Menu

మహెక్-ఒక సమీక్ష

mahek-1.JPGగత సంవత్సరం వివిధ సినిమా ఉత్సవాలలో Frozen సినిమాతో మన పరువు కొద్దో గొప్పో కాపాడిన శివాజీ తోపాటు మరో నవ యువ దర్శకుడు Kranti kanade తన సినిమా Mahek ద్వారా ఫర్వాలేదనిపించాడు. పూనే లోని Film and Telivision Institute of India లో Film making లో పట్టా పొంది తన తొలి లఘు చిత్రం ఛైత్ర తో జాతీయ స్థాయిలో ఉత్తమ లఘు చిత్రం అవార్డు సాధించిన పిమ్మట తన మొదటి పూర్తి స్థాయి చలనచిత్రంగా Mahek సినిమాను రూపొందించిన క్రాంతి కనాడే మొదటి సినిమాతోనే మంచి దర్శకుడిగా పేరు సాధించాడు.

కథా పరంగా ఈ సినిమా మహెక్ మిర్జా అనే పదకొండేళ్ళ అమ్మాయి కథ. మహెక్ అందరు పిల్లల లాగే పెద్దయ్యాక దేశానికి ప్రెసిడెంట్ అవ్వాలనీ, ఆపదలో వున్న వాళ్ళని రక్షించి సాహస బాలికగా అవార్డు పొందాలనీ కలలు కంటూ వుంటుంది. మిగిలిన పిల్లలతో మహెక్ కు వున్న సామ్యం అంతటితోనే ముగుస్తుంది. మిగిలిన పిల్లలతో పోలిస్తే ఆ అమ్మాయికున్న ప్రత్యేకత ఏంటంటే పగలూ రాత్రీ తేడా లేకుండా స్వప్నలోకంలో విహరిస్తూంటుంది ఈ అమ్మాయి. (పగటి)కలలే ఈమె ప్రపంచం.

ఈ కలలు ఒక్కోసారి సరదాగానే వున్న ఒక్కోసారి ఆమెను అత్యంత కష్టానికీ గురిచేస్తుంటాయి. ఇలా కలల లోకంలో మునిగిపోయే ఒకసారి దాదాపుగా నీళ్ళల్లో మునిగిపోయి ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంది. తన కలల ప్రపంచం వలన ఏదో సాదించినట్టు అనిపించినా ఇంతలోనే నిజమైన ప్రపంచంలోకి వచ్చిపడే సరికి నవ్వులాటకు గురవుతూండడంతో తనలో వున్న సమస్యను గ్రహిస్తుంది. ఎలా ఈ సమస్యను అధిగమించి నిజ జీవితంలో తను అనుకున్నది సాధించాలి అని ఆలోచలనో పడుతుంది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఆ అమ్మాయికి ఒక ఆధునిక దేవదూత ఎదురవుతుంది.ఆమె సలహాల ద్వారా మహెక్ చివరకు తన ప్రత్యేకతను తెలుసుకుని తను అనుకున్నది ఎలా సాధించింది అన్నది ఈ సినిమా మిగిలిన కథాంశం.

సంవత్సరానికి దాదాపు 500కి పైగా సినిమాలను నిర్మించే మన దేశం అందులో కనీసం ఒక్క శాతం సినిమాలైనా బాలల కోసం ప్రత్యేకంగా నిర్మించిన సినిమాలు వుండవు. ఈ మధ్య వచ్చిన The Blue Umbrella సినిమా తప్పితే ఈ సంవత్సరంలో వచ్చిన వేరే బాలల సినిమాలేవీ లేవనే అనుకుంటాను. ఈ లిస్టులో చేర్చదగిన మరో సినిమా ఈ Mahek. Chidrens Film Society చే నిర్మింపబడిన ఈ సినిమా ఇక్కడ లండన్ చలన చిత్రోత్సవంలో ప్రేక్షకులను బాగా నవ్వించి వినోదం అందించిన అతి కొద్ది సినిమాల్లో ఒకటి. దర్శకత్వ పరంగా క్రాంతి మంచి ప్రతిభ కనపర్చారు.

మన సినిమాల్లో ఎప్పుడూ కనిపించే ఎబ్బెట్టు రంగులు, భారీ సెట్టింగులు లేకుండా నిజజీవితానికి దగ్గరగా ఈ సినిమా రూపొందించడం జరిగింది. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు సంగీతం అన్నీ ఈ సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఆహ్లాదకరంగా వున్నాయి. చిన్న పిల్లలు ప్రధాన పాత్రధారులుగా వున్న సినిమాల్లో అత్యంత కష్టమైన పని, పిల్లలచే నటింపచేయడం. ఆ విషయంలో నూటికి నూరుపాళ్ళూ సఫలం కాగలిగాడు దర్శకుడు.

