Menu

అమెరికన్ బ్యూటీలో అందమెంత ?

American Beauty Movie Posterఏఁడు – ౧౯౯౯

దేశం – అమెరికా సంయుక్త రాష్ట్రాలు

భాష – ఆంగ్లం

అమెరికన్ బ్యూటి సినిమా గుఱించి అందరూ వినేవుంటారు. చాలా మంచి సినిమా అని నేనంటే అందరూ ఒప్పుకోకపోవచ్చు. ఆస్కారు వచ్చేంత ఆస్కారం వుందా అనిపించే ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఐదు వచ్చాయి ౨౦౦౦లోఁ. ఉత్తమనటుడు, ఉత్తమదర్శకుడు, ఉత్తమ చిత్రీకరణ, ఉత్తమ సంభాషణలతో సహా ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది !!

సినిమా పేరువచ్చేసి అమెరికా అందం. అంటే ఈ సినిమాలో అమెరికా స్వప్నాన్ని ఎంతో అందంగా చూపిస్తారా? కానీ, అమెరికాలో వున్న మీ చుట్టాలెవరితోనైనా ఈ సినిమా ప్రస్తావించండి. ఈఈఈవ్.. అని వికారం వస్తున్నట్టు ముఖం పెడతారు. అమెరికా అందాన్ని నమ్మిన ప్రవాసులకు అదీ అమెరికా స్వప్నంలో ప్రగాఢవిశ్వాసం వున్నవారు అయిన వారికి ఈ సినిమా నచ్చుదు. ఐతే ఈ సినిమా చేదు నిజాన్ని తెరకెక్కిస్తుందా? దీనికి ఐదు ఆస్కార్లు వచ్చాయి. దాని అర్థం ఏంటి? సినిమా అంత బాగుంటుందా? “మీ జీవితాలు నిస్సారం” అని చెబితే దాన్ని జీర్ణించుకొని, “అవును లెస్స పలికితిరి” అని ఒప్పుకొని విశాల దృక్పదంతో అకాదమీ వారు అన్ని బహుమతులు అంటగట్టారా? మొత్తానికి ఈ సినిమా చెప్పదలచుకుంది ఏంటి, అన్న చిక్కు ప్రశ్నకు నా విశ్లేషణాత్మక తటస్థ దృక్కోణం నుండి మీకో చూపే ఈ వ్యాసం.

అప్పుడెప్పుడో కల్లికోటలోఁ

నేనూ దీన్ని ౨౦౦౦లో చూసాను థియేటర్లో మఱీను. అప్పుడు నా వయస్సు పదిహేడో, పద్దెనిమిదో. నేనూ ఇద్దరు మిత్రులూ కలసి వెళ్ళాం. అమెరికా అందాలు అంటున్నాడు, పోష్టరులోనేమో తెల్లని నడుము పై బొడ్డు ప్రక్కన ఎఱ్ఱ గులాబీ. ఇంకేంటి మస్తీ అనుకుని వెళ్లాం. మమ్మల్ని నిరాశపఱచకుండా సినిమాలో సృంగారం లేకపోలేదు. కానీ ఈ సినిమాలో నిండివున్న విషం మాత్రం ఎంత కామంతోఁ కళ్ళు మూసుకుపోయిన వాడికైనా కొట్టొచ్చేడట్టు కనిపిస్తుంది. ఛీ ఇలాంటి సినిమాకి అమెరికా అందం అని పేరు ఎందుకు పెట్టాడు. దానికి అన్ని ఆస్కార్లు రావడం ఏంటి అనుకున్నా.

కానీ నిన్న రాత్రి ఈ సినిమాని మరల చూసాను. ఈ సారి వయస్సు నాది ఇఱవై ఒకటి కన్నా కాస్త ఎక్కువ, అమెరికాలో బ్రతికి వారి జీవితాలని నిశితంగా పరిశీలించి వీలైనంత అవగాహన చేసుకొని వచ్చాను. ఇక ఈమధ్య జనాలు సినిమాలు ఎందుకు చూస్తారు ఏమి ఆశిస్తారు అన్నది కూడా బాగా అవగాహన అయ్యింది. కాబట్టి అప్పటికన్నా ఇప్పుడు ఈ సినిమా మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఏర్పడింది.

