Menu

3:10 టు యుమా – మరో సమీక్ష

ఎప్పటి నుంచో ఎంతో మంది “3:10 to Yuma” సినిమా గురించి చెబుతూనే ఉన్నారు, అద్భుతమయిన సినిమా అని.
చూద్దామనుకుంటుంటే ఇన్నాళ్ళకు తీరింది. సినిమా నచ్చింది అన్నది అండర్ స్టేట్‌మెంటవుతుంది. చాలా బాగా నచ్చింది.

ఇంతకీ నేను చూసింది ౨౦౦౭ లో విడుదలయిన సినిమా. ఇది ౧౯౫౭ లో విడుదలయిన పాత “3:10 to Yuma” కి రీమేకు. సినిమాకు హైలైటు “రసెల్ క్రో” (గ్లాడియేటరు చూసిన వారికి రసెల్ క్రో గురించి చెప్పక్కర్లేదనుకుంట.)

టూకీగా సినిమా గురించి చెప్పుకుంటే బెన్ వేడ్ (రసెల్ క్రో) అనే ఔట్‌లా (లా ని ధిక్కరించేవాడు) దోపిడీలు చేసి, వాగన్‌ లను కొల్లగొట్టి డబ్బు దోచుకుంటూంటాడు. దయా దాక్షిణ్యాలు లేని వాడిగా చూపించబడతాడు.

ఇక డాన్ ఇవాంస్‌ అనే ఇంకో కౌబాయ్ ఒక కాలు లేని వాడు. ఆర్మీలో పనిచేసినవాడు. జీవితంలో ఫైయిల్యూరు.
అప్పులలో కూరుకుపోయి ఉంటాడు. సరయిన సంపాదన ఉండదు. ఎన్నో కష్టాలు ఎదురుకొంటుంటాడు.

కొన్ని పరిస్థితులలో డాన్ రెండు వందల డాలర్ల కోసం బెన్ ని యూమా (జైలు) కి తరలించే బాధ్యతని స్వీకరిస్తాడు. (బెన్, అతని ముఠా ఎంతో ప్రమాదకరం అని తెలిసినా సరే.) నిజం చెప్పాలంటే బెన్ ని ఆపే శక్తి ఆ పోలీసుల గుంపులో ఎవరికీ ఉండదు. అతను అటు శక్తిలోనూ, యుక్తి లోనూ అందరికంటే రెండాకులు ఎక్కువ చదివినవాడే.

ఇక సినిమా అంతా బెన్ ని యూమా కి చేర్చే రైలు ఎక్కించడం గురించే. ఆ ప్రయాణంలో తన గురించి తాను తెలుసుకుంటాడు డాన్. తను ఒక ఫెయిల్యూర్ అని భావించే తన కొడుక్కి తనంటే ఏమిటో నిరూపించుకునే ఒకే ఒక్క అవకాశంగా భావిస్తాడు బెన్ ని యూమా కి పంపడం.

ఇక బెన్ కూడా ఒక రకమయిన జాలి చూపిస్తుంటాడు డాన్ పట్ల. పైకి మాత్రం తను ఎంతో క్రూరుడిగానే ఉంటాడు.

ఇక బెన్ ని యూమా కి తీసుకువెళ్ళే ప్రయత్నంలో డాన్, ఇంకో ఇన్‌స్పెక్టరు, డాన్ కొడుకు తప్ప అందరినీ మట్టు పెడతాడు బెన్. చివరకు అందరూ బెన్ కీ, అతని ముఠాకూ భయపడి పారిపోతారు. ఆ సమయంలో డాన్ మాత్రం ఏది ఏమయినా సరే బెన్ ని యూమాకి వెళ్ళే రైలులోకి ఎక్కించాలనే నిర్ణయించుకుంటాడు.

ఆ ప్రయత్నంలో చివరకు విజయం సాధిస్తాడా ? తనను తాను నిరూపించుకుంటాడా ? అనేదే సినిమా.

దర్శకత్వం, స్క్రీన్ ప్లే అద్భుతం అని చెప్పవచ్చు. సినిమాలో అనవసరమయిన సీన్‌ లు దాదాపు కనిపించవు. అన్నీ అతికినట్టుగా అమరాయి.

ఇక నటీ నటుల గురించి చెప్పనవసరమే లేదు. ఆ కారక్టర్లకి పూర్తి న్యాయం చేసారు. రసెల్ క్రో అద్భుతమయిన నటన సినిమాని బాగా రక్తి కట్టిస్తుంది.

బెన్, డాన్ ఇద్దరిలోనూ సినిమా ఆద్యంతం అంతస్సంఘర్షనే. బెన్ చెడు నుంచి మంచి వైపుకి లొంగకుండా నియంత్రించుకుంటుంటే, డాన్ దానికి వ్యతిరేకం. చెడు వైపుకి మొగ్గకుండా తనను తాను కాపాడుకుంటుంటాడు.

ఈ సినిమాలో నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన సీన్ లలో ఒకటి కంటెన్షన్ నగరంలోని హోటలులో 3:10 సమయం కోసం వేచి ఉంటారు డాన్, బెన్. చుట్టూతా బెన్ ముఠా వారు పాగా వేసి ఉంటారు. అప్పుడు బెన్ అంటాడు రెండు వందల డాలర్ల కోసం ఎందుకు నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావు. నేను నీకు వెయ్యి డాలర్లు ఇస్తా, ఇప్పుడే నన్ను వదిలెయ్యి అని. ఆ సీనులో ఆ డబ్బు పట్ల ఆశ, బెన్ ను పట్టించి తనను తాను నిరూపించుకోవాలనే తపనల మధ్య కొట్టుమిట్టాడుతున్న డాన్ ని అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు.

చూడదగిన మంచి సినిమా.

* ఔట్‌లా అనేది సాధారణంగా చట్టాన్ని పట్టించుకోని వారిని పిలిచే పదం. ఔట్‌లా లో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఇద్దరూ ఉండవచ్చు. కల్పిత కారక్టర్లని తీసుకుంటే రాబిన్‌హుడ్, మాస్క్ ఆఫ్ జోరో, కొండవీటి దొంగ, చివరకు మన మాస్ 🙂 అందరూ ఔట్‌లా లే.

–ప్రవీణ్ గార్లపాటి

3 Comments
  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 7, 2008 /
  2. sandeep April 9, 2008 /
  3. sasank April 30, 2008 /