కిట్టి గాడు, చిరు గాడు,బాలకిట్టి గాడు, వెంకి గాడు, నాగ్ ఫ్యాన్స్ అంటూ స్కూలు కాలేజిల్లోని విధ్యార్థులు గ్రూపులుపడటం, మన “సినిమాంధ్ర ప్రదేశ్” లో సర్వసాధారణ విషయం. ఇక బాలక్రిష్ణ,చిరంజీవి అభిమానుల వీరంగాలు జగద్విదితమే కదా! ఇలా సాగే ప్రహసనాల పరంపరల మధ్య, బహుశా స్కూల్లో అనుకుంటా, నా మిత్రులు కొందరు మన పిచ్చి గురించికూడా వాకబు చెయ్యడం జరిగింది. అప్పటి వరకూ వరుసపెట్టి సినిమాలు చూడ్డమే తప్ప అభిమానాలు, అందునా హీరో పట్ల అభిమానాల్ని గురించి పట్టించుకోని నాకు, ఒక ధర్మసంకటం వచ్చి పడిందని చెప్పుకోవచ్చు.
కత్తియుద్దం కాంతారావు, చిన్నబొజ్జ రామారావు,రొమాంటిక్ నాగేశ్వర్రావు,అందగాడు శోభన్ బాబు లతోపాటు కుటిలుడు సీయస్సార్, రాచవిలనుడు రాజనాల,కంచుకంఠం జగ్గయ్య,భారీవిగ్రహం ఎస్వీ రంగారావుల్ని కూడా సమానంగా ప్రేమించి,అభిమానించిన తెలియనితనం నాది. సూపస్టార్ కట్టెఫైటింగ్ ని చూసి కళ్ళప్పగించిన బాపతునాది. రెబల్స్టార్ రౌద్రాన్ని, నాకు కోపమోచ్చినపుడు నెమరువేసుకున్న అమాయకుడిని. మెగాస్టార్ డ్యాంసులు,యువరత్న డయలాగులు,యువసామ్రాట్ స్తైలు,విక్టరీ ఈజ్ ను సమపాళ్ళలో ఆరాధించే మూర్ఖశిఖామణినైన నాకు,సమాధానం అంత సులువుగా రాలేదు. కానీ, నానోట అప్రయత్నంగా వెలువడ్డ పేరు విని నాకునేను ఆశర్యపోతే, నా స్నెహితులు నవ్వుకున్నారు.ఆ పేరు “రాజేంద్రప్రసాద్”. “వీడూ, ఆ జోకర్ గాడి ఫ్యాన్ అటరా !” అన్న నా మిత్రుడి మాటకు కోపం కన్నా, ఒక వీశమంత గర్వమేసింది నాకు. అలా నాకు ఆ క్షణంలో ఎందుకనిపించిందో, జీవితంలో కొంత మెచ్యూరిటి, సినిమాపై ఒక అవగాహన వచ్చేవరకు అర్థంకాలెదు.
తెలుగు చిత్రరంగంలో ఒక “పరిపూర్ణ నటుడు” ఎవరైనా ఉన్నాడు, అంటే అది రాజేంద్రుడే (with due respect to all other actors) అని నాభావన. బహుశా తను చేసిన వైవిధ్యమైన సినిమాల వలనైతే కావచ్చు, ’కామెడీ చేయటం నటనలో అన్నిటికన్నా కష్టం’ అనే నా నమ్మకం వల్ల కావచ్చు, లేక చిన్నతనంలో తన సినిమాలు చూసి నేను అనుభవించిన ఆనందానికి కృతఙత గా కావచ్చు, ఈ భావన నాలో క్రమేపీ బలపడింది. అందుకే ఈ వ్యాసం objective గా కాకుండా, నా వీరాభిమానానికి నేనే పట్టం కట్టేసుకునే విధంగా ఉంటే క్షమార్హుణ్ణి. మీ సహృదయత నాపై మెండుగా చూపించగలరని మనవి.
నా హీరో, క్యారెక్టరు నటుడిగా అంతకుమునుపు చాలాచిత్రాలలో(దాదాపు 50 పైచిలుకు తమిళ,తెలుగు భాషలలో) నటించాడు. ఇందులో మహా సీరియస్ సినిమాలు చేసే టి.కృష్ణ (వందేమాతరం,దేశంలో దొంగలు పడ్డారు, ఘర్జన) , వేజళ్ళ (ఈ చరిత్ర ఏసిరాతో,ఇదికాదు ముగింపు,ఈపిల్లకు పెళ్ళవుతుందా) మరియు ధవళ సత్యం (గుడిగంటలు మ్రోగాయి, ముద్దుల చెల్లెలు) యొక్క దర్సకత్వంలో కూడా ఉండటం గమనించదగిన విషయం. మొదటి సినిమాకూడా “బాపు” గారిదని విన్నాను. ఇకపోతే, వంశీ దర్శకత్వం లో నలుగురు హీరోలలో ఒకరుగా చేసిన “మంచు పల్లకి” తరువాత మూడు సంవత్సరాలకు “ప్రేమించు, పెళ్ళాడు!”(1985) తో హీరోగా తెరంగేట్రం చేసాడు. ఇక్కడినుండి మొదలైందండి, నా అభిమాన తరంగం.
