూడాలంటే సగటు మనిషికి దాదాపు అసాధ్యమే. కానీ నేటీ పరిస్థితి వేరు. కోకొల్లలుగా DVD షాపులు ఆవిర్భవించాయి. అలాగే అంతర్జాలం లో కూడా సినిమాలు చూసే అవకాశం కలుగుతోంది. ఒక విధంగా ఇప్పుడు మనకి కావలసిన సమాచారం అందుబాటులో వుంది, కానీ సినిమా విషయానికొస్తే, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న వేలకొలదీ చిత్రల్లో ఏది మంచిది,ఏది కాదు అని తెలుగు ప్రేక్షకునికి తెలియచేయగలిగే ఒక మంచి సదుపాయమే లేదు.

తెలుగు సినీ ప్రపంచంలో ఏర్పడిన ఆ కొరత కొంతలో కొంతైనా తీర్చే ఉద్దేశంతో స్థాపించబడిందే ఈ నవతరంగం.తెలుగు వారికి ఇలాంటి సమాచారం అందుబాటులోకి తేవడం ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. అందుకే సినిమా అంటే ఆసక్తి కలిగిన పది మంది సహాయ సహకారాలతో ఈ అంతర్జాల పత్రిక స్థాపించడం జరిగింది. ఏడాది పొడుగునా, ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సినిమాల సమీక్షలు, క్లాసిక్ సినిమాల గురించి పరిచయాలు, విశ్లేషణా వ్యాసంగం తో పాటు ప్రముఖులతో ఇంటర్వ్యూలు కూడా ఈ వెబ్ సైట్ ద్వారా అందచేయాలన్నది మా ఆకాంక్ష.

మేమే కాదు సినిమాల పై ఆసక్తి కలిగిన ఎవరైనా ఈ ప్రయత్నంలో పాలుపంచుకోవచ్చు. సినిమాలపై అత్యంత ఆసక్తి కలిగి ఒక వేళ మీరు రెగ్యులర్ గా నవతరంగంలో మీ వ్యాసాలు ప్రచురించదలుచుకుంటే మీరు ఇక్కడ సభ్యులు కావొచ్చు. లేదా సినిమాకు సంబంధించిన ఏదైనా అంశంపై మీ అభిప్రాయం తెలియచేయదల్చుకుంటే మీ వ్యాసాలు కూడా మాకు పంపవచ్చు. ఆసక్తి కలిగిన వారు navatarangam [@] gmail [.] com కు ఈమెయిల్ చేయగలరు.

మీరు సభ్యత్వం కోసం ప్రయత్నిస్తుంటే మీ మెయిల్ సబ్జెక్ట్ Membership గానూ, లేదా వ్యాసం పంపిస్తుంటే Article:మీ వ్యాసం యొక్క టైటిల్ గానూ వుండేలా ప్రయత్నించగలరు.

మా  ప్రయత్నాన్ని ఆదరించి మీ సహాయ సహాకారాలతో పాటు, మీ విమర్శలు, సలహాలనూ తెలియచేయండి.