Menu

జోకర్ గాడి ఫ్యాన్…! (రెండవ-ఆఖరి భాగం)

ladiestailor.jpgమొదటి భాగానికి వచ్చిన పరిశీలనల దృష్ట్యా, మొదట గా కాస్త ఉపోద్ఘాతం దంచేసి తరువాత రెండవభాగం లోకి దూకుదామని కాస్త స్వోత్కర్షని ఇక్కడ పొందుపరుస్తున్నా. ‘అప్రస్తుతం’ అనుకునేవారు, తరువాతి పేరా నుండీ చదవడం మొదలు పెట్టవచ్చు! “వివాహ భోజనంబు” గురించి లోతుగా చర్చించలేదని అసంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది. నిజానికి నేను ఈ సినిమా గురించి రాసిన ఒకేఒక్క పేరాని చూసి, “ఈ సినిమా కి ఇంతేనా గౌరవమని” నా ఆత్మారాముడు అవహేళన చేస్తే, “ఇంకో పూర్తి వ్యాసం దీనిగురించి రాస్తానని” వాడ్ని సంతృప్తి పరచాను. త్వరలో ఈ శుభకార్యానికి శ్రీకారం చుడతాను. అక్కడక్కడా కొన్ని ముఖ్యమైన సినిమాలు ‘మిస్’ కొట్టానని, నాకు తెలియజెప్పడం జరిగింది. వారికి నేను చెప్పే సంజాయిషీ ఒక్కటే, నాకు స్కూల్లో రాజేంద్రుడి ఫ్యాన్ గా జరిగిన గౌరవానికి ప్రతీకారంగా ఒక “స్వగతం” పక్షంగా ఈ వ్యాసం ఉంటోందే తప్ప, తన ఫిల్మోగ్రఫీని ఉటంకించడం ఉద్దేశంగా కాదు. కావున ఆ ‘మిస్’లు ఉద్దేశపూర్వకమేకాని, మరుపుకాదని మనవి. ఇక విషయం లోకి వద్దాం!

1991 లో నందిఅర్హమైన ‘ఎర్రమందారం’ తో పాటు వచ్చిన మరో “డిఫైనింగ్” చిత్రం, బాపు గారి “పెళ్ళి పుస్తకం” దాంతోపాటు, రాబోయే కాలంలో ఎస్.వి.కిష్ణారెడ్ది(ఈ సినిమాకి దర్శకత్వం వహించలెదుకానీ,మిగతావన్నీ తనే) -రాజెంద్రప్రసాద్ కాంబినేషన్ కి పునాది వేసిన “కొబ్బరిబోండాం” . దాదాపు 14 సంపత్సరాల మునుపటి ‘స్నేహం’(1977) తరువాత మళ్లీ బాపు-రాజేంద్రప్రసాద్ కలిసి పనిచేసి సినిమా ఇది. ‘బాపు’ నాయకుడు “కె.కె.” గా ‘పెళ్లిపుస్తకం’ లో రాజేంద్రప్రసాద్ నటనను చూసి యావదాంధ్రదేశం బ్రహ్మరధం పట్టింది,అప్పుడు నేను ‘ఇంటరు’ చదువుతున్నా. ఆ సందర్భంలో ఒక ఫ్యాన్ గా నన్నుకూడా అభినందించిన నా మిత్రమండలికి ఈ సందర్భంగా కృతఙత తెలుపకుండా ఉండలేను. అందుకే, ఈ జోకర్ గాడి ఫ్యాన్ కి ఒక విశిష్టమైన “విలువని” అందించిన సంవత్సరం  గా 1991 నాకు బాగా గుర్తు. ఈ సినిమా లోని “పెళ్ళి(డీల్)చూపుల” సీన్ మధ్యతరగతి మనసుల్లోని భావాలకి అద్దంపడితే, రాజేంద్రుడి నటన దానికి జీవం పోసింది. అఫ్కోర్స్, ‘దివ్యవాణి’ కూడా చాలా బాగా “కాంప్లిమెంట్” చెసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకోండి. ఇక టైటిళ్ల మధ్య జరిగే ‘పెళ్లి’ ,దాంట్లో నాయిక నాయకుల మధ్య జరిగే “రొమాన్స్” తెరపై కవిత్వమేకానీ “స్క్రీన్ ప్లే” మాత్రంకాదని వేరేచెప్పాలా? పాత “మిస్సమ్మ” సినిమాకి ప్రేరణగా తీసిన ఈ సినిమాలో, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు,ప్రేమలు,ఆప్యాయతలు,ఉక్రోషాలు ఇలా అన్ని రసాలనూ అవలీలగా పోషించడం “డాక్టర్” రాజేంద్రప్రసాద్ కే చెల్లు. ఒక్కోసారి దాదాపు చిన్నపిల్లల్లా హీరోహీరోయిన్లు “గిల్లికజ్జాలు” పెట్టుకుంటుంటే చూసి చిన్నపిల్లలవని ప్రేక్షకుడు లేడు. ఇక్కడ సినిమా గొప్పదో, దాన్ని పండించిన నటులు గొప్పవాళ్ళొ చెప్పడం మహాకష్టం.