నా వయసు అప్పుడు ఏ తొమ్మిదో,పదో ఉంటాయనుకుంటా. మా అన్నయ్య నన్ను ఈ సినిమాకి తీసుకెళ్ళాడు. తను అప్పటికే ఇళయరాజా సంగీతమంటే చెవికోసుకునే రకం కాబట్టి, అంతగా పేరు కూడా తెలియని ఈ హీరో సినిమాకి వెళ్ళే సాహసం చేసాడని నా ప్రఘాడ విశ్వాసం. ఇప్పుడు నాకు ఆ సినిమా కథగానీ, కథనంగానీ గుర్తులేవు. కానీ, ఒక బక్కపలచని,రివటలా ఉన్న వ్యక్తి, అదీ పెద్దపెద్ద కళ్ళద్దాలు పెట్టుకుని “వయ్యారి గోదారమ్మ…వొళ్ళంతా ఎందుకమ్మ కలవరం?” అని భానుప్రియ కు సర్దిచెప్పిన మొహం లోని ’అమ్మయకపు ధీమా’ నన్ను ఆకట్టుకుంది. “గోపెమ్మ చేతిలో గోరుముద్ద…” అంటూ నాయిక పెట్టే అల్లరికి ఉక్కిరిబిక్కిరై, ప్రేమావేశాన్ని ఒకవేపు, ఉక్రోశాన్ని మరోవైపు, గమ్మత్తుగా మిక్స్ చేసి నటించీ నటించనట్టు నటించిన సిన్సియరు పాత్రధారి మాత్రం నా కళ్ళకు కట్టినట్టు ఇంకా కనిపిస్తూనేఉన్నాడు. “హీరో్” అంటే ఇలా ఉండాలి…అలా ఉండాలని, తాము గీసిన గీతల మధ్య తామే బంధీలైన సినిమా పరిశ్రమను,తెలుగు ప్రేక్షకులను ఒక “మామూలు ముఖం” సై! అంటూ సైలెంటుగా విముక్తుల్ని చేసేసింది. ఆ హీరో కాని హీరో పేరు “రాజేంద్రప్రసాద్”, నేను తన అభిమానిని…ఒక జోకర్ గాడి ఫ్యాన్ ని!
ఈ సినిమా వ్యాపారపరమైన విజయాన్ని అందిపుచ్చుకున్నా, స్థాయిత్వాన్ని విపరీతంగా ప్రేమించి, మార్పుని మెల్లకంటితో మాత్రమే చూసే తెలుగు సినీపరిశ్రమ లో రాజేంద్రుడి నటనావైదుశ్యానికి, నీరాజనాలైతే దక్కలేదుగానీ పగలు,ప్రతీకారాలు, కాస్త విప్లవం మార్కు సినిమాలమధ్య కొట్టుమిట్టాడుతున్న తెలుగు ప్రేక్షకుడు మాత్రం “హమ్మయ్య కాస్త హాయిగా నవ్వుకున్నాం, ” అనుకున్నాడు. ఆతరువాత అడపాదడపా తను చిన్న వేషాలు మళ్ళీవేసినా, ప్రేక్షకుడిలో గుర్తింపునిమాత్రం మెండుగా అప్పటికే దక్కించుకున్నాడని చెప్పవచ్చు.
1985 రాజేంద్రప్రసాద్ ని హీరో ని చేస్తె , 1986 వ సంవత్సరం తనలోని విలక్షణతని పరిచయం చెసింది. ఒకవైపు జంధ్యాల “రెండురెళ్ళ ఆరు” వంశీ “లేడీస్ టైలర్” లో హాస్యపు జల్లుని కురిపిస్తే, మరోవైపు “కాష్మోరా” గా కళ్ళ తో నిప్పులు (నిజంగా ఈ సినిమాలో కంటి లోంచి నిప్పు పుట్టే సీన్ ఉందండోయ్!) కురిపించాడు. ఈ మూడు సినిమాలూ హిట్టే, తెలుగు సినిమా నాయకుడిగా రాజేంద్రుడు రాజమార్గం పట్టే ! అనచ్చు .
ఇక్కడ ఈ సినిమాల గురించి కొంత మాట్లాడుకుందాం.మొదటగా కామెడీలు; మల్లాది వెంకటక్రృష్ణమూర్తి నవల “రెండురెళ్ళ ఆరు” ను, చేయితిరిగిన హాస్యబ్రహ్మ జంధ్యాల అదేపేరుతో తెరకెక్కించారు. జంధ్యాల గారి “బాబాయ్-అబ్బాయ్” లో రాజేంద్రప్రసాద్ ఒక చిన్నవేషం వేసినా,హీరో గా ఈ కాంబినేషన్ కి ఇది మొట్టమొదటి సినిమా. ఆతరువాత కాలంలో ఈ జంట తెలుగు సినిమాలో కామేడీకి తెచ్చిన విలువ నభూతోనభవిష్యతి. బహుశా ఈ సినిమాతో ఇంకో జంట రాజేంద్రప్రసాద్ – చంద్రమోహన్ కూడా ప్రజల మష్తిష్కాలలో నిక్షిప్తమైపోయారు. అక్కడి వాడు ఇక్కడ,ఇక్కడివాడు అక్కడ గా జరిగే ఈ ప్రేమ (హాస్య) ప్రహసనంతో, రాజేంద్రుడు నవలానాయకుడుకూడా అయిపోయాడు.
