Menu

రాజేశ్ టచ్‍రివర్ – “అనామిక” చిత్ర దర్శకుడి పరిచయం

పేరు: రాజేష్ టచ్ రివర్
పుట్టింది పెరిగింది: కేరళ లోని ఒక గ్రామం
చదువు: త్రివేండ్రం స్కూల్ ఆఫ్ డ్రామా లో డైరక్షన్/డిజైన్ లో డిగ్రీ, జికా స్కూల్ ఆఫ్ యానిమేషన్ లో డిప్లొమా

మొదటి అడుగు: చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి కారణంగా,నా డిగ్రీ అయ్యాక సినీ రంగంలోకి నా మొదటి అడుగు వేసాను. మిత్రుల సహాయంతో ఒక లఘు చిత్రం నిర్మించి, దర్శకత్వం వహించాను. ఆ సినిమా అప్పట్లో కొన్ని అవార్డులు కూడా గెలుచుకుంది. ఈ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో నా దర్శకత్వ ప్రతిభ ను మెరుగుపరుచుకోవడానికి ఢిల్లీ లోని నేషన్ల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో కొన్నాళ్ళు పని చేసాను. అదే సమయంలో యానిమేషన్ రంగం అప్పుడప్పుడే మన దేశం లో ఊపందుకోవడం చూసి హైదరాబాదులోని జికా స్కూల్ ఆఫ్ యానిమేషన్ వారిని సంప్రదించాను. వారి సహకారంతో ఒక సంవ్త్సరం పాటు అక్కడ యానిమేషన్ నేరుకున్నాక తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలకై ప్రయత్నాలు మొదలుపెట్టాను.

తెలుగు సినీరంగం: నాకు తెలుగు సినిమా రంగం లో మొదట అవకాశం ఇచ్చిన వారు అశోక్ కుమార్. ఆయన వద్ద ఆర్ట్ డిపార్ట్మెంట్లో కొన్ని సినిమాలకు ఆర్ట్ డైరెక్షన్ లో సహాయకుడుగా పనిచేసాను. ఆ సమయంలో మాస్టర్ సినిమాకు పనిచేస్తుండగా నాగబాబు గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన సహకారంతో కొన్నాళ్ళూ తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుకుంతుండగా నాకు లండన్ లోని వింబుల్డన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో చదవడానికి స్కాలర్షిప్ లభించడంతో అక్కడికి బయల్దేరాను.

In The Name of Budhdha గురించి: లండన్ లో వుండగా రోడ్డులో తారస పడ్డ ఒక అపరిచుతుని పరిచయం In the name of Budhdha సినిమా అవకాశం నాకు కలిగించింది. ఈ సినిమా నా దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా. శ్రీలంక శరణార్ధుల జీవితాల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది. దురదృష్టవశాత్తూ ఈ సినిమా మన దేశంలో నిషేధించబడడంతో ఈ సినిమా ప్రేక్షకులకు చేరలేదు.

Ten, Alex గురించి: లండన్ నుంచి తిరిగొచ్చాక తిరిగి తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను. ఆ సమయంలోనే నలభై లక్షల్లో మూడు భాషల్లో సినిమా తీసి విడుదల లేము అన్న ఒక మిత్రుని మాటలను ఛాలెంజ్ గా తీసుకుని Ten – The Strangers సినిమా రూపొందించడం జరిగింది. ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందకపోయినప్పటికీ ఈ సినిమా వల్ల నిర్మాతలు మాత్రం నష్టపోలేదు. Ten తర్వాత నాకు వచ్చిన మరో అవకాశం Alex. ఈ సినిమా కూడా పెద్దగా ఆదరణ పొందకపోయినప్పటికీ నా పరిధుల్లో నేను ఈ సినిమాకు న్యాయం చేసాను. ఈ సినిమాలో ముఖ్య సమస్య స్క్రిప్టు. ఏ రోజుకారోజు రెండు పేజీల స్క్రిప్టు నా చేతిలో పెట్టి దర్శకత్వం చేయమన్నారు.

అనామిక గురించి: హైదరాబాదు చలనచిత్రోత్సవంలో ఈ సినిమా ద్వారా నాకీ అవార్డు రావడం ఎంతో ఆనందంగా వుంది. అనామిక నా జీవితంలో నేను చేసిన పెద్ద రిస్కీ ప్రాజెక్ట్. ముంబాయి, పూనే, కలకత్తా ల లోని రెడ్ లైట్ ఏరియాల్లో వేశ్యలను కలిసి వారి ఇంటర్వ్యూలను రహస్య కెమెరాలతో చిత్రీకరించి, వారి జీవితాలను, కష్టాలను తేరకెక్కించడమే కాకుండా, నేడు మహిళలను జంతువుల వలే హీనంగా అమ్మకానికి పెట్టి సంతలోలా అమ్ముతున్న human trafficking గురించి ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేసాను.

