Menu

నిండు మనిషి శోభన్

sobhan_babu.JPGఇటీవల స్వర్గస్తులైన శోభన్ బాబు తన సుదీర్ఘ చలనచిత్రజీవితంలో అంతఃసంఘర్షణ,సామాజికనిబద్దత వాస్తవజీవితానికి దగ్గరగా నిలిచిన పాత్రల ద్వారా సాధారణప్రేక్షకులకు మాత్రమే కాక ఆనాటి విమర్శకులకూ అభిమాన నటుడయ్యారు.ఉదాహరణకు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బలిపీఠం.చావుకు చేరువౌతున్న బ్రాహ్మణవితంతువును పెళ్ళి చేసుకుని ఆమె జీవితంలో వసంతాన్ని కురిపించి,అపార్ధాలకు గురయ్యే దళిత యువకుడి పాత్రలో శోభన్ బాబు ను తప్ప మరొకరిని ఊహించుకోవటం కష్టం.శోభన్ బాబు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చిత్రం వీరాభిమన్యు.భారతయుద్ధం నాటి యుద్ధవ్యూహాలను అధ్భుతంగా చిత్రించిన ఈ సినిమాలోని పాటలు ఎప్పటికీ మరచిపోలేనివికాగా,శోభన్ బాబు,కాంచన ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు ప్రశంసనీయం.

గ్లామర్ హీరో,అందాలనటుడు అని పేరొచ్చినా శోభన్ బాబుకు డిగ్లామరైజుడ్ పాత్రల ద్వారానే తన స్థాయికి తగ్గ గుర్తింపూ,తృప్తీ కలిగాయి.చెల్లెలికాపురంలో బంగారం లాంటి మనసూ,కాళిదాసు లాంటి కవితాశక్తి ఉన్నా నల్లని మేని చాయ వల్ల తెరవెనుక ఉండిపోయే పాత్ర,అలాగే మానవుడు-దానవుడు లో పగలు ప్రాణాలు కాపాడే డాక్టరుగా,రాత్రిళ్ళు దుండగుల ఆట కట్టించే దానవుడు జగన్ గా శోభన్ బాబు చూపిన నటనాకౌశల్యం అనితరసాధ్యం అని చెప్పాలి.దేవాలయం చిత్రంలో గుండు చేయించుకుని,పూజారి కొడుకుగా,తర్వాత తప్పని సరి పరిస్దితుల్లో తండ్రి స్థానంలో పూజారి గా శోభన్ బాబు పోషించిన పాత్ర ఎవరికోగాని దక్కని అపురూపమైన అవకాశం.వ్యక్తిగత విశ్వాసాల వల్ల నాస్తికుడు కానీ,పరిస్తితులప్రాబల్యం వల్ల పూజారి గా విధి నిర్వహించాలి.పూజారి నాస్తికుడైనా భక్తులకు దైవసాన్నిధ్యంలో ఎలాంటి లోటూ కనిపించకుండా చేయటం,దశావతారాలను డార్విన్ పరిణామ సిద్ధాంతాల వెలుగులో విశ్లేషించటం ఈ సినిమాలోని మరో విశేషం.సామాన్య ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా మేధావుల మన్ననలు అశేషంగా పొందిన చిత్రం దేవాలయం.అలాంటి సినిమాలో అందాలనటుడిగా విఖ్యాతి గాంచిన శోభన్ బాబు ఏమాత్రం గ్లామర్ లేని పాత్ర పోషించటం పలువురిని ఆశ్చర్యం లో ముంచినా వ్యక్తిగా ఆయన మతనమ్మకాలకు సదరు సినిమా అద్దం పట్టటం అసలు వాస్తవం.

మదర్ తెరెసాను అభిమానించే శొభన్ బాబు ఆమె అంతిమశ్వాస విడిచినప్పుడొకసారి,అంత్యక్రియలకు ఒకసారి కలకత్తా వెళ్ళి నివాళులు అర్పించివచ్చారు.మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్ వారికి శొభన్ బాబు చేసిన గుప్తదానాలు,ప్రచారార్భాటానికి దూరంగా,బహుదూరంగా ఆయన అందించిన భూరి విరాళాలు సంఖ్యాపరంగా లెక్కకు మిక్కిలి.

వయసులో తను కొంచెం పెద్దవాడైనా సమకాలికులైన నటుల్లో హీరో కృష్ణ తో శోభన్ బాబు కున్న అనుబంధం బహుశా ఏ భాషా చలనచిత్రపరిశ్రమలోనూ ఉండదేమో అనిపిస్తుంది.విచిత్రకుటుంబం,మంచి మిత్రులు,గూఢచారి116,మండేగుండెలు,ముందడుగు,కృష్ణార్జునులు,పుట్టినిల్లు-మెట్టినిల్లు,ప్రవేటుమాష్టారు, మహాసంగ్రామం, లక్ష్మీనివాసం, కురుక్షేత్రం, గంగ-మంగ,ఇలా చాలా సినిమాల్లో వాళ్ళిద్దరు కలసి నటించి రికార్డు సృష్టించారు.

