Menu

Ikiru ( to live )

కధగా చెప్పుకోవాల్సి వస్తే పబ్లిక్ సర్వీసు కమీషన్ లో ఒక సెక్షన్ కు చీఫ్ ఆఫీసర్ గా పని చేసే వటాంబేకు క్యాన్సర్ వచ్చి మరో ఆరు నెలల్లో మరణిస్తాడనే విషయం తెలుస్తుంది. ముప్పై సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసే వటాంబే వెనక్కి తిరిగి చూసుకొంటే తాను జీవితంలో అనుభవించింది ఏమీ కనిపించదు. ఉద్యోగానికి సంభందించిన హడావుడిలో తనకంటూ ఉన్న ఒక్కగానొక్క కొడుక్కీ, తనకీ మధ్య పెరిగిన దూరాన్ని తలచుకోని కుమిలిపోతుంటాడు. ఈ మిగిలిన కాలాన్ని ఆనందంగా గడపాలనే ఉద్దేశ్యంతో తన బ్యాంకు నుండి యాభై వేల యెన్ లు తీసుకోని బయలుదేరతాడు. ఆరోజు రాత్రి ఒక బార్ లో పరిచయమైన వర్ధమాన రచయితకు తన బాధ చెప్పుకోని ఆ డబ్బుని ఖర్చు పెట్టేందుకు సలహా అడుగుతాడు. అతను వటాంబేకు టోక్యోలోని నైట్ క్లబ్బును రుచి చూపిస్తాడు. కానీ వటాంబేకు ఏందుకో అది అంతగా రుచించదు. తర్వతా రోజు ఇంటికి వెళుతుండగా తన ఆఫీసులో పని చేసే ఒకామె కనిపించి తాను వేరే ఉద్యోగంలోకి మారిపోతున్నాననీ రిఫెరెన్సు లెటెర్ అడుగుతోంది. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండే ఆమేను తనతో నైట్ క్లబ్ కి తీసుకెళ్ళి ఆమె సంతోషాన్ని పంచుకుంటూంటాడు. ఐతే ఒక రోజు ఆమె ఎందుకు తనని ఇలా ప్రతీ రోజూ ఇబ్బంది పెడుతున్నారని అడగ్గా, తాను కొన్ని రోజుల్లో చనిపోబోతున్నానీ, అంతే కాకుండా నిత్యం సంతోషంగా గడిపే ఆమెను చూస్తే ఈర్ష్యగా కూడా ఉందనీ అంటాడు. ఆ సంతోషానికి గల కారణం ఏంటో తనకు చెప్పమంటాడు. దానికి ఆమె ఇదీ అని ప్రత్యేకంగా ఏమీ ఉండదనీ, ప్రస్తుతానికి ఐతే తానిప్పుడొక బొమ్మలు తయారు చేసే కంపెనీలో పని చేస్తున్నాననీ, తాను తయారు చేసే ప్రతీ బొమ్మలోనూ జపాన్ లోనీ ఒక చిన్నారిని చూసి ఆనందిస్తానని అంటుంది. ఒక్క నిమిషం పాటు మౌనంగా ఆలోచించిన తర్వాత తనకు కర్తవ్యబోధ అయ్యిందని భావించి, తర్వాత రోజే ఆఫీసుకి వెళ్ళి ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న ఒక మురికివాడను పార్క్ గా మార్చే పనిని మొదలుపెడతాడు. ఆ క్రమంలో ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ ఎదుర్కోని ఆ పార్కును సాధిస్తాడు. చివరికి ఆ పార్కులోనే ఉయ్యాల ఊగుతూ తనువు చాలిస్తాడు.