డాక్యుమెంతరీ చిత్రాల గురించి: నిజానికి నేను ఇప్పటికి 20 కి పైగానే డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ మధ్యనే UNICEF కోసం అమితాబ్ మొదలగు బాలీవుడ్ నటుల సహకారంతో మరికొన్ని సందేశాత్మక చిత్రాలను కూడా నిర్మించాను. నా వరకూ నేను సమాజానికి నా వంతు సేవ చెయ్యాలని తపన పడుతాను. ఉదాహరణకు నేను అలెక్స్ సినిమాలో సంపాదించిన డబ్బులన్నీ పెట్టి Sacred Face అనే డాక్యుమెంటరీ చిత్రం నిర్మించాను.

డిజిటల్ టెక్నాలజీ గురించి: నాకు సినిమాలు తీయడమే ప్రధానమైనప్పటికీ, ఖాళీ సమయాలోనూ, వీలున్నప్పుడూ డిజిటల్ టెక్నాలజీ ఉపయోగంతో సమాజానికి ఉపయోగపడే డాక్యుమెంతరీ చిత్రాలను నిర్మిస్తుంటాను. ఈ సినిమాలు NGO ల ద్వారా ఇప్పటికి చాలా మంది ప్రేక్షకుల వద్దకు చేరాయి. ఇప్పుడూ మనకు హైదరాబదు అంతర్జాతీయ చిత్రోత్సవం కూడా వుంది కాబట్టి ఇప్పుడూ డిజిటల్ టెక్నాలజీ తో తక్కువ వ్యయంతో తీసిన సినిమాలకూ ప్రేక్షకాదరణ లభించే అవకాశం వుంది కాబట్టి మరింత మంది తమ సినిమాలతో మూందుకు రావాలి.

ప్రస్తుత తెలుగు సినిమా పరిశ్రమ గురించి: తెలుగులో మంచి సినిమాలు వస్తున్నాయి కానీ ఇక్కడ వున్న ఒక పెద్ద సమస్య ఒకటే: ఇక్కడి సినీరంగ ప్రముఖులను కలవడానికి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. అదే కేరళ లో కానీ, బాలీవుడ్ లో కానీ ఒక నటున్ని కలుసుకోవడం ఇక్కడంత కష్టం కాదు. అందువల్లనే కొత్త వాళ్ళకు ఇక్కడ అవకాశాలు రావడం కష్టంగా వుంటోంది. మరో విషయమేమిటంటే తెలుగు సినిమా కథల్లో కొంచెమంటే కొంచెమైనా సామాజిక ధృక్పధం లేకుండా పోయింది. ఇక్కడ ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిగురీంచి కానీ వారి సమస్యల గురించి కానీ ప్రస్తావనకు తెచ్చే సినిమాలే లేకపోవడం ఆశ్చర్యంగానూ, బాధ గానూ వుంది. అంతెందుకు పూనే, ముంబాయి, కలకత్తా నగరాల్లోని వేశ్యా గృహాల్లో దాదాపు 50% మంది తెలుగు వాళ్ళే. వీరి గురించి ప్రస్తావించే సినిమాలెక్కడ? అలా అని అందరూ డాక్యుమెంతరీలే తియ్యమని కాదు కమర్షియల్ సినిమాల్లో కూడా ఈ సమస్యలను ప్రస్తావించవచ్చు, ఎంటర్‌టైన్ చెస్తూనే ఎద్యుకేట్ కూడా చేయ్యొచ్చు. మొన్న చిత్రోత్సవం ముగింపు కార్యక్రమంలో తేజ, పరుచూరి బ్రదర్స్ లాంటి ప్రముఖులు ఈ చిత్రోత్సవంలో చూసిన సినిమాల ద్వారా ఎంతో నేర్చుకున్నమన్నారు. కానీ వారి తదుపరి సినిమాల్లో అలాంటి ఛాయలు కనిపించినప్పుడే కొద్దో గొప్పో మార్పు రాగలదు.

తదుపరి ప్రయత్నాలు: ప్రస్తుతానికి ఒక హిందీ సినిమాకి దర్శకత్వం వహించడానికి ఆఫర్ వుంది. అలాగే మరి కొన్ని డాక్యుమెంటరీలు నిర్మించే ఆలోచన కూడా వుంది.

3 Comments
  1. Koresh March 15, 2008 /
  2. Jonathan March 19, 2008 /
  3. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 20, 2008 /