Menu

రాటటూయీ (2007)

ratatouilleposter.jpgరాటటూయీ అకాడెమీ అవార్డు అందుకున్న యానిమేషన్ చిత్రం. ఇలా చెప్పడం మీలో కాస్త కుతూహలం కలిగించవచ్చు. మినిమమ్ గ్యారంటీ నమ్మకం కలిగించవచ్చు. ఇది పిక్సార్ సంస్థ తీసింది అనగానే యానిమేషన్ ప్రియులకి అయితే, “అయితే ఓకే” అనిపించి ఉంటుంది. అలా అనుకున్నా కూడా, ఎలుకల మీద సినిమా అన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇన్నాళ్ళూ చూడలేదు. చివరికి తెగించి చూసాక గానీ అర్థంకాలేదు ఈ సినిమాని వీలుంటే చూసి తీరాలి అని. యానిమేషన్ ఎలుకలకూ, నిజం ఎలుకలకూ చాలా అంతరం ఉంది కానీ, అయినప్పటికీ, సినిమా తీసిన విధానం-పిక్సార్ అంటే ఉండే ఆంచనాలను అందుకున్నదనే నా నమ్మకం.

కథాంశం విషయానికొస్తే, రెమీ అన్న ఎలుకకు మంచి వంటలు చేయాలన్నది కోరిక. ఒకానొక సందర్భం లో అది ప్యారిస్ నగరంలో కెల్లా ప్రఖ్యాతి పొందిన గుస్తావ్స్ అన్న ఓ రెస్టారెంట్ లోకి వచ్చి పడుతుంది. అక్కడ ఒక పనివాడి ద్వారా తన వంట ప్రయోగాలు చేస్తూ పేరు తెచ్చుకుంటుంది. (అదే..వంటవాడు పేరు తెచ్చుకుంటాడు.) ఇంతలో, ఆ పనివాడు వేరెవరో కాదు, ఆ రెస్టారెంట్ పెట్టినతని కొడుకనీ, ఆయన కొడుక్కి ఆస్తి అంతా రాసిచ్చి వెళ్ళాడనీ అతని విల్లు ద్వారా తెలుస్తుంది. అక్కడే ఉండి గుస్తావ్స్ పగ్గాల కోసం నిరీక్షిస్తున్న స్కిన్నర్ కి ఇది నచ్చదు. అక్కడ్నుంచి కథంతా రెమీ తన మిత్రుడికి ఈ రెస్టారెంట్ ని ఇప్పించడం, దీని పేరు ప్రఖ్యాతులు పెంచడం గురించి. మధ్యలో అక్కడి ఏకైక ఆడ ఛెఫ్ అయిన టాటో తో మన కుర్రవాడి ప్రేమ వ్యవహారం, రెమీ కుటుంబ సభ్యులకి రెమీ ఇలా వంటలు చేసుకోడం మీద ఆసక్తి చూపుతూ, తిండి దొంగిలించడాన్ని వ్యతిరేకించడం గురించి కలిగిన అసంతృప్తి, రెమీ తన వాళ్ళని మార్చేందుకు చేసే ప్రయత్నం వగైరాలన్నీ పిట్టకథలు. అసలింతకీ, రాటటూయీ అన్న పేరు నేను ఎలుకలని గురించి ఆలోచించి పెట్టారేమో అనుకున్నా. తరువాత తెలిసింది -అదో వంటకం అని. సినిమాలో రెమీ ఆ హోటల్ని ఆ వంటకం చేయటం ద్వారా విమర్శకుల ప్రశంసలు పొందేలా చేస్తుంది.

సినిమా మొదట్లో ఇచ్చే పరిచయ వాక్యాలే ఎలుకలంటే మనుష్యులకి ఉన్న చిరాకుని తుడిచిపెట్టడానికి ప్రయత్నించే విధంగా ఉంటాయి. కిచెన్, వంటల యానిమేషన్ చాలా సహజంగా ఉంది. నాకు చీనీకమ్ సినిమాలోని వంటగది గుర్తు వచ్చింది. షరామామూలుగా పిక్సార్ వాళ్ళు బొమ్మల్లోకి జీవం తేవడంలో మళ్ళీ సఫలీకృతులయ్యారు. కథలో ప్రేమ కథ… నాకు భలే నవ్వొచ్చింది ఆ ప్రేమకథ చూస్తూ ఉంటే. ఇంకా, విలన్ పాత్ర రూపురేఖలే చిత్రంగా ఉంటాయి…వాడు సీరియస్ విలన్ అయినా కూడా మనకు కామెడీ విలన్ ఫీలింగ్ ఇచ్చేలాగ ఉంటాయి. ఎలుక-రెమీ పాత్ర చిత్రణ చాలా నచ్చింది నాకు. ఇంకా, గుంపులు గుంపులుగా ఎలుకలు చుట్టుముట్టే సన్నివేశాలు నాలుగైదు ఉన్నాయి సినిమాలో-మొదటి నుండీ చివరిదాకా. వీలైనంత భయపెట్టేలా ఉన్నాయి అవి. ఆ సీన్లు చూసి…ఓసారి మీ రూముని కలియజూడకుంటే అడగండి. ఓసారి సీను ఊహించుకుంటే చాలు… 🙂 చివరి సీనులో కింద మనుష్యులు, పైన ఎలుకలు – గుంపులు గుంపులుగా గుస్టావ్స్ విందుల్ని ఆరగించే దృశ్యం చూడగానే ఎలుకలంటే చిరాకేసే నాలాంటి వాళ్ళ పెదాలపై కూడా ఓ చిర్నవ్వు. రెమీ ముఖకవళికలు కూడా చాలా బాగా చూపించారు. ఎలుకలు సాధారణంగా చేసే శబ్దాలు ఈ సినిమాలో ఎక్కడో కానీ వినబడకపోవడం ఓ పెద్ద ఊరట. రెమీ వీలునామా ని తీసుకుపోతూ ఉంటే స్కిన్నర్ దాన్ని వెంటాడే సీన్ కూడా బాగా తీసారు. మన కుర్రాడి తలపై టోపీలో ఉంటూ రెమీ వాడి చేత నానా విన్యాసాలు చేయించడం కొన్నిసార్లు నవ్వుపుట్టిస్తుంది.. అవే విన్యాసాలతోనే వాడి చేత వంట చేయించేసేయడంలో రెమీ చూపిన చాకచక్యం ఆశ్చర్యపరుస్తుంది..ఆ సన్నివేశాలు తీసిన విధానానికి ఆశ్చర్యం కూడా కలగకమానదు. యానిమేషన్ అయినా కూడా పూర్తి జీవకళ ఉంది ఈ సినిమాలో.

7 Comments
  1. chavakiran April 18, 2008 /
  2. మంజుల April 18, 2008 /
  3. venu April 18, 2008 /
  4. సౌమ్య April 19, 2008 /
  5. sujatha April 22, 2008 /
  6. ప్రపుల్ల April 27, 2008 /
  7. Bujji May 19, 2008 /