Menu

The man from earth (2007)

ఇది 2007 లోనే వచ్చిన సినిమా అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది ఇంకా. అంత లో-ప్రొఫైల్ గా వచ్చి వెళ్ళినట్లు ఉంది. ఇండీ ఫిలిం అంటారట ఈ సినిమా వంటి వాటిని. అదే – ఇండిపెండెంట్ ఫిలిం అని. హాలీవుడ్ స్టూడియో సిస్టం తో సంబంధం లేకుండా నిర్మించిన చిత్రాలని అలా పిలుస్తారంట.ఇవి మామూలు కమర్షియల్ చిత్రాల్లా కాకుండా కాస్త భిన్నంగా ఉండే చిత్రాలు కూడా అని చదివాను. ఇక విషయానికొస్తే, మేన్ ఫ్రం ఎర్త్ (భూమికి చెందిన మనిషి.. హీహీ) సినిమా అంతా ఒకే గదిలో నడుస్తుంది. ఆ కథా వస్తువు విని – నేను అసలు ఊహించని విషయం ఇది. కథలో అంత చరిత్ర ఉంటే, ఒకే గదిలో ఎలా చూపుతారు? అనుకున్నా. కానీ, అక్కడున్న మనుష్యుల మధ్య సంభాషణలే ఈ కథకి అన్నీనూ. కేవలం సంభాషణలతోనే కథంతా నడిపించడం (శ్రీపాద వారి కథల్లాగా), అది కూడా సినిమా లో – నాకు కాస్త కొత్తగానే ఉంది. కొన్నింటిలో హావభావాల వల్ల కూడా చాలా విషయాలు తెలుస్తాయి, కథంగా ఒకే గదిలో నడిచినా కూడా. ఈ కథాంశం అలా కాదు. దీనికి సంభాషణలే మొత్తం అంతానూ.

కథాంశం విషయానికి వస్తే, జాన్ ఓల్డ్మేన్ అనే కాలేజీ ప్రొఫెసర్ తన ఉద్యోగానికి హఠాత్తుగా రాజీనామా ఇచ్చేసి ఊరు వదిలి వెళ్ళడానికి సిద్ధపడతాడు. అతని సహోద్యోగులకి ఇదంతా ఆశ్చర్యం కలిగించి, అతని ఇంటికి వచ్చి, అతన్ని ఈ విషయమై ప్రశ్నిస్తారు. అతను తన కథ చెప్పడం మొదలుపెడతాడు – అక్కడ్నుంచి మనకు షాకులు మొదలు…కథలోని తక్కిన వాళ్ళకి కూడా. జాన్ తాను పధ్నాలుగు వేల ఏళ్ళ క్రితం భూమిపై నడిచిన క్రో-మాగ్నన్ జాతికి చెందిన మానవుడిననీ, తనకి ఏవో కారణాల వల్ల ముప్ఫై ఐదు సంవత్సరాల వయసు వచ్చాక వయసు పెరగడం ఆగిపోయిందనీ అంటాడు. అప్పట్నుంచి, పదేళ్ళకోసారి, తనకు వయసు పెరగడం లేదని తనుండే ప్రాంతం ప్రజలు గుర్తించేలోపు మకాం మారుస్తూ ఉంటానని చెబుతాడు. సారాంశం ఏమిటీ అంటే, వేల ఏళ్ళుగా అతను ఇలాగే జీవిస్తూ, తన ఉనికి ఎవరికీ తెలీకుండా చేసుకుంటూ వస్తున్నాడు అని. మొదట ఇదంతా హాస్యానికి చెబుతున్నాడు అనుకుంటారు అందరూ. కానీ, అతన్ని వేసే ప్రశ్నలు, అతని జవాబులు – అంతా చూస్తూ ఉంటే, ఓ నిముషం పూర్తిగా నమ్ముతూ, ఓ నిముషం పూర్తిగా అపనమ్మకంతోనూ – ఏది నిజమో, ఏది కల్పితమో అన్నట్లు తయారౌతుంది వాళ్ళ పరిస్థితి. స్థూలంగా ఇదీ కథ. అతని మాటల్ని నిజమని ఒప్పుకోవాలా అర్థం కాదు. కాదు అని అనడమూ అనలేము. అలా ఉంటుంది పరిస్థితి.

అయితే, సినిమా లోని విషయాన్ని సస్పెన్స్ తో మలిచిన తీరు బాగుంది. ఇక ఐపోయింది, ఏముంది లే, అనుకున్నప్పుడు చివర్లో కూడా ట్విస్ట్ వస్తుంది. సినిమా ఆద్యంతమూ ఆసక్తికరం. విషయాన్ని క్రమంగా మన బుర్రల్లోకి ఎక్కించే తీరు కూడ నచ్చింది నాకు. ముఖ్యంగా, తన సహోద్యోగులు అడిగే ప్రశ్నలకి అతను చెప్పే జవాబులు హైలైట్. ఈ చిత్రానికి రచయిత – జెరోమ్ బిక్స్‍బీ ఊహాశక్తికి జోహార్లు. అతను ఇది రాసి 1998 లో చనిపోతే, ఈ సినిమా ఇప్పుడు వచ్చిందట. దీన్ని పెద్ద వ్యాసం చేసే ఉద్దేశ్యం నాకు లేదు కానీ – ఈ కథావస్తువే ఆసక్తికరమైనది. కథనం ఇంకా ఆసక్తికరంగా ఉంది. కనుక, నేడే చూడండీ, తప్పక చూడండీ. ఈ సినిమా మాత్రం మిస్సవకండి.

9 Comments
  1. ప్రసాద్ సామంతపూడి February 20, 2008 /
  2. vijjugadu February 22, 2008 /
  3. వెంకట్ February 23, 2008 /
  4. srikanth.M October 21, 2008 /
  5. కొత్తపాళీ September 28, 2009 /
  6. Sudhakar February 20, 2010 /
  7. kiran February 20, 2010 /
  8. sudhakar February 17, 2011 /