Menu

హేండీక్యామ్ హారర్

handycam.jpgమన తెలుగు సినిమా పరిశ్రమలో కానీ మరేదైనా సినిమా పరిశ్రమలోకానీ ఒక సినిమా విజయం సాధిస్తే ఆ సినిమానే అధారంగా తీసుకుని మరి కొన్ని సినిమాలు రావడం జరుగుతూనే వుండడం సహజం. ఉదాహరణకు, పోయిన సంవత్సరం సూపర్ హీరోల సినిమాల సీక్వెల్స్ తో హాలీవుడ్ సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి వచ్చిపడ్డాయి.

ఈ సంవత్సరం విడుదలయిన క్లోవర్‍ఫీల్డ్ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమాలో ఉపయోగించిన టెక్నిక్ తో రాబోయే కాలంలో మరిన్ని సినిమాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు సాక్ష్యంగా ఈ మధ్యనే వచ్చిన డైరీ ఆఫ్ ది డెడ్, పోయిన వారం విడుదలయిన [REC] సినిమాలు క్లోవర్ ఫీల్డ్ సినిమాలోని టెక్నిక్ నే ఉపయోగించి రూపొందించబడ్డాయి.

ఇంతకీ క్లోవర్ ఫీల్డ్ సినిమాలో వాడినా ఆ కొత్త టెక్నిక్ ఏంటో తెలుసుకోవాలంటే ముందు బ్లెయిర్ విచ్ ప్రొజెక్ట్ అనే సినిమా గురించి తెలుసుకోవాలి.

1999 లో బ్లెయిర్ విచ్ ప్రొజెక్ట్ అనే సినిమా విడుదలయినప్పుడు అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 22,000 డాలర్ల వ్యయంతో నిర్మింపబడ్డ ఈ సినిమా 240 మిలియన్ల డాలర్లు వసూలు చేసిందంటే ఈ సినిమా గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా లో స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమా రూపొందించిన విధానం.

1994 లో ముగ్గురు విద్యార్థులు Burkittsville అడవుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న బ్లెయిర్ విచ్ అనే జీవి కల్పితమో లేక అలాంటి జీవి నిజంగానే ఉందా అనే అంశంపై పరిశోధన చేసే ప్రయత్నంలో బయల్దేరి కనిపించకుండా పోతారు. వాళ్ళు తిరిగి రాకపోయినా వారి పరిశోధన జరిపేటప్పుడు చిత్రీకరించిన వీడియోలే మీరు చూస్తున్నారని ఈ సినిమా మొదలయ్యేటప్పుడే మనకి సబ్ టైటిల్స్ ద్వారా తెలియచేస్తారు దర్శకుడు. ఇక మనం చూసే సినిమా మొత్తం ఆ బృందం తమ హేండీ క్యామ్ లో చిత్రీకరించిన సన్నివేశాలే. సినిమా మొదటినుంచి చివరి వరకూ హోమ్ వీడియో చూస్తున్నట్టుగా వుంటుంది.

ఈ సినిమా కథాంశం లో ఏ మాత్రం నిజం లేనప్పటికీ, ఆ రోజుల్లో ఈ సినిమాకి ఇచ్చిన వైవిధ్యమైన పబ్లిసిటీ వలన ప్రజలు ఇదంతా నిజమే అనుకుని ఈ సినిమాని ఎగబడి చూడడంతో సంచలనాత్మకంగా ఈ సినిమా కొన్నాళ్ళు అందరినోటా నలిగింది. మనం మాములుగా ఎక్కడికైనా టూర్ కి వెళ్ళినప్పుడు షూట్ చేసుకునే వీడియోలా వుంటుంది ఈ సినిమా మొత్తం. అలా వుండడం వల్లనే ప్రేక్షకులు అథెంటిక్ గా ఫీల్ అవడంతో ఈ సినిమా ఒక కల్ట్ సినిమాగా మిగిలిపోయింది.

ఈ సినిమా ప్రేరణతో చాలామంది ఔత్సాహికులు హేండీక్యామ్ లతో ప్రయోగాలు చేసినప్పటికీ దాదాపు పదేళ్ళ తర్వాత గానీ ఆస సినిమాతో పోల్చదగ్గ మరో హేండీక్యామ్ హారర్ సినిమా రాలేదు.

ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన క్లోవర్ ఫీల్డ్ అనే సినిమా బ్లెయిర్ విచ్ ప్రోజెక్ట్ తో పోల్చదగ్గది కాకపోయినా ఈ రెండు సినిమాల్లోనూ ఉపయోగిమ్చిన టెక్నిక్ ఒకటే కావడంతో క్లోవర్ ఫీల్డ్ సినిమా చూసిన వాళ్ళందరూ మరోసారి బ్లెయిర్ విచ్ ప్రోజెక్ట్ సినిమాని గుర్తుకు తెచ్చుకున్నారు.

బ్లెయిర్ విచ్ లో లాగే క్లోవర్ ఫీల్డ్ లో కూడా సినిమా మొత్తం హేండీ క్యామ్ లో షూట్ చేసినట్టుగా డాక్యుమెంటరీ సినిమాని పోలివుంటుంది. ఈ సినిమా అమెరికా లోని న్యూయార్క్ పట్టణంలో జరుగుతుంది. బ్లెయిర్ విచ్ సినిమాలోలానే ఇందులో కూడా మనం చూస్తున్నది ఒక వీడియో ఫుటేజ్ అని సినిమా మొదలయ్యేటప్పుడే సబ్‍టైటిల్స్ ద్వారా తెలుసుకుంటాం. సినిమా మొదలయ్యేటప్పటికి ఒక యువతీ యువకుల బృందం పార్టీ లో పాల్గొంటారు. ఈ పార్టీలో జరిగే తంతునంతా ఒక వ్యక్తి వీడియో కెమెరాలో షూట్ చేస్తుంటాడు. అనుకోకుండా జరిగిన ఒక భారీ విస్పోటనం ఆ బృందం చెల్లాచెదరవుతుంది. ఒక నలుగురు మాత్రం కలిసికట్టుగా వీధిలోకొస్తారు. వారనుకున్నట్టు అది బాంబు పేలుడు కాదని, వారి జీవితాల్లో అవే ఆఖరు క్షణాలని త్వరలోనే తెలుసుకుంటారు. అసలక్కడ ఏం జరిగిందో వారి చివరి క్షణాల వరకూ షూట్ చేసిన ఆ వీడియో ఫుటేజ్ చూడడం ద్వారా మనం తెలుసుకుంటాం.

ఈ సినిమా బ్లెయిర్ విచ్ ప్రొజెక్ట్ అంతటి సంచలనం సృష్టించకపోయినా ఒక మోస్తరు విజయం సాధించింది. అందుకు కారణం ఈ సినిమా లోఉపయోగించిన హ్యేండీ క్యామ్ టెక్నిక్ ఒకటయితే ఈ సినిమా కోసం చేసిన వినూత్న ప్రచారం మరొకటి .

ఇలా దశాబ్దం క్రితం విజయం సాధించిన ఒక టెక్నిక్ అధారంగా రూపొందించిన క్లోవర్ ఫీల్డ్ విజయం సాధించడంతో మరిన్ని సినిమాలు ఇదే కోవలో రూపొందించబడడం ఆశ్చర్యం లేదు.

జోంబీ సినిమాలకి శ్రీ కారం చుట్టిన నైట్ ఆఫ్ ది లివింగ్ డెడ్ సినిమా దర్శకుడు George A. Romero రూపొందించిన కొత్త సినిమా డైరీ ఆఫ్ ది డెడ్ సినిమా కూడా ఈ టెక్నిక్ ఆధారంగానే నిర్మించబడింది.

పోయిన వారం విడుదలయిన [REC] అనే స్పానిష్ సినిమా కూడా ఇప్పుడు ఇదే కోవలోకి చేరుతుంది.

అంతా బాగానే వుంది కానీ ఇలాంటి సినిమాలు మరీ ఎక్కువైతే ప్రేక్షకుల కళ్ళకి మాత్రం పెద్ద ప్రమాదమే. ఎందుకో తెలుసుకోవలంటే పైన చెప్పిన సినిమాల్లో ఏదో ఒకటి చూడండి మీకే తెలుస్తుంది.

12 Comments
 1. Sowmya April 15, 2008 /
 2. Sudhakar April 15, 2008 /
 3. మంజుల April 15, 2008 /
 4. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 15, 2008 /
 5. శిద్దారెడ్డి వెంకట్ April 15, 2008 /
 6. కొత్తపాళీ April 15, 2008 /
 7. మంజుల April 15, 2008 /
 8. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 16, 2008 /
 9. అసంఖ్య July 24, 2008 /
 10. ravi September 13, 2008 /
 11. Falling Angel September 16, 2008 /