Menu

శోభన్ బాబు – అశృనివాళి

sobhan-babu-5.jpgనేను చెప్పేది ముప్పై ఏళ్ళ క్రింది అనుభవం. ఎందరో సినిమా నటులున్నా కూడా శోభన్ బాబుగారితో మాత్రం చాలా ఆత్మీయమైన బంధం ఉండేది. మా నాన్నగారి స్నేహితుడు సినిమా ఫీల్డ్ లో ఉండేవారు. ఆయన్ అప్పుడప్పుడు సినిమా యాక్టర్లను మా ఇంటికి భోజనానికి తీసుకువచ్చేవారు. కాని శోభన్ బాబు గారు మాత్రం సుమారు ఐదారుసార్లు వచ్చారు మా ఇంటికి. ఆయన వచ్చారంటే చాలు మా ఇంటి ముందు వందల మండి గుమిగూడేవారు ఆయనను చూడడానికి. మా ఇంటిని ఆ ఏరియాలో శోభన్ బాబు ఇల్లు, మా నాన్నగారిని ఆయన సోదరుడు అనేవారు. పోలికలు ఉండేవి ఇద్దరికి.. శోభన్ బాబు గారు ఒకసారి “రాజు వెడలె” సినిమా ప్రీమియర్ షో కోసం హైదరాబాదు వచ్చినపుడు మా ఇంటికి మొదటిసారిగా వచ్చారు. ఎంత మంది జనమో ఆ రోజు, నాకు ఇంకా గుర్తుంది .. ఆ లైట్లు, ఫోటోలు, … మా అమ్మే అన్ని రకాల వంటకాలు చేసేది. త్వరగా భోజనాలు చేసి మేము కూడా అయనతోనే ప్రీమియర్ షో కి వెళ్ళాము సుదర్శన్ … సంగం థియేటర్ గుర్తులేదు సరిగ్గా. కాని ఆ రోజుల్లో సినిమా స్టార్లంటేనే చాలా గొప్పవాళ్ళూ. ఇంకా అయన మన ఇంటికొస్తే ఇంకా ఎంత గొప్ప. చాల క్రేజ్ ఉండేది. గౌరవం కూడా ఉండేది. అలా ఒకసారి ఆయన పిల్లలు కూడా హైదరాబాదు వచ్చారని మా ఇంటికి భోజనానికి పిలిచారా మా నాన్న. వాళ్ళని తీసుకురావడానికి నేను మా తమ్ముళ్ళూ కారులో హోటల్ కి వెళ్ళాము బాగా గుర్తుంది నాకు. శోభన్ బాబుగారి భార్య రాలేదు అప్పుడు. శోభన్ బాబు గారి రెండొ అమ్మాయి నేను ఒకే వయసు. అందరం కాస్సేపు ముచ్చట్లేసుకుని ఐస్ క్రీమ్ తినడం నాకు బాగా గుర్తు. (ఎందుకంటే మేము హోటల్ కి వెళ్ళడం అదే మొదటిసారి కాబట్టి ). శోభన్ బాబు గారు , వారి పిల్లలు మమ్మల్ని కూడా మెడ్రాస్ వచ్చినపుడు వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. శోభన్ బాబు గారితో డైరెక్ట్ గా మాట్లాడలేదు కాని అయన చాలా మృదువుగా మాట్లాడతారు. నిజంగా చాలా సింఫుల్ గా అందంగా ఉండేవారు మేకప్ లేకుండా కూడా. వేసవి సెలవుల్లో మద్రాసు వెళ్ళినపుడు మేము శోభన్ బాబు గారి ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కి వెళ్ళాము. ఆయన తన కుటుంబ సభ్యులను ఎప్పుడూ సినిమా వ్యక్తులకు దూరంగా ఉంచేవారు, సినిమా వాళ్లని ఇంట్లో ఎంటర్‍టైన్ చేయరు అనేవారు అప్పుడు. కాని మా కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా వాళ్ళ ఇంటికి వెళ్ల్లగలిగాము. ప్రశాంతంగా ఉంటుందని సిటికి దూరంగా కట్టుకున్నారు వాళ్ళ ఇంటిని.

