Menu

నేను విన్న మన పాటలు

గమనిక: ఈ అభిప్రాయాలు నేను నాకు తెలిసినంతలో గమనించినంతలో కలిగినవి మాత్రమే. వీటిలో పొరపాట్లు కూడా ఉండవచ్చు…బహుశా కాలం గడిచే కొద్దీ (rather, వయసయ్యే కొద్దీ) ఇక్కడన్న అభిప్రాయాలు మారొచ్చు కూడా. కనుక, ఇలా నాలుగు భాగాలు ఎలా చేస్తారు మీరు? నువ్వెవరు చెయ్యడానికి? వంటి ప్రశ్నలేస్తే జవాబులకోసం ఎదురుచూడొద్దని మనవి చేసుకుంటూన్నా. ఇక నా క్లాసిఫికేషన్ కి ప్రాతిపదిక అంటారా – నేను చూసిన సినిమాలలో పాత-కొత్త అని నేను ఎలా అర్థం చేసుకున్నానో అదే ప్రాతిపదిక.

నేను, తెలుగు సినిమా పాటల్ని (కొంత ప్రైవేటు పాటల్ని…పాతకాలం వి) నాలుగు కాలాల్లోకి విభజిస్తున్నాను.
అతిపాత – నాగయ్య సినిమాలు, సూర్యకుమారి, రావు బాలసరస్వతుల పాటలు వగైరా
పాత – ఎన్టీఆర్, ఏన్నార్ ల బ్లాక్ అండ్ వైట్ సినిమాల మొదలుకుని డెబ్భైలదాకా
కాస్త కొత్త – ఎనభైలు, తొంభైలు
కొత్త – రెండువేల సంవత్సరం దాటాక వచ్చినవి.

