Menu

Massey sahib

కధ(సంక్షిప్తంగా) : ఈ చిత్రం 1930ల కాలానికి సంభందించింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో టైపిస్టుగా పనిచేసే ఫ్రాన్సిస్ మస్సెయ్ భారతీయుడు ఐనప్పటికీ బ్రిటీష్ జీవన శైలిని అనుకరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ అప్పులతో బాధపడే తన కష్టాలు కొత్తగా వచ్చే ఆఫీసర్ ఆడంతో పోతాయనుకుంటాడు. కానీ రోడ్ నిర్మాణమే ధ్యేయంగా పనిచేసే ఆడంకి సహకరించే క్రమంలో కొన్ని తప్పుడు లెక్కలు సృష్టించి పర్యావశానంగా ఉద్యోగాన్ని కోల్పోతాడు.

కొన్నాళ్ళ తర్వాత కూలీలను తన తెలివితో పనికి ఒప్పించి రోడ్ నిర్మాణం పూర్తి చేయించడం ద్వారా మళ్ళీ ఆడంస్‌కి దగ్గరౌతాడు. దానికి ప్రతిఫలంగా మళ్ళీ మస్సెయ్ కి ఒక పర్మెనెంట్ ఉద్యోగం ఇప్పించాలనుకొంటాడు. కానీ కొత్తగా నిర్మించిన రోడ్‌కు మస్సెయ్ అక్రమంగా పన్ను వసూలు చేయిస్తున్నాడనే విషయం తెలుసుకొని అసహ్యించుకుంటాడు. ఈ అవమానంతో ఇంటికి వచ్చిన మస్సెయ్‌కి తాను ఏరికోరి పెళ్ళి చేసుకొన్న సైలా కనిపించదు. తనను వెతికేందుకు పక్కింటి పెద్దాయనను సహాయం అడుగుతాడు. గతంలో ఒకసారి ఇదే పరిస్థితిలో ఒక రహస్య సమాచారాన్ని అందించినందుకు ప్రతిఫలంగా అదే పెద్దయన మస్సెయ్‌కు సహకరిస్తాడు. కాని ఇప్పుడు ఆ ఉద్యోగం లేని మస్సెయ్‌తో తనకేమి అవసరం లేదని సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. అప్పుడు జరిగిన చిన్నపాటి గొడవకు ఆ పెద్దయన చనిపోతాడు. చివరికి మరణ శిక్షను ఆనందంగా ఆహ్వానించిన మస్సెయ్‌ను చూపిస్తూ చిత్రం ముగుస్తుంది.

