Menu

కరీంనగర్ చిత్రోత్సవం – రిపోర్ట్

kar1.jpgవ్యాపార రంగానికి దూరంగా సామాజికతకు, సమ్స్యలకు అద్దంపడుతూ మానవ జీవన చిత్రాలను విలక్షణంగా ఆవిష్కరించిన 84 లఘు మరియు డాక్యుమెంటరీ సినిమాలతో కూడిన ద్వితీయ జాతీయ చిత్రోత్సవం మహానగరాలకు దూరంగా కరీంనగర్ లో నిర్వహించబడి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది, ఆలోచింపజేసింది. జాతీయవేడుకగా నిర్వహించిన ఈ చిత్రోత్సవం కొత్త దర్శకులకు వేదికగా కూడా నిలిచింది. ఉత్తమ డాక్యుమెంటరీలకు వేదికగా కరీంనగర్ ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న జాతీయ షార్ట్ మరియు డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివలకు ఇది రెండవ ఎడిషన్. గత సంవత్స్రం ఫిబ్రవరిలో ఫస్ట్ ఎడిషన్ నిర్వహించారు. నాన్ మెట్రో సిటీలో నిర్వహించిన ఈ చిత్రోత్సవంలో గోవా, ముంబాయి, అస్సాం, కొల్‍కత్తా,చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, హైదరాబాదు లాంటి మహానగరాలనుంచి శాక్యుమెంటరీ దర్శకులు తమ చిత్రాల్ని ప్రదర్శించారు. అంతే కాకుండా కరీంనగర్ జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు రూపొందించిన డాక్యుమెంటరీలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శితమయ్యాయి. ఫిబ్రవరి 13 న ప్రారంభమై ఆరు రోజులపాటు ఫిలింభవన్, ఎస్.ఆర్.ఆర్ పిజి కాలేజి, వుమెన్స్ డిగ్రీ కళాశాలల్లో నిర్వహించిన ఈ చిత్రోత్సవంలో వ్యక్తిగతంగా దర్శకులు పంపిన ఎంట్రీలతోపాటు కేరళలో జరిగే signs ఫిలింఫెస్టివల్, హైదరాబాదు అంతర్జాతీయ ఫిలింఫెస్టివల్ లో అవార్డులు అందుకున్న చిత్రాలు, చెన్నై లోని ప్రసాద్ టివి అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు నిర్మించిన చిత్రాలు ప్రత్యేక ప్యాకేజీలుగా ప్రదర్శితమయ్యాయి. ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన సిరా, బ్లూక్రాస్, ప్రముఖ నటుడు ఎల్బీ శ్రీరాం నటిమ్చిన రాళ్ళు, సందన సక్సేనా, కవితా బాల్ లు దూరదర్శన్ కోసం నిర్మించిన ’”ది హోమ్ కమింగ్” , జాకబ్ వర్గీస్ చిత్రం ఆంధియా, ఇంద్రనీల సర్కార్ “ది వర్కర్”, సుస్మితా గుప్తా “బుల్లెట్స్ అండ్ బటర్ ఫ్లైస్” , ఆర్ ఆర్ శ్రీనివాస్ నిర్మించిన “మాస్క్ ఆన్ ది ఫేస్”, బెంగాళీ నందిగ్రాం సమస్యపై ప్రమోద్ గుప్తా తీసిన “డెవలప్‍మెంట్ అట్ గన్ పాయింట్” డగ్లస్ గామా రూపొందించిన “ఎ ముస్లిం నాట్ ఎ టెర్రరిస్ట్”, మధుశ్రీదత్తా నిర్మించిన ” 7 ఐలాండ్స్ అండ్ ఏ మెట్రో” తదితర చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. లతామోహన్ దర్శకత్వంలో నిర్మితమయిన “పచ్చబొట్టు”, నరేందర్ రాజు “గెలుపు”, రాజు “విముక్తి”, చిలివేరి కిశోర్ “తలైవా౨ చిత్రాలు మంచి ప్రయత్నాలుగా మన్ననలు అందుకొన్నాయి.

