Menu

Conceptual Integrity – A case study of జల్సా

జల్సా

జల్సా సినిమా నచ్చలేదని చాలా మంది యాంటీ ఫాన్సు అంటూనేవున్నారని చాలా మంది ఫాన్సుకు తెలిసినదే. దానికి కారణం సినిమా చెత్తగా వుండడం అని వారన్నా, మాకు అది నమ్మసక్యంగా లేదు. పవనం నటన, త్రివిక్రమం సంభాషణలు, ఇలియానా మఱియూ పార్వతీ మెలటను సొగసులు మొదలైనవి ఎన్నో వుండగా, ఈ సినిమా బాగోకపోవడమేమిటి అని. అలాంటి దృశ్య సంపదలతోఁ బాటు, రెండు మూడు కథలు, ఒక దానితో ఒకటి అల్లేసుకొని వుండడం; అత్యాధునిక కూర్పు సాంకేతికాలు; అర్భాటంగా పాటలు; వికృతంగా స్టంట్లు మొదలైన అదృశ్య సంపదలతో కూడుకున్న సినిమా రెండో వారమే బెంగుళూరు నుండి ఖాళీ చేసి ఎందుకు వెళ్లిపోయింది?మీకు సగటు తెలుగు సినిమాలు నచ్చుతాయా? మీకు మన భారతీయ ప్రఖ్యాత సినిమా పరిశ్రమలో ఏఁవ్ లోపాలు కనిపించవా? అన్ని రకాల సినిమాలూ వుండాలి. మనోరంజనం కోసం కృతకంగా, విచ్చలవిడిగా సినిమా తీయడంలో తప్పేఁవిటి అనా మీ ప్రశ్న. అలాగైతే మీకు పరిచయం చేస్తున్నాను కాంసెప్షుయల్ ఇంటెగ్రిటీ, ఈ పదం వ్రాయడానికి చదవడానికి చాలా కష్టంగా వుంది కాబట్టి దానిని తెలుఁగులో అందరికీ అర్థమయ్యేడట్టు అంశనిజాయితీ అనుకుందాం.

అంశ నిజాయితీ
మీరు సాఫ్టువేరు పరిశ్రమలో పని చేసేవారైతే (నవతరంగానికి వచ్చేవారిలో ౯౪శాతం వారే) మీకు లెక్క ప్రకారం ఈ విషయం గుఱించి తెలిసే వుండాలి. కానీ ఆ పరిశ్రమలోఁ గూడా మంచి శిక్షణ వున్న వారికే (వీరు శాతానికి ఒక ౧౨ మంది వుంటారు) దీని గుఱించి తెలుస్తుంది. అంటే మీకు అంశనిజాయితీ గుఱించి తెలిసే అవకాశం కేవలం ౧౧.౨౮శాతం మాత్రమే వుంది. కాబట్టి దాని గుఱించి వివరించే పని నేనే నెత్తికి ఎత్తుకుంటా. అంశ నిజాయితీ అనగా, మీరు సృజించిన ఒక వస్తువులో, ఏ అంశాన్ని తీసుకున్నాగాని, దాని తత్వం ఆ వస్తువు యొక్క తత్వానికి భిన్నమై యుండకూడదు. అంటే నిజాయితీ వున్న వ్యవస్థలో ఒక రెండు మూడు అంశాలని పరీక్షించిన పిదప మీకు మిగిలిన వ్యవస్థలో ఎటువంటి ఆశ్యరాలూ కలుగకూడదు, ఎందుకంటే వాటి తత్వాన్ని మీరు అప్పటికే ఊహించివుండాలి.

ఉదాహరణకు – మీరు ఒక భవంతి నిర్మిస్తున్నారు అనుకుందాం. దాని ఒక్క మూల అవసరం విపణం అనకుందాం. దానికి వుండాల్సిన ముఖ్య తత్వం ఆహ్వానించేదిగా వుండడం. కాబట్టి మీరు బయటకి కనబడనట్టుగా చిన్న ద్వారం ఎక్కడో ప్రక్కన ఇచ్చారనుకోండి, అలా ఇవ్వడంలో నిజాయితీ లేదని అర్థం. అలా ఇవ్వకూడదని నియమాలైతే లేవు, కానీ షాపింగు మాల్‌కి ఒకటే చిన్న తలుపు ఇవ్వడం మూర్ఖత్వమే అవుతుంది.

ఈ నిజాయితీ అనేది ఏ సృజనకైనా వర్తిస్తుంది. సాఫ్టువేరు మొదలుకొని, సినిమాల వఱకూ; అలానే భవంతులు మొదలుకొని పుస్తకాలవఱకూ.
ఉదా- పౌరాణిక సినిమాలలో, లేదా సినిమాలలో పౌరాణిక పాత్రలు ఆంగ్ల పదాలు వాడితే ఎబ్బెట్టుగా వుంటుంది అని అందరికీ తెలిసిందే, ఎందుకంటే మిగిలిన సినిమా అంతా పౌరాణికమైనా ఈ ఒక్క అంశం మాత్రం దానికి వ్యతిరేకంగా వుంటుంది కాబట్టి. మీకు ఇక్కడ యమదొంగ సినిమాలో బుక్కు బుక్క అని చిత్రగుప్తుడు పదే పదే అనడం గుర్తుకు రావచ్చు.

జల్సా సినిమాని తీసుకున్నచో, అందులో సినిమా తీసిన వారు ఏం చెప్పదలచుకున్నారో మనకు అర్థంకాకుండా వుంటుంది.
ప్రేమ కథా? నక్సలు కథా? కక్షల కథా? హాస్య చిత్రమా? యాక్షను చిత్రమా? అన్నది మనకు అర్థం కాదు. నిజాయితీ వుండాలంటే అన్ని అంశాలకు తత్వం ఒకేలా వుండాలనుకున్నా, ఆ ఒక తత్వం ఏఁవిటి ఈ సినిమాకు అన్న సందిగ్ధంలో పడతాం. అంటే సినిమాకు ఒక తత్వమే లేదన్నమట.