ఎప్పుడు మన దేశభక్తి సినిమా చూసినా మనకు కామన్‌గా కనిపించే కొన్ని ట్రేడ్ మార్క్ సినిమాటిక్ సన్నివేశాలు ఇందులో కనిపించవు. ఆ మాటకొస్తే ఇది అసలు దేశభక్తిని ప్రభోదించే చిత్రమేకాదు. భారతీయులతో కలిసిపోయి భారత దేశపు అభివృద్దికి పునాదులు వేసిన ఎందరో బ్రిటీషర్లకు ప్రతినిధిగా నిల్చే ఆడంస్‌కు , బ్రిటీష్ నైజాన్ని అణువనువునా నింపుకొని వాళ్ళలాగా జీవితాన్ని గడపాలనుకొనే ఆ కాలపు మస్సెయ్ లాంటివాళ్ళకి మధ్య సంఘర్షణే ఈ చిత్రం. దర్శకుడు ప్రదీప్ కిషెన్ ఆ కాలంనాటి ఎన్నో విషయాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు. మచ్చుకకు కొన్ని. రోడ్ నిర్మాణం ఆవశ్యకతను చెప్తూ ఆడంస్ ‘ ఒక్కో రోడ్ రెండు తాజ్‌మహల్‌లతో సమానం’ అంటే, దానికి మస్సెయ్ తన భట్రాజు తనాన్ని ప్రదర్శిస్తూ ‘ అవును సాబ్, ఆ ముస్లింలు ఏది ప్రజలకు ఉపయోగపడేది చెయ్యలేదు, మీ బ్రిటీష్ వాళ్ళు చాలా గొప్పోళ్ళు ‘ అంటాడు. ఒక సన్నివేశంలో గిరిజన పిల్ల సైలాను పెళ్ళి చేసుకుంటావా? అని ప్రశ్నించిన తన ముస్లిం స్నేహితుడు ఫజ్లుతో ‘నేనేమన్నా పుట్టుకతో బ్రిటీషర్నా, అన్ని అవే అలవాటు అవుతాయీ అంటాడు మస్సెయ్. ఇక్కడ మనకు రెండు విషయాలు అర్ధమౌతాయి. ఒకటి తాను కూడా ఒక బ్రిటీషర్ అనే భావనలో వుంటాడు మస్సెయ్. అలానే తనకు కుల, మత, జాతి వివక్షలు లేవనే విషయం కూడా అర్ధమౌతుంది. ఒక మంచి పనికోసమే ఆడం మస్సెయ్ కలిసి తప్పుడు లెక్కలు చూపించినా, రూల్స్ అతిక్రమించినందుకు మస్సెయ్‌ను మాత్రమే ఉద్యోగం నుండి తప్పిస్తారు. ఇక్కడే బ్రిటీష్‌వారి పక్షపాత ధోరణి కనిపిస్తుంది. ఇంకో సన్నివేశంలో పనికి నిరాకరించిన గూడెం వాల్లను మభ్యపెట్టి పనికి ఒప్పించే సమయంలో మస్సెయ్ ప్రదర్శించే దర్పం మనకు సుపరిచితమైన లౌక్యమే.ఇదే కాదు ఈ చిత్రంలోని ప్రతీ సనీవేశం ఎంతో నేచురల్గా అనిపించడానికి ప్రధాన కారణం ప్రతీ పాత్రా మనం నిజ జీవితంలో చూసేవే. ఉన్నదానికి లేనిదానికి గొప్పలు చెప్పుకొనే మస్సెయ్, రూల్స్ కోసం ఏమైనా చేసే ఆడంస్, భర్త చాటు భార్యగా సైలా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మహిళగా రూబీ,డబ్బుకోసం చెల్లెలి జీవితాన్ని కూడా పనంగా పెట్టిన పాసా , అవసరం తీరాకా మాటమార్చే పెద్దాయనా ఇలా అందరూ మనకు ఎదో ఒక విధంగా తెలిసిన పాత్రలే.ఇంక వీటిని పోషించిన నటీనటుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందరిలోకీ ఎక్కువగా మనల్ని తన చిత్రవిచిత్రమైన వాచకంతో సినిమా నిడివి మెత్తం గిలిగింతలు పెట్టే మస్సెయ్ పాత్రధారి రఘువీర్ యాదవ్‌ది. చివరిలో కంట తడి పెట్టిస్తాడు కూడా. ఆ తర్వాత సలాం బాంబే, బాండిట్ క్వీన్ , లగాన్ లాంటి ఎన్నో చిత్రాల్లో మెప్పించిన ఇతనికి ఇదే మొదటి చిత్రం. ఈ చిత్రంతో రెండుసార్లు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటుడిగా నిలబడ్డాడు. సైలాగా నటించిన అరుందతీ రాయ్ గురించిన పరిచయం అవసరం లేదు అనుకుంటున్నాను. బుకెర్ ప్రైజ్ గ్రహీతైన ఈమె, ఈ చిత్ర దర్శకుడు ప్రదీప్ కిషెన్ భార్యాభర్తలు. సినిమాలో ఈ పాత్రకు అంతా కలిపి పది మాటలు కూడా ఉండవు. కేవలం ముఖకవళికలతో, అందమైన నవ్వుతో అద్భుతంగా నటించిందామె. పాసాగా నటించిన వీరేంద్ర సక్సేనా ఆ పాత్రలోని కౄరత్వాన్ని, స్వార్ధాన్ని ఒలికించడంలో వంద మార్కులు సంపాదిస్తాడు. చార్లెస్ ఆడంస్‌గా నటించిన బ్రిటీష్ నటుడు బారి జాన్, రిచెర్డ్ అటెంబరో గాంధీలోని పోలీస్ ఆఫీసరు పాత్రను మరిపిస్తూ ఎంతో హుందాగా చేసాడు.

దర్శకుడు ప్రధానంగా బ్రిటీష్ వారితో కలిసిపోవాలనుకునేవాళ్ళ అంతర్గతాన్ని ఆవిష్కరించాలనుకోవడం వల్లనే ఈ సినిమాలో మనకు కధగా ఏమీ కనిపించదు. కేవలం వాళ్ళ దైనందిన జీవితంలో జరిగే సంఘటనల కూర్పుగా వుంటుంది ఈ చిత్రం. సినిమా పెద్దలు చెప్పే స్ట్రక్చరు ఎక్కడా కనిపించకపోవడం ఒక లోటుగా అనిపిస్తుంది చూస్తున్నంతసేపూ. చిత్రం ఒక ఘట్టం నుండి మరో ఘట్టానికి మారెటప్పుడు వుండాల్సిన బ్యాక్ గ్రౌండ్ సరిగ్గా లేదు. అందుకే మనకు మస్సెయ్ మీద జాలి కలగదు. కేవలం బ్రిటిష్ వాళ్ళ లాగా వేషధారణ చేసుకున్నప్పటికీ తోటి భారతీయుల్ని చులకనగా చూడడం అనే అలవాటు మాత్రం ఎప్పటికీ వదులుకొలేదు మస్సెయ్( అదే ఒక బ్రిటీషర్ మరో బ్రిటీషర్కి చాలా గౌరవం ఇచ్చుకుంటాడు). చాల చోట్ల తన మాటల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదనే అవసరాన్ని గుర్తించలేకపోవడం ఒక లోపమే. కేవలం ఒకే ఒక్కసారి తన డాంబికాలకు ప్రయోజనం దక్కుంది, కానీ దాన్ని కూడా వృధా చేసుకుంటాడు. క్లైమాక్స్‌లో కూడా సరైన సందేశాన్ని అందించడంలో పూర్తిగా సక్సెస్ కాలేదనిపిస్తుంది. కొంచెం నాటకీయతను రంగరించి ప్రధాన సన్నివేశాలపై మరికొంచెం శ్రద్ధ తీసుకొనుంటే ఒక క్లాస్సిక్‌గా మిగిలిపోయేది.

One Response
  1. శిద్దారెడ్డి వెంకట్ April 7, 2008 /