‘చందమామ’ వారి రీఎంట్రీ సినిమా “బృందావనం” (1992) కి రాజేంద్రున్ని ఎంచుకోవడం ఒకవిధంగా తనకి గౌరవాన్ని కల్పిస్తే, సినిమాని తన నటబలంతో నడిపించి సంస్థను నిలబెట్టి తన ఘనతని చాటుకున్నాడు. సింగీతం శ్రీనివాసరావు గారి దర్శక ప్రతిభ, వివిధ గెటప్పులలో మన హీరో చూపిన కొత్తదనం కలిపి ఈ సినిమాను ఒక “క్లాసిక్” గా నిలిపాయి. సినిమా ప్రధమభాగం లో శుభలెఖ సుధాకర్ తండ్రి గెటప్పులో, “ఆ..నా పేరు పోతరాజు” అని రమ్యకృష్ణ కు చెప్పిన తీరుకు మొత్తం ధియేటర్ నవ్విందిగానీ, అసలు వాచకం,మాడ్యులేషన్ నేర్పటానికి నటనా విధ్యార్థులకు చెప్పవలసిన పాఠమది అని నా విశ్వాసం. తరువాత సత్యనారాయణ ను ‘నమ్మకమైన నటన’ తో ఇంట్లోనే తిష్టవేసి భయపెట్టడం ఒక ఎత్తైతే, పెద్ద వ్యాపారవేత్తగా వేషం వేసి తనది కాని ఇల్లుని సత్యనారాయణకు అంటగట్టే గెటప్ లో తను చేసిన ఆ “ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్” ఏ కమల్ హాసన్ లాంటి నటుడికో తప్ప వేరొకరి తరంకాదు.

జంధ్యాల స్కూల్ నుండి వచ్చిన ‘ఇ.వి.వి.సత్యనారాయణ’  దర్శకత్వం లో అంతకుమునుపు “చెవిలోపువ్వు” చేసినా, అది అంతగా ఆర్థికం గానూ ప్రేక్షకులకు అందటంలోనూ విజయవంతం కాలేదు. “వీడెవడో జంధ్యాల లా తీసాడుకానీ సబ్జెక్ట్ లోఅంత బలం లేదు, రాజేంద్రప్రసాద్ యాక్టింగ్ లో అంతపదును రాలేదు” అని తేల్చేసారు. ఈ ఓటమి తరువాత వచ్చిన చిత్రాలు, “ఆ…ఒక్కటీ అడక్కు!”, “అప్పుల అప్పారావు” (1992). కొంత పెడర్థాలు, కొంత ద్వంద్వర్థాలు, కొంత లేకితనం వెరసి ‘నామార్కు హాస్యం’ అని ఇ.వి.వి. నిర్ణయిస్తే, దాన్నికూడా తన సమర్ధతతో సంసారపక్షం చేసిన నటుడు రాజేంద్రప్రసాద్. స్వర్గీయ రావుగోపాలరావు కాంబినేషన్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ లో వచ్చే ప్రతి సీనులోనూ ‘నటకిరీటి’ నటన ఏ నటుడికి అనుకరణ సాధ్యం? ” ‘అప్పు’ ‘డే’ తెల్లారిందా!” అని ‘అప్పుల అప్పారావు’లో తనుఅన్న ఒక్క డైలాగుచాలు,సినిమాలో తను పండించిన నటనని చెప్పడానికి.

రాజేంద్రప్రసాద్ హాస్యం అపహాస్యమైపోతోందా ? అన్న తరుణం లో మరో దర్శకుడు తెరమీదికి వచ్చి, రాజేద్రుడి ఆరోగ్యకరమైన హాస్యనటనని తన నూతన ఒరవడితో మరో మలుపు తిప్పాడు. ఆ దర్శకుడే ఎస్.వి.కిష్ణారెడ్డి.  “రాజేంద్రుడు-గజేంద్రుడు”,” మాయలోడు” (1993) సినిమాలతో అప్పటివరకూ కొంత ‘ఓవర్ యాక్టింగ్’ వైపు మోగ్గుచూపిన రాజేంద్రుడు మళ్ళీ సహజ నటనను  “అండర్ ప్లే” గా మలచి కామెడీని పుట్టించి, హిట్టిమీదహిట్టు తో ప్రజల మనసు దోచేసాడూ. నాలాంటి అభిమానుల ఆశల్ని నిలిపాడు. గజేంద్రుడి (జంతువు) మీద ప్రేమ ఒకదాంట్లో ఐతే, చిన్నపాప మీద ప్రేమ మరోకసినిమాలో. ఇలా తను “నేను గాని ఒక వీల గానీ వేశానంటే” అంటూ నటమాయ చెస్తే మంత్రముగ్ధులుకాని వారెవ్వరు?