మహెక్ పాత్రలో నటించిన శ్రేయ తన అధ్భుత నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే మిగిలిన పాత్రలలో పిల్లలందరూ పోటాపోటిగా తమ నటనను ప్రదర్శించారు. ఇవన్నీ ఈ సినిమాలోని మంచి విషయాల గురించి.ఇకపోతే ఈ సినిమాలో కొన్ని పొరపాట్లూ వున్నాయని నాకనిపించింది.అందులో మొదటిది ఈ సినిమా నిర్మాణం.

Children’s Film Society చే నిర్మింపబడిన మాత్రాన కేవలం పిల్లలనే దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా నిర్మించినట్టుగా వుందని ఈ సినిమా చూస్తే నాకనిపించింది. అంటే ఒక విధంగా చూస్తే ఈ సినిమా రేపు విడుదలయినా కూడా పిల్లలే ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ అవుతారని నా బాధ.

ఇలాంటి ఆలోచనా విధానం నుంచి మనం బయట పడాలి. ఉదాహరణకు ఇరానియన్ సినిమాలైన Where is my friend House, Children of heaven, Color of Paradise లేదా The White Balloon సినిమాలు తీసుకుంటే ఈ సినిమా కథలన్నీ పిల్లల చుట్టూనే నడుస్తాయి కానీ ఈ సినిమాకి ప్రేక్షకులు మాత్రం వయసుతో పరిమితం లేకుండా అన్ని వయసుల వారూ వుంటారు. అందుకు కారణం ఈ సినిమాలోని కథాంశం పిల్లల చుట్టూ అల్లబడ్డా ఈ సినిమాలోని ఎమోషన్స్ మాత్రం ఏ వయసు వారి హృదయాన్నైనా హత్తుకునేలా వుంటాయి.

అలాగే Mahek సినిమాలో నాకు కనిపించిన మరో సమస్య ఏంటంటే ఈ సినిమా స్క్రీన్‌ప్లే. సినిమా మొదలయిన రెండు నిమిషాల్లోనే మహెక్ పాత్రధారిణి సమస్య మనకు తెలిసిపోతుంది. కానీ అదే సమస్యని దాదాపు సినిమా ముప్పవు భాగం వరకూ ఆ అమ్మాయిని వెంటాడుతూనే వుంతుంది. అంటే కొద్ది సేపటికి రిపిటిటివ్ అయిపోతుందని నా అభిప్రాయం. అలాంటప్పుడు ఒక మంచి సబ్ ప్లాట్ ఉపయోగించడం ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దుకుని వుండొచ్చని నా అభిప్రాయం. ఒక స్టేజిలో ఆ సబ్‌ప్లాట్ మొదలవ్వబోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంతలోనే ఏ ప్రత్యేకత లేకుండానే మరో సీన్లో ఆ అవకాశానికి శుభం కార్డు వేసేస్తాడు దర్శకుడు.

ఒక విధంగా చూస్తే ఇవన్నీ ఈ సినిమాను ఆనందించకుండా ఆపగలిగే అంశాలు కాకపోయినప్పటికీ, ఈ సినిమా రేపు విడుదలయ్యి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో మాత్రం పైన పేర్కొన్న సమస్యలు ఈ సినిమాను వేధిస్తాయని నా అభిప్రాయం. ఏదైమనప్పటికీ పిల్లల స్వప్న ప్రపంచాన్ని తెరకెక్కించడంలో క్రాంతి చాలా వరకూ సఫలం కాగలిగారన్నది నిజం.

పిల్లలంటే ఎంతో ఇష్టం కలిగిన క్రాంతి Mother అనే NGO ద్వారా ఇప్పటికి 34 మంది పిల్లలను తమ సంస్థ అక్కున చేర్చుకుని వారికి ఆపధ్భాందవుడిగా నిలిచాడు. తన సినిమాల ద్వారానే కాకుండా తన సంస్థ ద్వారా కూడా పిల్లలకు దగ్గరవ్వడానికి ప్రయత్నం చేస్తున్న క్రాంతి కనాడే దర్శకత్వం వహించిన మహెక్ సినిమా చూడడమే కాదు వీలయితే ఆయన సంస్థ అయిన మదర్ కి కూడా మీ ప్రోత్సాహన్ని అందివ్వండి

4 Comments
  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి May 1, 2008 /
  2. శిద్దారెడ్డి వెంకట్ May 2, 2008 /