Menu

గాన గంధర్వుడి గానవర్షం

మూడున్నరదాటి పదినిముషాలైనా బస్సు ఇంకా కదలలేదు. వేడిగానేకాదు ఉక్కగా కూడా ఉంది లోపల. ఫిబ్రవరి వచ్చింది కదా మా ఊరికి వేసవి వచ్చేసింది అనుకున్నాను. ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని ఎఫ్ఫెమ్ రేడియో వినడం మొదలుపెట్టా.

“…బాలసుబ్రహ్మణ్యం” అన్నది మాత్రం అర్ధమైంది, ఆ రేడియోజాకీ మాటల్లో. బాలుగారి గాత్రం వినబడడం మొదలైంది. సన్నగా ఏదో రాగాలాపన మొదలైంది. మనస్సులో కాస్త ఉత్సాహం కూడా. పాట మొదలయ్యేప్పటికి బస్సుకూడా కదిలింది. “ఉమండు ఘుమండు ఘన్ గర్‌జే…” అంటూ హిందీలో సాగుతోంది పాట. కాస్త ఉక్కపోత తగ్గినట్టనిపించిండంతో కళ్ళుమూసుకుని వెనక్కి వాలాను. కిటికీలోంచి వస్తున్న చల్లనిగాలితో పాటు సన్నటి చినుకులు శరీరాన్ని తాకుతున్న భావన. ఇంతలో ఎంత మార్పు! ఈ చినుకులకి తడుస్తున్నది శరీరమో మనస్సో తెలియనట్టుగా ఉంది.

మియా కీ మల్‌హర్ రాగం లో హిందుస్తానీ చీజ్ లా సాగిన ఈ పాట బాలూగారు పాడడం ఏమిటా అని నాకొక ఆశ్చర్యం. పాట వినడం అయిపోయినా, పాటలోని మాధుర్యం మనస్సుని వెంటాడుతూనే ఉంది. ఇంటికొచ్చేవరకు నాకు ఉత్సాహం ఆగలేదు. వస్తూనే గూగుల్ లో వెతికాను. గిరీష్ కర్నాడ్ నటించిన “గానయోగి పంచాక్షరి గవాయి” అన్న కన్నడ చిత్రంలోని పాట ఇది. 1995 లో విడుదలైన ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం హంసలేఖ. నేను విన్న పాటకి బాలూగారికి జాతీయస్థాయి పురస్కారం కూడా లభించింది.

మెసెంజర్ లో కనిపించిన స్నేహితుడికి వెంటనే పాటలంకె పంపి వినమన్నా. వాడు విని, ఇది మియాకీ మల్‌హర్ అంటే ఒప్పుకుంటాను కానీ, హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం అంటే ఒప్పుకోను అన్నాడు. నీది మరీ చాదస్తం అని వాడిని విసుక్కున్నా.  ఈ పాట పాడడం బాలూగారు చేసిన సాహసం అనే చెప్పాలి. శృతిప్రధానమైన హిందుస్తానీ సంగీతం తగిన సాధనలేకుండా పాడడం ఎంతటివాళ్ళకైనా కష్టమే.

మియా కీ మల్‌హర్ రాగాన్ని కనిపెట్టింది అక్బర్ కొలువులో ప్రఖ్యాత గాయకుడైన తాన్‌సేన్ అని చెప్పుకుంటారు. దీనికి సంబంధించి ఒక కధకూడా ప్రచారంలో ఉంది. ఒకసారి తాన్‌సేన్ తన మేడమీద కూర్చుని “దీపక్” రాగం ఆలపిస్తూ మైమరచిపోయి ఉండగా, వంటిలోంచి విపరీతమైన వేడిపుట్టడం మొదలైందిట. ఆ వేడిలో ఆయన కాలిపోతాడేమో అని భయపడి తాన్‌సేన్ కూతురు వర్షాన్ని కురిపించే “మల్‌హర్” రాగం పాడటం మొదలుపెట్టిందిట. ఐతే ఆ కంగారులో “మల్‌హర్” రాగంలో లేని నిషాదస్వరాన్ని కూడా పాడడంతో పుట్టిన రాగమే మియా కీ మల్‌హర్ అనీ, ఈ రాగాలాపనతో పెద్దవర్షం కురిసి తాన్‌సేన్ రక్షింపబడ్డాడనీ కధ.

ఇలాంటివాటిని కట్టుకధలని కొట్టిపారేయడానికే ఎక్కువ అవకాశం ఉందికానీ, ఇలాంటికధలే లేకపోతే మన వారసత్వ సంపదలో చాలా విలువైన భాగం కోల్పోయినట్టే అని నాకు అనిపిస్తుంది.

“గుడ్డీ” సినిమాలో వాణీ జయరాం పాడిన “బోలే రే పపీహరా” అనే ప్రఖ్యాతమైన పాట ఈ రాగంలోదే.

మియా కీ మల్‌హర్ రాగంలో మరింత శాస్త్రీయ సంగీతం ఇక్కడ వినచ్చు.

–శ్రీరాం K

14 Comments
 1. వెంకట్ February 9, 2008 /
 2. Sowmya February 9, 2008 /
 3. వికటకవి February 9, 2008 /
 4. వెంకట్ February 9, 2008 /
 5. మంజుల February 9, 2008 /
 6. వెంకట్ February 9, 2008 /
 7. కొత్తపాళీ February 10, 2008 /
 8. కొత్తపాళీ February 10, 2008 /
 9. రాజేంద్ర February 11, 2008 /
 10. వికటకవి February 16, 2008 /
 11. రాజేంద్ర February 17, 2008 /
 12. వికటకవి February 18, 2008 /
 13. sangeeth December 29, 2008 /