Menu

భలే పాప (1971)

ఆ మధ్య ఓరోజు “భలే పాప” అన్న సినిమా వచ్చింది తేజ టీవీలో. నిజానికి, ముందుగానే చెప్పేసుకుంటున్నాను – నేను సినిమాని పూర్తిగా చూడలేదు. టీవీ ఉన్న గదిలోకి వస్తూ పోతూ చూసాను. కానీ, ఈ సినిమా గురించి రాయకుండా ఉండలేక, రాసున్నాను.

కథ విషయానికొస్తే, కె.ఆర్.విజయ, హరనాథ్ ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు. హరనాథ్ మోసగాడు, దొంగ కూడా. కె.ఆర్.విజయ ని మోసం చేసి వెళ్ళిపోతాడు. బేబీ రాణి వీళ్ళిద్దరి సంతానం. కె.ఆర్.విజయ కి ఉన్న కాస్త బంధుగణం కూడా ఆమె అలా ప్రేమించి పెళ్ళిచేసుకోడం తో ఆమెతో సంబంధాలు తెంచుకుంటారు. ఆమె దిక్కుతోచక, తన కూతుర్ని చూసుకొమ్మని నాగయ్యకి అప్పగించి నదిలో దూకేస్తుంది. నాగయ్య ఆ అమ్మాయిని వాళ్ళ బంధువుల ఇంటికి పంపిస్తాడు, ఓ ఉత్తరం తో. కానీ, ఆ బంధువులెవరూ కూడా ఆమె ని ఆదరించరు. దానితో ఆ పాప తన తల్లిదండ్రుల్ని వెదుకుతూ మద్రాసు బయలుదేరుతుంది. అక్కడ ఆమెకి ఓ గుడ్డి బిచ్చగాడు (ఎస్వీఆర్) తారసపడి వాళ్ళిద్దరి మధ్యా ఓ అనుబంధం ఏర్పడుతుంది. ఆ పాప వాళ్ళని కలుస్తుందా? చివరికి ఏమౌతుంది? అన్నది కథ.

ఇంతకీ, ఈ సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే – ప్రధానంగా నాలుగు కారణాలు:
1. బేబీ రాణి నటన
2. ఎస్వీఆర్ నటన
3. ఉన్న కాసేపూ కామెడీ పండించిన రమణారెడ్డి-చాయాదేవి, అల్లు రామలింగయ్య-రాధాకుమారి, రావికొండలరావు, ఆ పిల్లవాడు – ఈ ఆరుగురూ.
4. ఎస్వీఆర్ వాళ్ళు ఉండే కాలనీ లో ఉండే పాత్రలు (జ్యోతి లక్ష్మి, పద్మనాభం వగైరా..) ఒక్కోళ్ళూ ఒక్కో యాస భలే మాట్లాడతారు.

ఎస్వీఆర్ బిచ్చగాడిగా నటించినా కూడా అందులో రాజసం ఉంటుంది అని “పడక్కుర్చీ కబుర్లు” లో ఎమ్బీయస్ ప్రసాద్ గారు రాస్తే చదివాను. ఇక్కడ ఈ సినిమాలో కొంతవరకూ ఆ మాటల్లోని నిజం అర్థమైంది. కానీ, ఆయన ఆ సినిమాలో ప్రదర్శించిన నటన మాత్రం చూసి తీరవలసినదే. బేబీ రాణి చాలా బాగా చేసింది. ఆ పాప వయసుకి అన్ని హావభావాలు ఎలా తెప్పించారో మరి, నాకు అర్థం కాలేదు. నేను చూసినంతలో ఓ పది సీన్లలో అన్నా అనుకుని ఉంటాను – “అరే, భలే చేసిందే ఈ పిల్ల!” అని. అప్పట్లో ఆ అమ్మాయి పేరొందిన బాలనటి అని మా అమ్మ చెప్తే తెలిసింది తరువాత. ఇక పోతే, అల్లు-రాధాకుమారి మధ్య జరిగిన సంభాషణ, పాపకీ-రావికొండలరావుకీ జరిగిన సంభాషణా, తరువాత పోలీసు ఇంట్లో రాధాకుమారికీ-ఛాయాదేవికీ జరిగిన సంభాషణ – ఇవి మూడూ నాకు నచ్చిన హాస్య సంభాషణలు నాకు ఈ సినిమాలో. పాప ఉన్న ప్రతి ఫ్రేమూ నాకు ఏదో ఓ విధంగా నచ్చిందనే చెప్పాలి నిజానికి. లాటరీ టికెట్ గురించి ఎవరైనా అడగ్గానే బేబీ రాణి కళ్ళు ఒకమాదిరి తిప్పుతుంది. భలే నవ్వొచ్చింది అది చూసి.

నెగిటివ్స్, నా అనుభవం లో: అదొక మాదిరి డాన్స్ ఒకటి వేసింది జ్యోతిలక్ష్మి. మన భాష లో ఐటెమ్ సాంగ్ అనమాట. ఆమె మంచి డాన్సర్ అని అర్థమైంది కానీ, పాట చూడ్డం, వినడం కాస్త కష్టమైంది నాకు. హరనాథ్ పెద్దగా ఏమీ ప్రభావం చూపలేదు. కె.ఆర్.విజయ వయసులో పెద్దగా అనిపించింది.

ఈ సినిమా లెవెల్ గూఫులు దీనికున్నాయి. నిజానికి నాకు చాలా చోట్ల నాటకీయంగానే అనిపించింది. కాకుంటే, సినిమా మాత్రం కాలక్షేపానికి చాలా బాగుంది. నిట్ పికింగ్ మానేసి చూస్తే, మంచి టైంపాస్ సినిమా.

4 Comments
  1. Theja April 2, 2008 /
  2. రాజేంద్ర కుమార్ దేవరపల్లి April 2, 2008 /
  3. veerablogudu June 23, 2008 /