ఫిబ్రవరి 13న సాయంత్రం ఫిలింసొసైటీ భవనం “ఫిలింభవన్” లో చిత్రోత్సవాన్ని ప్రారంభించిన ప్రముఖ దర్శకుడు బి.నరసింగరావు మాట్లాడూతూ ఉత్తమ విలువలు కలిగిన సినిమాల్ని ప్రదర్శించడం, ఔత్సాహికులను ప్రోత్సాహించడం గొప్ప సాంస్కృతిక బాధ్యత అన్నారు. మమ్చి సినిమాలకు, సామాజుక కోణం వున్న డాక్యుమెంటరీలకు ఫిలిం సొసైటీలు చిరుదెవ్వెలు అన్నారు. కొత్తతరం దర్శకులు కరీంనగర్ చిత్రోత్సవం లాంటి వేదికల నుంచే ఉద్భవిస్తారని అన్నారు. ముఖ్యాతిధిగా హాజరయిన జిల్లా కలెక్టర్ ఎం.వీ సత్యనారాయణ కరీంనగర్ ఫిలింసొసైటీ వెబ్సైట్ www.kafiso.org ను ప్రారంభించారు. చిత్రోత్సవం రెండవరోజు ప్రతిష్టాత్మకమైన ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో ప్రదర్శనల్ని ప్రారంభించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.విజయకుమార్ మాట్లాడుతూ మీడియా రంగం విస్తారంగా అభివృధ్ధి చెందుతున్న తరుణంలో యువతీయువకులు టివి సినిమా రంగాలపై దృష్టి సారించాల్సిన అవసరం వుందన్నారు. ఆ రోజు సాయంత్రం ఫిలింభవన్ లో జరిగిన కార్యక్రమంలో “పచ్చబొట్టు” చిత్ర దర్శకురాలు లతామోహన్, “తలైవా” దర్శకుడు చిలివేరి కిశోర్, “విముక్తి” దర్శకుడు రాజు పాల్గొన్నారు. లతా మోహన్ మాట్లాడుతూ సినిమా రంగంలోకి స్త్రీలు మంరింతగా ముందుకు రావాలని సూచించారు. తన చిత్రం పర్యావరణాన్ని ఇతివృత్తంగా చేసుకుని నిర్మించబడిందన్నారు. కిశోర్ మాట్లాడుతూ “తలైవా” హైదరబాద్ ట్యాంక్ బండ్ పైన కనిపించే హస్తాసాముద్రికుల్ని ప్రధాన పాత్ర చేసుకుని నిర్మించినట్టు చెప్పారు. బాల కార్మికుల జీవితాల పై తీసిన “విముక్తి” చిత్రం వివరాల్ని రాజు వివరించారు.

చిత్రోత్సవం మూడవ రోజు విజయవాడకు చెందిన షార్ట్ ఫిలిం “వన్‍డే” దర్శకుడు పి.ఎం సుందరరావు చిత్రప్రదర్శనల్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో దర్శకుడు సుందరరావు మాట్లాడుతూ తెలంగాణాకు చెందిన కళాకారులు సామాజిక ఆత్మీయ కోణం లోంచి సృజన చేస్తున్నారని అన్నారు. డాక్యుమెంటరీ సినిమాలు సమాజాల్ని భిన్నమైన కోణంలో, విభిన్నమయిన ద్రక్ఫధంతో ఆవిష్కరిస్తాయని పేర్కొన్నారు. కళాశాల తెలుగు విభాగం అధిపతి సాహితీవేత్త డాక్టర్ గండ్రలక్ష్మణ రావు మాట్లాడుతూ యువతీయువకులు వ్యాపార సినిమా గాలిలో పడి కొట్టుకు పోరాదని సూచించారు.

ఇలా ఆరు రోజులపాటు విజయవంతంగా సాగిన ద్వితీయ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో పలువురు సినిమా దర్శకులతో పాటు ఉత్తమ సినిమా అభిమానులు, విద్యార్థులు, ఫిలిం సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

డిజిటల్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలో యువతీయువకులు సినిమారంగంలోకి దూసుకు రావాల్సిన అవసరం వుందని ఫెస్టివల్ డైరెక్టర్ ప్రధాన నిర్వాహకుడు వారాల ఆనంద్ ఈ సందర్భంగా అన్నారు. తెలుగు సాహిత్యంలో విలక్షణమయిన స్థానాన్ని పొందిన కరీంనగర్ భవిష్యత్తులో డాక్యుమెంటరీ రంగంలో కూడా ప్రత్యేకతను చాటుతుందన్నారు. ఈ ఏడూ ముగ్గురు యువ దర్శకులు కరీంనగర్ నుంచి తమ చిత్రాలు ప్రదర్శించారని భవిష్యత్తులో ఆ సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిలింఫెస్టివల్ని పోటీ ఉత్సవంగా నిర్వహించి మరింత విస్తృత పరుస్తామని వారాల ఆనంద్ అన్నారు.

మొత్తంమీద రానున్న కాలంలో కరీంనగర్ డాక్యుమెంటరీ మరియు షార్ట్ ఫిలింస్ కు చిరునామాగా మారతుందనిపిస్తుంది.