ఇక ప్రత్యేకంగా చెప్పుకోవలసినది, “లేడీస్ టైలర్”. అసలే కొత్త అర్థాలు నేర్చుకుంటున్నతెలుగు కామెడీ కి “సెక్స్ కామెడీ” అనే కొత్త విధానాన్ని’వంశీ’ పరిచయం చేస్తే, దాన్నిజుగుప్స కలగకుండా పండించిన ఘనత మనవాడిదే. “జమ జచ్చ,జతో జడ” అనిఉన్న పోస్టర్ ని చదివే ప్రయత్నం చేసిన నన్ను అక్కడినుండి లాక్కెళ్ళిన మా అన్నయ్య చెయ్యి ఇంకాగుర్తే. ఆ సినిమా ప్రభావంతో సమస్తాంధ్రా ’క’ భాష, ’గ’ భాష ల హొరెత్తింది. మనలోఎంతమంది ఈ ప్రయోగాలు చేసామో ఒక్కసారి జ్ఙాపకం చేసుకుందాం. ఈ సినిమాని కొంత వయసు వచ్చేవరకు చూసేభాగ్యం నాకు కలగలేదు. కానీ, దీన్ని చూసినవెంఠనే నాకు “అబ్బా…ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయా” అన్పించింది. ఇక మన హీరో అంటారా, తనుకాక ఈ పాత్రలో ఇంకెవరినైనా ఊహించగలరేమో చెప్పగలరా? చేతిలో కళ ఉండీ, పని చెయ్యటానికి బద్దకించే సోమరితనం. జాతకం పిచ్చితో, ఏంచెప్పినా నమ్మే భోళాతనం. తెలివిగా మాటలు చెప్పి అమ్మాయిల్ని ఇంప్రెస్ చెయ్యగల, మాటకారితనం. అప్పుడప్పుడు ప్రాణభయం తో గిజగిజ లాడే పిరికితనం, ఇలా ఎన్నెన్ని చాయలు,ఎన్నెన్ని భావాలు. వీటన్నింటినీ అవలీలగా చేసిన నటుడు ఎవరు? ముఖ్యంగా, సినిమాలొ అమ్మాయిల తోడలు (మచ్చ కోసం) తను తడుముతుంటే, ఆ ముఖం చూసి నవ్వుకున్నవాళ్ళే ఎక్కువగానీ, తొడల్ని చూసి ఉద్రేకపడిన వారు తక్కువే. ఈ చమక్కు,ఈ తరం లోని ఏ నటుడికి చేతనౌనో?
“వీడెవడో కామెడీ బాగా చేశాడ్రా!” అనుకుంటుండగానే వచ్చింది, “కాష్మోరా”. యండమూరి వీరేంద్రనాధ్ క్షుద్రనవలకు సినిమా రూపమైన దీంట్లో ’కాద్రా’ అనే ఒక ఒరియా మాంత్రికుడి వేషం అది. ప్రధమార్ధం లో మానవ సంపర్కంలేని,దాదాపు ఒకజంతువులాంటి పాత్ర. ఈ భాగం లో , ఆ పాత్ర నడక,భాష,చూపు లో(అదీ ఏ స్పెషలు మేకప్పు, గ్రాఫిక్సూ లేకుండా) రాజేంద్రప్రసాద్ చూపిన వైవిధ్యం ఒకఎత్తైతే, ద్వితీయార్థం లో ’తులసి’ ని అభిమానించి,తనని కాపాడే ప్రయత్నం లో ప్రాణాల్నే అర్పించే త్యాగశీలిగా తను ఒలికించిన కరుణరసం ఒకఎత్తు.
ఇలా “నటకిరీటి” నటించిన దాదాపు 200 లకుపై సినిమాల గురించి ఒక్కొక్క పేరా రాసినా, ఈ వ్యాసం కొండవీటి చాంతాడవుతుంది కాబట్టి, కేవలం నన్ను అభిమానిగా మలచిన ముఖ్యమైన మరియు వైవిధ్యమైన సినిమాల గురించి ఉటంకిస్తాను.
