Menu

షష్టిపూర్తి దాటినా సొగసు చెరగని – స్వర్గసీమ

బి.యెన్ దర్శకత్వంలో వచ్చిన నాలుగవ సినిమా ఇది. “స్వర్గసీమ” సినిమాలో కూడా మళ్ళీ నాగయ్యే నాయకుడు.ఆయనే సంగీత దర్శకుడు కూడా. బెర్నార్డ్ షా “పిగ్మాలియన్” నాటకం ఈ సినిమాకు ఆధారం. ఇంగ్లీష్‍లో వచ్చిన రీటా హేవర్త్, టైరన్ పవర్ ల ’బ్లడ్ అండ్ శాండ్’ ప్రేరణ. మద్రాసులో ఆ రోజుల్లో ఈ సినిమా వీర విహారం చేస్తోంది. ఒక రచయిత…భార్యాబిడ్డలు కలవాడు…పరస్త్రీ వ్యామోహంలో పడి భార్యాబిడ్డలను మరవడం….కొన్నాళ్ళకు మళ్ళీ ఇల్లు చేరడం….తనవారిని ఏలుకోవడం….ఇదీ కథ.ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా బి.యె.రెడ్డికి ఈ సినిమా సవాలనే చెప్పవచ్చు. వాహినీ వాహినీ సంస్థఆరంభించినప్పుడు రామ్‍నాథ్, శేఖర్ లుభాగస్వాములు కానీ ఈ సినిమా తీసేనాటికి వాళ్ళిద్దరూ జెమినీ వాసన్ ఆహ్వానాన్ని అందుకుని అక్కడకు వెళ్ళిపోయారు. ఇక బి.యెన్. పని అయిపోయిందని పరిశ్రమ అంతా గుసగుసలు.దానితోఆయనకిది జీవన్మరణ పోరాటమయ్యింది. అంతకుముందు సినిమాలన్నిటికీ రామ్‍నాథ్ ఆయనకి కుడి భుజంగా వున్నారు. ఇప్పుడాయన ఒంటరి.

సరిగ్గా ఆ సమయంలో బి.యెన్.కు చందమామ రామారావు ఒక రచయితను పరిచయం చేశారు. ఆయనే ఆలూరు వెంకట్ సుబ్బారావు అనే చక్రపాణి.చ్క్రపాణి అప్పటికే పి.పుల్లయ్య తీసిన “ధర్మపత్ని” సినిమాకు పనిచేసి వున్నారు. “స్వర్గసీమ” సినిమాకు చక్రపాణి కథ రాశారు. బి.యెన్.స్క్రీన్‍ప్లే రాసుకున్నారు. మామూలుగానే సముద్రాల రాఘవాచార్య మాటలు రాశారు.

టి.నగర్ తనికాచలం వీధిలో వున్న  వాహినీ కార్యాలయంలో 1944 సంవత్సరం ఉగాది నాడు సంగీత కార్యక్రమాలు ఆరంభమయినాయి. నాగయ్య సంగీత దర్శకుడు. ఓగిరాల రామచంద్రరావు సహాయకుడు. మమ్చి వాచకం వున్న నటులకోసం, గళం వున్న గాయకుల కోసం, కలం బలం వున్న రచయితల కోసం ఆ రోజుల్లో బి.యెన్. ఆకాశవాణి కార్యక్రమాలు చాలా శ్రద్ధ గా వినేవారు.అలాఆయనకు తారసపడినవారే బాలాంత్రపు రనీకాంతరావు.ఆయన కూడా ఈ సినిమా సంగీత విభాగంలో సహకరిం చారు. మావనల్లూరు సభాపతయ్య రాసిన మువ్వగోపాల పదం ’మంచి దినము నేడే…’ తీసుకున్నారు.ఆ పదంతోనే పాటల రికార్డింగ్ ఆరంభమయ్యింది. “స్వర్గసీమ” సినిమాలో టైటిల్స్ నుంచే సంగీత వైభవం మొదలవుతుంది. ’వాతాపి గణపతింభజే…’ కీర్తన ఇన్‍స్ట్రుమెంటల్ గా వినిపిస్తుంటే టైటిల్స్ పడ్తాయి. సహాయ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు,ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కె.వి.రెడ్డి, నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్య కూడా సంగీత చర్చలో పాల్గొనేవారు.

“పాట కారణంగా ఒక తెలుగు సినిమాకు జనం పట్టాభషేకం చేయడమన్నది బహుశా “స్వర్గసీమ” తోనే ఆరంభమైందని అనుకోవాలి. భానుమతి పాడీన ’ఓహొహొ పావురమా….’ పాట ఈ సినిమాకు ఒక పెద్ద బాక్సాఫీసు ఆకర్షణయ్యి కూర్చుంది.  “బ్లడ్ అండ్ శాండ్” సినిమాలో రీటా హేవర్త్ హమ్ చేసిన ఒక స్పానిష్ ట్యూన్ దీనికి ప్రేరణ. నాయకుడిని కవ్విస్తూ సుజాతకు ఒక పాట పెట్టాలని బి.యెన్. అనుకున్నప్పుడు భానుమతికి ఈ ట్యూన్ గుర్తుకు వచ్చింది. ఆ స్పానిష్ ట్యూనుకు కాస్త సింధుభైరవి రంగరించి ఆవిడా, నాగయ్యా ఈ ట్యూన్ తయారుచేశారు. మ్యూజిక్ చర్చల్లో పావురాన్ని పట్టుకున్నట్టు చేతి రుమాలును పట్టుకుని భానుమతి అభినయపూర్వకంగా ఈ పాటను ఆలపించగానే బి.యెన్. ఆనందానికి అవధులు లేవు. ’కుదేల్ బ్రదర్…జనం కుదేల్…’ అన్నారు సంబరంగా కె.వి.రెడ్డి. ఏదైనా బ్రహ్మాండం అని చెప్పేందుకు ఆయన ఈ ’కుదే్ల్’ పదాన్ని వాడే వారు. చక్రపాణి కూడా నవ్వుతూ ’బావుంది’ అన్నారు. ఆయన సాధారణం గా నవ్వరు. బాగుంది అని అస్సలు అనరు. ఆయ్న బాగుంది అన్నారంటే అది నిజంగ బ్రహ్మాండమే అన్నమాట. న్యూటోన్ స్టూడియోలో ఈ పాట రికార్డింగ్ జరిగినప్పుడు సిబ్బంది అంతా ఆ రోజు థియేటర్ ముందే వున్నారు. అలా షూటింగుకు కూడా వెళ్ళకుండానే ఆ పాట సూపర్ హిట్టయింది.సినిమా విడుదలయ్యాక దక్షిణాదిని అంతా ఒక ఊపు ఊపింది. తమిళనాడులో అప్పట్లో బాయ్స్ కంపెనీ అని ఒక నాటక సంస్థ వుండేది. అందులో సూదంటురాయిలా ఓ కుర్రాడుండేవాడు. కేవలం పావురమా పాట కోసం అతను ఈ సినిమాను ఏకంగా నలభ సార్లు చూశాడు.ఆ తరువాతి కాలంలో అతను తమిళ చలనచిత్ర పరిశ్రమకు చక్రవర్తి అయ్యాడు. అతని పేరు శివాజీ గణేశన్!!!” అంటూ నవ్య వారపత్రిక ఒక ఉదంతాన్ని ప్రచురించింది. (దీపావళి-2005)

3 Comments
  1. కొత్తపాళీ March 6, 2008 /
  2. Sowmya March 29, 2008 /