ఇటీవలే నాకు ఎవరో కాలేజీలోని యూసర్ పుణ్యమా అని – టంగుటూరి సూర్యకుమారి ప్రైవేట్ పాటలూ, ఎస్.రాజేశ్వరరావు ప్రైవేటు పాటలు, నాగయ్య హీరోగా వేసిన – త్యాగయ్య, భక్త రామదాసు, స్వర్గసీమ, భక్తపోతన – వంటి సినిమాల పాటలు దొరికాయి. కొంత విన్నాను … అదివరలో సూర్యకుమారి పాటలు కొన్ని నిడదవోలు మాలతి గారు చెబితే – సురస.నెట్ గురించి తెలుసుకుని, అందులో విన్నాను. నేను విన్నవన్నీ – సూర్యకుమారి గానం, బాలాంత్రపు రజనీకాంతరావు సంగీతం. అది, అక్కడ నుండే నాకు అప్పటి పాటల్నీ, ఇప్పటి పాటల్నీ పోలుస్తూ స్టడీ చేసే రోగం మొదలైంది. నాకు గుర్తు ఉంది… సూర్యకుమారి గారి పాట విన్న తేదీ – ఆగస్టు పదిహేను 2007. “మాదీ స్వతంత్ర దేశమ్…” అన్న పాట నేను విన్న మొదటి పాట. అక్కడికి ఆగితే, “పడక్కుర్చీ కబుర్లు” పుస్తకం ఒక భాగం లో ఎమ్బీయస్ ప్రసాద్ గారు – నలుగురు గాయకులు అని – నాగయ్య గారితో మొదలుపెట్టారు పరిచయాలని. నాగయ్య గారి ఆత్మకథ నేను కాస్త ఎర్లీ టీన్స్ లో ఉన్నప్పుడే చదివి ఉండటం వల్ల ఆయన గాయక ప్రతిభ గురించి కొంతవరకు బ్యాక్‍గ్రౌండ్ తెలుసు. కానీ, ఆ ఎమ్బీయస్ గారి వ్యాసం నన్ను ఎంతగా ఆకట్టుకుంది అంటే నేను నాగయ్య గారి పాటలు వెంటనే డౌన్లోడ్ చేసాను. నా క్లాసిఫికేషన్ లో ఇవి కూడా అతిపాతవే అని అర్థమైంది… ఇవన్నీ అతి పాత పాతది లో పెట్టింది ఎందుకు? అన్న ప్రశ్న వేస్తే, ఇవీ నా కారణాలు:
1. ఇవన్నీ ఒక తరహా లో, గాయనీ/గాయకుల గొంతుక ప్రధానంగా ఉంటాయి. పక్కన ఆర్కెస్ట్రా ఉండేది చాలా తక్కువ, లేకుంటే అసలే లేదు. ప్రత్యేకంగా సూర్యకుమారిగారి పాటల్లో ఐతే ఇది మరీనూ. సో, నాకు ఇవి ఎలా అనిపిస్తాయి అంటే, మన ఎరుకలో బాగా పాడేవాళ్ళు ఉంటే, వాళ్ళని పాడమని అడిగి పాడించుకుంటూ ఉంటాము కదా – అలా అన్నమాట. అలా వాళ్ళు పాడినప్పుడు నేపథ్య సంగీతం ఎవరిస్తారు? ఈ పాటలు కూడా అంతే.
2. ఈ పాటలు పాడే గొంతుకల మాడ్యులేషన్లు కూడా ఒక మాదిరిగానే అనిపించాయి. అదొక శైలి ఉన్నట్లు అనిపించింది పాటని పాడే విధానం లో. ఒక రకంగా నాటకీయంగా పాడినట్లు అనిపించింది చాలా వరకూ.
3. నేను నాగయ్యగారివి విన్నవి చూస్తే భక్తి సినిమాలవి స్వర్గసీమ తప్ప. సూర్యకుమారి గారివి చూస్తే సాంఘికం పాటలు. చాలావరకు సాహిత్యాన్ని పోల్చలేము కానీ, అప్పట్లో వాడే సాహిత్యానికీ, ఇప్పటికీ తేడా మాత్రం ఉంది.
4. పాటలు చాలావరకు స్వతంత్ర పోరాటం మీదనే ఉంటాయి సాంఘికాలైతే. పౌరాణికాల తరహా వాటిదే అనుకోండి. కానీ, పౌరాణికాల్లో కూడా, అప్పటి పౌరాణికాల పాటలకి, తరువాతి పాటలకి (ఉదా: బాపు సంపూర్ణ రామాయణం వంటివి) ఉన్న తేడా వినగానే అర్థమైపోతుంది ఎవరికన్నా.
5. ఇక కన్ఫెషన్ విషయానికొస్తే – ఈ పాటలు వినడానికి కష్టపడ్డాను. ఎందుకూ అంటే, రెండవ కారణం చూడుడు. దానివల్ల పాటలు మరీ బొత్తిగా పద్యాల్లా అనిపించాయి కొన్ని సార్లు. పైగా ఆ నేపథ్య సంగీతం కూడా అలాగే ఉంది… ఈ కాలం సంగీతం అవీ విన్నాక భూమి పుట్టినకాలం నాటివి వినడం కష్టమే! 🙂 అయినా, ఎందుకు విన్నానూ అంటే – వాటికున్న చారిత్రక విలువ ఒక కారణమైతే, ఇలా నేను అనడానికి నాకు ఆధారం కావాలి కదా… అందుకని. 🙂