“గాంధీనగర్ రెండవ వీధి”(1987) , ఈ సినిమాకు మూలం మళయాళం, అందులో ఇండియాలోనే గొప్ప నటుడని చెప్పుకునే “మోహన్ లాల్” హీరో. దీంట్లో ’హిందీ రాని గూర్ఖా’ వేషం లో, “మై జాతా హై! హు!” అని ఇబ్బందిగా పెట్టిన ఫేసుకి ఆస్కారు ప్రదానం చేసెయ్యొచ్చని నా మనవి. ఈ మధ్యనే ఈ సినిమా మాత్రుక చూడటం సంభవించింది, నావరకు “లాల్” కన్నా “ప్రసాద్” నటనలొ ఫ్లెక్సిబిలిటీ చాలా ఉందనిపించింది. “దొంగకోళ్ళు”(1988) కూడా ఈ కోవకే చెందుతుంది. ఇల్లు ఖాళీ చెయ్యించలేని అసహాయత. తన ఇంట్లో తననే “అన్ వాంటెడ్ గేస్ట్” గా ట్రీట్ చేస్తున్న సుమలత పై కోపం,ఉక్రోశం. కావాలన్నా కఠినుడు కాలేని అతిమంచితనం. ఇలాంటి భావాల్ని,సునాయాసంగా పలికిస్తూకూడా, హాస్యాన్ని పండించడముంది చూశారూ! శహభాష్!! ఏ ఒక్క మహానటునికీ తీసిపోని నటన. ఈ సినిమా మళయాల మాత్రుక లోని ఒక పాట మాత్రం చూశాను, హిందీ (సునీల్ శెట్టి ఈ పాత్రచేశాడు)లో సినిమా పూర్తిగా చూసి, మళ్ళీ మనోడే “ఝకాస్” అనుకున్నా.
1987-88 సంవత్సరాల్లో ’రెలంగి నరసింహారావు’ తో చాలా సినిమాలు చేసినా అవి హాస్యాన్ని పంచాయేగాని, రాజేంద్రప్రసాద్ నటనకు అంతగా మెరుగులు దిద్దలేదని అనుకోవచ్చు. కాని, 1987 వేసవిలో వచ్చిన “సురేష్ ప్రోడక్షన్స్” వారి “అహనా పెళ్ళంట”, జంధ్యాల మార్కు హాస్యానికి పెద్దపీట వెస్తే, రాజేంద్రప్రసాద్ ని ఒక గొప్ప కమర్షియల్ హీరోని చేసింది. దాంతోపాటు తన హాస్యపు అంబుదిలో మరిన్ని బాణాలు, జంధ్యాలగారి శిష్యరికం లో పోందుపరచుకో గలిగాడు. నటనా పరంగా ఈ సినిమా హాస్య నటులందరికీ ఒక “బెంచ్ మార్క్” అయి కూర్చుంది. నటుడిగా తనకు మరోదశాబ్దం వరకూ ఢోకాలేదని తెలియజెప్పింది. చిన్న సినిమాలకు కూడా, పెద్ద మార్కెట్ ఉంటుందని నిరూపించింది.
“హి..హి..హి..ఎక్స్పెక్ట్ చేసా” అని రజని(ఇప్పుడీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపొయిందో?) “ఉత్తిత్తి వెక్కిళ్లకు,ఉత్తుత్తి నీళ్ళు” ఇచ్చినపుడు చెబుతూ, తన ఎంబరాస్మేంటుని ఒకవైపు, నాయిక పట్ల తనకు ఎర్పడిన ప్రేమ మరోవైపు ఉన్న భావనని సింగిల్ షాట్లో చూపిన ఘనత జంధ్యాలదైతే, ప్రతిభ మాత్రం మా ప్రసాద్ దే. నూతన్ ప్రసాద్- రాజేంద్రప్రసాద్ ల మధ్య ఉన్న తండ్రీకోడుకుల దెప్పిపొడుపుల, వస్తువు విరుపుల సీనూ, నటనా ఇంతవరకూ ఏ ఇతర భాషలొనూ చూడలేదు. పిసినారి మామని తన జిత్తులతో బుట్టలో వేసుకునే నటన కానిస్తూనే, తనకు ఆశ్రయమిచ్చినవారి కుటుంబం లో ఒకడిగా మారే దృశ్యం లో చూపిన నటనకు కళ్ళు చమర్చని వాళ్ళు ఉండరు. కోట శ్రీనివాసరావు తనతండ్రి ముందే అవమానిస్తే, చెప్పుకోలేని నిస్సహాయత, తన ప్రేమను ఏమైనా చేసి గెలిపించాలనే పట్టుదల ఒక్క చూపులో చూపించిన నటుడ్ని, “జోకర్” అన్న నా స్నేహితుడి అజ్ఞానానికి నవ్వాలో,లేక ఏడవాలో ఇప్పటికీ సందిగ్ధమే.
అమాయకపు ప్రేమికుడిగా, ప్రేమలో మోసపొయానన్న దుగ్ధతో “స్త్రీ ద్వేషి” గా మారి తన శిష్యుల్ని,కుటుంబాన్నీ నానా తిప్పలుపెట్టి, తనూ అపహాస్యం పాలయ్యే పాత్ర ఒకటైతే, అమ్మాయిలను పెళ్ళిచేసుకుని మోసంచేసి కట్నం డబ్బుతొ పారిపొయి, ప్రాణాల్ని సైతం తియ్యడానికి సిద్దపడే “మిస్టర్ వి” మరోటి. అవే జంధ్యాల “వివాహ భోజనంబు”, సత్యానంద్ “ఝాన్సీరాణి”, ఈ రెండూ1988 లోవచ్చినవే. పాత్రల వైరుధ్యాలు చూడండి! ఇప్పుడేదో “మెథడ్ యాక్టింగ్” గట్రా అని అంటూ ఉంటారు, ఇంతకన్నా ఉదాహరణలు కావాలా?. ఝాన్సీరాణి సినిమాచూసి నేను, పక్క తడుపుకున్నాను, అంతకంటే మించి తన నటన గూర్చి సాక్ష్యం ఎమివ్వగలను? ఇక వివాహ భోజనంబు గురించి చెప్పాలంటే నాకు కనీసం పది రీముల పేపరో, లేక ఒక పూర్తి ‘వెబ్ సైటు’ కావలసి రావచ్చుగాక. అందరికీ తెలిసిన విషయాలేకాబట్టి దీన్ని దాటవేస్తున్నా.
