Menu

మిస్సమ్మ(1955)

telugu_missammaold.jpgతెలుగు చిత్ర సీమకి అద్భుతమైన ఆణిముత్యాలను అందించిన విజయ ప్రొడక్షన్స్ వారి వజ్ర పేటికలోని మరొక అపూర్వమైన మణిహారం మిస్సమ్మ. ఒక చిత్ర విజయాన్ని ఆ చిత్ర దర్శకుడి నైపుణ్యం కాని, నటీ నటులాద్భుత నటన కాని,వీనుల విందైన సంగీతం కాని, చక్కిలి గింతలు పెట్టే హాస్యం కాని, చక్కని కధా/కధనం కాని ప్రభావితం చేయవచ్చు. అన్ని రుచులు సమపాళ్ళల్లో మేళవించి,షడ్రుచశోభాయమానం గా విందు చేసే చిత్రాలు చాలా అరుదు. అటువంటి కోవలోకిచెందే అతి తక్కువ చిత్రాలలో మిస్సమ్మ ఒకటి.

కొన్ని సినిమాలు, ‘ఫలాన సినిమాని చూసారా?’ అనే విధంగా ఉంటే, మరి కొన్ని మహత్తర చిత్రాలను ‘ఆ సినిమా ఎన్ని సార్లు చూసారూ’ అని అడగడంలో అతిసయోక్తి లేదనిపిస్తుంది.మిస్సమ్మ ఈ రెండవ కోవ కు చెందుతుంది.

సాధారణమైన కధకు, సుతి మెత్తని హాస్యాన్ని జోడించి , అద్భుతమైన శైలిలో చిత్రీకరించి, తెలుగు ప్రేక్షకులకు రసవత్తరమైన కానుక అందించిన ఘనత శ్రీయుతులు ఎల్.వి.ప్రసాద్, నాగిరెడ్డి మరియు చక్రపాణి లదే.

ఏ చిత్రం కధాపరం గా చూస్తే, సంక్షిప్తంగా, నిరుద్యోగులైన ఒక అవివాహిత జంట, కేవలం ఉద్యోగము కోసము అబద్దపు భార్య భర్తలుగా చెలామణి అయ్యి, ఒక పాఠశాలలో పంతులు/పంతులమ్మగా జేరడం, క్రమేణా,వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, ప్రేమాభిమానాలు చోటు చేసుకొవడం,ఆ అమ్మాయి 16 సంవత్సరాల క్రిథం తప్పిపోయిన ఆ పాఠశాల యజమాని యొక్క కుమార్తెగా ఋజువు అవ్వడంతో కధ సుఖాంతమవుతుంది.

చక్రపాణి గారు, పింగళి నాగేంద్ర రావు గారు ఈ చిత్రానికి సందర్భోచితంగా మాటలు పాటలు కూర్చి, చిత్ర విజయానికి తాము కూడ కారకులమని మరో మారు రుజువు చేసుకున్నారు. చక్రపాణి గారు కూర్చిన కధనం,మాతలు ఎంతో సరళంగా, ఎక్కడా విసుగు కలిగించకుండా, చిత్రం ఆద్యంతము అలవోకగ సాగిపోతుంది. 1955 లో నిర్మించబడిన ఈ చిత్రంలో, అప్పటి సామజిక పరిస్థితులకు చురకలు వేసిన మాటలు గమనార్హం;

ఎన్టీయార్ – “చదువుకునే రొజుల్లో నేను స్పోర్ట్స్ column చూసేవాణ్ణి మిస్టర్, ఇప్పుడు వాంటెడ్ columns లోకి దిగాను” (నిరుద్యోగ సమస్య ఇప్పటిదే కాదు, అప్పటిది కూడ మరి!!!)

చందాలు వసూలు చేసే రాజకీయ నాయకులను చూసి, గుడ్డి వాడి వేషం వేసిన రేలంగి, ఎన్టీయార్ తో అనే మాటలు – ‘వీళ్ళు మంచి వేషం వేసారు.(చందాల పేర దోపిడి చేసే మహమ్మారి ఆ రోజుల్లో కూడ ఉంది కాబోలు!!!)

ఎస్వీయార్ – జీతం మగ బి.ఏ కి 200, ఆడ బి.ఏ కి 250, వసతి భోజనాలు ఫ్రీ. ఐనా, ఈ రోజుల్లో బి.ఏ చదివిన మొగుడు పెళ్ళాలు దొరుకుతారా?

ఏయన్నార్ -ఓ, కోకొల్లలు గా దొరుకుతారు, యే రోడ్ మీద చూసిన బి.ఏ లే మావయ్యా

(స్త్రీలకు ఎక్కువ జీతం ప్రకటించడం, ఆ రోజుల్లో బి.ఏ ల కు ప్రాధాన్యత ఇవ్వడం వంటి విషయాలు స్పష్టమవుతాయి)

నటనాపరంగా, సావిత్రి, ఏయన్నార్ లు ఒకరిని మించి ఒకరు పోటి పడి నటించారు. సంస్కారవంతుడైన యువకుడిగా ఎన్టీయార్ నటన అద్భుతం. ముఖ్యంగా, సావిత్రి ని అనునయించే సన్నివేసాలలో, ఆయన నటన అభినందనీయం. ఆడపిల్లలు ఇలాంటి భర్త లభిస్తే బావుండును అనుకునే పాత్ర ఎన్టీయార్ది.ఇక టైటిల్ పాత్ర పొషించిన మహానటి సావిత్రి, ఆ పాత్ర (మిస్ మేరీ) లో జీవించారు. ఆత్మాభిమనము కల యువతిగా ఆమె ప్రదర్శించిన నటనా కౌశలం తిరుగులేనిది. మహానటుడు ఎస్వీయార్ నటనకు మరి సాటి లేదు. ఆయన ఉచ్చారణ, పద ప్రయోగం చూస్తే, అసలు ఈయన ని నిర్దేశించ వలసిన అవసరము లేదేమో దర్శకుడికి అనిపిస్తుంది.

13 Comments
 1. మంజుల April 3, 2008 /
 2. Sowmya April 3, 2008 /
 3. Theja April 3, 2008 /
 4. కొత్తపాళీ April 3, 2008 /
 5. విష్ణుభొట్ల లక్ష్మన్న April 3, 2008 /
 6. Sreenivas Paruchuri April 3, 2008 /
 7. శిద్దారెడ్డి వెంకట్ April 3, 2008 /
 8. శిద్దారెడ్డి వెంకట్ April 3, 2008 /
 9. Udayakiran April 4, 2008 /
 10. sujatha April 13, 2008 /
 11. Sreenivas Paruchuri April 14, 2008 /
 12. K. SHANKAR RAO July 13, 2008 /
 13. RAMACHARY BANGARU December 21, 2008 /