తరువాతి తరం పాటలంటే, నేను ఎక్కడ మొదలుపెడతాను అంటే, యాభైల్లో వచ్చిన సినిమాలలోనే మొదలుపెట్టి, పైన చెప్పిన శైలికి విరుద్ధంగా కాస్త ఊపూ అవీ ఉన్న పాటలూ, వినసొంపుగా ఉన్న సంగీతమూ, బైటకొచ్చి హం చేసుకోవడమూ, కొన్నాళ్ళైనా పాడుకుంటూ,వింటూ ఉండే పాటలు మొదలుకుని సుమారు ఓ డెబ్భైలదాకా వచ్చిన పాటలు. ఒక విధంగా చెప్పాలంటే, ఎన్టీఆర్, ఏఎన్నార్ రాజ్యమేలిన కాలం పాటలు 🙂 సాధారణంగా నేను ఓ పాట నచ్చితే ఎవర్రాశారు? ఎవరు సంగీతం? ఎవరు పాడారు? అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తాను. కానీ, ఈ దశపాటలకి మాత్రం అవి పట్టించుకోవాలి అనిపించదు. విని విని విని … వింటూ ఉన్నా తప్పితే, చాలా పాటలకి అదే సినిమా అన్నది కూడా పట్టించుకోలేదు, సంగీత దర్శకుడు, రచయిత వంటి వివరాలన్నీ పక్కన పెడితే. ఎందుకు? అంటే, ఒక కారణమంటూ చెప్పలేను. నాకు అర్థమైనంతవరకు కారణం ఏమిటీ అంటే – ఇవి ఎప్పటివో నేను పుట్టకముందు నాటివి. ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. ఇంట్లో పెద్ద వాళ్ళు ఈ పాటల్ని హం చేసుకుంటూ ఉంటే చిన్నప్పుడంతా విన్నాను. కేసెట్లలో విన్నాను. టీవీలో చూసాను. ఇప్పుడు పీసీల్లో వింటున్నాను. అది డిఫాల్ట్ కాన్ఫిగ్ అన్న భావన వచ్చేసి ఉండొచ్చు. అందుకే దానికి సంబంధించిన లోతు వివరాలపై నాకు కుతూహలం కలగలేదేమో. దీని తరువాతి తరం నుండి వచ్చిన పాటలు అలా కాదు. ఎనభైల నుండి ఇక నాకు వర్తమానకాలంలోనే వచ్చాయి పాటలు. ఈ తేడా కారణమేమో అని నేను అనుకుంటున్నా – ఏమీ తెలీకుండానే ఈ పాటల్ని విని ఆనందించడానికి, ఆనందిస్తూ ఉండడానికి. కాస్త విభిన్నరకాలైన పాటలు రావడం ఇక్కడే మొదలైంది అనుకుంటా. కుటుంబంలో అందరిపై తీసే పాటలు, ప్రేమ గీతాలు, విరహ గీతాలు, పిల్లలతో తీసిన పాటలు – ఇలా చాలా రకాల పాటలు రావడం మొదలైంది ఇక్కడే అని అనుకోవచ్చు. పాటలన్నీ, పద్యాలకథ వదిలేస్తే, హంగులూ అవీ లేకుండా మామూలు మానవుల భాషలో, ట్యూన్లు కూడా వీలైనంత సింపుల్ గా ఉండటం వల్ల అనుకుంటా – అప్పటి పాటలు ఇప్పటికీ జనాల నోళ్ళలో నానుతున్నాయి. ఆ పాటలు అలా పాపులర్ కావడానికి వేరే కారణం కూడా చూస్తాను నేనైతే – అప్పుడు వచ్చే సినిమాల సంఖ్య ఇప్పటికంటే తక్కువ కావడం వల్ల పాటలకి జనాలల నాలుకపై స్థిర నివాసం ఏర్పరుచుకోడానికి అవకాశం ఎక్కువ ఉండిందేమో అనిపిస్తుంది నాకు.