ఒక “కామెడీ థ్రిల్లరు” , ఒక “మాజిక్ రియలిజం థ్రిల్లరు”,ఒక “మర్డర్ మిస్టరీ” వెరసి 1989 వ సంవత్సరం. వంశీ “చెట్టుకింద ప్లీడరు” ,యండమూరి “ధ్రిల్లర్” నవలకి రవిరాజాపినిశెట్టి తెరరూపం “ముత్యమంత ముద్దు” మరియు రామచంద్రరవు “సాక్షి”. ఈసమయం లోనే నేను, నా అభిమాన నటుడిని నేరుగా కలవడం జరిగింది. ముత్యమంత ముద్దు షూటింగ్ లో కొంతభాగం ‘హార్స్లీహిల్స్’ లో తీసారు, ఆ సమయం లో నెను అక్కడి స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నా. తను తపస్సు చేసే దృశ్యాలు, “ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ” అనే యుగళగీతాల్ని ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. క్లాసుకి డుమ్మా కోట్టిమరీ షూటింగ్ చూసినరోజుల్ని ఇప్పుడు తలుచుకొంటుంటే ఎంత ‘థ్రిల్’ గా ఉందో. ఆటొగ్రాఫ్ పుస్తకాలు అప్పట్లో నాలాంటి అర్భకులకి అందుబాటులో లేనికారణంగా, నోటు పుస్తకం లో తీసుకోవడానికి నామోషీగా ఫీలై, నా అభిమాన నటుడి ఆటోగ్రాఫ్ మిస్సయ్యాను. ఆలొటు జీవితం లో ఖచ్చితంగా తీర్చుకుంటానని “బ్లాగు సాక్షిగా” ప్రమాణం చేస్తున్నాను.
నటనాపరంగా, చెట్టుకింద ప్లీడరు నల్లెరుపై బండినడకైతే, సాక్షి, ముత్యమంత ముద్దు, రాజేంద్రప్రసాద్ లోని కొత్త పార్శ్వాలను పరిచయంచేసింది. ‘సాక్షి’ తరహా నటనని “ఏప్రిల్ 1 విడుదల” సినిమాలో క్లైమాక్సు సమయానికి పర్ఫెక్షన్ నుకు తీసుకువస్తే, తను నవ్వకుండా ప్రేక్షకులని నవ్వించి, ఏడ్పించి,పేమింపజేసిన ‘ముత్యమంత ముద్దు’ నటన మళ్ళీ తెలుగుతెరమీద ఆవిష్కరించబడలేదు. ఈ విషయం కావాలంటే, అందుబాటులో ఉన్న బల్లలనన్నింటిని గుద్ది మరీ చెప్పగలను.
1990-91 లో తను చేసిన కామెడీ సినిమాలు చాలానే ఉన్నా, ‘ఈ తరం’ వారి “నవయుగం” “ఎర్రమందారం”, రామచంద్రరావు తీసిన “మాస్టారి కాపురం” మరియు డాక్టర్. శివప్రసాద్ తీసిన “ప్రేమతపస్సు” వంటి సినిమాలు విషయవైవిధ్యం తోపాటు, రాజేంద్రుడి నటవిశ్వరూపాన్ని ఆవిష్కరించి బంగారు నందిని సొంతం చేసాయి(ఎర్ర మందారం చిత్రానికిగాను, ఉత్తమనటుడుగా బంగారునంది లభించింది). ఆదర్శానికి ప్రాణమిచ్చే ‘లాయర్’. తనని నమ్మి ఓటు వేసిన ప్రజలకు మేలుచెయ్యాలని, దొరతనానికి ఎదురుతిరిగి ప్రాణాలు కోల్పోయే ‘నిమ్నజాతి ప్రతినిధి’. మతాంతర వివాహం చేసుకుని,సమాజం లో ఇమడడానికి పడేపాటులో ,అదే సంసారాన్ని దాదాపు పోగొట్టుకునే ‘మాస్టర్”. పేమ కోసం కళ్ళని త్యాగంచేసే ఒక ‘బిక్షగాడు’. ఎన్నిపాత్రలూ?, ఏమినటన? ఇంతటి “ఇంప్రెసివ్ రెస్యుమే” తెలుగు లో ఎవరికుంది?
(రెండవ భాగం త్వరలో….)