ఇక ఇదే సంవత్సరం లో వచ్చిన మరో ఆణిముత్యం “మిస్టర్ పెళ్ళాం”. బాపు-రమణల “సోషియో ఫాంటసీ సోషియల్ సెటైర్” (ఇలాంటి కేటగిరీ అంటూ ఏదీ లెదు, కానీ ఈ సినిమా అదేమరి) ఇది. ఇందులో పితృస్వామ్య భావజాలాన్ని అణువణువూ నింపుకున్న, ప్రేమించే(ఇదే ఇక్కడి కాంట్రడిక్షను) భర్త,తండ్రి గా “ప్రసాద్” పాత్రలో రాజేంద్రుడు చేసిన నటనకి, జోహార్లర్పించడం తప్ప ఏంచేయగలను. “ఫ్యాను…!” అంటూ, పేపరు చదువుతూ, తను సిగరెట్టు వెలిగించుకోవడానికి ఫ్యాన్ ఆపడం అవసరమై, వంటగది లో చాలా ముఖ్యమైన పనిలోఉన్న పెళ్ళానికి అరుస్తూ పురమాయించే ఈ సీను ఇంకేనటుడైనా చేసుంటే, ఆడవాళ్ళ చీవాట్లు పడేవే తప్ప ఈ “సెటైరు” కామెడీగా పండేదేకాదు. ఇలాంటి స్క్రిప్టు కి అలాంటి నటుడెంత అవసరమో చూసారా ! తను మొగాడినన్న అహం, మోసపోయి ఉద్యొగం పోగొట్టుకునే అమాయకత్వం,భార్య ఉన్నతికి ఉడుక్కునే ఉడుకుమోతుతనం, తనమాటే చెల్లాలననే ఉక్రోషం ఒకవైపు పండిస్తే. పిల్లలతో పిల్లాడై తనుచేసే అల్లరి, “సొగసుచూడ తరమా” అని ఆఫీసునుండి వచ్చేభార్య కోసం వంట తయారుచేసి ప్రేమతో ఎదురుచూసే పార్శ్వాన్ని సమంగా మరోవైపు పండించాడు. అదీ నటుడిగా తన “క్యాలిబర్”.

తన సోంత సినిమాలైన “మేడమ్”, “రాంబంటు” రెండూ వ్యాపారపరంగా నష్టాలు కలిగించినా, ఆడవేషంలో ‘మేడం’ గా తనుచేసిన అల్లరి,అభ్యుదయం రెంఢూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయ్. ‘రాంబంటు’ లో సమయానికి అనువైన కొత్తదనం లేకపోయినా తన గెటప్పుని తప్ప నటనని ఖచ్చితంగా తప్పుపట్టలేము.

1995 వ సంవత్సరం నుండి ఈ విలక్షన నటుడికి హీరో గా అవకాశాలు తగ్గాయి, అడపాదడపా సినిమాలు వచ్చినా అవి మంచి హాస్యఅభిరుచి కలిగిలేకుండా ఉండటంతో అటకెక్కాయి. తరువాత, మళ్ళీ సహాయ నటుడిగా, నలుగురు హీరోల్లో ఒకరిగా 2006 వరకూ నటించినా, అవేవీ (అభిమానిగా) చర్చించదగిన సినిమాలు కావని నా అభిప్రాయం. 2007 వ సంవత్సరం ఈ నటుడి సత్తా మరోసారి తెరపై ఆవిష్కరించింది. “ఆ నలుగురు” మరియు “మీ శ్రేయోభిలాషి” చిత్రాలు ఈ వయసులో రాజేంద్రప్రసాద్ చేయవలసిన పాత్రల స్వభావాలను, విషయాల స్వరూపాలను మచ్చుకకి రుచిచూపాయి. నటుడిగా, తన పూర్తి సత్తాని ఇంకా తెలుగు సినిమా ఉపయోగించుకోలేదని డి.టి.యస్ లో నిరూపించాడు.

నేను ‘జోకర్ గాడి ఫ్యాన్ ని’ అని అప్పుడు, ఇప్పుడూ,ఎప్పుడూ గర్వంగానే చెబుతాను. ఇప్పుడు నా గొంతు లో గొంతు కలపడానికి కనీసం కోటి గొంతులున్నయ్ అంతే తేడా.

P.S. రాజేంద్రప్రసాద్ తొ దాదాపు చెరో పది సినిమాలు చెసిన “రేలంగి నరసింహారావు”, “విజయబాపినీడు” గురించి పై వ్యాసంలో ఎక్కడా చెప్పలేదు.కారణం, అభిమానిగా నా స్పందనకు తోడ్పడిన సినిమాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం.

7 Comments
  1. Sowmya April 30, 2008 /
  2. Uttara April 30, 2008 /
  3. మంజుల May 1, 2008 /
  4. రాజేంద్ర కుమార్ దేవరపల్లి May 1, 2008 /