నా క్లాసిఫికేషన్ లో మూడో రకం – ఎనభైలు, తొంభైల కాలానివి. నేను కాస్త దగ్గరగా లైవ్ చూసిన మొదటి తరం పాటలు :). ఇళయరాజా, కె.వి.మహదేవన్ వంటి వారికి విశ్వనాథ్, బాలచందర్ వంటి దర్శకులు తోడై, మంచి పాటల్ని సృష్టించిన తరం. సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రతాపం మొదలైన తరం. ఎస్పీబీ-జానకి, ఎస్పీబీ-సుశీల, ఎస్పీబీ-చిత్ర – అంటూ ఎస్పీబీ ఏ విధంగా చూసినా ఏలిన తరం. నాకు బాగా నచ్చిన పాటల్లో ఎక్కువ భాగం ఈ కోవలోకి వచ్చేవే. ఉదాహరణకి – స్వర్ణకమలం, సిరివెన్నెల, శృతిలయలు మొదలుకుని గీతాంజలి, శివ వంటి సినిమాల దాకా అన్నీ ఈ తరం లోనే వచ్చాయి. “అబ్బే…ఈ కాలం సినిమా పాటలా..” అని చప్పరించేసే ముందు ఆలోచించాల్సిన పాటలెన్నో నాకు ఈ తరంలో కనిపించాయి. ఇప్పుడవేంటి? అని ఒక్కోటీ చెప్పడం మొదలుపెడితే, నవతరంగానికి ఎన్ని పేజీలిచ్చినా సరిపోదు. ఇది మీకు నచ్చితే, ఇది ఇంట్రో వ్యాసం లా తీసుకుని నా ఎరుకలోని పాటల గురించి రాస్తాను. బాలేదంటారా… ఇక నేనేం చెప్పను ఈ విషయమై 🙂 నేను పది తెలుగు పాటలు వింటే అందులో కనీసం ఐదు పాటలు ఇందులోవే అయిఉంటాయని నా నమ్మకం.

నాలుగో రకం – ప్రస్తుతం వచ్చేవి. నా క్లాసిఫికేషన్ లో మూడోరకమే స్వర్ణయుగం. దానితో పోలిస్తే, ఇది నాకు నిరాశ కలిగించేదే. రెండో రకం ఎక్కడా నిరాశైతే కలిగించలేదు. ఇప్పటి పాటల్లో మంచివి లేవని ఎలా అనగలను? బోలెడు ఉన్నాయి. ఇంకా సిరివెన్నెల, వేటూరి రాస్తూనే ఉన్నారు. మొదటాయన ఒకరకమైన మాయ చేస్తాడు, రెండో ఆయన మరో రకం మాయ … ఇప్పుడు కూడా మంచి సంగీత దర్శకులు వస్తూనే ఉన్నారు. ఎటొచ్చీ, నా అసంతృప్తి కి, పెద్దవాళ్ళు పాటల గురించి చప్పరించడానికీ…రెంటికీ కూడా నాకొకే కారణం తోస్తుంది… అన్ని సినిమాలు వచ్చి పోతూ ఉండి, అన్ని పాటలొస్తూ ఉంటే, పాటలు జనాలకి తగులుకునే హిట్ రేట్ తక్కువేమో అని. ఇప్పటి సంగీత దర్శకులకి ముందున్న ఛాలెంజ్ తక్కిన తరాల్లోకంటే ఎక్కువేమో అని తోస్తుంది నాకైతే. కేవలం వారికే కాదు. గీత రచయితలకి కూడా వర్తిస్తుంది ఇదే విషయం. నా ఉద్దేశ్యంలో మనమేమీ మన పాటలు పాడైపోతున్నాయని దిగులుపడనక్కరలేదు అనిపిస్తుంది. పాటలు అన్ని రకాలవీ వస్తున్నాయిప్పుడు. ఆడియన్స్ రకరకాలుగా ఉన్నారు. ఒక పాట లో సాహిత్యం బాలేదనో, ఒక పాటకి సంగీతం బాలేదనో.. ఒకటి మరీ పాశ్చాత్యంగా ఉందనో…ఒకటి మరీ నాటుగా ఉందనో… ఇలా ఎన్ని అనుకుంటామో, వాటి అన్నింటికీ చెల్లు చేసే విధంగా మంచి పాటలు, మంచి సంగీతం ఉన్నవి, మంచి సాహిత్యం ఉన్నవీ వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉంటాయి కూడా. తెలుగు పాటల్లో తెలుగు వెలుగుతూనే ఉంటుంది అని నా నమ్మకం.

10 Comments
  1. వెంకట్ February 14, 2008 /
  2. KRISHNA RAO JALLIPALLI February 21, 2008 /
  3. jwalanarasimhareddy February 23, 2008 /
  4. kasyap February 29, 2008 /
  5. deepasikha March 7, 2008 /
  6. Jonathan March 7, 2008 /