Menu

సుమంగళి-సంప్రదాయాలపై తిరుగుబాటు

“వందేమాతరం” ఆంధ్రలో పలుకేంద్రాల్లో శతదినోత్సవాలు చేసుకుంది. ఆ విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వాహినీ బృందం వచ్చింది. వాళ్ళు ఏలూరు వెళ్ళినప్పుడు అక్కడ మాలతి అనే చిన్నది కనిపించింది.ఆమె కళ్ళల్లోని చురుకుదనం బి.యెన్.కు నచ్చింది. “సుమంగళి” సినిమాలోఆమెనుఒక నాయికగా తీసుకుని పార్వతి వేషం ఇచ్చారు.

సాంకేతికంగా చూస్తే సుమంగళి సినిమా చాలా ఉన్నతంగా కనిపిస్తుంది. ఇందుకు ముఖ్య కారకుడు రామ్‍నాథ్. ఈ సినిమాకు లైటింగ్ ఏర్పాట్ల విషయంలోఆనాటికి చాలా కొత్త పోకడలు పోయారు. “సుమంగళి” సినిమా ఇవాళ చూసినా రామ్‍నాథ్ పనితనం అబ్బురమనిపిస్తుంది. సరస్వతి తను బాల వితంతువునని తెలుసుకునే దృశ్యంరైల్లో జరుగుతుంది. మేనత్త ఆమెకు జరిగిన సంగతంతా వివరిస్తుంది. ఈ మొత్తం సన్నివేశం బ్యాక్ ప్రొజెక్షన్ పద్ధతిలో తీశారు. కిటికీలోంచి బయటి దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తూ వెడుతుంటాయి. అప్పట్లో మద్రాసులో రేర్ ప్రొజెక్షన్ సదుపాయాలు లేవు. “సుమంగళి” సినిమాలో ఈ రైలు సన్నివేశాలు చూసిన ప్రఖ్యాత దర్శకుడు వి.శాంతారం ఆశ్చర్య పోయారట. “ఎలా తీసారని తనను పదే పదే అడిగార”ని బి.యెన్. ఎప్పుడూ చెబుతుండేవారు. సరస్వతి కోసం సత్యం రైల్లో వెదికే సన్నివేశంలో రామ్‍నాథ్ మనకు ఒక ప్రయాణికుడి వేషంలో కనిపిస్తారు కూడా.

ఇక సంగీతం విషయానికి వస్తే ’ప్రేమమయమీ జీవనము….; ఆడ బ్రతుకే నధురం….’, ’బాలా…పసుపు కుంకుమ నీకు…’, ’వస్తాడే మా బావ…’ ఆనాడు అందరినీ అలరించాయి. ముఖ్యంగా ’వస్తాడె మాబావ…’ పాట ఆడపిల్లలకు ఆ రోజుల్లో ఇది బాత్రూం సాంగ్. “సుమంగళి” సినిమాలో కొన్ని పాటల బాణీలు హిందీ, బెంగాళి చిత్రాలకు నకళ్ళు కాకపోలేదు. అప్పట్లో ఈ పద్ధతి అంతటా వుండేది. బి.యెన్. కూడా దీన్ని తప్పుగానూ, చట్ట విరుద్ధం గానూ భావించేవారు కాదు.

హిందూ పత్రికను అప్పట్లో చాంధస వాద పత్రిక అనేవారు. అలాంటి ఆ పత్రికే “సుమంగళి”ని ఘనంగా ప్రశంసించింది.ఉత్తర భారతంలో తప్ప మంచి సినిమాలు రావన్న అపప్రధను ఈ సినిమా తునాతునకలు చేసిందని వ్యాఖ్యానించింది. అయితే, పత్రికలు ఇంతగా ప్రశంసించినా “సుమంగళి” సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. వాహినీవారి మూలధనాన్నంతా తుడిచిపెట్టేసింది. “సుమంగళి” సినిమాను ప్రేక్షకలు కళ్ళతో మాత్రమే చూశారు. మనసుతో చూడలేదు. విధవా పునర్వివాహం అన్నది వాళ్ళకు ఎందుకనో అంత రుచించలేదు. సినిమాలకు అప్పట్లో మహరాజ పోషకులు మధ్య తరగతి ప్రజానీకమే. వాళ్ళ మనస్తత్వానికి ఈ సినిమా సరిపడలేదు.దాంతో పరాజయం పాలైంది. విమర్శకులు మాత్రం బి.యెన్. సాహసాన్ని వేనోళ్ళ పొగిడారు. “సుమంగళి” చిత్రం తదనంతరకాలంలో ఒక క్లాసిక్‍గా నిలిచిపోయింది. ఆ తరువాత అనేక సెమినార్లలో, శిక్షణాలయాలలో, చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది.

రచన: శ్రీ పాటిబండ్ల దక్షిణామూర్తి (నవ్య వారపత్రికలో శ్రీ వి.బాబూ రావు చేసిన రచనల ఆధారంగా)

సేకరణ: “కళాత్మక దర్శకుడు-బి.యెన్.రెడ్డి’ అన్న గ్రంధంనుండి.

4 Comments
  1. కొత్తపాళీ March 2, 2008 /
  2. కొత్తపాళీ March 2, 2008 /
  3. రానారె March 2, 2008 /
  4. వెంకట్ March 3, 2008 /