Menu

సుమంగళి-సంప్రదాయాలపై తిరుగుబాటు

sum.jpgనిర్మాణం:వాహినీ ఫిలింస్

కాలం:1940

కథ,స్క్రీన్‍ప్లే,ఫోటోగ్రఫీ,ఎడిటింగ్:కె.రామ్‍నాథ్

మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య

సంగీతం:నాగయ్య

కళ,శబ్దగ్రహణం:ఎ.కె.శేఖర్

నటీనటవర్గం:నాగయ్య,గిరి,కుమారి,మాలతి

కథాసంగ్రహం:

వరకట్న దురాచారం, నిరుద్యోగ పెనుభూతాలను మొదటి సినిమాలో ఎండగట్టిన బి.యెన్.రెడ్డి తన రెండో సినిమాలో బాల్య వివాహాలను దునుమాడారు.తెలిసీతెలియని వయసులోనే వివాహమూ,వైధవ్యమూ సంప్రాప్తిస్తున్న ఆనాటి బాలవితంతువులకు మేలుకొలుపుగా ఆయన ఈ సినిమా తీశారు.స్థూలంగా ఇది త్రికోణ ప్రేమకథ. ఇక్కడ ముఖ్యపాత్రధారులు సత్యం, సరస్వతి,పార్వతి. సత్యం అభ్యుదయభావాలుగల యువకుడు. బస్తీలో చదువు పూర్తిచేసి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయి ఐ.సి.ఎస్‍.కు ఎంపిక అయ్యాడు.పోస్టింగ్ వచ్చేలోగా ఒకసారి సొంతవూరు కపిలేశ్వరం చూడాలనిపించి పల్లెకు వచ్చాడు.అతని మేనమామ కూతురు పార్వతి. ఆ పిల్లకు ఈ బావంటే పంచప్రాణాలు. చదువులేను పార్వతి అతని చుట్టూతానే తన ప్రపంచాన్ని అల్లుకుంటుంది.అయితే, ఆ పిల్లకు తెలియదు, తన బావ బస్తీలో సరస్వతి అనే యువతితో స్నేహం చేస్తున్నాడని. ఈ సరస్వతి అక్కడ గిరి సహాధ్యాయి..సత్యం అంటేఆమెకు కూడా పంచప్రాణాలు ఐశ్వరవంతురాలైన సరస్వతి బాల వితంతువు. ఈ సంగతి ఆమెకు కూడా తెలీదు. ఊహ తెలియని వయసులోనే తండ్రిఆమెకు పెళ్ళిచేస్తాడు. విధివశాత్తూ ఆ మొగుడు చనిపోతాడు.తనకు పెళ్ళయిందని కానీ, విధవరాలయినానని కానీ సరస్వతికి తెలియదు. కూతురు ఎక్కడ తట్టుకోలేదన్న భయంతోఆమెకు ఊహ తెలిసాక కూడా తండ్రిఈ విషయాలేవీ చెప్పడు.అయిత, ఒకానొక పరిస్థితిలో సరస్వతికి పాత కథంతా తెలుస్తుంది. ఆమె హృదయం బద్దలవుతుంది. అటు పార్వతికి కూడా బావను సరస్వతి ప్రేమిస్తున్నది తెలుస్తుంది. ఇద్దరూ తమ ప్రేమను అవతలివారికి త్యాగం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తారు. చివరిలో పార్వతి ప్రాణత్యాగం చేసి సత్యం, సరస్వతిలను ఒక్కటి చేస్తుంది.

నిర్మాణ విశేషాలు:

బి.యెన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా ఇది. విధవా పునర్వివాహం ఈ సినిమా కథకు మూల దినుసు. ’దయలేని సంఘానికీ, అర్థం లేని కర్మకూ దాసులై, జీవచ్ఛవాలై బతికే అభాగ్య, అనాధ హిందూ బాలికలకు ఈ “సుమంగళి” అంకితం. ఈ చిత్రం వల్ల వారి కన్నీరు ఏ మాతం ఎండినా, వారి అదృష్టం ఏ మాత్రం పండినా నిర్మాతలు తమ కృషి ఫలించినట్టు భావిస్తారు’ అని టైటిల్స్ కు ముందే నేపథ్య వ్యాఖ్యానం చెబుతారు. ఆ వ్యాఖ్యానం చెప్పింది చిత్తూరు నాగయ్య. ఇవాళంటే మనకు తెలియదు కానీ, ముఫ్ఫయ్యవ దశకాల్లో మన దేశంలో బాల్య వివాహాలు ముమ్మరంగా జరిగేవి. కాటికి కాళ్ళు చాపుకు కూచున్న ముదుసలికి ముక్కు పచ్చలారని బాలికలను ఇచ్చి వివాహం చేసే దుర్మార్గపు సంప్రదాయం వుండేది.ఆ ముసలాడు హరీమంటే ఇంతే మన ప్రాప్తం అనుకుని ఈ బాలవితంతువు జీవితమంతా ఇక అలాగే మోడులా బతకాలి. ఈ దుర్మార్గపు సంప్రదాయాలమీద ఒక్కడిగా పోరాటం సాగించిన కందుకూరి వీరేశలింగం పంతులు ఆనాడు బి.యెన్.రెడ్డిని అమితంగా ఆకట్టుకున్నారు. ఆయన ఉద్యమానికి ప్రోద్బలంగా బి.యెన్. ఈ సినిమా తీశారు. ఇందులో నాగయ్యది ఒకరకంగా వీరేశలింగం పంతులు వేషమే. పేరు కూడా పంతులు అనే పెట్టారు. ఆహార్యం కూడా ఆయన్నే పోలి వుంటుంది. నాగయ్య నిజానికి ఈ సినిమా అయిష్టంగానే చేశారు. అయితే, నాగయ్య అయిష్టంగానే చేసిన ఈ వేషం ఆయనకు అమిత పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది. ఫిల్మ్ ఇండియా పత్రికలో బాబురావు పటేల్ చేత ప్రశంసలు కురిపించేలా చేసింది.అప్పట్లో ఆయన సినిమా రివ్యూలకు దేశమంతటా కూడా చాలా గౌరవం వుండేది. నాగయ్యను ఆయన ’పాల్ ముని ఆఫ్ ఇండియా’ గా అభివర్ణించారు.

4 Comments
  1. కొత్తపాళీ March 2, 2008 /
  2. కొత్తపాళీ March 2, 2008 /
  3. రానారె March 2, 2008 /
  4. వెంకట్ March 3, 2008 /