Menu

High and Low (1963)

high-and-low.jpg“High and Low” అన్నది అకిరా కురోసవా తీసిన “Tengoku to Jigoku” అన్న జాపనీస్ చిత్రానికి ఆంగ్ల నామధేయం. నిజానికి ఆ పేరు కి అర్థం “స్వర్గం మరియు నరకం” అని అట. కానీ, ఆంగ్లం లో పేరు ఇలా పెట్టడం వెనుక కారణంఏమిటో అయితే నాకు తెలీదు. ఈ సినిమా ఒకవిధంగా ఆలోచిస్తే అపరాధ పరిశోధన తరహా చిత్రమని చెప్పాలి. కానీ, మరో కోణం నుంచి చూస్తే – పేదా గొప్పా తేడా ని చెప్పీ చెప్పనట్లు చెప్పి కూడా చూసేవారికి అర్థమయ్యేలా చేసారు.

కథ విషయానికొస్తే, నేషనల్ షూస్ అన్న కంపెనీ చాలా ఏళ్ళుగా పేరుపొందినది. కథా ప్రారంభం లో ఆ సంస్థ డైరెక్టర్ల మధ్య వాదం జరుగుతూ ఉంటుంది – ఆకర్షణీయంగా, తక్కువ ధరతో, తక్కువ కాలం మన్నే చెప్పులు తయారు చేసి డబ్బు గడిద్దాం అని అందరూ అంటూ ఉంటే, ఎన్నో ఏళ్ళుగా ఆ కంపెనీకే అంకితమైన గొండో మాత్రం, మంచి మన్నిక ఉండే చెప్పులే చేద్దాము, ధర ఎక్కువైతే ఎమి? అన్న అభిప్రాయం తో ఉంటాడు. వీళ్ళందరూ కుమ్మక్కై కంపెనీ ని అసలు యజమాని (కథలో ఓల్డ్ మ్యాన్ అని అంటారు) నుంచి తీసేసుకుందామని ఎత్తుగడ. గొండో రెండాకులు ఎక్కువ చదివి, మొత్తం తానే చేజిక్కించుకోడానికి ఎత్తు వేస్తాడు. ఉన్నదంతా తాకట్టు పెట్టి డబ్బులు చేకూర్చుకుంటాడు. కానీ, ఇంతలో గొండో కొడుకు అనుకుని అతని డ్రైవర్ కొడుకుని ఎవరో అపహరిస్తారు. ఇప్పుడు ఆ పిల్లవాడిని అప్పగించడానికి కిడ్నాపర్ ఎవరూ ఊహించనంత సొమ్ము అడుగుతాడు. ఇస్తే, గొండో దివాళా తీసినట్లే. ఇవ్వకుంటే, పిల్లాడు దక్కడు. ఇలాంటి పరిస్త్థితుల్లో గొండో డబ్బు కిడ్నాపర్ కి ఇవ్వడానికే నిశ్చయించుకుంటాడు. తరువాతి భాగం కథంతా పోలీసులు దొంగని ఎలా పట్టుకున్నారు అన్నది. ఈ భాగమంతా ఎత్తులు-పై ఎత్తులతో ఆసక్తికరంగా ఉంటుంది.స్థూలంగా ఇదీ సినిమా కథ.

గొండో పాత్రని పోషించింది కురోసావా ఆస్థాన నటుడు-తొషిరో మిఫునె. నేను ఇదివరకు చూసిన మిఫూనె సినిమాలు అన్నింటిలోనూ అతను జాపాన్ సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించాడు. ఇందులో అతన్ని మామూలు తరహా దుస్తుల్లో చూడడం ఓ కొత్త అనుభవం. గొండో పాత్ర స్వభావాన్ని చాలా బాగా ఆవిష్కరించాడు మిఫునె. నేను చూసిన మిఫునె సమురాయ్ పాత్రల్లాంటి స్వభావమే కొంతవరకూ ఇది కూడా. ఇందులో అతిథి పాత్రలో కనిపిస్తాడు “ఇకిరు” కథానాయకుడు తకాషి షిముర. కంపెనీ డైరెక్టర్ల మధ్య జరిగే చర్చా, చివర్లో గొండోకీ-దొంగకీ మధ్య జరిగే సంభాషణా – ఈ కథ మొత్తం మీదా అత్యంత ఆసక్తికరమైనవి. దొంగ ఎవరూ అన్ని అర్థమయ్యాక పోలీసులు అతన్ని వెంటాడిన సన్నివేశాలు కూడా చాలా బాగా తీసినట్లు అనిపించింది. చివరి సంభాషణ సీనులో, గాజు కిటికీ కి అవతలా, ఇవతలా ఉంటారు గొండో, దొంగా. ఒకరు మాట్లాడుతూ ఉంటే ఇంకోరి ప్రతిబింబం కనబడ్డం ఆ సన్నివేశానికి మంచి visual appeal ఇచ్చిందేమో అనిపిస్తుంది.ఆ సంభాషణలోనే దొంగ డైలాగులు కాస్త ఆశ్చర్యానికి గురి చేసాయి నన్ను-ఇదా ఇతని ప్రవర్తనకి కారణం! అని. ట్రైన్ ద్వారా కిడ్నాపర్ డబ్బులు తీసుకునే సన్నివేశాన్నీ, తరువాత దాన్ని పోలీసులు స్టడీ చేసిన వైనాన్నీ చాలా బాగా తీసారు అనిపించింది. డ్రగ్ అడిక్ట్లను చూపిన సీను ఆలోచింపజేసేలా, జాలి కలిగించేలా ఉంది. పాత్రలన్నీ చాలా సహజంగా అమరాయి కథకి. ఎక్కడా ఏ కాస్తన్నా కృత్రిమత్వం కనబళ్ళేదు.

ఇంతకీ, ఈ సినిమా చూస్తూ ఉంటే నాకర్థమైంది ఏమిటీ అంటే..మన తెలుగు వాళ్ళు దీన్నీ వదల్లేదు అని. ఒకానొక కృష్ణా-జయప్రద సినిమాలో ఈ సినిమాలోని కిడ్నాప్ సన్నివేశాల్ని యధాతథంగా వాడుకున్నారు. అందులో మిఫునె పాత్రని ప్రభారరెడ్డి పోషించాడు. పేరు గుర్తు లేదు. ఇటీవలే ఆ సినిమా మన తేజావారి పుణ్యమా అని కాసేపు చూశాను. చూసినంత మేర మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు కొంత మార్చారు తప్పితే, సీన్లన్నీ అలాగే వాడుకున్నారు, కామెడీతో సహా. ఎపుడన్నా మనవాళ్ళు భలే తీసారే! అనుకున్నన్ని రోజులు పట్టదు…దాని తాలూకా అసలు సినిమా ఇలా కనిపిస్తుంది నాకు! దురదృష్టం! నా గోల పక్కన పెడితే, ఈ సినిమా ఆద్యంతమూ ఆసక్తి కరంగా సాగే సినిమా. చాలా కురొసావా సినిమాల్లా అక్కడక్కడా నెమ్మదిగా కూడా సాగదు. త్వరత్వరగా సాగుతుంది, కథాంశం అటువంటిది మరి!

One Response
  1. శిద్దారెడ్డి వెంకట్ April 17, 2008 /