శంకర్ says:
దర్శకులకి ప్రయోగాలు చెయ్యడానికి పనికొచ్చే పరికరంగా పాతికేళ్ళ నుండి ఉపయేగపడ్డ రాజేంద్రుడిది తనదైన కామెడీ ప్రపంచంలో మాత్రం ఏకచత్రాధిపత్యమే. ఆయనలోని విళక్షణ నటున్ని గుర్తుచేసినందుకు అభినందనలు. కానీ మీ వ్యాసంలో ఉన్న లోపమల్లా ఒక్కటే. మీరే ఏకైక అభిమానిగా చిత్రీకరించుకున్నారు. మా బంధువుల్లోనూ ఫ్రెండ్స్‌లోనూ లెక్కలేనంతమందున్నారు ఆ లిస్ట్‌లో
…
మీరు కవర్ చేసేసిన పిరియడ్‌లో వదిలేసిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు : చిన్నోడు పెద్దోడు, నా(కూ)తూ పెళ్ళాం (కా)తావాలి, బంధువులొస్తున్నారు జాగ్రత్త, సంసారం ఒక చదరంగం ( ఇదో ఉత్తమ కుటుంబ కధా చిత్రమని నా అభిప్రాయం). రెండవ భాగంలో స్తలాభావం గురించి మదనపడకుండా తమ పాండిత్యాన్ని పూర్తిగా ప్రదర్శిస్తారని, ఏ చిన్న విషయాన్ని వదలకుండా జతచేయడం ద్వారా భవిష్యత్తులో ఇంకెవరైన మళ్ళీ రాజేంద్రప్రసాద్ గురించి వ్రాయాలనుకొంటే తప్పనిసరిగా మీ వ్యాసాన్ని రిఫెర్ చెసేలా ఉంటుందనీ ఆశిస్తూ
శంకర్
మంజుల says:
నాకు తెలుగు చలనచిత్రసీమలో నచ్చిన నటులు ఎవరంటే ఎస్.వి.ఆర్., చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, సాక్షి రంగారావు.
సౌమ్య says:
మీ వ్యాసం రెండో భాగం కోసం వెయిటింగ్.
K మహేశ్ కుమార్ says:
@ శంకర్,
నా స్కూలు జీవితం లో “డిక్లేర్డ్ ఫ్యాన్” గా నేనొక్కడినే ఉండి అపహాస్యం పాలైన “దుగ్ధ” ను వెళ్ళగక్కుతున్నానేగాని, మీవంటి సహృదయులు, అభిమానులూ లేరనిమాత్రం నా ఉద్దేశ్యం కాదు.
ఇక కొన్ని సినిమాల్ని వదిలేయడమంటారా, ఫిల్మోగ్రఫి రాసే భావనతో వ్యాసం మొదలుపెట్టలేదు కనుక “ఒమిషన్స్” ని నా మేధస్సుతో నిర్ణయించేసాను. క్షమించగలరు. ‘సంసారం ఒక చదరంగం’,లో తను ముఖ్యకథానాయకుడు కాదుకనుక విడిచిపెట్టడమైనది. ‘వివాహ భొజనంబు’ గురించి ఒక పేరా రాసి, it deserves better అని, ఒకపూర్తి వ్యాసంగా గౌరవించటానికి అట్టిపెట్టడమైనది
మీ పరిశీలనలపుణ్యమా అని నాకు మరిన్ని ఆలోచనలు వచ్చేస్తున్నయ్. “తెలుగు లో ద్వినాయక సినిమాలు – ఒక పరిశీలన” , అని ఒకటి. “అవార్డులు రాని ఉత్తమ సహాయనటుడు” అనిమరోటి ఇలాఇలా. పై టైటిళ్ళను నేను గుత్తానికి తీసుకోలేదుకనుక, ఎవరైనాకూడా స్వతంత్రించి వ్యాసంగం కానించగలరని ప్రార్థన.
K మహేశ్ కుమార్ says:
@ సౌమ్య,
మీ నిరీక్షణ, రెండో భాగాన్ని త్వరగా ముగించే నైతిక బాధ్యతని నాపై కలిగిస్తున్నదని మనవి. మీ కోరిక మేరకు త్వరితగతిన రెండో భాగాన్ని అందరి ముందుకూ తీసుకు రాగలవాడను.
సగటు జీవి says:
నిజమే రాజేంద్ర ప్రసాద్ కి నేను కూడా అరివీర భయంకరమైన పంకానే.వంశీ, జంధ్యాల కాంబినేషన్ లో వచ్చిన రాజేంద్రుడి సినిమాలు ఆ తర్వాత కృష్ణా రెడ్డి, ఇవివి ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలతో దుమ్ముకొట్టుకున్నాయి. ఆ తర్వాత చాలా రోజులు గురువు గారు ఖాళి గా కూర్చున్నా మళ్ళి రీ ఎంట్రీ చేసి ఇప్పుడు మన సహనానికి కొద్దిగా పరీక్ష పెడ్తున్నాడు.
ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి సినిమాలు నేను చూడలేదు కానీ మిగతా సినిమాలు చూడకుండానే వాటి పరిస్థితి అర్థమవుతోంది.
