Menu

Kantri Ante NTR anI

ఈ పేరుని ఆంగ్లలో వ్రాసినప్పుడు KANTRI అని వస్తుంది. అందులో NTR అన్న మూడక్షరాలు కనబడడం హైలైట్. ఇదే ఈ సినీమనోరంజన శిఖరాఘ్రం. ఇంత కన్నా పెద్ద హైలైట్లు ఈ సినిమాలో లేవు. అంటే మీరు దారిలో వెళుతూ వెళుతూ ఎక్కడైనా పోస్టరు చూస్తే అందులో పేరు ఆంగ్లంలో ఉంటే, దాన్ని చూసి, సినిమా చూసినంత సంబర పడవచ్చు. మీ పని తేలిక చేయడానికి వారు NTR అన్నదాన్ని ఎఱ్ఱసిరాలో ఉంచారు. ఈ విషయంలో దర్శకుణ్ణి అభినందించాలి. కానీ దర్శకుడు కన్నడ అతను. కాబట్టి ఈ ఉపాయం దర్శక బృందంలో ఒక సభ్యునికి లేదా సభ్యురాలికి వచ్చి ఉండాలి. వారి ప్రతిభ బహుధా (లేదా కన్నడంలో బహళ అనాలేమో) అభినందనీయం. వారి పేరు పేర్లలో రాకపోవడం బహళ దుఃఖదాయకం. ఇలా సినిమాకల్లా పెద్ద హైలైట్‌ను చూపించడానికి డబ్బుతీసుకోకపోవడం ఇంకా బహుధా అభినందనీయం.

ఇక కథలోకి వెళ్ళమంటారా. హూఁ. సమీక్ష అన్నాక కథలోనికి వెళ్ళకపోతే ఏఁవ్ బాగుంటుంది చెప్పండి. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి సినిమా యొక్క హైలైట్ గురించి ఇప్పటికే చెప్పేసుకున్నాము, తరువాయి కొంత బోరింగు అనిపించవచ్చు!
కథలో ఎంటీఆర్ తనగానే నటించాడు. అంటే NTR as self అన్నమట. ఇది మీకు సినిమా మొదట్లోనే చెబుతాడు. మా తాత సైకిల్ మీద వచ్చి ఏదేదో చేశాడని. ఆ తరువాత నేను ఇంతకు ముందు బండగా ఉండేవాడిని ఇప్పుడే ఎలాగోలా తగ్గాను అంటాడు కూడా. దానికి తోడు అతనిని కొందరు జూనియర్ అని సంబోధించడం కూడా చేస్తారు. అంటే ఇది ఎంటీయార్ జీవితంలో జరిగిన కొన్ని నిజమైన సంఘటనల మీద తీసిన అకల్పిత చలనచిత్రం (డాకుమెంటరి) అన్నమట. కానీ కొంత సేపైన తరువాత నా పేరు క్రాంతి అంటాడు. వీడేంటి ఇలా అమ్మాయి పేరు పెట్టుకున్నాడు అని మీరు నివ్వెర పోతారు. కానీ అతనికి ఇంకో అసలు పేరు వుందంట అది కంత్రి. అది తెలిసి మీరు ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే, KANTRI అనేది “Kantri Ante NTR anI” అనేదానికి క్లుప్తాక్షరమట! పేరు పెట్టిన దర్శకుడు పూర్వజనమలో రికర్సీవ్ కోడు వ్రాసి ఉద్యోగం కోల్పోయిన కంప్యూర్ ఇంజనీరు అయివుంటాడు. ఇంత గొప్ప పేరు పెట్టినందుకు అతనిని ఎంతైనా అభినందించాలి.

