Menu

సలీం లంగ్డే పే మత్ రో

salim-_angde.JPGదర్శకత్వం:Saeed Mirza

కాలం:1989

నటీ నట వర్గం: పవన్ మల్హోత్రా, మకరంద్ దేశ్‍పాండే, అశుతోష్ గోవరికర్

సలీం ముంబాయు లోని మురికి వాడలో జీవించే ఒక ముస్లిం యువకుడు. ఇంట్లోని ఆర్థిక పరిస్థుతుల కారణంగా చదువుకోలేకపోతాడు. చిన్నప్పటినుండి వీధుల వెంట జులాయిగా తిరుగుతూ ఒక చిన్నపాటి రౌడిగా ముంబాయి వీధుల్లో తిరుగుతుంటాడు. సలీం చేసే అల్లరి చిల్లరి పనుల్లో అతనికి తోడుగా వుంటూంటారు అతని మిత్రులు పీరా మరియు అబ్దుల్.జైలుకెళ్ళడం, దొంగతనాలు చెయ్యడం లాంటవి వీరి జీవితంలో సర్వసాధారణం.

సలీం తో పాటు ఇంట్లో అతని తల్లి,తండ్రి మరియు సోదరి ముంతాజ్ నివసిస్తుంటారు. సలీం వీధుల్లో ఎంత జులాయిగ తిరిగినా ఇంటికొచ్చాక మాత్రం ముంతాజ్ ని ప్రేమగా చూసుకుంటాడు. ఆమె కోసం మంచి వరున్ని వెతికే ప్రయత్నంలో అతను అస్లం ని కలుస్తాడు. నేరపూరితమైన జీవితం గడుపుతున్న సలీం జీవితం అస్లం పరిచయంతో మార్పు దిశగా పయనిస్తుంది.

మొదట్లో అస్లం భావాలతో అంగీకరించని సలీం, హిందూ ముస్లిం ల మధ్య జరిగిన మత సంఘర్షణల గురించి రూపొందించిన ఒక డాక్యుమెంటరీ వీడియో చూడడంతో అతని ఆలోచనా శైళిని మారుకుంటాడు. తన చెల్లెలి పెళ్ళి అస్లం తో ఘనంగా చేసి ఆ తర్వాత నేర ప్రవృత్తి కి స్వస్తి చెప్పి కష్టపడి బతకాలనుకుంటాడు. కానీ నేరసామ్రాజ్యంలోకి కొంచెం లోతుగానే అడుగులు వేసిన సలీం మళ్ళీ తిరిగిరావడం ఎంత కష్టమో తెలుసుకోలేకపోతాడు.

“ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యో ఆతా హై” (Albert Pinto ko Gussa Kyon Ata Hai) సినిమా ద్వారా భారతదేశంలోని క్రిస్టియన్ల మనోభావాలను దృశ్యీకరించి, “మోహన్ జోషి హాజిర్ హో!” (Mohan Joshi Hazir Ho) సినిమాలో ముంబాయి లో అద్దె గృహాల్లో వుంటున్న వారి సమస్యలను తెరకెక్కించిన సయీద్ మిర్జా “సలీం….” సినిమాలో ముస్లింల మనోభావాలను ఎంతో నేర్పుతో తెరకెక్కించారు.

ఈ సినిమా చూస్తున్నంత సేపు చాలా వరకూ రాంగోపాల్ వర్మ రూపొందించిన సినిమాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా పీరూ పాత్రలో నటించిన మకరంద్ దేశ్‍పాండే ని చూస్తున్నప్పుడు “శివ”సినిమాలో జె.డి చక్రవర్తి గుర్తుకొస్తాడు. వీరిద్దరూ చూడ్డానికి ఒకేలా వుండడం ఒక కారణమైతే వారి నటన శైలి కూడా దాదాపు ఒకేలా వుండడం మరో కారణం.అలాగే ఈ సినిమాలోని చాలా పాత్రలు ఆ తర్వాత రాంగోపాల్ వర్మ సినిమాలకు ముడిసరుకు అయిందని ఈ సినిమా చూసినవారెవరైనా అంగీకరిస్తారనుకుంటున్నాను.

ఈ సినిమా మొత్తం రియలిస్టిక్ లోకేషన్లలో తీయడం వలన, అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ లతో పాటు, సహజత్వం ఉట్టిపడేలా పాత్రలకు జీవం పోసిన నటన కారణంగా ఈ సినిమా 80 వ దశకంలోని ముంబై మన కళ్ళముందుకి కదిలొస్తుంది.

సలీం పాత్రలో నటించిన పవన్ మల్హోత్రా (“ఐతే” సినిమాలో విలన్), పీరూ పాత్రలో మకరంద్, అబ్దుల్ పాత్రలో అశుతోష్ (లగాన్ దర్శకుడు) తమ పాత్రల్లో జీవించారనే చెప్పొచ్చు.

కొత్తదా పాతదా అనే తేడాలేకుండా మంచి సినిమా చూడాలనుకునే వారందరూ చూడదగ్గ సినిమా. Dont miss it!

పవన్ మల్హోత్రా-సయీద్ మీర్జా కలయికలో 19 ఏళ్ళ విరామం తర్వాత త్వరలో మరో సినిమా రాబోతుందని సమాచారం!

One Response
  1. శంకర్ March 29, 2008 /