Menu

Dersu Uzala (1975)

dersu-uzala.jpg“Dersu Uzala” – మరో Akira Kurosawa సినిమా. ఈ సారి జాపనీస్ కాదు. రష్యన్. ఇప్పటిదాకా చూసిన కురోసవా సినిమాలన్నింటిలోకీ భిన్నమైన సినిమా అనే చెప్పాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే. కథాంశం ఆయన కథలతో పోలిస్తే భిన్నమైనది కావడమూ, పాత్రల్లో జాపనీస్ మొహాలు లేకపోవడమూ, కథ Siberia లో తీసింది కావడమూ ఈ కొత్తదనానికి కారణం కావొచ్చు.

విషయానికొస్తే, ఈ సినిమా ని ఇదే పేరుతో 1923లో Vladimir Arsenyev రాసిన జ్ఞాపకాల ఆధారంగా తీసారు. కథేమిటంటే, అర్సెన్యేవ్ తన బృందంతో సైబీరియాలోని ఓ ప్రాంతానికి ఏవో పరిశోధనల కోసం వస్తాడు. అక్కడ అతనికి ననాయ్ తెగకు చెందిన వేటగాడు Dersu Uzala పరిచయమౌతాడు. అతన్ని గమనించే కొద్దీ అర్సెన్యేవ్ కు అతనంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడుతుంది. డెంజూ కూడా తన అనుభవం వల్ల ఈ బృందానికీ, ముఖ్యంగా అర్సెన్యెవ్ కీ ఎంతో సాయం చేస్తాడు. ఈ పర్యటన ముగిసాక Arsenyev Dersu ని తనతో వచ్చేయమని అడిగినా కూడా అతను ఒప్పుకోడు. మళ్ళీ ఐదేళ్ళ తరువాత Arsenyev మరో బృందంతో ఆ ప్రాంతానికి వస్తాడు. అనుకోకుండా Dersu ని కలుస్తాడు. ఈ పర్యటన చివరికి వచ్చేసరికి Dersu కి చూపు మందగిస్తుంది. దానితో, Arsenyev తో వెళ్ళడానికి వప్పుకుంటాడు. అడవుల్లో పుట్టి పెరిగిన ఇతడు నగరం వెళ్ళాక ఏం జరిగింది? చివరికి Dersu ఎమయ్యాడు? అన్నది ఈ కథలో ఆఖరు భాగం – చివరి ఇరవై నిముషాలు. దాదాపు మూడు గంటల సినిమా అంటే నమ్మడానికే కష్టంగా ఉంది. సమయం తెలీలేదు. సైబీరియా అడవి ప్రాంతాన్ని బాగా చూపారు. మొదటి పర్యటన చలి కాలం లో, తరువాతిది ఎండాకాలం మొదలుకుని… మళ్ళీ చలిదాకా సాగుతుంది. ఈ రకంగా మొత్తం కాలాలన్నింటిలోనూ ఆ ప్రాంతాన్ని చూసేసినట్లైంది. ఇందులో కూడా కురసోవా తన స్టైల్లో పొగ-మంచులను తెలివిగా వాడుకున్నాడు. సినిమా సాగుతున్నంత సేపూ, Dersu కి మనం కూడా అభిమానులమౌతాము. Dersu పాత్ర చిత్రీకరణకి పాఠకులను కదిలించే గుణం ఉంది. Dersu సమయస్పూర్తి, అతని అనుభవజ్ఞానం – ఇవి చూసేవారికి చాలా బాగా ప్రెజంట్ చేసారు, రకరకాల సన్నివేశాల ద్వారా. అక్కడక్కడా చైనా బందిపోట్ల ప్రస్తావన-అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి చెబుతాయి. గోల్డీలు లేదా ననాయ్లు – ఈ జాతి నమ్మకాల గురించి కూడా కాస్త అవగాహన ఏర్పడుతుంది ఈ సినిమా చూస్తూ ఉంటే. Dersu మనసుని బాగా చూపారు – అతను Arsenyev తో సినిమా మొదటి భాగం లో జరిపిన సంభాషణల్లో. ఈ సినిమా ముగిసే సరికి, Dersu అంటే మీకు ఎంతో కొంత సానుభూతి కలుగుతుంది. అభిమానమూ పెరుగుతుంది. నగరానికి వచ్చాక Dersu పడ్డ ఇబ్బంది-మళ్ళీ అడవికి వెళ్ళిపోతా అనేంత వరకూ ఉన్న సన్నివేశాలు – కదిలించేవి. నాకు ఒకే ఒక్క సందేహం ఏమిటీ అంటే, సినిమా మొదట్లో Arsenyev గతం చెప్పడం మొదలుపెట్టడం తో మొదలౌతుంది ఈ కథంతా. అలాంటప్పుడు, ముగింపు సమయంలో దాన్ని పూర్తి చేయాలి కదా. కానీ, కథ గతం లోనే ఉండిపోతుంది. వర్తమానంలోకి రాలేదేమిటో! ఇదొక్కటి పక్కన పెడితే, ఇది మంచి సినిమా. మిగితా కురోసవా సినిమాలకి భిన్నమైనది. సమయం తెలీనే లేదు నాకు ఇది చూస్తూ ఉన్నంతసేపూ. PS: నా కురోసవా మేరథాన్ కి ప్రస్తుతం ఓ విరామం, ఈ సినిమానే చివరిది, కొంతకాలం దాకా.

5 Comments
  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 26, 2008 /
  2. Sowmya April 27, 2008 /
  3. గిరి May 1, 2008 /
  4. శిద్దారెడ్డి వెంకట్ May 1, 2008 /
  5. Skip May 15, 2017 /