Menu

ఇకిరు (1952)

ikiru.jpgఇకిరు అన్న జాపనీస్ సినిమా అకిరా కురసోవా తీసిన 1952 నాటి సినిమా. దీని గురించి ఇప్పటికే నవతరంగం లో ఓ పరిచయంతో కూడిన సమీక్ష వెలువడ్డాక కూడా మళ్ళీ ఇంకోటి రాయడం దేనికి? అన్న సందేహం మీకు కలుగవచ్చు. కానీ, నేను చెప్పదలుచుకున్నవి వేరు. అందుకని, నా తరపునుండి ఈ పరిచయం.

కథావస్తువు గురించి చెప్పాలంటే – వతానబే ఒక ప్రభుత్వాధికారి. ప్రభుత్వ యంత్రాంగం లో గానుగెద్దులా పనిజేయడం తప్ప ఏమీ చేయడు ముప్ఫై ఏళ్ళపాటు. కథ ప్రారంభంలోనే అతనికి క్యాన్సరనీ, ఎక్కువకాలం బ్రతకడనీ తెలుస్తుంది. ఇక తక్కిన కథ అంతా, ఆ ఆరునెలలూ అతనేమి చేసాడు, చివరికి జరిగింది ఏమిటి? అన్నది. ఈ విధంగా చూస్తే, ఇది కొన్నాళ్ళ క్రితం కొత్తపాళీ గారు ఇచ్చిన కథా వస్తువు లాగుంది. ఎలాగన్నా మలుచుకోవచ్చు ఈ వస్తువుని. ఇంకోళ్ళైతే ఏమి చేసేవాళ్ళో నాకు తెలీదు కానీ, ఇది కురసోవా తీసినందుకు కాబోలు – సూటిగా తాకుతుంది చూసేవారిని.

కథ ప్రారంభంలోనే బ్యూరోక్రసీ అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు – ఆ ఆఫీసులు ఎలా ఉన్నాయో చూపడంలో కానీ, ఉద్యోగుల వైఖరిలో కానీ, తమ ప్రాంతంలో పార్కు కట్టించుకోవడం కోసం ఆ గుంపు మనుష్యులు ఎన్ని డిపార్ట్మెంట్లు తిరిగారో – ఇదంతా చాలా సహజంగా చూపారు. యాభైల్లో జపాన్ కీ, ఇప్పటి భారద్దేశానికీ కూడా తేడా ఏమీ తెలీలేదు నాకు-ఈ విషయంలో. జపాన్ లో ఇప్పుడెలా ఉందో అన్నది నాకు తెలియదు మరి. మన హీరో ఆఫీసులో ఉన్న అంతమందిలోనూ కాస్త వేరుగా ఉండే మనిషి ఒక యువతి. ఆమె పాత్రను పరిచయం చేసే సీను కూడా నాకు చాలా నచ్చింది. అందులోనే ఆమె స్వభావం అర్థమౌతుంది పాఠకులకి. వతానబే డాక్టర్ దగ్గరకి వెళ్ళిన సీను కూడా ఓ అద్భుతం. బైట మరో రోగితో అతనికి జరిగిన సంభాషణ (ఏకపాత్రాభినయం అనాలేమో…) తరువాత, డాక్టరు లోపల అన్న ఒక్కో మాటకీ వతానబే లో మారుతున్న రంగులు – చూసి తీరాలి. తరువాత అతని ఇంట్లో – అతని కొడుకూ-కోడలూ అతని గురించి మాట్లాడుకున్న మాటలు, వతానబే స్పందనలు అన్నీ చాలా సహజంగా ఉన్నాయి. జాపనీస్ కుటుంబాలకీ, మన కుటుంబాలకీ చాలా సన్నిహిత సంబంధం ఉందేమో జీవన విధానం లో-అనిపించింది ఈ సినిమా లో కుటుంబ సన్నివేశాలు చూస్తున్నంతసేపూ.

వతానబే “Life is brief” పాడిన రెండు సన్నివేశాలు (ఒకటి క్లబ్ లో దిగులుగా, ఒకటి పార్కులో చివరి క్షణాల్లో ఆనందంగా) చాలా బాగా తీసారు. వతానబే తన గురించి తానే బాధపడుతున్నపుడు అతనితో ఉన్న అతను అంటాడు, బార్లో – “we’ve got to be greedy about living. we have learnt that greed is vice. but, thats old. Greed is virtue. especially this greediness for life.” అని. ఎంత నిజం! అనిపించక మానదు ఆ డైలాగు వింటే. బ్యూరోక్రసీ ని గురించి వ్యంగ్యం ఈ సినిమాలో చాలా చోట్లే కనిపిస్తుంది మనకు-మొదటి సీను నుండి. ఉదాహరణకి, వతానబే మరణం తరువాత జరిగిన సమావేశం లో – “doing anything but nothing is radical there.” అన్న డైలాగు. సినిమా మొదట్లో వచ్చే వాయిస్ ఓవర్ లో కూడా కావాల్సినంత వ్యంగ్యం ఉంది. వతానబే మరణం తరువాత జరిగిన చర్చ – అది ఎన్ని సార్లైనా వినొచ్చు. ఒక మనిషి చనిపోయాక అతని గురించి అతన్ని ఎరిగిన వాళ్ళ స్పందనలు ఎన్ని రకాలుగా ఉంటాయి అన్నది బాగా అర్థమౌతుంది. చావు అనేది ఎక్కడన్నా చావే – ఈ సన్నివేశాన్ని మన సమాజానికి అన్వయించుకోగలిగాక ఆ విషయం మరింత బాగా అర్థమైంది.

ఇంతా చెప్పి వతానబే పాత్రధారి తకాషి షిమురా గురించి చెప్పకపోతే అసలు ఈ వ్యాసం రాయడమే వ్యర్థం. అతను నటించాడో, జీవించాడో తేల్చుకోలేకపోతున్నాను నేను. కథలో పెద్ద డైలాగులే లేవు అతనికి. ఉన్నా కూడా, ఏదో గొణిగినట్లు ఉంటాయి. ఒకే సన్నివేశంలో అనుకుంటా నవ్వింది కూడా. ఎన్ని భావాలు పలికించాడో లెక్కలేదు-ఆ కళ్ళలో. అతన్ని చూస్తే చిరాకేసింది…అతన్ని చూస్తే జాలేసింది…అతన్ని చూస్తే భయమేసింది….అతన్ని చూస్తే బాధ…అతని చూస్తే కోపం…అతని నవ్వు చూసి ఆనందం… ఒకే మనిషి కథాక్రమంలో కేవలం తన ముఖ కవళికలతోనే మనచేత ఇన్ని రసాల్ని అనుభవింపజేయగలిగాడు అంటే – అతనిది నటనకానే కాదు.. జీవించడమే! ఇకిరు మొత్తానికి ఓ గొప్ప అనుభవం.

5 Comments
  1. rajesh April 16, 2008 /
  2. malathi April 16, 2008 /
  3. Reddy G April 17, 2008 /
  4. కొత్తపాళీ April 17, 2008 /
  5. కొత్తపాళీ April 17, 2008 /