Menu

Frozen-సమీక్ష

frozen.jpgకథా పరంగా ఇది లాస్య అనే ఒక అమ్మాయి కథ.హిమాలయల్లోని లడఖ్ ప్రాంతంలో లాస్య, తన తండ్రి కర్మ మరియు తమ్ముడు కోమో తో కలిసి జీవిస్తుంటుంది.

వారుండే ప్రాంతమంతా దట్టమైన మంచుతో కప్పబడి వుండడంతో వారి జీవితాలు కూడా అక్కడి వాతావరణంలాగే వారి జీవితాలు కూడా స్తంభించి పోయివుంటాయి. ఒక పూట తిండి కోసం అష్టకష్టాలు పడే తండ్రి ఒక వైపైతే పసితనపు చాయలు అప్పుడప్పుడే వీడుతున్న లాస్య తన తమ్మునితో చేసే షికార్లు ఒక వైపు.

వారి జీవితాల్లో సంభవించిన వివిధ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా కథా పరంగా వైవిధ్యం ఏమీ లేనప్పటికీ దర్శకుడు తన పనితనంతో ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తరపైకెక్కించారు. ఒక్క దర్శకత్వమే కాకుండా సినిమోటోగ్రఫీ, ఏడిటింగ్, సంగీతం మరియు లాస్య పాత్రధారిణీ నటన ఎంతో అధ్భుతంగా వున్నాయి.

ఈ సినిమా చూస్తున్నంత సేపూ మిగిలిన దర్శకులుకు ఇలాంటి విజన్ ఎందుకుండదో అనిపించింది.టెక్నిక్ పరంగా ప్రస్తుతం వస్తున్న ఇతర దేశ సినిమాల సాంకేతికతతో పోల్చదగిన ఒకేఒక్క భారతీయ సినిమా ఇదని చెప్పొచ్చు. ఈ సినిమా మన ప్రేక్షకుల మన్ననలు పొందడం కష్టమే!

ఒక విధంగా ఇలాంటి సినిమాలు మన దేశంలో విడుదలవడమే కష్టమనుకుంటా. ప్రేక్షకులు ఈ సినిమాని నచ్చినా నచ్చక పోయినా లడఖ్ ప్రజల జీవన శైళికి, అక్కడి పరిసరాలు, ప్రకృతికి, ఈ సినిమా ఒక తిరుగులేని విజువల్ డాక్యుమెంట్‌గా మాత్రం ఈ సినిమా చరిత్రలో మిగిలిపోతుందని నా అభిప్రాయం. ఈ సినిమా కథాపరంగా దర్శకుడు మరింత శ్రధ్ధ తీసుకుని వుండాల్సిందేమో అనిపించింది. మరీ మాస్టర్ పీస్ అని చెప్పడం లేదు కానీ సినిమా అనే ప్రక్రియ పై ఎంతో అనుభవమున్న దర్శకునిలా మంచి విజువల్ గ్రామర్ తో పాటు, అన్ని రంగాల్లోనూ పరిపూర్ణమైన శ్రధ్ధ కనిపరిచాడు దర్శకుడు.

ఉదాహరణకు ఈ సినిమాలో ఒక సీక్వెన్సు మరియు దాని తర్వాత సీక్వెన్సుని పంక్చువేట్ చేస్తూ, ఒక భారీ వాహనం లడఖ్ లోని ఇరుకు రోడ్డుల గుండా భారంగా వెళ్ళడం మనం గమనించవచ్చు. అలా చూపించడం ద్వారా అక్కడ ప్రజల జీవనం ఎంత భారంగా, దైన్యంగా వుంటుందో చెప్పకనే చెప్తాడు దర్శకుడు. అలాగే ఎలాగోలా భారమైనా జీవితం నెట్టుకు రావాలనే ఉద్దేశమూ అందులో వ్యక్తమవుతుంది.

అవకాశం దొరికితే సినీ ప్రేమికులు తప్పక చూడవలసిన సినిమా. అంతే కాదు గతంలో మీరు చూసిన భారతీయ సినిమాలకు భిన్నంగా వున్న ఈ సినిమాను కొంచెం ఓపెన్ మైండ్ తో చూసి ఆదరించగలరని మనవి.

3 Comments
  1. మంజుల April 5, 2008 / Reply
  2. మేడేపల్లి శేషు January 14, 2009 / Reply
    • శంకర్ January 14, 2009 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *