Menu

జొధాఅక్బర్ అనే సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే..

ఈ సినిమా దర్శకుడు అశుతోష్ ని అందరూ అభినందించాలి.చాలా విభిన్నమైన కధను ఎంచుకుని,తాపీగా,భారీగా తీసినందుకు.చాలా వరకు ఇవ్వాళ వస్తున్న హిందీ సినిమాలు,మల్టీప్లెక్సుల కోసం,విదేశాల్లోని భారతీయులకోసం రూపొందుతున్న నేపధ్యంలొ నాయికానాయకులను చిన్నప్పటి నుంచీ చూపటమనేది అరుదై పోయింది.కానీ ఇందులో ఇద్దరినీ చిన్నతనం నుంచి చూయించి పాత సాంప్రదాయానికి మళ్ళీ ఒక సారి ఊపిరి పోసాడు.హృతిక్ రోషన్,లక్ష్య సినిమా తర్వాత కాస్త నటించేందుకు ప్రయత్నించాలని చాలా కష్టపడ్డాడు.ఐశ్వర్య ని క్లోజప్ లో చూయించినప్పుడల్లా ఆమె కళ్ళల్లో ఆస్కార్ ఉత్సవంలో ఫొటోగ్రాఫర్ల కెమెరా ఫ్లాషులే కనిపించి నన్ను చకితుడిని చేశాయి.
గతం లొ అమెరికా నుంచి వెలువడే ప్లేబాయ్ పత్రిక కొంతకాలం ఒక నినాదం ఇచ్చేది “అందరికీ అన్నీ “అని.ఈ సినిమాలో కూడా దర్శకుడు చాలా వరకూ ఆ నినాదాన్ని ఆచరించేందుకు తిప్పలు పడ్డాడు.నాలాంటి వాడి కోసం నలభై ఏనుగులూ,వంద ఒంటెలూ.ఇక గుర్రాలు లెక్కే లేదు.ఏనుగును లొంగతీసుకునే(?)సన్నివేశం చూసి నా చిన్నప్పుడు చూసిన అన్నదమ్ముల సవాల్ సినిమా గుర్తుకొచ్చి ఫ్లాష్ బ్యాక్ తెగ ఫీలయ్యా.కాకపోతే అందులో హీరో మదగజాన్ని చితక్కొడితే ఇక్కడ అభ్యాసం మాత్రం చేసి కాబోయే మామగారికి తన టాలెంటు చూపుతాడు.మామగారంటే గుర్తొచ్చింది,లగాన్ సినిమాలో కుల్ భూషణ్ కర్భందా మహరాజు పాత్రలో ఎక్కి తిరిగిన ఏనుగుకి కూడా ఇందులో పాత్ర ఏమన్నా ఉందేమోనని చాలా వెతికాను కానీ నలభై ఏనుగుల్లో గుర్తు పట్టలేక పోయా.
ఇంకో విషయానికి కూడా దర్శకుడిని అభినందించాలి.చాలా మంది గమనించి ఉంటారు,మొదటి సినిమా నుంచి కూడా హృతిక్ రోషన్ మొహంలో కొన్ని భావ ప్రకటనలు అలా ఫిక్స్ అయిపోయుంటాయి,వాటిని ఏమాత్రం మరువనివ్వకుండా సినిమా జరిగిన మూడు గంటల చిల్లర సమయంలో వాటినే తిప్పితిప్పి ప్రదర్సించుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా నాకు ఆనందం కలిగింది.
ఈకాలపు కుర్రకారుని మర్చిపోకుండా,వాలెంటైన్స్ డేకి వారం ముందు గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చెయ్యడానికి దేనికయినా సిద్దపడే మహాప్రేమికుని తరహాగా హృతిక్ పాత్రను తీర్చిదిద్దటం భలే ఉంది.నాకు సరిగ్గా కనిపించలేదుగానీ ఐశ్వర్య దుస్తులూ,ఆభరణాల మీద స్పాన్సర్ల పేర్లు ఉండి తీరాలి కాని మనకు స్పష్టంగా తెలీకుండా చేయటంలో దర్శకుని ప్రతిభ బాగా వెల్లడయ్యింది.ఈసందర్భంగా ఒక చిన్న యానెక్డోట్..ఎలిజబెత్ టేలర్ కధానాయికగా నటించిన క్లియోపాట్రా షూటింగ్ జరుగుతుండగా,ఆపాత్రకు మెడలో ఒక వజ్రాల హారం అవసరమయ్యింది.ఆరోజుల్లోనే ఆహారం ఖరీదు ఒక మిలియన్ డాలర్లు, దాని ధర విని గుడ్లు తేలేసిన నిర్మాతలు నకిలీ హారంతో పని ముగిద్దామన్నారు.