Menu

జాన్ అబ్రహం-ఒక పరిచయం

johnabraham.jpgసినిమా ఆయనకు పరిశ్రమా కాదు, వ్యాపారమూ కాదు. సినిమా ఆయనకు ఒక కళ….’ప్రజా కళ’. ఆ కళ కేవలం అధ్యయనం చేయడానికో, ఆనందించడానికో కాదు, ఆ కళ కేవలం అశేష ప్రజానీకం కోసం అట్టడుగున పడివున్న ప్రజల క్షేమం కోసం నిర్దేశించబడిందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆయన ఎక్కడి నుంచో ఆకాశం నుండి ఊడిపడ్డవాడు కాదు. ఆయన జనం నుంచి జనం కోసం వచ్చినవాడు. ఆయన జాన్ అబ్రహం.

ఆయన విశ్వాసంలో కెమెరా అబద్ధం చెప్పదు.కెమెరా తన కళ్ళెదుట వున్న విషయాన్ని మాత్రమే చూపుతుంది.అందుకే ఆ విశ్వాసంతోనే తన కెమెరాను మన సామాజిక నగ్న సత్యాల్ని ఎత్తి చూపడానికి ఉపయోగించాలనే ధ్యేయంతో చివరంటా పోరాటం చేసినవాడు జాన్ అబ్రహం.

జాన్ అబ్రహం పేదల్లో పేదవాడు. వారి మధ్యే జీవిస్తూ, వారి సహచర్యంలోనే జీవితాన్ని గడిపాడు. ఈ వ్యవస్థ పేదల జీవితాలతో ఎట్లా ఆడుకుంటూ వుందో గమనించాడు. అటు మధ్య తరగతి జీవితాల్లో వున్న కుహనా విలువల్ని ఈసడించుకున్నాడు.వారి నడవడికల్ని సర్దుబాటుతనాన్ని అసహ్యించుకున్నాడు.

జాన్ అబ్రహం క్రైస్తవునిగా జన్మించాడు.అయినప్పటికీ కేవలం మనిషిగా మాత్రమే జివించాడు. మానవీయ విలువల పట్ల సంస్కృతి పట్ల ఖచ్చితమైన అభిప్రాయాల్తో ఎదిగాడు. పూనా ఫిలిం ఇన్‍స్టిట్యూట్ లొ శిక్షణ పొంది గోల్డ్ మెడల్ సంపాదించుకున్న అబ్రహం చుట్టూ వ్యాపార సినిమా నిర్మాతలు చేరారు.కాని ఆయన వారందరిని కాలదన్ని తనదైన ’సినిమా కోసం’ అంకితమయ్యాడు.

జాన్ అబ్రహం నిర్మించిన చిత్రాల్లో మూడు పూర్తి నిడివి చిత్రాలు ఆయన ప్రతిభకు, నిబద్దతకు తార్కాణాలు. అవి ’అగ్రహారతిల్ కుజుదై’(అగ్రహారంలో గాడిద), ’సెరియచ్చంటె క్రూర కృత్యంగల్’ (చరియచన్ క్రూర చేష్టలు), ’అమ్మా అరియన్’ (అమ్మకి నివేదన). ఈ మూడు చిత్రాలకు ముందు అబ్రహం ’విద్యార్థిగలె ఇద్దిలె, ఇద్దిలె’ అన్న చిత్రం నిర్మించాడు. కాని ఆయన చెప్పుకున్నట్టే అది అతి సాధారణమయిన చిత్రం.సినీ ప్రపంచంతో రాజీ కుదుర్చుకుని తీసిన తొలి, చివరి చిత్రం అదే.ఆ తర్వాత 1987 లో అబ్రహం నిర్మించిన ‘అగ్రహారత్తిల్ కజుదై’ఉత్తమ తమిళ ప్రాంతీయ చిత్రంగా అవార్డును అందుకుంది.ఈ చిత్రం మూఢ విశ్వాసాలను, సనాతన ఆచారాలను ఖండిస్తూ మానవీయ విలువల్ని గుర్తించాలని ప్రబోధిస్తుంది.ప్రాణం తీసింతర్వాత గుడ్డి కట్టించాలని అగ్రహారీకుల మూర్ఖత్వాన్ని, విశదీకరిస్తుందీ చిత్రం.ఇందులో గాడిదను ముఖ్యపాత్ర చేయడం ద్వారా అబ్రహం ఒక నూతన విధానాన్ని అనుసరించాడు.

