Menu

సయూద్ అఖ్తర్ మీర్జా – ఒక పరిచయం

saeed.jpgవర్తమాన భారతంలో నెలకొని వున్న సామాజిక, రాజకీయ, అర్థిక, మత విచ్చిన్నకర పరిస్థితుల విషయంలో తరపి చేసిన ప్రతిభావంతమయిన వ్యాఖ్య, విమర్శ సయీద్ అఖ్తర్ మీర్జా. ఆయన చిత్రంలోని అరవింద్ దేసాయిలాగా ఆయన కూడా స్పష్టంగా బాధితులవైపు, మైనారిటీల వైపు, వెనకబడ్డ వారి వైపు నిలుచున్నాడు. అంతెందుకు ఆయన మాటల్లోనే చెప్పాలంటే “ఖచ్చితంగా జీవితాంతం ప్రతిపక్షంలోనే నిలుచుంటాను” అంటాడు.

అలా సుస్పష్టమయిన ఆలోచన నిబద్దలతో చిత్రాలు తీస్తున్న సయీద్ మీర్జా తన చిత్రాలకు పెట్టిన పెర్లే ఆయన వ్యంగ్యాన్నీ, వగర జీవితంలోని డొల్లతనాన్నీ చెప్పకనే చెబుతాయి. ’అరవింద్ దేశాయికీ అజీబ్ దాస్తాన్’, అల్బర్ట్ పింటో కో గుస్సా క్యో ఆతాహై?’, మోహన్ జోషీ హాజిర్ హొ’, ’సలీమ్ లంగ్డేపే మత్ రో’ లు ఆయన నిర్మించిన చిత్రాలు. 1995 లో నిర్మించిన మీర్జా చిత్రం పేరు ’నసీమ్’. దీంట్లో ప్రఖ్యాతకవి కైఫీ ఆజ్మీ ప్రధాన భూమికను పోషించాడు.

1943 లో జన్మించిన సయీద్ పూనా ఫిలిం ఇన్స్‍టిట్యూట్ లో డిగ్రీ పూర్తి చేసుకుని 1976 లో మూడు డాక్యుమెంటరీలు (Corpses, Slum Eviction, Urban Housing)నిర్మించాడు.

వీటిలో ముంబాయి టి.వి కోసం నిర్మించిన ’స్లమ్ ఎవిక్షన్’, బాంబే అర్బన్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‍మెంట్ వారి కోసం చేసిన ’అర్బన్ హౌజింగ్’ డాక్యుమెంటరీలు పెద్ద వివాదస్పదమై నిషేధానికి గురయ్యాయి. ఇంకా ఆయన్ ’పిపార్‍సోద్’, ’ఈజ్ ఎనిబడీ లిజనింగ్’, ’వి షల్ ఓవర్‍కమ్’, ’ది థర్డ్ వాయిస్’, ’రిక్షా పుల్లర్స్ ఆఫ్ జబల్‍పూర్’ తదితర డాక్యుమెంటరీలు కూడా నిర్మించారు.

“అరవింద్ దేశాయి…” చిత్రంలో మీర్జా ఉన్నత మధ్య తరగతిలోని యువత పరాయీకరణ చెందడాన్ని స్పష్టంగా సూచిస్తాడు. ఇందులో మనం రోజూ చూస్తున్న మనుషులూ మనస్తత్వాలే గోచరిస్తాయి. అలా ఆ చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రం 1979 లో కేన్స్, బెర్లిన్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది.

