Menu

Throne of Blood (1957)

Throne of blood (Japanese Original: Kumonosu-jō) అన్నది 1957లో అకిరా కురొసవా తీసిన జాపనీస్ సినిమా. నా కురొసవా మారథాన్ లో భాగంగా ఈ వారంలో చూసిన మూడోసినిమా. ఇది షేక్స్పియర్ నాటకం “మాక్బెత్” ఆధారంగా తీసిన సినిమా. అయితే, జపాన్ నేటివిటీకి అనుగుణంగా తీసారు సినిమాని. మాక్బెత్ ఆధారంగా తీసిన అన్ని సినిమాలూ,నాటకాల్లోనూ ఉత్తమమైన అనుసరణగా పేరు పొందింది ఈ చిత్రం. దీని గురించి “the most successful film version of Macbeth, though it departs very far from the specifics of the play.” – అని రాసారు విమర్శకులు.

కథ విషయానికొస్తే, కథా ప్రారంభం spiders web castle పై శత్రువుల యుద్ధం తో. యుద్ధం లో వీరత్వం ప్రదర్శించి తమ రాజ్యాన్ని గెలిపించి రాజును కలవడానికి బయలుదేరతారు వీరయోధులు- మికీ, వషిజు. spiders web castle కి వెళ్ళే దారిలోని అడుగు నిజంగానే ఓ సాలెగూడు వంటిది. ఎంతో పరిచయం ఉన్నవారు తప్పితే ఆ అడవిలో తప్పిపోవడం ఖాయం. మికీ, వషిజు అడవి గుండా వెళుతూ ఉండగా, వాళ్ళకో ఆత్మ కనిపిస్తుంది. అది వాళ్ళకి భవిష్యత్తు చెబుతూ, వషిజు కోటని ఏలతాడనీ, మికీ సంతానం చాలా రోజులు కోట ఏలుతుందనీ జోస్యం చెబుతుంది. వీళ్ళిద్దరు అది పట్టించుకోక రాజ్యానికి వస్తారు.కానీ, రాగానే, ఆత్మ చెప్పిన మరో విషయం నిజమౌతుంది. దానితో, వషిజు లో రాజవ్వాలన్న కోరిక కలుగుతుంది..అతని భార్య అతన్ని రాజుని హతమార్చేందుకు ప్రేరేపిస్తుంది. వషిజు రాజౌతాడు. అతని భార్య అప్పుడు గర్భవతి అని తెలుస్తుంది. దానితో, మికీ కొడుక్కి తన తదనంతరం రాజ్యమివ్వాలి అన్న ఆలోచన ఉన్నవాడల్లా ఈమాట విని, మికీని, అతని కొడుకునీ చంపించే ప్రయత్నం చేస్తాడు. మికీ మరణిస్తాడు, కొడుకు తప్పించుకుంటాడు. మికీ దయ్యమై వషిజు కి కనిపిస్తూ ఉంటాడు. ఇదలా ఉంటే, పాత రాజు కొడుకూ, మికీ కొడుకూ, మిగితా వారు కొందరు పక్కరాజుతో చేతులు కలిపి ఈరాజ్యం మీదకు యుద్ధానికి వస్తారు. వషిజు మళ్ళీ ఆత్మను కలుస్తే, అది అతనితో, “చెట్లు నడిచి వచ్చిన రోజు తప్ప నీకు అపజయం ఉండదు” అంటుంది. దానితో, వషిజు ధీమాగా ఉంటాడు. కానీ, చివర్లో, నిజంగానే చెట్లు నడిచొస్తాయి. యుద్ధంలో వషిజు మరణిస్తాడు. స్థూలంగా ఇదీ కథ.

కథ ఆద్యంతమూ స్క్రీనుకే కళ్ళను కట్టిపడేసిందని చెప్పాలి. ఎక్కడికక్కడ పొగ, దుమ్ము రెండింటినీ భలే వాడుకున్నారు. స్క్రీన్ పై అది ఓ మంచి ఎఫెక్ట్ ఇచ్చింది అనిపించింది నాకు. వషిజు పాత్ర పోషించింది తోషీరో మిఫునె. ఇతని నటన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. అయితే, మిఫునె లోని హాస్య నటనని ఈ సినిమాలో కూడా ఉపయోగించుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. సీరియస్ కథే అయినా, హాస్యం అన్నది సహజంగా పుట్టేది…దాన్ని కూడా ఎక్కడో చూపిఉండాల్సింది అనిపించింది. మికీ ఆత్మ కనబడ్డప్పుడూ, చివర్లో బాణాల సీనులోనూ, మిఫునే కళ్ళలో కనిపించిన భయం- ఎంత నిజంగా ఉందో, అంత నిజంగా ఉంది. భయంలో మిఫునే వేసిన కేకలూ, తీసిన పరుగులూ-అంతా సహజంగా ఉన్నాయి. బాణాల సీనులో నిజం బాణాలు వాడారట-నిజం భయాన్ని కనిపించేలా చేయడానికి!

మిఫునే భార్య పాత్ర – అంత కౄరమైన మనిషి ఉంటుందా? అనేలా ఉన్నాయి ఆమె కళ్ళలో పలికిన భావాలు. చివర్లో, పశ్చాత్తాపం తో, చేతులపై ఊహాజనితమైన రక్తపు మరకల్ని ఊహించుకుని అదే పనిగా కడిగే సీను-భలే చేసింది. ఈ సినిమాలో కనిపించిన ఆత్మలు నిజం ఆత్మల్లానే ఉన్నాయి అసలు. అంటే…నిజంగా ఆత్మలు ఎలా ఉంటాయో నాకు తెలీదనుకోండి…కానీ, చూడగానే, ఆత్మ అన్న ఫీలింగ్ వచ్చేసింది..:) ఇది నేను చూసిన పదకొండో కురసోవా సినిమా. ఇంకా బోరు కొట్టలేదు సరికదా..ఇంకా చూడాలి ఆయన సినిమాలు అనిపిస్తోంది. మిఫునె ని కూడా చూసేకొద్దీ మొదటి సినిమా చూసినప్పటి అబ్బురం పెరుగుతూనే ఉంది కానీ, తగ్గడం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే, ఇక చెప్పాలా మరి! చూసి తీరాల్సిన సినిమాల్లో ఇదీ ఒకటి.

4 Comments
  1. sridhar April 21, 2008 /
  2. సౌమ్య April 21, 2008 /
  3. సగటు జీవి April 21, 2008 /
  4. Jonathan April 23, 2008 /