కథ

నలభై రెండేళ్ళ లెస్టర్ సగటు మధ్యతరగతి అమెరికను. భార్యా, కూతురుతో నివాసం. చాలా వఱకూ అమెరికా కుటుంబాల వలె వీరికి కూడా తమ జీవితంలో ఏదో లోపిస్తుందని ఎక్కడో తెలుసుకాని ఒప్పుకొని మార్చుకోవడానికి తగిన ధైర్యం లేదు. అలా అతి నిస్సారమైనదైనా నిస్సహజమైనది మాత్రం కాని అమెరికా జీవితం గడుపుతూంటాడు. ఇతని ఉద్యోగం చెత్త, కానీ ఇంటిపై ఋణం తీర్చాలి కాబట్టి వదలడానికి లేదు, అలానే భార్య కారోలిన్ సేల్లు ఉద్యోగం, అందులో ఆమెకు విజయం లేదు. (ఒక వేళ విజయం ఉన్నా సేల్సు వారి జీవితం చాలా నిరర్థకంగానే వుంటుంది. దానికి ఋజువు కారోలిన్ అక్రమ ప్రియుని జీవితం). కూతురు జేనీ పదో-పదకొండో తరగతి పిల్ల. భారతంలోఁ హైస్కూలు అంటే ఆప్తమిత్రులతో కాలం గడపడం, కానీ అమెరికాలో కౌమార విధ్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. అబధ్రత (insecurity) మఱియూ వ్యక్తిత్వ సంక్షోభం (identity crisis) చాలా ఎక్కువ. పైపెచ్చు జేనీ గురించి అమ్మానాన్నలు పట్టించుకుని ఏండ్లయ్యింది.

ఇక ప్రక్కింటిలోఁ, రిటైర్డు జనరల్ గారు, చండశాసనుడు, ఏ స్థాయిలోనంటే, భార్యకు మతి భ్రమిస్తుంది, కొడుకు రిక్కీకి రహస్యంగా మత్తుపదార్థాల వ్యాపారం ఉంటుంది. జనరల్ శ్వేతాధిపత్వవాది! స్వలింగ సంపర్క తీవ్ర వ్యతిరేకి!

మొత్తానికి ఒకరిని మించిన కుటుంబం ఇంకొకటి. జీవితంలో ఏ ఆశాలేని లెస్టర్ ఉనికిని కుదిపేస్తుంది కూతురు జేనీ స్నేహితురాలు ఆంజలా. ఆంజలా అందగత్తె, మాడల్ అవ్వాలని కలలు. లెస్టర్ కు ఆమెను చూడగానే వ్యామోహం కలుగుతుంది. దానికి తోడు ఆంజలా జేనీతో “మీ నాన్నే కొద్దిగా కండలు పెంచితే I would totally fuck him” అనడం లెస్టర్ కు వినిపిస్తుంది. మీలో సాంప్రదాయబద్దమైన వారికి ఈ పాటికే వికారం కలిగివుండాలి. పదిహేడేళ్ళ పిల్ల నలభై రెండేళ్లతను పైగా స్నేహితురాలి తండ్రిఁ గుఱించి ఇలా మాట్లాడుతుందని. దానికి నా సమాధానం “ఇంకా వుంది” ! దానితో స్ఫూర్తి పొందిన లెస్టరు ఉద్యోగం వదిలేసి, కండలు పెంచడం మీద పూర్తి ధ్యాస పెడతాడు. ఆంజలానే తన సర్వస్వం అనుకుంటూ. ఈ విషయం గ్రహించిన జేనీ పక్కింటి డ్రగ్ డీలర్ మఱియూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించే రిక్కీ దగ్గర ఊరట పొందుతుంది. కండలు పెంచడం ఉపకరించడానికి లెస్టర్ రిక్కీ దగ్గర మందు పదార్థాలు కొనడం మొదలు పెడతాడు. రిక్కీ తండ్రి రిక్కీకి లెస్టర్ కీ వున్న సంబంధం వ్యభిచారాత్మకమైనదని (ఇద్దరు పురుషుల మధ్య) అనుమానించి, లెస్టర్ ని చంపేటంతగా ద్వేషించడం మొదలు పెడతాడు. రిక్కీని ఇంటినుండి వెళ్లిపొమ్మంటాడు. ఈలోగా లెస్టర్ భార్య కారోలిను కూడా చేతగానివాడైన భర్తను వదిలేసి ఇళ్ళ అమ్మకం రంగంలో విజయాన్ని వరించిన బడ్డీని కామించడం మొదలుపెడుతుంది. చివరకు ఆంజెలా లెస్టర్ కు దొరకుతుంది. కానీ ఆమె కన్య అని తెలుసుకున్న క్షణం ఆమె మీద వ్యామోహం పోతుంది. ఆపై ఆమెతోఁ మాటల్లో తన ప్రస్తుతం జీవితం (సినిమా మొదటితోఁ పోల్చుకుంటే) ఎంత అందంగా వుందో అని గ్రహిస్తాడు. కానీ ఆ క్షణానే పక్కింటి మేజర్ అతనిని చంపేస్తాడు!