హీరోని గొప్పగా చూపించాలి. బిందస్ అన్నట్టు చూపించాలి. కాబట్టి సీనియర్లను కొడుతున్నట్టుగా, తాగేవాడిగా, గోల్డు మెడలిష్టుగా చూపిస్తున్నారు. హూఁ.. అతకలేదు! తాగితే ఎందుకు తాగుతున్నాడో చెప్పలేదు. లేదా చదువులో రాణిస్తే అలా ఎలా రాణించగలుగుతున్నాడనీ చెప్పలేదు. పరస్పర విరుద్దాలైన తాగుడూ చదువూ ఎలా ఒకే చోటవుంటున్నాయో ఆ భగవంతుడికే ఎఱుక.

ఇలా చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు కానీ ఇంకో రెండు మూడు ఉదాహరణలతో ముగిస్తాను.
౧) నక్సలైటు కథ అన్నప్పుడు పూర్తిగా వారికి కేటాయించి, సంఘంలో ప్రాముఖ్యత వున్న ఆ అంశానికి తగిన గౌరవం ఇవ్వడం సమంజసం.
౨) హీరో యొక్క సంక్లిష్టమైన గతం యొక్క ప్రభావం తనపై ఎలా వుంది అన్నది కూడా ఎక్కడా సరిగా లేదు. ఎక్కడైనా వున్నా అది అన్ని చోట్లా ఒకేలా లేదు.
౩) అన్ని తెలుగు సినిమాలవారిలా ఇందులో కూడా సామాన్యులను(అభిమానులను) గౌరవించాలి అన్న సందేశం పంపుతున్నాము అని చెప్పుకుంటారు. కానీ ఒక బ్రహ్మానందాన్నీ ఒక అలీనీ ఇష్టఁవచ్చినట్లు బాదడం మాత్రం సరౌతుంది. అదెలానో మఱి!

ఒక ముక్కలో చెప్పాలంటే, జల్సా సినిమాలో ఒక నక్కని, ఒక నాగలోకాన్ని, ఒక కుక్కని, ఒక కుజగ్రహాన్ని ఎంచుకోవడం జరిగింది (త్రివిక్రమం సినిమా గుఱించిగా, కొంత యతి కుదిరితే బాగుంటుందని). వాటిని కలపడానికి మన త్రివిక్రమం మఱియు అతని అనామిక జట్టు సభ్యుల మేధస్సు ఉపయోగించడం జరిగింది.

ఈ సినిమాలో చాలా టాలెంటు వుంది. సంభాషణలుగాని, ఒకప్పటి మఱియు ఇప్పటి ఇలియానాకి తేడా గానీ, కథానాయకుడి నటనలో గానీ (నా ఉద్దేశంలో కనీసం), గుడ్డిలో మెల్ల అన్నట్టు కాస్త తక్కువ ఫైట్లుగాని, హాస్యంగాని. కానీ స్పష్టత లోపించినప్పుడు దాన్ని ఇలా ఇతరులతో ప్రతిక్షేపించడం సరిపోదు.

అందరూ చాలా చాలా చెత్తగా వుందనడంతో నా అంచానాలు ఎక్కడో పాతళంలో వుండడం వలన నాకు ఈ సినిమా బానే అనిపించింది. స్పష్టత మాత్రమే లోపించింది ! పవన్ అభిమానిగా అతన తదుపరి సినిమా కోసం ఎదురు చూస్తున్నాను.

43 Comments
 1. sujatha April 16, 2008 /
 2. chavakiran April 16, 2008 /
 3. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 16, 2008 /
 4. Sri April 16, 2008 /
 5. rajesh April 16, 2008 /
 6. sathish April 16, 2008 /
 7. మంజుల April 16, 2008 /
 8. శంకర్ April 16, 2008 /
 9. కొత్తపాళీ April 17, 2008 /
 10. veer April 18, 2008 /
 11. రానారె April 18, 2008 /
 12. Kathi Mahesh Kumar April 19, 2008 /
 13. Uttara April 21, 2008 /
 14. Kathi Mahesh Kumar April 21, 2008 /
 15. Uttara April 21, 2008 /
 16. సగటు జీవి April 21, 2008 /
 17. సగటు జీవి April 21, 2008 /
 18. Uttara April 21, 2008 /
 19. సగటు జీవి April 21, 2008 /
 20. Uttara April 21, 2008 /
 21. Kathi Mahesh Kumar April 21, 2008 /
 22. సగటు జీవి April 21, 2008 /
 23. Kathi Mahesh Kumar April 22, 2008 /
 24. Theja April 22, 2008 /
 25. Uttara April 23, 2008 /
 26. సగటు జీవి April 23, 2008 /
 27. Kathi Mahesh Kumar April 23, 2008 /
 28. chavakiran April 23, 2008 /
 29. శిద్దారెడ్డి వెంకట్ April 23, 2008 /
 30. Uttara April 23, 2008 /
 31. Kathi Mahesh Kumar April 23, 2008 /
 32. శిద్దారెడ్డి వెంకట్ April 23, 2008 /
 33. రాకేశ్వర రావు April 23, 2008 /
 34. Kathi Mahesh Kumar April 24, 2008 /
 35. kala May 15, 2008 /
 36. Hari Charana Prasad August 1, 2008 /
 37. Hari Charana Prasad August 1, 2008 /
 38. Jonathan September 23, 2008 /