మరి ఇక్కడ వయసు పై బడి ఆయన నటన లో ఏమైనా తేడా వచ్చిందా లేక మన దర్శకులు ఆయన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారా? అనేది ప్రశ్న
K మహేశ్ కుమార్ says:
@ సగటుజీవి,
నటుడిగా రాజెంద్రప్రసాద్ ఆవిర్భానికి, ఎదుగుదలకీ గల సామాజిక,రాజకీయ,సినిమా కారణాలను నా వ్యాసంలో వివరించడానికి రెండవ భాగంలో కూడా ప్రయత్నిస్తాను
ఇక మీరు లేవనెత్తిన ప్రశ్న కు సమాధానం, మీ ప్రశ్నలోనే నిక్షిప్తమై ఉంది. వయసు పైబడినా (నటనలో)రొమాన్స్ చేయడానికి అందమైన అమ్మాయిలు అందుబాటులో ఉంటే, సహజంగా బయటపడే ‘లేకితనాన్ని’ ఈమధ్య వచ్చిన కొన్ని రాజెంద్రప్రసాద్ సినిమలలో చూసి నేనూ కాస్త బాధపడ్డా (రామారావు “యమగోల” లో జయప్రదను హింసిస్తూ చేసిన రొమాంసుకూడా గుర్తుకు వచ్చె). కానీ, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి సినిమాలు మళ్ళీ తన నటనకు కొత్త రూపాన్ని ఇవ్వడంతో, ఆ హింస తప్పింది. దీంతో తేలిందేమిటంటే, తనలో ఇంకా విషయమైతే ఉందిగానీ, దాన్ని రాబట్టుకునే సత్తా ఉన్న సబ్జక్టు, దర్శకుడూ చాలా అవసరం అని.
rayraj says:
@K మహేశ్ కుమార్,
పర్ఫెక్ట్
Anil Kumar says:
nenu kooda meetho ekibhavistunnanu..
Telugu chitrarangamlo unna athbuthamina natudu mana MADAM sarugaru
Madhu says:
Baagundhandi mee vyasam….
Aha na pellanta naa personal favorite… enni sarlu choosano lekha leydhu.
Maa Nanagaru entho busy gaa undi kuda night intiki vachchaka relax avuthu antaarooo ‘Edhina Rajendra Prasad cinema unte pettamma kasepu choosi padukuntanu’ ani.
నవీన్ గార్ల says:
>> 97 వేసవిలో వచ్చిన “సురేష్ ప్రోడక్షన్స్” వారి “అహనా పెళ్ళంట”
ఇది 1987లో విడుదలైన సినిమా. అదేమిటో గానీ మధుసూదనా థియేటర్లో ఎప్పుడూ సూపర్‌హిట్టు సినిమాలే విడుదలయ్యేవి. నేను, అన్నయ్య, శ్యామ్‌సుందర్ కలసి మూడో తరగతిలో కూర్చుని ఈ సినిమా చూశాం. అద్భుతమైన క్యామెడీ సినిమా ఇది.
>> ఇవివి ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలతో దుమ్ముకొట్టుకున్నాయి.
ఇవివి సినిమాలంటే మనకు భలే ఇష్టం. సినిమా టైటిల్సు నుంచే నవ్వడం మొదలు పెట్టచ్చు. అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు,ఏమండి ఆవిడ వచ్చింది, జంబ లకిడి పంబ లాంటి సినిమాలు ఇవివి ప్రతిభకు మచ్చుతునకలు.
K మహేశ్ కుమార్ says:
@నవీన్
ఇది 1987 లో రిలీజైనదే తప్పుగా 97 అయ్యింది.
తప్పు తెలిపినందుకు ధన్యవాదాలు.
నవతరంగం లో కరెక్షన్ ఎలాచెయ్యాలో నాకు తెలియదు. కావున వెంకట్ గారు ఈ పనిచేసి పుణ్యంకట్టుకోవాలని మనవి.
K మహేశ్ కుమార్ says:
http://www.chimatamusic.com/rajendraPrasad.php
పై లంకె ద్వారా రాజేంద్రప్రసాద్ పాటల కలెక్షన్ను విని ఆనందించగలరు.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
మహేష్ గారు 1987 గా సరిదిద్దాను గమనించండి.తేదీలు,నెలలు,సంవత్సరాలు,వగైరా గణాంకాలను భవిష్యత్తులో కూడా ప్రామాణికంగా చాలా మంది తీసుకునే అవకాశం ఉన్నందున అన్నీ ఒక్కసారి సరిచూసుకుని పబ్లిష్ బటన్ నొక్కవలసిందిగా మనవి.
sandhya says:
chaaalaaaa chaalaa baaagundi andi meee jokar gaari pina vyaasam .
padmasree expected for rajendraprasad’s action but some politics happened in tollywood
but he deserve it
prekshakula hrudayallo kalakaalam gurtuntaaru ee joker gaaru.
” ఆ నలుగురి ” హృదయాల్లో “మీ శ్రేయోభిలాషి ” గా “రాజేంద్రుడు గజేంద్రుడు ” గా ఎప్పటికి నిలిచిపోతాడు
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
@సంధ్య గారు,రాజేంద్రప్రసాద్ పద్మశ్రీకి అన్ని విధాలా అర్హుడే,ఆ బిరుదు రాకుండా పాలిటిక్స్ అడ్డుపడ్డాయన్నారు,ఆ సంగతి నాకు తెలియదు కానీ,ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేటు ఇవ్వటానికీ అవే రాజకీయాలు కారణమయ్యాయి.