అప్పట్లో శోభన్ బాబు గారి సినిమాలు చాలా వచ్చేవి. దాదాపు రంగుల్లో వచ్చిన సినిమాలు చాలానే చూసామని చెప్పవచ్చు. అప్పుడు అతనిపై అందరికి హీరో వర్షిప్ లాంటిది ఉండేది. నిజంగానే విభిన్నమైన కధనాలతో సినిమాలు వచ్చేవి అప్పట్లో. నాకు బాగా నచ్చింది జీవన తరంగాలు, గిరిజా కళ్యాణం, బాబు, దేవుడు మావయ్యా మొదలైనవి. కాలేజీ రోజులలో ఐతే అతను అమ్మాయిలకు డ్రీమ్ బాయ్. ఎందుకంటే నవలా హీరో, అందగాడు ఎటువంటి భేషజాలు లేనివాడు. అతను నటించిన “వంశగౌరవం” సినిమాకు మా జీవితాలకు చాలా పోలికలున్నాయని మా అమ్మ చెప్పేది. ఎందుకంటే ఆ సినిమాలో శోభన్ బాబు చాలా స్ట్రిక్ట్. మా నాన్న కూడా అంతే.
ఆయన ఇంట్లో ఉంటే ఎక్కువ అల్లరి చేయరాదు. ఆయన చెప్పిన మాట ఎవరూ కాదనరాదు. మొదలైన కండీషన్స్ మా ఇంట్లో కూడా ఉండేవి.

ఆయన నటించిన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలన్నీ టీవిలో చూసినవే. కాని ఈ మధ్య వచ్చిన కొత్త సినిమాల్లో యువకుడిగా చేసినవి నడవలేదు. ఆయన ఇక మళ్ళీ సినిమాల్లోకి రానని అన్నారు. శోభన్ బాబుగారు ఎంత పేరు పొందిన సినిమా నాయకుడైనా తన కుటుంబాన్ని సినిమా రంగానికి దూరంగానే ఉంఛారు. ఒక్క సినిమా షూటింగ్ కి కూడా తీసుకురాలేదు. తను సంపాదించిన డబ్బును సినిమాల్లో పెట్టలేదు. స్వంత వ్యాపారం ప్రారంభించి తన కొడుకుకు అప్పజెప్పి మరి కొందరికి ఉపాధి కల్పించారు.

నిజంగా ఆయన వయసు 72 అని ఆయన చనిపోయేవరకు తెలీదు. అంత పెద్దవాళ్ళా ? అని.. కాని ఆయన అంత్యక్రియలు చూసేటప్పుడు చాలా బాధ కలిగింది. ఆయన పడుకున్నారు. నిప్పు అంటించి తల దగ్గర, శరీరంపై పెడుతుంటే అయ్యో ఆయనకు బాధ కలుగుతుందే! కాలిపోతున్నారే అని ఏడ్చాను, కాని నిజంగా అయన చాలా అదృష్టవంతులు. చాలా సునాయాస మరణం సంభవించింది. ఇది ఆయన చేసిన పుణ్యకార్య మహిమే అని నా నమ్మకం. అలాటి అదృష్టం నాకు కూడా కలగాలి అనుకుంటున్నాను.

రచన: వలబోజు జ్యోతి

7 Comments
  1. శిద్దారెడ్డి వెంకట్ March 26, 2008 /
  2. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 27, 2008 /
  3. akella raghavendra May 21, 2008 /
  4. rao T January 5, 2009 /
  5. Swarna September 23, 2009 /
  6. Swarna September 23, 2009 /
  7. nrahamthulla March 31, 2011 /