ఇక మన కథానాయకుడు యధావిధిగా, ఆడంబరముగాఁ బల్కుచూ అల్పులను ఇఱగ బాదుతూంటాడు. సినిమా మొదలైన నాలుగు నిమిషాలకే తెలుగు సినిమాల్లో ఉన్న విలన్లు అందర్ని చూపిస్తారు. నాకు వాళ్ళ పేర్లు సరిగా తెలియవు. ప్రకాశ్ రాజు, ఆశీస్ విద్యార్థి, పోకిరిలో పోలీస్ ఆఫీసర్ (తిన్నామా పడుకున్నామా అని అంటాడు అతను), బంగారం విలన్, సమరసింహారెడ్డి విలన్ ఇంకో ఇద్దరు ముగ్గురు విలన్లు ఉంటారు. వారికి తోడుగా మహేశ్ (నరసింహ నాయిడు విలన్), కోటా శ్రీనివాసరావు (చాలా సినిమాల్లో విలన్), ఆహుతీ ప్రసాద్ (చాలా సినిమాల్లో విలన్ సహాయకుడు) వంటి ఇంకో ఇద్దరు ముగ్గురు తెలుగు సినిమా విలన్లు మంచి వాళ్ళుగా పాత్రులు పోషించారు.
ఇక కామెడీ విషయంలో కూడా ఇదే జరిగింది, ఇందులో గిరిబాబు తనయుడు, సునీల్, ఆలీ, బ్రహ్మానందం, ధర్మవరపు, కృష్ణ భగవాన్, ఎమ్మస్ నారాయణ వంటి వారు ఉన్నారు. తారాగణం విషయంలో దర్శకుణ్ణు ఎంతో అభినందించాలి. తరువాతి తరాల వారికి మన తెలుగులో సినిమా విజ్ఞాన సర్వస్వం (ఎంసైక్లోపీడియా) లేదనే లోటు తీర్చాడు. ఈ సినిమా చూస్తే వారికి కావలసిన వారందరి జాబితా చిక్కుతుంది. కానీ కష్టమెక్కడ వస్తుందంటే, అందరూ ఒక నాలుగైదు ఫ్రేములకంటే ఎక్కువ కనిపించరు. కాబట్టి త్వరత్వరగా పేర్లు వ్రాసుకోవాలి.

ఇక హీరోయిన్,
ఇప్పటికే మీరు ఎప్పుడొస్తుందా హీరోయిన్ అని తెగ తహతహ పడుతున్నారుగా, నేనూ అంతే సినిమాలో హీరోయిన్ ఎప్పుడు వస్తుందా అని తెగ తహతహ పడ్డాను. మొదటి హీరోయిన్ వచ్చింది. పేరు హంసిక అంట.
అచ్చ తెలుగు అమ్మాయి కాని ఈ హంసిక, సినిమాలో కూడా అచ్చ తెలుగు అమ్మాయి కాకపోయినా, కనీసం అచ్చ తెలుగు పేరు కలిగిన అచ్చ తెలుగు సినిమా హీరోయిన్ కాబట్టి, ఆ విషయమై దర్శకుణ్ణి నిజంగా అభినందించాలి. పేరు వరలక్ష్మి అంట. అలా అని “లంగా ఓణి వేస్తుంది, బొట్టు పెట్టుకుంటుంది” అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. ప్రతి సగటు మధ్య తరగతి తెలుగు అమ్మాయి మల్లే ఈమే కూడా తన జుట్టుకి ఎఱ్ఱ రంగు వేయించుకుని వర్షంలో తడుస్తూ మనకు తొలి దర్శనమిస్తుంది.

మొదటి రెండు మూడు సీన్లలో ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని మనకు చూపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడే మనకు అర్థమవ్వాలి, ఈ సినిమా యొక్క రొమాన్సు భాగం Just My Luck కి కాపీ అని (జల్సాలో Hitch లాగా). అప్పటికీ అర్థంకాని వారికి, చైనీసు కార్డులతో ఉన్న ఆలీని చూస్తే అర్థమవుతుంది. ఇది అర్థమవ్వబట్టి Just My Luck లో Lindsay Lohan, Chris Paine వాళ్ళు గుర్తుకు వచ్చి నాకు చాలా మనోరంజనం కలిగింది. కానీ మీరు JML చూడకపోతే మీకు అందులోని హాస్యశృంగారం బోధపడదు. ఆ సినిమా చూడకపోవడం మీ తప్పే అవుతుంది కానీ దర్శకుడిది కాదు. పైపెచ్చు JML లాంటి మంచి సినిమాలు చూడడాన్ని పెంపొందించే విషయంలో దర్శకుణ్ణి ఎంతో అభినందించాలి.