చూడడానికి చిన్న కధలా అనిపించినప్పటికీ కురసొవా తన అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రతీ ఫ్రేమును ఒక కళాఖండంగా చిత్రీకరించాడు. ఉదాహరణకు కొన్ని… క్యాన్సర్ రోగికి డాక్టర్లు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారో ముందుగానే వేరే క్యాన్సర్ రోగి ద్వారా చెప్పించేయడం వల్ల మామూలుగా సాగాల్సిన ఆ సన్నివేశం ఆసక్తికరంగా మారుతుంది. డాక్టర్లతోపాటు ప్రేక్షకులు కూడా మరో ఆరునెలల్లో చనిపోతానని తెలుసుకొని ఏం చేస్తాడు అనే ప్రశ్న వేసుకొంటారు. ఇదే ప్రశ్న సినిమా అంతటిని నడిపిస్తుంది కాబట్టి దానిని ముందుగానే మన మెదడుల్లోకి ఎక్కిస్తాడు కురసోవ ఇక్కడ. ఇంక భార్య చనిపోయిన తర్వాత తన కొడుక్కి ఎలా దూరమయ్యిందీ అనే విషయాన్ని చాలా సింబాలిక్ గా చూపిస్తాడు. మొదట ఫ్లాష్ బ్యాక్ లో బేస్ బాల్ లో కొడుకు ఓడినప్పుడు నిరుత్సాహపడడం, అపెండిసైడిస్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో దగ్గర ఉండమని కోరినప్పటికీ ఆఫీసు పనికై వెంపర్లాడడం, యుద్ధానికి పంపేటప్పుడు ధైర్యం చెప్పలేకపోవడం చూపడం ద్వారా తండ్రి ప్రేమను చూపడంలో విఫలమైనట్టుగా చూపించి,వెంటనే కొడుకు పడ్డ ఆ బాధను ఒకేఒక్క సన్నివేశం(కొడుకు పిలిచినప్పుడు ఎంతో ఆత్రంగ వెళ్ళబోయినవానికి, ఇంటికి తాళం వెసుందో లేదో చూడమని చెప్పడం) ద్వారా వటాంబేకు తెలియబరుస్తాడు. ఆ తర్వాత తన క్యాన్సర్ విషయం కొడుక్కి చెప్పకుండా కూడా దాస్తాడు( ఇంక వాళ్ళ మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందనే భావం వచ్చేలా). మరో సన్నివేశంలో తన శేష జీవితంలో చేయ్యాల్సిన కార్యాన్ని గుర్తించి వటాంబే మెట్లు దిగుతూ వస్తూంటే అప్పుడే పుట్టినరోజు జరుపుకోవడానికి వస్తున్న ఒక అమ్మాయికి స్నేహితులు తెలియజేసే అభినందనలు వటాంబే క్రొత్త జీవితానికి చెప్పేవిగా ఉంటాయి. సినిమా ప్రారంభంలో మురికివాడకు చెందిన కొందరు మహిళలు పార్కు కోసం అభ్యర్ధించడానికి వచ్చినప్పుడు వాళ్ళను ఒక సెక్షన్ నుండి ఇంకోదానికి పంపిస్తూ మళ్ళీ మొదటికే తీసుకురావడం చూస్తే మన భారతీయుడులోని సన్నివేశం యధాతధంగా గుర్తొస్తుంది.
ఈ సినిమా మొదటి తొంభై నిమిషాలు ఒక ఎత్తైతే మిగతా యాభై నిమిషాలు మరో రషొమొన్ ని తలపిస్తుంది. కురసోవాలోని చాకచక్యమంతా ఇక్కడే కనిపిస్తుంది. వటాంబే పార్కు నిర్మాణమే తన ధ్యేయంగా నిర్ణయించుకున్నాక కట్ చేసి అందరూ వటాంబే సంతాపానికి హాజరైన సన్నివేసంతో మొదలవుతుంది ఈ చివరి అంకం. రషొమొన్లో ఒకే సంఘటనని అనేక కధనాల ద్వారా వివరిస్తే, ఇక్కడ వటాంబే జీవితంలోని చివరి ఐదు నెలల్ని ఆఫీసులో పని చేసే సహోద్యోగులు, కుటుంబ సభ్యులు ఎలా అర్ధం చెసుకున్నారు అనే విషయాన్ని విశదీకరిస్తాడు. మొదట్లో పార్కు నిర్మాణంలో వటాంబే గొప్పదనమేమీ లేదనీ, తాను క్యాన్సర్ వల్ల చనిపోతాననే విషయం వటాంబేకు తెలీదని భావించిన వాళ్ళు తర్వాత తర్వాత మద్యం సేవిస్తూ ఎవరికి వారు