కానీ దర్శకుడు మిలియన్ డాలర్ల హారం మెడలో ఉన్నప్పుడు వచ్చే మెరుపు ఆమె మొహంలో కనిపిస్తుంది,ఎన్ని నకీలీలు వాడితె మీరు నాకు ఆ ఎక్స్ ప్రెషన్ తెచ్చివ్వగలరు అని అడిగాడు. అలాగే ఐశ్వర్య కూడా ఐదు వందల సంవత్శరాల నాటి కధ ఐనా కాంటెంపరరీ లుక్కులోనే కనిపించేలా ముఖ్యంగా కాస్ట్యూమ్స్ విషయంలో దర్శకుడు తీసుకున్న స్వేచ్చ నాకు బాగా నచ్చింది.ఎగ్జిబిషనిస్టులూ,వాయెర్స్ వగైరాలను కూడా సంతృప్తి పరిచేందుకు అశుతోష్ కొన్ని సన్నివేశాలను రూపొందించటం కూడా నాకు బాగా నచ్చింది.వెనుకటికి అంటే1966లో పిడుగురాముడు అనే సినిమాలో “నడకలో కొదమ సింహపు అడుగులున్న చినవాడ” అంటూ ఒక పాట ఉంది,అలాగే 1982 లొ వచ్చిన బంగారుకానుక చిత్రంలో “నడకా హంసధ్వని రాగమా” పాటలో నాయికను నాగేశ్వరరావు నా మృగేంద్ర మధ్యమా ..అంటాడు.అలాగె ఇందులో కూడా హృతిక్ రోషన్ బస్కీలు తీస్తూ కండలు చూపుతుంటే ఐశ్వ్రర్య తెరచాటు నుంచి చూస్తూ..ఉండిపోతుంది.శరీరం మీద ఒక్క నూగు వెంట్రుక కూడా లేని హృతిక్ జబ్బలు,వీపు,నడుము చూపెట్టటంలో అటు దర్శకుడు,ఇటు కెమెరామెన్ చూపిన క్రియేటివిటీ నాకు పిచ్చపిచ్చగా నచ్చింది.ఉమ్రావ్ జాన్,జోధాబాయ్ పాత్రలను తను చెయ్యగలనూ అన్న ఆత్మవిశ్వాసానికి ఐశ్వర్యాను అభినందిస్తూనే పాత్రలపేర్లు ఏమయినా తను తనుగానే మిగిలిపోతున్న ఆమె చతురతకు ఆశ్చర్యపోతూ ఆనందిస్తున్నాను.ఇలా ఒకటేమిటి సినిమాలో నాకు నచ్చిన సన్నివేశాలు చాలా ఉన్నాయి.
ఇంత రాసినా ఎక్కడా నేను చారిత్రాత్మక సినిమా అనే పదాన్ని వాడకపోవటం విజ్ఞులయిన పాఠకులకు కాస్త ఆశ్చర్యం కలిగించి ఉండవచ్చు.నాకు సినిమా నచ్చటంలో రహస్యం అదే అని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నా.చరిత్రకారులకు తెలిసిందీ,మనకు చెప్పినదాంట్లో ఎంత నిజముంది అన్న సంగతే తేలక జనం చస్తుంటే సినిమాలకు చరిత్రా,దాని రుజువులూ ఎవరిక్కావాలి.ఈ “తొక్కలో” చరిత్రను పట్టించుకుంటే మనకు అన్నమయ్య,శ్రీరామదాసు లాంటి కళాఖండాలు వస్తాయా?హాలీవుడ్ లో కూడా అడపాదడపా ఇలా చారిత్రక కధాంశాలతో భారీ సినిమాలు వస్తుంటాయి,94శాతం యాక్యురసీతో కానీ విమర్శకులు,ముఖ్యంగా అకడమిక్ విమర్శకులు,టైమ్స్ ఎడ్యుకేషన్ సప్లిమెంటు లాంటి పత్రికల్లో చెత్తచెదారం తీసి జనం మొహాన కొట్టాడంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.ఈ మధ్య వచ్చిన ట్రాయ్,అలెగ్జాండర్ లాంటి సినిమాల గతి ఏమయ్యింది.అందుకే మనవాడు చరిత్రను ఏమాత్రం సీరియస్ గా తీసుకోలేదు,అలా కూడా నన్ను బాగా మెప్పించాడు.మీరు ఎన్ని అన్నా…నలభై ఏనుగులూ,వంద ఒంటెలూ ఉన్న సినిమా ఎన్నేళ్ళకు ఒకసారి వస్తుంది చెప్పండి?

12 Comments
  1. chavakiran March 14, 2008 /
  2. శిద్దారెడ్డి వెంకట్ March 14, 2008 /
  3. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 14, 2008 /
  4. lalitha March 14, 2008 /
  5. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 14, 2008 /
  6. మంజుల March 14, 2008 /
  7. cbrao March 17, 2008 /
  8. sathish March 17, 2008 /
  9. raji October 17, 2008 /