1980 లో వచ్చిన ఆయన రెండవ చిత్రం ’ఆల్బర్ట్ పింటోకో గుస్సా క్యో ఆతా హై’ లో అల్బర్ట్‍పింటోకు కోపం వచ్చిన కారణం నేటికీ అదే రీతిలో వుంది. తమ ఐడెంటిటీ కోసం సంఘర్షణ పడుతున్న వారంతా పింటోలో తమని తాము చూసుకుంటారు. తమదైన భాష సంస్కృతి అలవాట్లు అన్నింటినీ వేరెవరయినా ఆక్రమిస్తే ఎవరూ అంగీకరించలేరనే వాస్తవం పింటోలో మనకు స్పష్టంగా చూపిస్తాడు మీర్జా. ఆయన తర్వాతి చిత్రం ’మోహన్ జోషీ హాజిర్ హో’. ఈ చిత్రం ఆధునిక భారత దేశంలో పేరుకుపోయిన లంచగొండతనం, దోపిడీ, నగర జీవితంపైన ఎదురు తిరిగిన ఓ బడుగు జీవి ఇతి వృత్తాన్ని ఒకింత వ్యంగంగా, మరింత కోపంగా చిత్రించాడు మీర్జా. మహా నగరాల్లో ఇళ్ళ సమస్య పైన ఆధారపడిందీ చిత్రం. ఈ చిత్రం కుటుంబ సంక్షేమ విభాగంలో జాతీయ అవార్డును పొందడంతో పాటు రియోడిజనేరియో ఫిలిం ఫెస్టివల్ లొ విశేష ప్రశంసలు అందుకుంది. ఇందులో భీష్మ సహానీ ప్రధాన పాత్ర పోషించారు.

1989 లో మీర్జా నిర్మించిన ’సలీం లంగ్డే పే మత్ రో ’ టోక్యో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో పోటీ విభాగంలో ప్రచురితమయ్యింది. దీన్ని 1990 ఇండియన్ పనోరమా విభాగంలో కూడా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని మీర్జా తన మిత్రుడు, ఢిల్లీలో హత్యకు గురైన కళాకారుడైన సప్థర్ హష్మీకి అంకితం చేశాడు. ఈ చిత్రం మీర్జా ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఖచ్చితమయిన రీజినల్ ఫిలిం మేకర్ గా ఎదిగిన మీర్జా బొంబాయి మెట్రో ప్రాంతాల్లోనే తన చిత్రాలన్నీ నిర్మించాడు. సినిమాని మెయిన్ స్ట్రీమ్, ఆర్ట్ ఫిలిం అంటూ విభజనలు చేయడం సరైంది కాదు అనే మీర్జా తాను తన కోసమే చిత్రాలు తీస్తున్నానంటాడు. తన సినిమాల ద్వారా వేస్తున్న ప్రశ్నలు, సమాధానాలు కొనసాగుతూనే వుంటాయంటాడు.

“తన చిత్రాల్లోని అరవింద్ దేశాయి తాను, తన బ్యాక్‍గ్రౌండ్ అని, ఆల్బర్ట్ పింటో పాత్ర మంగలోరియన్ క్రిష్టియన్ అయిన తన భార్య అని, మోహన్ జోషి తన తండ్రి పాత్ర అని చెబుతూ సలీం లంగ్డే తిరిగి వ్యతిరేకార్థంతో తన వైపే చూస్తుందని” సయీద్ మీర్జా అంటారు. తన చిత్రాల్లోని పాత్రలన్ని సజీవమయినవని ఆయన చెబుతారు. 1995 లోఆయన నిర్మించిన ’నసీమ్’ 1996 పెనోరమాలో ప్రదర్శించారు. ’1992′ లో దేశంలో జరిగిన బాబ్రీమసీదు కూల్చివేత, బొంబాయి అల్లర్ల నేపథ్యంలో ఓ తాత, మనవరాలి మధ్య అనుబంధాన్ని సున్నితంగా చూపించాడీ చిత్రంలో. ఇంకా మీర్జా టి.వి కోసం ’నుక్కడ్’, ’ఇంతేజార్’, ’నయానుక్కడ్’ సీరియల్స్ నిర్మించాడు. అవి ఎంతో విజయవంతమయ్యాయి. వర్తమాన సమాజంపై ప్రతిభావంతమయిన వ్యంగ్య వ్యాఖ్యలు సయీద్ మీర్జా చిత్రాలు.