Menu

నేటి సమాజానికి బి.యన్. జీవిత సందేశం

bnreddi-s.jpgచలనచిత్రాలకు సామాజిక బాధ్యత ఉన్నదని గ్రహించి, తమ చలనచిత్రాల ద్వారా ప్రేక్షకుల ఉత్తమాభి రుచులను, లలితకళాసక్తిని పెంపొందించి, సంఘంలో ఉన్న దుష్టసంప్రదాయాలకు, ఆవాంఛనీయ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచిన కొద్దిమంది తెలుగు దర్శకుల్లో బి.యన్.రెడ్డి అగ్రగణ్యులు. చలనచిత్రకళ నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహత్తర ప్రచార సాధనం. చలనచిత్రం సంగీత, సాహిత్య శిల్పాది లలితకళలను కమనీయంగా మేళవింపచేసే ఆధునిక కళారూపం. అయిదేళ్ళ పిల్లలనుండి వృద్ధుల వరకు, పామరులనుండి పండితులవరకు, మనదేశంలోని అన్ని తరగతుల కుటుంబాలకు అతితక్కువ వెలతో వినోదాన్ని అందిస్తూ గత 75 సంవత్సరాలుగా చలనచిత్రాలు మన జీవితం మీద అనితర సాధ్యమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయి.

కీర్తిశేషులు రాజాజీ, ఆచార్య వినోభావే, లీలావతీ మున్షీ వంటివారు చలనచిత్రాలు అవినీతిని ప్రోత్సాహిస్తున్నాయని ఆరోపించినా మనదేశ ప్రజల జీవితం నుంచి చలనచిత్రాలను వేరు చేయలేమని అందరూ అంగీకరించక తప్పదు. రెండువైపుల పదును కలిగిన కత్తిలాగ, చలన చిత్రాలు ప్రజలను చైతన్యపర్చగలవు – చెడుత్రోవలోను నడిపించగలవు. దేవకీబోస్ నిర్మించిన ’సీత’ చలనచిత్రం ఆడిటర్ గా శిక్షణ పొందిన బి.యన్.కు చలనచిత్ర రంగంవైపు మరల్చింది. కె.వి.రెడ్డి తీసిన ’భక్త పోతన’ ను చూసి ఒక బాలుడు ముమ్మిడివరంలో బాలయోగిగా రూపొందారు. కొన్ని దుష్ట చిత్రాలను చూసి ప్రభావితం చెంది, కొంతమంది నేరప్రవృత్తికి, హింసాత్మక చర్యలకు, దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారని మనం వింటూనే ఉన్నాం. వార్తాపత్రికలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం.

మెరుగైన సమాజం ఏర్పడటానికి, చలనచిత్రాలు దోహదపడాలని బి.యన్. ఆకాంక్షించేవారు. స్వాతంత్ర్యసిద్ధికి ముందు మనదేశంలో ప్రబలిఉన్న వరకట్న సమస్య, మద్యపానం, కులమత విభేదాలు మొదలైన దురాచారాలు మన సంఘాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయని, వీటి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రబోధించిన బి.యన్ అటువంటి ఉత్తమ చిత్రాలనే – ఉదాహరణకు వందేమాతరం, సుమంగళి, దేవత మొదలైన వాటిని నిర్మించారు. మంచి కథలు దొరకటంలేదని నేటి దర్శకులు వాపోతూ వుంటారు. ఎన్నో సాంఘికసమస్యలు, ఇతివృత్తాలతో తెలుగు సాహిత్యంలో అసంఖ్యాకంగా కథలు, నవలలు ఉన్నాయి. వాటిని చలనచిత్రంగా మలచుకోవడానికి సమయం వెచ్చించి, కఠోరమైఅన్ కృషి చేయవలసి ఉంటుంది.

నేటి నిర్మాతలలో దర్శకులలో చాలామందికి ఓర్పు, పట్టుదల, చిత్తశుద్ధి, కష్టపడి పనిచేసే మనస్తత్వం అంకితభావం కనబడటం లేదు. రెడీమేడ్ ఆహారపదార్థాలు లాగ, వారికి అతివేగంతో తయారయ్యే కథలు, మాటలు, పాటలు కావాలి. స్క్రిప్టును ముందే పకడ్బందీగా తయారు చేసుకునే మంచి పద్ధతి నేటి చిత్ర పరిశ్రమలో మృగ్యమవుతున్నది. అగ్రతారలను ముందే బుక్ చేసి షూటింగ్ ప్రారంభం కాబోయేముందు కథకోసం వెతుకుతున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందు రాత్రి, హోటల్ గదిలో కూర్చుని రచయిత కథ వ్రాయటం ప్రారంభిస్తాడు. తరువాత ఏవో నాలుగుమాటలు రాసుకొచ్చి షూటింగ్ సమయానికి అందచేస్తాడు. మంచి కథానాయికల పాత్రలకు తెలుగునాట నటీమణులే కరువయినట్లు, ముంబాయి భామలను రప్పించి వారితో నగ్న దృశ్యాలను చిత్రీకరించే జాడ్యం నేటి చిత్ర పరిశ్రమకు సోకింది.

2 Comments
  1. శిద్దారెడ్డి వెంకట్ March 27, 2008 /
  2. venkat Balusupati September 5, 2008 /