@మహేష్,మీరు మీ బ్లాగులో ఈ వ్యాసం ప్రచురించటం,మంచి స్పందన లభించటం చాలా సంతోషంగా ఉంది.కానీ ఈ వ్యాసం మొదట నవతరంగం లో వచ్చింది అని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది అని నా అభిప్రాయం.
K.మహేష్ కుమార్ says:
@రాజేంద్రగారు,
నా బ్లాగు http://parnashaala.blogspot.com/ లో నవతరంగం గురించి http://parnashaala.blogspot.com/2008/05/blog-post_9377.html లో చెప్పటం జరిగింది. ఇంకా విస్తారంగా చెప్పమంటే, మనమెప్పుడూ తయారే. నవతరంగం సైటు హిట్లను పెంచే బృహత్తర కార్యాన్ని, నా భుజస్కంధాలపై నేనే వేసుకుని నా మిత్రమండలి లో వీరవిహారం చేస్తున్నాను.కొంత అదిలింపులు కూడా భరిస్తున్నట్టు చిత్తగించగలరు.
రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:
మహేష్ గారు,మీ వ్యాసాలతో పాటు సదరు వ్యాసం నవతరంగం లొ ముందు ప్రచురితమైతే ఆ లింకు మీబ్లాగు లో కింద ఇవ్వగలరు.
Nag says:
Navatarangam Garu,
Bavundi mee article. Nijamga Oka manchi natudi gurinchi meeru Prasavinchina Tiru Aamogam.
రాజేంద్ర says:
@నాగ్ చంపేసారు సార్ కష్టం సార్ చాలా కష్టం మహేష్ గారు ప్రసవించటం
“Oka manchi natudi gurinchi meeru Prasavinchina Tiru”
బహుశా ప్రస్తావించిన తీరు అయ్యుండొచ్చు కదా??!!
rayraj says:
రాజేంద్ర ప్రసాద్ ఫ్యాన్ అని నే “చెప్పుకోనందుకు” బాధ పడుతున్నాను –
“అప్రయత్నంగానే వచ్చేసింది” – అన్నారు. అదృష్టవంతులు. నిజం వైపు ఎల్లప్పుడూ ప్రయత్న పూర్వకంగానూ, అప్రయత్న పుర్వకంగానూ – రెండూ విధాలుగా – మీరు నిలబడాలని నే కోరుకుంటున్నాను -
నా కళ్ళింకా చెమర్చే ఉన్నాయ్.
కానీ ఆయనలొ తనకు తగ్గ గుర్తింపు రాలేదన్న భావన చాలా ఇంటర్వ్యూల్లో తొంగి చూస్తోంది. మీరు ఆటో గ్రాఫ్ తీసుకునే రోజు – తీసేసుకుని ఉంటే మరో అవకాశం వచ్చినప్పుడు – ఆ భావనని పోగుట్టుకో మని చెప్పండి. ఆయన ప్యాన్స్ ఉన్నారని చెప్పండి. “ఎటొచ్చి వాళ్ళు బాగా ఇంటెలెక్త్యుయల్స్ కూడా అండీ. అందుకని, చిరంజీవి ఫాన్స్, ఆ ఫాన్స్ ఈ పాన్స్ లాగా పెద్ద హడావిడి చేయరు గాని – నిజంగానే ఎక్రాస్ ఫాన్స్ – వాళ్ళ హృదయంలో సుస్త్ఝిర స్థ్జానం కలిగి ఉన్న నటుడు మీరే ” నని చెప్పండి.
“ఈ చమక్కు,ఈ తరం లోని ఏ నటుడికి చేతనౌనో?”
“ఏప్రిల్ 1 విడుదల” సినిమాలో క్లైమాక్సు సమయానికి పర్ఫెక్షన్ నుకు తీసుకువస్తే…”
“కావాలన్నా కఠినుడు కాలేని అతిమంచితనం.”……
వద్దు మళ్ళా అంతా రాయాల్సి ఉంటుంది.
ఏ నటుడికీ ఈ ప్రతిభలేదు – అంతగా నవ్వించి మెప్పించే ఈ నటుడు – నిజ జీవితంలో ప్రతి సమస్యని భరించే మనిషలా హాస్యమాడాడు. హాస్యం అంటే ఒకళ్ళనొకళ్ళు తన్నుకోవటమే అయిపోయింది ఈ మధ్య! లేక పోతే బూతు.
ఒకవేళ ఏడిపిస్తే, ఏడ్చి తీరాల్సిందే; మధ్య తరగతి కోపం కదా! ఆ నిస్సహాయతతో కూడిన కోపం, పట్టుదల – ఓహ్!
బై ద వే, మీ గురించి చెప్పుకున్న “కత్తియుద్దం కాంతారావు……” పేరా : ఎక్సలెంట్; రాజేంద్ర ప్రసాద్ ఫాన్స్ అంతా అంతేనా లేక “జస్ట్ హిజ్ ఫాన్స్” ఎవరన్నా ఉంటారంటారా?
rayraj says:
మీరు బాగా టైట్ గా రాశారు
“ఏ నటుడికీ ఈ ప్రతిభలేదు ” – ఇది నా వీరాభిమానాన్ని ప్రదర్శించడానికే!