చివరి రోజుల్లో వటాంబేతో గడిపిన సంఘటనలను గుర్తుచేసుకోవడం ద్వారా వటాంబే పార్కు నిర్మాణానికి ఎంతగా కష్టపడిందీ గ్రహిస్తారు. అందులోనే వటాంబేకి పేరు రావడం ఇష్టం లేనివాళ్ళు వీలైనప్పుడల్లా ఏదో ఒక లోటును ఎత్తి చూపుతుంటారు. కొడుకు మమగారు ఐతే వటాంబేకు ఆఫీసులో పనిచేసే ఆమెకు మధ్య సంబందాన్ని అపార్ధం చేసుకోంటాడు. అందులో ఒకడు ‘ మరో ఆరు నెలల్లో చనిపోతానని తెలీడంవల్లనే ఇంతచెయ్యగలిగాడనీ , ఎవ్వరైనా ఇలానే చేస్తారంటాడు ‘, దానికి సమాధానంగా మరొకడు ‘ మనం కూడా ఎప్పుడు చనిపోతామో తెలీదు కదా అలాంటప్పుడు మనమెందుకు ఇలా ప్రజల సమయాన్ని వౄధా చెయ్యడం ‘ అంటాడు. ఇంతలో ఆ పార్కుకు రాత్రిపూట కాపలా ఉండే ఒక పోలీస్ వచ్చి వటాంబే చనిపోయేముందు చాలా ఆనందంగా ఉయ్యాల ఊగుతూ తనకిష్టమైన ‘లైఫ్ ఈజ్ బ్రీఫ్ ‘ అనే పాట పాడుకున్నాడని గుర్తు చేస్తాడు. ఇదే పాటను అంతకు ముందు కూడా వటాంబే నైట్ క్లబ్ లో విషాధ స్వరంతో ఆలాపించినప్పటికీ చివరిసారి పార్కులో పాడినప్పుడు మాత్రం చాలా అహ్లాదకరంగా , తాను అనుకున్నది సాధించాననే తన్మయత్వంతో పాడినట్టుంటుంది. ఇదంతా విన్న సహోద్యోగులు వటాంబే స్ఫూర్తితో ప్రజల కోసం పని చెయ్యాలని నిర్ణయించుకొని అక్కడినుండి వెళ్ళిపొతారు. కానీ మరుసటి రోజు మళ్ళీ మామూలుగానే ప్రవర్తిస్తుండడం చూపించడం ద్వారా, మంచి పని చెయ్యాలనుకోవడానికీ చెయ్యడానికీ వున్న తేడాను ప్రస్ఫుటంగా చెబుతాడు కురసోవా. చివరిగా వటాంబే ఆత్మ బ్రిడ్జి మీదనుండి పార్కులో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఉండగా, ఖాలీ ఊయల ఊగడం చూస్తాం. ఇలా చివరికి తన జీవితానికి ఒక అర్ధం కల్పించుకుంటాడు వటాంబే. అంతా తానే అయి నటించిన తకషి షిమురా కి ఈ సినిమాలో ఎక్కువ మార్కులు పడతాయి. ఆనందాన్ని బాధను, నిరాశను, ఆశను, వ్యంగ్యానీ అద్భుతంగా పండించాడు ( రషొమొన్ లో కూడ కట్టెలు కొట్టేవాని పత్రధారి ఈయనే). ఇతను కూడా ముఫునె లానే ఇరవైకి పైగ కురసోవా సినిమాలలో దర్సనమిస్తాట్ట. ముఖ్యంగా తనను భయపెట్టడానికి వచ్చిన మాఫియా లీడర్ చంపుతానని బెదిరించినప్పుడు చూపించిన ఎక్ష్‌ప్రెషన్స్ అద్భుతం.’లైఫ్ ఈజ్ బ్రీఫ్’ ఒక్కసారైనా వినాల్సిన పాట.
కొసమెరుపు: ఈ సినిమా చూస్తుంటే మన తెలుగులో విమర్శకుల ప్రశంసలు పొందిన ఆ నలుగురుకి ఇదే స్ఫూర్తేమో అనిపిస్తుంది. అందులో కూడా ఇలానే చనిపోయిన వ్యక్తి చేసిన మంచి పనులను గురించి సంతాపానికి వచ్చిన వాళ్ళ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది కాబట్టి. ఇదేదో నేను ఆ సినిమాను తక్కువ చెయ్యడానికి అంటున్నది కాదు. ఈ విషయాన్ని తెలీజేయడం అనవసరం కాదనుకోవడం వల్ల మాత్రమే చెప్పాను.

6 Comments
  1. శిద్దారెడ్డి వెంకట్ March 16, 2008 /
  2. ప్రసాద్ సామంతపూడి March 17, 2008 /
  3. subbarao March 18, 2008 /
  4. సగటుజీవి March 27, 2008 /
  5. honeymist March 27, 2008 /
  6. Sowmya April 15, 2008 /