రొమాన్సు
చెప్పాగ Just My Luck కథ అని. ఇక పోతే మన ప్రజా హీరో NTR కి కూడా మనలానే ఇది సినిమానో లేక డాకుమెంటరీనో అర్థం కాక, హీరోయిన్ని పదే పదే తన అసలు పేరు హంసతో పిలుస్తుంటాడు. మనకి ఆమె వరలక్ష్మో హంసో అర్థంగాదు. అలా అతను తికమక పడడాన్ని దర్శకుడు చాలా బాగా చిత్రీకరించాడు. ఈ విషయంలో దర్శకుణ్ణి ఎంతో అభినందించాలి.

కథనం
ఈ సినిమా చూస్తున్నంత సేపు మీరు చాలా తికమకకు లోనౌతారనుకుంటే మీరు పొరబాటు పడ్డట్టే. మనలాంటి సగటు ప్రేక్షకులు బాగా అర్థమవ్వాలని చెప్పి సంభాషణలు వ్రాసినప్పుడు, మనకు వివరించడానికి,
“ఈ సినిమాలో ఫైట్లు ఎక్కువుంటాయి, వయలెన్సు ఎక్కువుంటుంది”, “ఇప్పటి వరకూ ట్రయిలర్ చూసారు ఇప్పుడు అసలు సినిమా మొదలవుతుంది”, “ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు”, “ఒక హీరోయిన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక సినిమా సింగిల్ హీరోయిన్ సినిమా” అంటూ వివరణలు ఇస్తూంటారు.
“ఈ థియేటర్ లో నా సినిమా అడుతుంది” అని వివరించిన కంత్రిని చూసి మీరు అతనికి ఇప్పుడు కూడా ఇది సినిమానా లేదా నిజ జీవితమా అని తికమక పడుతున్నాడు అని భావిస్తే పప్పులో కాలేసినట్టే. అది సినిమాని చూడడానికి వచ్చిన మతిభ్రమించిన వారికోసం వివరణ. (మతిభ్రమిస్తేనేగా ఇలాంటి సినిమాలు చూసేది అని మీరనుకుంటే అది కూడా జీడి పప్పు కూరలో కాలేసినట్టే అవుతుంది). ఇలా వికలాంగులను వికలబుద్ధులను (మాత్రమే) దృష్టిలో పెట్టుకొని సినిమా తీసిన విషయంలో దర్శకుణ్ణి ఎంతో అభినందించాలి.

మూస – మెలిక
పోకిరి సినిమా ఎందుకు హిట్టయిందో తెలియదు గానీ, ఈ సినిమాని కూడా అదే తీరులో తీసారు మన దర్శకులు. ఈ సినిమాలో రెండు పోకిరిలు ఉన్నాయి. మొదటి సగం ఒక పోకిరి, రెండో సగం ఇంకో పోకిరి. మీరు పోకిరి సినిమా చూడకపోయినచో (అంటే మీ నివాసం అంటార్కుటికా అయినచో), ఈ సినిమా చూసి ఆ పాపాన్ని కడిగేసుకోవచ్చు. ఈ సినిమా చూస్తే రెండు పోకిరిలు చూసినట్టు లెక్క. మొదటి సగం చివరిలో కథలో మెలిక ఉంటుంది, మన కంత్రి ప్రకాశ రాజు కొడుకు అని, అప్పుడు మీ మతి భ్రమిస్తుంది. అలా మిమ్మల్ని భ్రమింపజేసి రెండో సగం గడిపించాక, రెండో సగం చివరిలో ఆ మెలికను తిన్నం చేస్తాడు మన దర్శకుడు.
దీనితో మనకు Every twist has an equal and opposite twist అని తెలుస్తుంది. ఇలా ఇంటర్ పిల్లలకు భౌతికశాస్త్రాన్ని నేర్పూతూ అదే సమయంలో, చెత్త చెత్త ట్విస్టులతో సినిమాలు తీసే పూరీ జగన్నాథం వంటి దర్శకులను తన తిన్నాలోతో(untwistలతో) ఖండించిన దర్శకుణ్ణి ఎంతైనా అభినందించాలి.

