Menu

కమ్లి..బంజారా బతుకు చిత్రం

kam1.JPG

సినిమా:కమ్లి

కాలం:2006

దర్శకత్వం:కె.ఎన్.టి.శాస్త్రి

నిర్మాణం:హరిచరణ్ ప్రసాద్-సుకన్య

దృశ్యం చాలా బలమైంది. వ్యక్తిని ప్రభావితం చేయగల శక్తి కలిగింది. అది సమాజస్థితికి నిలువుటద్దం అయినప్పుడు ఆలోచింపజేస్తుంది. ఒక్కోమారు కర్తవ్యానికి సైతం పురిగొల్పుతుంది. మనం తేరిపారచూడాలే గానీ ఇలాంటి దృశ్యాలు ఎటు చూస్తే అటు అగుపిస్తాయి. ఎన్నెన్నో వాస్తవాల్ని వెల్లడి చేస్తాయి. కానీ జీవితం తాలూకూ ఆ సాదా సీదా దృశ్యాలు మనల్ని అట్టే ఆకర్షించవు. వినోదాన్ని అందించవు. కాబట్టి దృశ్యాలతో కేవలం వ్యాపారమే చేయాలనుకునేవారికి సగటు ప్రజల ’జీవన చిత్రం’ తో పని లేదు. ఇందుకు భిన్నంగా కొద్దిమంది దృశ్యాన్ని ఓ చక్కని వాహికగా ఎంచుకుంటారు. జీవిత వాస్తవాలపై దృష్టి సారింపజేస్తారు. జీవితం తాలుకూ చేదు గుళికలను మన చేత మింగిం చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి సినిమాకారులు అందించిన వాస్తవిక చిత్రం ’కమ్లి’. ’అపూర్వ చిత్ర’ పతాకంపై హరిచరణ్ ప్రసాద్ – సుకన్య నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎన్.టి.శాస్త్రి కథ-దర్శకత్వం అందించారు. లంబాడా తండాల్లో పేదరికపు పదఘట్టన కింద నలిగిపోతున్న ఆడశిశువుల జీవితంపైకి ఆలోచనలని మరల్చారు.

కమ్లి తన ఇద్దరు బిడ్డల్ని వెంటేసుకుని ఓ ప్రభుత్వ ఆసుపత్రిని కూలగొట్టే పనికి పోతుంది. ఆసుపత్రిని సమీపించగానే ఎన్నో జ్ఞాపకాలు ముప్పిరిగొంటాయి. ఆసుపత్రిలో అదృశ్యమైన కన్నబిడ్డ కోసం తను పడిన ఆరాటం… న్యాయం కోసం జరిపిన పోరాటం…. అనీ స్ఫురణకొస్తాయి. సినిమా మొత్తమూ ఆమె జ్ఞాపకాల ప్రవాహమే. ఆ ప్రవాహంలోంచే ఆమె జీవిత కథను మన కళ్ళముందు ఆవిష్కింపచేస్తారు దర్శకులు శాస్త్రి.

కమ్లి(నందితా దాస్) -రెడ్యా(షఫి) దంపతులు హైదరాబాద్ నగరంలో దినసరి కూలీలు. బతుకు తెరువుకోసం తండా నుండి నగరానికి నెట్టబడి వలసజీవులు. మురికివాడలో నివసిస్తుంటారు. కూలి పనులు చేసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా జీవితాన్ని వెళ్ళదీస్తుంటారు.

పేదరికమూ, పురుషాధిపత్యమూ ఉన్న చోట్ల ఆడపిల్ల అవాంఛితురాలు. పేదరికం తాండవించే తండాలు ఆడబిడ్డను నిరాకరిస్తాయి. ఏదో ఒక విధంగా వధించేందుకో-వదిలించుకునేందుకో సిద్ధపడతాయి. అలాంటి తండాలో పుట్టి పెరిగిన కమ్లి తన ఇష్టాలకు భిన్నంగా తొలి చూలు ఆడబిడ్డను అమ్మేస్తుంది. మరో మారు గర్భవతి అవుతుంది. పుట్టేది ఆడబిడ్డ అయితే అమ్ముకోవచ్చని-అప్పులు తీర్చుకోవచ్చని అనుకుంటాడు ఆమె భర్త రెడ్యా. కానీ భార్య మగబిడ్డను ప్రసవిస్తుమ్ది. ఆసుపత్రిలో పనిచేసే ఒకావిడ ఆ మగబిడ్డపై కన్నేస్తుంది. కమ్లి మరుగుదొడ్లోకెళ్ళిన సందర్భంలో ఉయ్యాల్లోని మగ శిశువును చేజిక్కించుకుంటుంది. ఓ ఆడశిశువుని ఆ ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. బడ్డను కోల్పోయిన కమ్లిలో దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. ’నా బిడ్డను నా కివ్వుండ్రి’ అని బతిమాలుతుంది. ఎవ్వరూ ఆమెను పట్టించుకోరు. “ఆడపిల్లను చూస్తే ఎవరైనా ఇట్టే మాట్లాడుతారు” అంటూ ఆమె మాటల్ని కొట్టి పారేస్తారు. మగబిడ్డ మాయమయినందుకు రెడ్యా ఏ మాత్రమూ దుఃఖించడు. పైగా “ఆడపిల్లయితే ఇంకా మంచిది. పిల్లని తండాలో ఇస్తే మస్తు పైసలొస్తాయి” అంటాడు. ఇందుకు అంగీకరించని కమ్లిని తిడతాడు. కొడతాడు. తన మాట వినిపించుకోని భార్యతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోతాడు. “పాగల్ది” అంటూ కమ్లిని ఆసుపత్రి సిబ్బంది తరిమేస్తారు. కమ్లికి పుట్టని ఆడశిశువును ఆమెకు కట్టబెడ్తారు. ఈ నేపథ్యంలో ఆమె ఆసుపత్రి మెట్ల మీద పోరాటానికి దిగితుంద. భర్త తనను తిరస్కరించినా పట్టు వదలదు. పోరాటాన్ని ఆపదు. మీడియా ఆమె పోరాటానికి అండగా నిలుస్తుంది. డియన్‍ఏ టెస్టులో ఆ ఆడశిశువుకు ఆమె తల్లి కాదని తేలుతుంది. కమ్లి బిడ్డను ఆమెకు అప్పగించనట్టయితే పోలీసుల్ని పిలుస్తామంటాడు ఓ పాత్రికేయుడు. దీంతో నర్సుతో కలిసి బిడ్డను కాజేసినావిడ భయపడుతుంది. గుట్టు చప్పుడు కాకుండా బిడ్డను తిరిగిచ్చేస్తుంది. తన మగబిడ్డ తన ఒడికి చేరడంతో కమ్లి ఆనందిస్తుంది. తనకు అంటగట్టబడిన ఆడబిడ్డ ’అనాథ’ అన్న విషయం తెలుసుకుని ఆ పాపను కూడా అక్కున చేర్చుకుంటుంది. ఇద్దరు బిడ్డల్ని చేరో చంకనేసుకుని వెనుదిరగడంతో కథ సమాప్తమవుతుంది.