కథాంశం

ఈ పాటికే మీకు అర్థమయ్యుండాలి. సినిమాలో అమెరికా లేదా పాశ్చాత్య జీవితంలో వుండే అన్ని రకాల వైకృతాలూ మనకు కనిపిస్తూవుంటాయి. నాకు ౨౦౦౦లో సినిమా చూసినప్పుడు అన్ని పాత్రల మీదా విపరీతమైన చిఱాకు వేసింది. ప్రత్యేకించి లెస్టర్ గా చేసిన కెవిన్ స్పేసీ మీద. నటన అంత అద్భుతమని కూడా దాని అర్థం.

అందం

రిక్కీ అందమైన వస్తువులను కెమరాలో చిత్రీకరించే అలవాటు వున్నవాడు. అతను తన జీవితం ఎంత చెండాలంగా వున్నా, దానిని ద్వేషించడు. తండ్రి తనను హింసించినా, పిచ్చాసుపత్రిలో బంధించినా, మాదక ద్రవ్యాల వ్యాపారం వున్నా, అతను మాత్రం ఒక ఎగిరే ప్లాస్టిక్కు కవరు చూసి దాని కదలికలలోని అందం వర్ణనాతీతం అని గ్రహించిన ‘జ్ఞాని’, అదే విషయాన్ని జేనీకి చెబుతూవుంటాడు. అలానే అతను జీవితంలో అన్ని భయాలనూ అధిగమించినవాడౌతాడు. ఈ సినిమాలోని మఱపురాని సంభాషణ

It was one of those days when it’s a minute away from snowing and there’s this electricity in the air, you can almost hear it. And this bag was, like, dancing with me. Like a little kid begging me to play with it. For fifteen minutes. And that’s the day I knew there was this entire life behind things, and… this incredibly benevolent force, that wanted me to know there was no reason to be afraid, ever. Video’s a poor excuse, I know. But it helps me remember… and I need to remember… Sometimes there’s so much beauty in the world I feel like I can’t take it, like my heart’s going to cave in.

లెస్టర్ కూడా చనిపోయాక (ఆ ఆఖరి క్షణంలో తన జీవితం తన ముందు చివరిసారి కదలాడేటప్పుడు) దీన్నే గ్రహిస్తాడు.

I guess I could be pretty pissed off about what happened to me… but it’s hard to stay mad, when there’s so much beauty in the world. Sometimes I feel like I’m seeing it all at once, and it’s too much, my heart fills up like a balloon that’s about to burst… And then I remember to relax, and stop trying to hold on to it, and then it flows through me like rain and I can’t feel anything but gratitude for every single moment of my stupid little life… You have no idea what I’m talking about, I’m sure. But don’t worry… you will someday.