రెండో హీరోయిన్
ఈ సినిమా పోస్టరులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకమ్మాయికి ఎఱ్ఱజుట్టు వుంటుంది. ఇకొంక అమ్మాయకి ఎఱ్ఱవళ్ళు వుంటుంది, ఈ రెండో అమ్మాయి ఇంకా రాలేదేంటి అని అనుకుంటున్నారా? నేను కూడా అదే అనుకున్నా సినిమా చివరి వరకూ. కానీ ఈ అమ్మాయి మధ్యలో వచ్చి వెళ్ళిపోయిందంట. ఏం చేసిందో కూడా నాకు గుర్తులేదు. ఆ చేసిన హీరోయిన్‌కి తెలుగు రాదు కాబట్టి ఆమెకీ తెలియదు. ఇక సినిమా తీసిన కన్నడ దర్శకునికి కూడా ఆమె ఎందుకు ఉందో అస్సులు తెలియదు. కానీ నిర్మాతకు తెలుసు స్తనభేదము దాయని ఎఱ్ఱవళ్ళు అమ్మాయి ఎందుకు వుందో. ఈ ఒక్క విషయంలో మాత్రం మనం నిర్మాతను ఎంతైనా అభినందించాలి.

ఇంకెన్నో
దీనితోఁబాటు ఈ సినిమాలో అభినందించ దగ్గ విషయాలు ఇంకెన్నో వున్నాయి. మచ్చుకకు ‘చిన్న పిల్లల చేత తుపాకులు పేల్పించడం’, ‘అనాథ శరణాలయాన్ని నాటకంగా చూపించడం’ వంటివి. పాటల విషయమై, సినిమా నాణ్యతకూ పాటలలోని నృత్యాలు పాటల చిత్రీకరణ వంటి వాటి నాణ్యతకూ ఎటువంటి పొంతనా లేదు కాబట్టి వాటిని నేను ప్రస్తావించదలచుకోలేదు.

అందరూ తప్పక చూడవలసిన పోస్టరు ఈ సినిమాది. కాబట్టి మీరు వెంటనే బయటకు వెళ్ళి ఈ పోస్టరు చూసిరండి.

35 Comments
 1. srilu May 10, 2008 /
 2. గిరి May 10, 2008 /
 3. మేధ May 11, 2008 /
 4. రాఘవ May 11, 2008 /
 5. Bhaskar Ponaganti May 11, 2008 /
 6. Raghuram May 11, 2008 /
 7. రాజేంద్ర కుమార్ దేవరపల్లి May 11, 2008 /
 8. Uttara May 11, 2008 /
 9. Desi May 12, 2008 /
 10. mantri May 12, 2008 /
 11. bhanu prakash May 12, 2008 /
 12. Uttara May 12, 2008 /
 13. Murali May 13, 2008 /
 14. arvind May 13, 2008 /
 15. వాసు. బొజ్జ May 13, 2008 /
 16. raghurichards May 13, 2008 /
 17. bujji May 14, 2008 /
 18. Uttara May 15, 2008 /
 19. bhanu prakash May 15, 2008 /
 20. Uttara May 15, 2008 /
 21. rao May 15, 2008 /
 22. rao May 15, 2008 /
 23. bhanu prakash May 15, 2008 /
 24. bhanu prakash May 15, 2008 /
 25. Chetana May 15, 2008 /
 26. Chetana May 15, 2008 /
 27. bhanu prakash May 15, 2008 /
 28. bujji May 16, 2008 /
 29. raghurichards May 18, 2008 /
 30. Desi May 20, 2008 /
 31. murari September 6, 2008 /
 32. మహేశ్ బాబు September 6, 2008 /