Menu

జోధా అక్బర్-సమీక్ష

ఈ సంవత్సరంలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో జోధా అక్బర్ ఒకటి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా జోధాబాయి-అక్బర్ కాంట్రవర్శీ గురించి చెప్పుకోవాలి. అసలు జోధాభాయ్ అనే ఆవిడ అసలు లేదు అదంతా కట్టుకథ అని కొంతమంది, కాదు ఆమె వుంది కానీ ఆమె అక్బర్ భార్య కాదు కోడలు అని కొంతమంది వాదన. ఈ గొడవంతా నాకెందుకని అశుతోష్ ముందుగా సబ్-టైటిల్ వేసి అక్బర్ కి ఒక రాజపుట్ వనితతో పెళ్ళయిన మాట నిజం కానీ ఆమె పేరు చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. అలా చెప్పుకున్న కథల్లో జోధాబాయ్ అక్బర్ భార్యపేరు అని చాలా మంది సామాన్య మానవుల అభిప్రాయం. వారి దృష్టికోణంలో చెప్పిన కథే ఇది అని చెప్పి కథను మొదలుపెడ్తాడు.

కథ అందరికీ తెలిసేవుంటుంది. అక్బర్ హిందూ వనిత అయిన జోధాభాయ్ ని కొన్ని కారణాల చేత పెళ్ళిచేసుకోవాల్సి వస్తుంది. ఈ పెళ్ళి మొదట్లో జోధాభాయ్ కి ఇష్టం వుండదు. కానీ అక్బర్ గురించి కొద్దికొద్దిగ తెలుసుకుని అతనితో ప్రేమలో పడ్తుంది. అంతే కథ.

సినిమా అప్పుడప్పుడూ చరిత్రకు ఒక దృశ్యకావ్యంలా నిలిచే అవకాశాలు చాలానే వున్నాయి. కానీ ఈ సినిమాలో అలాంటి చారిత్రక సత్యాలకోసం వెళ్తే మీరు అత్యంత నిరాశ చెందడం ఖాయం. ఒక్కోసారి రొటీన్ భారతీయ కుటుంబ కథాచిత్రం చూస్తున్నామా చారిత్రాత్మక సినిమా చూస్తున్నామా అని అనుమానం కలగక మానదు.

లాగాన్ కి ఆస్కార్ నామినేషన్ ఇచ్చిన దగ్గర్నుంచీ అశుతోష్ అన్నీ అస్కార్ కి ఆస్కారముండే సినిమాలు తీయాలని అనిపిస్తుందో ఏమో కానీ ఈ సినిమా కూడా చాలా ఖర్చు పెట్టి అంతర్జాతీయ స్థాయిలో నిర్మించే ప్రయత్నం చేసాడు. మొదట్లో వచ్చే కొన్ని యుధ్ధ సన్నివేశాలు మళ్ళీ టి.విలో రామాయణం, మహాభారతం ముఖ్యంగా టిప్పుసుల్తాన్ చూసిన రోజులను గుర్తుకు తెచ్చాయి.

ఈ సినిమాకి పెద్ద సమస్య-నిడివి. నేను 7:45 కి హాల్లోకి వెళ్ళి 11:45 కి బయటపడ్డాను. పోనీ మూడున్నర గంటలపాటు ప్రేక్షకుల ఆసక్తిని తెరపై నిలపగలిగాడా అంటే అనుమానమే. అసలే కథ లేదు. దాంతో నత్త నడక సాగుతున్న కథనానికి మథ్యలో పాటలు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ లాగా.

అలా అని సినిమా అసలే బాగోలేదని కాదు.కొన్ని సన్నివేశాలు నిజంగానే చాలా బావున్నాయి.చివర్లో ఫైటింగ్ సీన్, అక్బర-జోధాల మధ్య కత్తి సాము, వారిద్దరి మధ్యా ప్రేమాయణం లాంటివి బాగా రూపొందించారు.

ప్రొడక్షన్ డిజైనింగ్ చాలా బావుంది. బాగా పరిశోధన చేసినట్టు తెలుస్తుంది. కెమెరా వర్క్ కొన్ని చోట్ల డిసప్పాయింటింగా వుంది. నేను చూసిన థియేటర్ సమస్యో ఏమో గానీ దాదాపు 90% సీన్లలో తల భాగం కట్ అయిపోయేలా వుంది షాట్ కంపోజిషన్. మిగిలిన చోట్ల సినిమాటోగ్రఫీ బావుంది.ఇలాంటి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకం కాబట్టి వాటి గురించీ చెప్పుకోవాలి. హాలీవుడ్ సినిమాల లెవల్లో భారీగా చూపించడానికి ప్రయత్నం చేసినా ఈ యుధ్ధం సీన్లు అంతగా ఏమీ ఆకటుకోలేదు. కానీ గుంపు మధ్య జరిగే పోరాటాలకంటే ఇద్దరి మధ్య జరిగే పోరాట సన్నివేశాలను బాగానే కొరియోగ్రాఫ్ చేసారనిపించింది.

ఇందాక చెప్పినట్టు ఇది ఒక కుటుంబ కథా చిత్రం. అలాగే ప్రేమ కథా చిత్రం కూడా. అప్పుడప్పుడు మాత్రమే ఈ కోవలోనుంచి దారి మళ్ళి చారిత్రక సినిమాగా అనిపిస్తుంది. సినిమా చివర్లో హీరో విలన్ ఫైట్ చేసుకుని ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం అనడం ఏదైనా కాల్పనిక కథలకు బావుంటుందేమో గానీ ఇలా అక్బర్ చరిత్రనూ తిరగరాయడం కొంచెం విపరీతమే. అదే నిజమని నమ్మిన వాళ్ళకు తీరని మోసం చేసినట్టే కదా.అలాగే సినిమా చివర్లో అక్బర్ ప్రజలతో జోధాభాయ్ నాభార్యఆవిడను ఎవరన్న పల్లెత్తి మాటన్నరో ఖబడ్దార్ అనడం కొంచెం చీప్ గా వుంది.

మొత్తానికి జోధా అక్బర్ కొన్ని విధాలా డిసప్పాయింట్‍మెంటే. కానీ హృతిక్ రోషన్, రాజ మురాద్, సొనూ సూద్ బాగా నటించారు. ఐశ్వర్యా రాయ్ కూడా బాగానే చేసింది. హృతిక్ ఐశ్వర్యా మధ్య రొమాన్స్ బావుంది. ఓవరాల్ గా యావరేజ్ సినిమా.

12 Comments
  1. రాజేంద్ర February 15, 2008 /
  2. వెంకట్ February 15, 2008 /
  3. వెంకట్ February 15, 2008 /
  4. రానారె February 16, 2008 /
  5. వెంకట్ February 16, 2008 /
  6. వెంకట్ February 22, 2008 /
  7. p. mary madiga February 29, 2008 /
  8. sunita chowdhary March 12, 2008 /
  9. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 13, 2008 /
  10. శిద్దారెడ్డి వెంకట్ March 13, 2008 /