శోభన్ బాబు నటించిన ఘరాన గంగులు చిత్రం ద్వారానే సిల్కు స్మిత తెలుగుతెరకు పరిచయం అయ్యింది.పారితోషికం విషయంలో పైసా కూడా వదలడని పేరొందిన శోభన్ బాబు అందరూ దొంగలే,పిచ్చిమారాజు అనే రెండు సినిమాలకు పైసా కూడా తీసుకోకుండా నటించిన సంగతి అతితక్కువమందికి మాత్రమే తెలిసిన సంగతి. ఏ విషయంలోనూ వేలెత్తి చూపించుకునే మచ్చ లేని వ్యక్తిత్వం,క్రమశిక్షణ,సమయపాలన,పాత్రకు న్యాయం చెయ్యటం, ఇతరుల శ్రేయస్సు తప్ప పొల్లు మాటలు ఆడకపోవటం,వృత్తిలో పూర్తి స్థాయి ప్రొఫెషనలిజం కనపర్ఛటం ఇలా చాలా అరుదైన లక్షణాలు శోభన్ బాబును విలక్షణ నటుడిగా,వ్యక్తిగా తీర్చి దిద్దాయి.
తెలుగు సినీసంగీత రంగంలోని కొన్ని అత్త్యుత్తమ మధుర గీతాలు శోభన్ బాబు మీద చిత్రీకరించబడ్డాయి.విచిత్రకుటుంబం లోని “ఆడవే జలకమ్ములాడవే “,సత్తెకాలపు సత్తెయ్య లోని “నన్ను ఎవరో తాకిరి”,వీరాభిమన్యు లోని “అదిగో నవలోకం”,ఇలా సుమారు ఒక దశాబ్దం పైన శోభన్ బాబు నటించిన ప్రతి సినిమాలోనూ ఒక మధురగీతం ఎవర్ గ్రీన్ సాంగ్ ఒకటి తప్పనిసరిగా ఉండేది.

సంగీతం ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ముచ్చటించుకుందాం.సంసారపక్షంగా ఉండే సినిమాలే ఐనా శోభన్ బాబు సినిమాల్లో,అల్లరీశ్వరి గా పేరొందిన యలారీశ్వరి పాటలు,వాటికి తెలుగు సినిమాలకు ఏనాటికీ తిరుగులేని సెక్స్ బాంబైన జ్యోతిలక్ష్మీ డాన్సులు విపరీతంగా జనం ఎగబడి చూసేవారు.

అమ్మమాట నుంచి “మాయదారి చిన్నోడు నామనసే లాగేసిండు”,ఇదాలోకం నుండి “గుడియనక నాసామి గుర్రమెక్కి కూర్చున్నాడు”,జీవితం నుంచి “మాయజెసి పోతివిరో నాగులూ”,ఈ విధంగా ఆ అల్లరీశ్వరి పాటలు దాదాపు ప్రతి సినిమాలోనూ అలరించేవి.

పౌరాణిక,జానపద,సాంఘిక,సినిమాల్లో నటించిన శోభన్ బాబు తనకెరీర్ మొత్తం మీద ఒకేఒక్క కౌబాయ్ సినిమా దెబ్బకు ఠా దొంగలముఠా లో,అలాగే జగత్ జెట్టీలు,జగత్ జెంత్రీలు తదితర క్రైం సినిమాల్లోనూ తన ప్రతిభను చూపారు.కిలాడిబుల్లోడు లాంటి మామూలు మాస్ మసాలా సినిమాలొ కూడా ” ఓమై లవ్లీ డార్లింగ్,లెట్ మీ టెల్ యు సంతింగ్” “ప్రతి పుట్టిన రోజూ పండుగా కాదు,ప్రతి రేయీ వెన్నెల రాదూ” లాంటి చక్కని గీతాలు శోభన్ బాబు కే స్వంతం.

ఫిల్మ్ ఫేర్ ఆవార్డులూ,నంది ఆవార్డులూ,క్రిటిక్స్ ఇచ్చే పురస్కారాలూ,ఇక ఆంధ్ర మహిళామణులు పట్టిన అభిమాన హారతులు అసంఖ్యాకం.

ఈ వ్యాసం శోభన్ బాబు సినీరంగప్రస్తానం పై గాని.ఆయన వ్యక్తిత్వంపై విశ్లేషణగానీ కాదు.నా జ్ఞాపకాలు,అనుభవాలు అక్కడక్కడ చదివి గుర్తుంచుకున్న అంశాలు తప్ప.ఎక్కడైనా పొరబాట్లు దొర్లి ఉంటే నా దృష్టికి తెస్తే సవరించుకుంటాను.

sobhan1.jpg

28 Comments
 1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 23, 2008 /
 2. శిద్దారెడ్డి వెంకట్ March 23, 2008 /
 3. ప్రసాద్ సామంతపూడి March 23, 2008 /
 4. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 23, 2008 /
 5. చిన్నమయ్య March 23, 2008 /
 6. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 23, 2008 /
 7. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 24, 2008 /
 8. sunita chowdhary March 24, 2008 /
 9. Onlytruth March 24, 2008 /
 10. కొత్తపాళీ March 25, 2008 /
 11. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 25, 2008 /
 12. sujatha March 25, 2008 /
 13. kalikaalam March 27, 2008 /
 14. kalikaalam March 27, 2008 /
 15. kalikaalam March 27, 2008 /
 16. సగటుజీవి March 27, 2008 /
 17. సగటుజీవి March 27, 2008 /
 18. kalikaalam March 27, 2008 /
 19. kalikaalam March 27, 2008 /
 20. సగటుజీవి March 27, 2008 /
 21. T. Vijaya Bhaskar March 29, 2008 /
 22. T. Vijaya Bhaskar March 30, 2008 /
 23. kalikaalam April 4, 2008 /
 24. Ram Charan May 22, 2008 /
 25. Ravi May 31, 2008 /
 26. priya August 30, 2008 /