Menu

Children of Heaven

అలీ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు బాగుచేయించడానికి తీసుకెళ్ళిన తన చెల్లెలు జహ్ర షూస్‌ను దారిలో పోగొట్టుకుంటాడు. కొత్త షూస్ కొనే స్థోమత తండ్రికి లేకపోవడం , చెబితే కొడతారనే భయం ఆ అన్నాచెల్లెల్లిద్దరూ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచేలా చేస్తాయి. అలీకి ఉన్న చినిగిపోయిన స్నీకర్స్‌నే ఇద్దరూ జాగ్రత్తగా పంచుకుంటారు. ఒకరు ఉదయం పూటా ఇంకొకరు మద్యాహ్నం పూటా స్కూల్‌కి వెళ్తూ పోయిన షూస్‌ని వెతికే పనిలో ఉంటారు. ఈ ప్రయత్నంలో వాళ్ళ పరిధికి మించి ఆ చిన్నారులిద్దరూ చేసే సాహసకృత్యాల సమాహారమే మిగిలిన కధ.

ఇంత సింపుల్ పాయింటుతో తొంబై నిమిషాలు పాటు మనల్ని వశపర్చుకోవడానికి ఈ సినిమా దర్శకుడు మజిద్ మజిది దగ్గర ఉన్న ఒకే ఒక్క అస్త్రం, సంక్లిష్టమైన మానవసంబంధాలలోని గాఢతను విపులంగా చిత్రీకరించగల నేర్పు.టెహ్రాన్ నగరంలోని మధ్యతరగతి జీవితాలలో జరిగే చిన్ని చిన్ని ఆటుపోట్లను, వాటిని ఎదుర్కోవడానికి జరిపే నిరంతర బతుకుపోరును ఆవిష్కరించడంలోని నిజయితీని ప్రతి ఫ్రేములోను గమనించవచ్చు. మచ్చుకకు కొన్ని: ఎంత బీదరీకాన్ని అనుభవిస్తున్నా మసీదుకి సంబంధించిన చక్కెర కిలోల లెక్కన తనముందున్నప్పుడు చిటెకెడు కూడా సొంత ప్రయోజనానికి వాడకూడదనే తండ్రి, అనారొగ్యంతో బాధపడుతున్న పొరుగింటి వృద్ధ దంపతులకు ఉన్నదాంట్లోనే కొంత పంచే తల్లి పాత్రలు తమకు తెలియకుండానే కేవలం తమ ప్రవర్తన ద్వారా అత్యున్నత విలువల్ని పిల్లలకు భోదించే తల్లిదండ్రులకు నిదర్శనం. తన సహ విద్యార్ధిని రోయా దగ్గర పోయిన షూస్ చూసిన జహ్ర, అలీతో కలిసి వాటిని తెచ్చుకోడానికి వెళ్ళి అక్కడ గుడ్డివాడైన ఆమె(రోయా) తండ్రిని చూసి జాలిపడే సన్నివేశం ఎవ్వరినైనా కదిలిస్తుంది. ఆ తర్వాత జహ్ర పడేసుకున్న పెన్ను తిరిగి ఇచ్చి రోయా స్నేహాన్ని పెంచుకొంటుంది. పరుగు పందెంలో మొదటి స్ధానంలో వచ్చినా , చెల్లెలికి షూస్ సంపాదించే మూడవ స్ధానం రానందుకు అలీ పడే బాధ ఆ అన్నాచెల్లెల్ల అనుబంధానికి మచ్చుతునక. అలానే టెహ్రాన్‌లోని మధ్యతరగతి వాళ్ళకి, ఉన్నత తరగతివాళ్ళకి ఉన్న వ్యత్యాసం చూపిచే గార్డెనింగ్ ఘట్టం కూడా ఎన్నదగినది. ఆడుకోవడానికి స్నేహితులు కరువై అలీ సహవాశం కోసం అర్ధించే ఆ గొప్పింటి పిళ్ళాడు వారి స్నేహానికి ఇచ్చిన ప్రతిఫలం (జహ్రాకి,అలీకి కొత్త షూస్ , ఈ విషయాన్ని ప్రేక్షకులు మాత్రమే తెలుసుకుంటారు. తండ్రి షూస్‌ని ఇంటికి తెచ్చే సన్నివేసాన్ని చూపించకుండానే సింబాలిక్‌గా ముగిస్తాడు దర్శకుడు).

ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు గెల్చుకున్న ఈ సినిమా ఆస్కార్‌ని మాత్రం ‘ లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’కి కోల్పోయింది. వేరే ఏ సంవత్సరంలోనన్నా ఐతే తప్పక గెలిచేదే. ఇందులో నటించినవారంతా కొత్తవారే కావడం, చాలా సన్నివేసాలను రియలిస్టిక్‌గా తియ్యడం(వీధుల్లో తీసిన సన్నివేసాలు hidden cameraతో తీసారు, అందులో కనిపించే జనం సామన్య్య ప్రజానికమేగాని usualగా వాడే extraa నటులు కాదు.) ఈ సినిమా లోబడ్జెట్‌కి కారణాలైనా క్వాలిటీ విషయంలో ఏమాత్రం లోటు లేదు. ఏ హాలీవుడ్ సినిమాను ఫ్రీమేక్ చెయ్యాలా అని బోర్డ్ రూముల్లో గంటల తరబడి స్టొరీ డిస్కషన్‌లు వెలగబెట్టే ప్రముఖులు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాల్సిన చిత్రమిది. ప్రేక్షకుల్ని కట్టిపడేయడానికి కావల్సింది మనం ఎప్పుడో తుంగలో తొక్కి గంగలో వదిలేసిన మానవీయ సంబంధాలే కానీ అరువు తెచ్చుకున్న హాలీవుడ్ గిమ్మిక్కులు కాదనే విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియచేసే సినిమా ఇది. తమదైన సంస్కృతికి, అచారవ్యవహారాలకు పెద్దపీట వేస్తూ, వాటిని కధలో ప్రధాన పాత్రలుగా చేసుకొని నేటివిటీని కాపాడుకోవడం వల్లనే ఈ ఇరానీయన్ సినిమా ప్రపంచ సినిమా ప్రేమికుల మదిలో సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకోగలిగింది. అందుకే ఈ సినిమాను చాలమంది bicycle thief తో పోలుస్తారు. కేవలం 75 లక్షలతో తీసిన ఈ సినిమా ఎందరికో ఆదర్శవంతం. ఇరాన్‌లో సినిమా నిర్మాణానికి కేటాయించే money చాలా తక్కువ అవడం వల్లనే అక్కడి దర్శకులు ఇలాంటి ఇన్నోవేటివ్ సినిమాలను అందించగలుగుతున్నరనే ప్రచారం కూడా ఉంది. మన తెలుగు సినిమాకి కూడా ఒక బడ్జెట్ నియంత్రణా మండలిని నియమిస్తే మన దర్శకులు డబ్బు ఖర్చుపెట్టే బదులు బుర్రపెట్టి ఆలొచించడం మొదలుపెడతారేమో!

11 Comments
  1. chavakiran May 17, 2008 /
  2. రాజేంద్ర కుమార్ దేవరపల్లి May 17, 2008 /
  3. Manjula May 18, 2008 /
  4. Desi May 25, 2008 /
  5. శిద్దారెడ్డి వెంకట్ June 4, 2008 /
  6. శంకర్ June 4, 2008 /
  7. రాజేంద్ర కుమార్ దేవరపల్లి June 7, 2008 /
  8. rr June 21, 2008 /
  9. venky September 8, 2013 /