అనంతరం 1981లో అబ్రహం నిర్మించిన ’చరియిచ్చంటె క్రూర కృత్యంగల్’ మధ్య ట్రావెంకూర్ ప్రాంతంలో వున్న భూస్వామ్య, క్రైస్తవ ఉన్నత వర్గాల వారికి, ప్రగతిగాములయిన ప్రజలకూ మధ్య జరుగుతున్న ఘర్షణని చూపిస్తుంది.భూమి కలవాళ్లు, భూమి లేని వాళ్లపై జరుపుతున్న దాడులను, దోపిడీని చూపిస్తుందీ చిత్రం. ఇందులో హీరో, విలన్ అంటూ ఎవరూ ప్రత్యేకంగా వుండరు. కొన్ని సన్నివేశాలు జరుగుతూ వుంటే కథాగమనం దానంతట అదే గడిచిపోతుంది. వాస్తవం కళ్ల ముందు దర్శనమిస్తుంటుంది.

తర్వాత ఆయన నిర్మించిన ’అమ్మ అరియన్’ చిత్రం ప్రజలు అభిమానంతో ఇచ్చిన డబ్బుతో నిర్మించాడు. ఈ నాటి చిత్ర పరిశ్రమ తీరుతెన్నుల్ని నిరసించిన అబ్రహం పంపిణీ వ్యవస్థ సంపూర్ణంగా పోవాలన్నాడు. కొంతమంది ఉత్సాహవంతులైన మిత్రుల్ని కలుపుకుని ’ఒడెస్సా మూవీస్’ ను స్థాపించాడు. దాంతో గ్రామాల్లోకి ఉత్తమ చిత్రాల్ని తీసుకెళ్లి ప్రదర్శించి కేరళలో ఉద్యమాన్ని పెంపొందింప చేశాడు. పట్టణాల్లో గ్రామాల్లో ప్రదర్శించే ఈ చిత్ర ప్రదర్శనలకు టిక్కెట్లుండవు. ప్రదర్శన తర్వాత చందాల కోసం జోలె పడతారు. అలాంటి ప్రదర్శనలు 16 ఎం.ఎం లో అనేకం వేశారు.

సత్యజిత్ రే, మృణాల్ సేన్, బుద్ధదేవ్, అదూర్ లాంటి వారి చిత్రాల్ని ఇక్కడ ప్రదర్శించేవారు. ఈ ప్రదర్శనల అనంతరం పోగుచేసిన డబ్బుతోనే ’అమ్మ అరియన్’ చిత్రం నిర్మించాడు అబ్రహం.

’అమ్మ అరియన్’ లో 1970 ప్రాంతంలో కేరళ యువకుల్లో ఉన్న అసంతృప్తినీ వారి చేతల్నీ చూపించాడు జాన్ అబ్రహం. యువకులు రెండు సమాజాల్లో బ్రతుకుతున్నారని ఆయన అనేవారు. చచ్చిపోయి కుళ్ళిపోతున్న ప్రస్తుత సమాజం ఒకటికాగా రెండవది ఇంకా పూర్తిగా జన్మించని సుందర భవిష్యత్ సమాజం అంటాడతను. ఈ సంధికాలంలో యువకుల సంఘర్షణని ఈ చిత్రం అద్బుతంగా చిత్రిస్తుంది. అలాగే స్త్రీల అభ్యున్నతినీ దాని అవసరాన్ని కూడా చూపిస్తుందీ చిత్రం.

’అమ్మ అరియన్’ గత రూపాన్ని చూపిస్తూ భవిష్యత్ ని కదిలించే అమ్మ అవశ్యకతని సూచిస్తూ చిత్రం ముగుస్తుంది. ’అమ్మ అరియన్’ తర్వాత దేశానికి చిత్రసీమకు పేద ప్రజానీకానికి చేయాల్సింది ఎంతో మిగిల్చి జాన్ అబ్రహం వెళ్లి పోయాడు. కాని ఆయన మొదలెట్టిన ’ఒడెస్సా’ ఉద్యమం నూతన రెక్కలు విచ్చుకుని ముందుకు సాగాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతో వుంది. జాన్ జ్ఞాపకార్థం కాలికట్ వద్ద ’జాన్ అబ్రహం’ సెంటర్ స్థాపించబడింది. అబ్రహం స్మృతిలో దక్షిణ భారత ఫిలిం సొసైటీల సమాఖ్య ఉత్తమ ఫిలిం సొసైటీ అవార్డును బహుకరిస్తుంది.