Menu

ఉత్తమ సాంఘిక చిత్రం స్వతంత్రావారి ’ద్రోహి’

drohi_poster.jpgగమనిక: ఇది శ్రీ ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1948 లో వచ్చిన ’ద్రోహి ’చిత్రం గురించి రూపవాణి పత్రికలో వచ్చిన ఫిలిం రివ్యూ.

నేటి గాఢాంధకార తెలుగు చలనచిత్ర లోకంలో వెలుగును చూపించే ఉత్తమ సాంఘిక చిత్రం స్వతంత్రావారి ’ద్రోహి’

  • ప్రసాద్ దర్శకత్వము, నటన చాలా బాగున్నవి.
  • పాములేని కొరతను శివరావు తీర్చాడు.
  • లక్ష్మీ రాజ్యం ఆడగాంధిగా రాణించింది

పాములూ, తేళ్ళూ, గాడిదలూ, గుర్రాలూ, దొంగలూ, దేవతలూ ఇత్యాది సామగ్రితో జానపద చిత్రాలు తీసి వాటియొక్క ప్రయోజనాన్ని గురించి తాము నమ్మలేక, ప్రేక్షకుల్ని నమ్మించలేక గుడ్డెద్దు చేలో పడ్డట్లు దాట్లు వేసే మన నేటి నిర్మాతలకు స్వతంత్రావారి ’ద్రోహి’ చిత్రం ఒక ఛాలెంజ్. సాంఘిక వ్యవస్థలోనూ, ప్రజాసౌఖ్యములోనూ, ప్రజాశాంతిలోనూ అభ్యున్నతి రావాలని ఆకాంక్షిస్తూ, తత్ప్రయోజన సిద్ధికోసం ఉపయోగపడే సాంఘిక చిత్రాలు, అభ్యుదయ పంధాలో కావాలి, కావాలి అని ఆశగా నిరీక్షిస్తున్న ప్రేక్షకలోకానికి ఇది నిజంగా సంతృప్తిని కల్గించే చిత్రమే.

కొద్ది లోపాలు అక్కడక్కడ తొంగిచూస్తున్నప్పటికీ యుద్ధానంతరం తయారుగాబడిన చిత్రములన్నింటికంటే ’ద్రోహి’ ఉత్తమచిత్రమని చెప్పవచ్చు.

ముఖ్యంగా కథావస్తువు ప్రశంసనీయమైనది. అనాది నుంచీ పీడిస్తున్న సమస్య-ధనమదాంధులకూ దీన జనులకూ మధ్య సంఘర్షణ-ధన పిశాచానికీ -పేదతనమునకూ గల సంబంధము-నిరుపేదలు ధన మదోన్మత్తుల బలిపీఠంపై తడిగుడ్డలతో బలిగావింపబడే విధానము…

అసంఖ్యాకులైన సాధారణ ప్రజానీకమును వేళ్ళతో లెక్కింపదగిన కొందరు ధనికులు సాంఘికముగా – ఆర్థికముగా – నైతికముగా కొల్లగొట్టే రహస్య పంథా….పాలూ నేయీ కొందరికిచ్చీ…

ఇదే గొప్ప సమస్య-అత్యంత పురాతన సమస్య-దీనినే నిర్మాతలు ఆధునిక రంగులతో, నవ్యకళా కవళికలతో సూటిగా గుండెకు నాటేలాగు, చిత్రించారు.

దీనిలో పాత్రలన్నీ కూడా మనం నిత్యజీవితంలో చూస్తూ విస్తుబోయేవేగాని ఊహాప్రపంచంలో దాగుడుమూతలాడేవిగాని, దేవలోకంలోని సందేహాస్పదమైనవిగాని కావు.

అందుచాతనే మనకళ్ళముందు జరిగే వాస్తవిక సన్నివేశాలు, సంఘటనలూ చూస్తున్నట్లుంది-నటనగా యెంతమాత్రమూ లేదు.

డైరెక్షను:-

ప్రసాద్ డైరెక్టు చేసిన ’గృహప్రవేశం’ చూచినతర్వాత, ’ద్రోహి’ చిత్రాన్ని గురించి యేమీ ఆశించలేకపోయాము. కాని -’ద్రోహి’ చిత్రంతో ప్రసాద్ మనపై ఒక గొప్ప ’సర్‍ప్రజ్’ విసిరాడని చెప్పితీరాలి. ప్రారంభంనుంచీ, ఆఖరువరకూ ప్రతి సన్నివేశంలోనూ దర్శక ప్రతిభయొక్క కిరణాలు ప్రసారితమైనవి.

’కొక్కొరోకో’ యని కోడి కూతతో గూడెము యొక్క వాతావరణాన్ని ఒక్క శబ్ద విశేషంతో సూచిస్తూ సచిత్రంగా గూడెమును వర్ణిస్తున్నట్లుగా ప్రతి చిన్న అంశాన్ని గూడ కళ్ళకు గట్టగలిగాడు.

మొత్తంమీద ప్రతి ’షాటు’ కూడా దానియొక్కప్రత్యేకత, విలువ, సంభాషణల విలువనుబట్టి ’ఎఫెక్టివ్’గా వుండేలాగు తీయబడింది.

One Response
  1. సౌమ్య April 21, 2008 /