జీవితం ఎంత ఛండాలంగా వున్నా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు వున్నంత కాలం, బ్రతుకు జీవించదగ్గది అన్నది సినిమా సారం.

సాంకేతిక అంశాలు

సినిమా చాలా చాలా బాగుంటుంది. స్క్రిప్టుగానీ, స్కిరీను ప్లే గానీ మాః గొప్పగా వుంటాయి. ఇక నటన కూడా అత్యద్భుతం. కెవిన్ స్పేసీ ఏ సినిమాలోనైనా చీల్చిచెండాడతాడు నటన. కారోలిన గా ఆనెట్ బెనింగ్ కూడా చాలా బాగానటించింది. అన్ని పాత్రలూ చాలా అద్భుతంగా చిత్రీకరించబడ్డవి.

నిజానిజాలు

నిజంగా చాలా అమెరికా జీవితాలు ఇంతా చెండాలంగానూ వుంటాయి. కానీ దూరపు కొండల నునుపుల్నే జీవితానికి మూలస్కంధాలుగా మార్చుకున్నవారికి ఇలాంటివి ఎక్కవు. కాబట్టి సంస్కారవంతులైన ప్రవాసులుకు ఈ చలనచిత్రం నచ్చకపోవడం సర్వ సహజం. అది మన మొదటి ప్రశ్నకు సమాధానం. ఇంక రెండోది అన్ని ఆస్కార్లు ఎందుకు వచ్చాయన్నది. మనుషులకు మనుషులను కొలవడానికి కొలబద్దలు కావాలి. ఒకిరకొకరు లేబుళ్లు అతికించుకోవాలి. తరతరాలుగా చెఱగని బిరుదులు, బహుమతులు, సన్మానాలు మొదలైనవాటి యునికే దీనికి నిలువెత్తు ఋజువు. కాబట్టి సినిమాల్ని కొలవడానికి కూడా కొలబద్దలు కావాలి. అలాంటి కొలబద్దే ఈ ఆస్కార్లు. ఈ కొలబద్ద వంకరది, ఇది కొలిచేది కూడా చాలా నిమిత్తమైన ఆంగ్ల సినిమాలను మాత్రమే. కానీ అమ్ముకోలుకు అమ్ముడుపోయిన ప్రపంచంలో, అందరికంటా మాః బాగా మార్కెటింగు చేసుకున్న ఆస్కార్లే భగవద్వాక్కు. వాటికి వోట్లు వేసేది అమెరికన్లు మఱియూ ఇతర పాశ్చాత్యులు మాత్రమే. అందరి వోటర్లలానే వారికి కూడా కాకరకాయి కూరలో బెల్లంలాగా, సక్కర పూసిన సత్యమే కావాలి. ఇక్కడ సత్యం పాశ్చాత్య జీవితాల వైకృతాలు. చ౨క్కెర ఎంత ఛండాలమైన జీవితం అయినా దానిలో అందం వుంటుందన్నిది. అంటే ఈ సినిమా యొక్క సందేశం ఏంటంటే అమెరికా జనాలకి, మన జీవితాలు అతి ఛండాలం, కానీ ఏం పర్వాలేదు, జీవితంలో చాలా చాల అందం వుంది. ఎంత అందం వుందంటే తట్టుకోలేనంత అందంవుంది అని. అంతులేని ఆశకల్పిస్తుంది ఈ సినిమా.

I can’t feel anything but gratitude for every single moment of my stupid little life… You have no idea what I’m talking about, I’m sure. But don’t worry… you will someday.

అంటే ఒక రకంగా మీ జీవితాలు చాలా ఛండలంగా వున్నవి అన్నదానిని మీరు ధైర్యంగా ఎదుర్కుని మార్చుకోవలసిన అవసరం లేదని చెబుతున్నట్టు. ఇక్కడ కూడా మీలో కొందరికి మనోలంజనం అనే పదం గుర్తుకురావచ్చు. అలా చెప్పడం తప్పనట్లేదు. సినిమా అంటేనే నీరసపు జనాలకు కలలను అమ్ముకోవడం. ముఠా మేస్త్రిలో అమ్మిన కలకూ హ్యపీడేస్ లో అమ్మిన కలకూ శంకరాభరణంలో అమ్మిన కలకూ వ్యత్యాసాలు వుంటాయంతే! నిజాన్ని నిర్మొహమాటంగా చెబితే సినిమాలు హిట్లవ్వవు. ౧౫ ప్రయుతాలతో తీసిన సినిమా దానికి ఇఱవై నాలుగు రెట్లు సంపాదించేలదు.

చివరి మాట

ఈ సినిమా చాలా చాలా మంచి సినిమా అని ఇప్పటికే రెండు సార్లు అన్నాను. నేను పై ఆఖరి గద్యంలోనే దీన్ని కొంత తక్కువచేసి మాట్లాడినట్లు మీకు అనిపించవచ్చు. కానీ అది ఐదు ఆస్కార్లు రావడానికి వెనుక కారణం సినిమాలోని నాణ్యతే గాదు, ప్రేక్షకుల మనోభావాల నిత్రాణ కూడా కొంత కారణం అని చెప్పడానికే. ఈ సినిమా గుఱించి ఇంకా ఎంతో వ్రాయవచ్చు. ఎన్నో వేఱే దృక్కోణాలలోఁ. అలా ఎవరైనా వ్రాసి నవతరంగంలో వేస్తే చాలా బాగుంటుంది. అలానే మీరు నవతరంగం సభ్యులు కానప్పటికీ, మంచి ఆలోచనలను మంచి తెలుగులో వ్యాయగలిగిన వారైతే తప్పకుండా వ్రాసి నవతరఙ్‌గమ్@జీమేల్.కామ్ కి పంపగలరు.

కొసమెఱుపులు

ఈ సినిమా దర్శకుడు సామ్ మెండెస్‌కి ఇది మొదటి చిత్రం. అతని భార్య నటి కేట్ విన్స్‌లెట్. ఇతను అసలు బ్రిటీషరు, బ్రిటిష్ ఆర్మీలో కూడా పనిచేసాడు! మెండెస్ అనేది అసలు పోర్తుగీసు పేరఁట! సినిమా రచయిత అలెన్ బాల్‌కు కూడా ఇది తొలి చిత్రం. దర్శకునిలా ఇతను కూడా ఎక్కవ రంగస్థలం మీద పనిచేసేవాడట. అమెరికాలోని వోల్డ్ ట్రేడ్ సెంటర్ బయట అతనికి ఎగురుతూ కనిపించిన ప్లాస్టిక్ సంచి ఈ సినిమా స్క్రిప్టుకు దారి తీసింది ! (ఈ సినిమా తీసిన ఏఁడాదికే ట్రేడ్ సెంటర్ దుర్ఘటన జరిగింది). అలా మంచు కుఱిసేముందు గాలిలో అల్లాడుతున్న సంచి చూసి ఇంత గొప్ప సినిమా వ్రాసాడన్న విషయం చాలా మందికి అబ్బురం గొల్పినా, మీరు కూడా కళాకారుడైతే మీకు అది సర్వసహజం అనిపిస్తుంది (ఎన్నిసార్లు మీరు కిటికీలోంచి దేన్నో చూసిన్నప్పుడో లేదా నడిచి వెళ్తూ ఒక్కసారి ఆగి దేన్నో చూసో ఆహాఆ అనుకోలేదు ?)

లంకెలు

17 Comments
 1. శిద్దారెడ్డి వెంకట్ March 30, 2008 /
 2. Jonathan March 31, 2008 /
 3. Kiran March 31, 2008 /
 4. venkat March 31, 2008 /
 5. కొత్తపాళీ March 31, 2008 /
 6. Kiran April 1, 2008 /
 7. lalitha April 1, 2008 /
 8. lalitha April 2, 2008 /
 9. Kanth April 18, 2008 /
 10. KillBill February 16, 2011 /
 11. KillBill February 16, 2011 /
 12. naresh February 18, 2011 /