Menu

జోధ అక్బర్ – మరో సమీక్ష

జోధ అక్బర్ చివర్లో, అంటే మూడు గంటలకుపైగా ఓపిగ్గా కూర్చున్న తర్వాతన్నమాట, అమితాబ్ కంఠం మనకి మళ్ళీ వినిపిస్తుంది, మనము చూసినది చరిత్ర పుటల్లో మరుగైపోయిన ప్రేమగాధ అని చెపుతుంది. అది వినగానే నాకు ఇంకో చిత్రంలో మూడుగంటన్నరల తర్వాత అదే గొంతు చెప్పన అలాంటి మాటలే గుర్తుకువచ్చాయి.

మీరు ఊహించినట్టే అది లగాన్ లో భువనుడి గురించి. రెంటికీ తేడా ఏమిటంటే, భువనుడి కధ ముమ్మాటికి కల్పితమని తెలుసు, అందువల్ల మనమంతా నిజానజాలు గాలికొదిలి అతడి ధైర్యం, ఔదార్యం, తెలివితేటలు, ప్రేమకలాసపము, దుష్టులపై గెలుపు కన్నార్పకుండా చూసి హాల్లోంచి తృప్తిగా బయటపడగలిగాము. మరి అక్బరుడు అలా కాదే? అయనిలో శ్రీరాముని తలపించే సహనశీలత్వము, ఏకపత్నివ్రాత్యం లాంటివి చూపిస్తే మింగుడు పడదు కదా? మొగలు సామ్రాజ్యాధిపతులలో కాస్తో కూస్తో ఇతర మతాలవారిపట్ల సహనాన్ని చూపి, ఇతరులంత కౄరత్వం చూపని వాడు అక్బరు – ఐనప్పటికీ ఈ చిత్రంలో చూపినంత విశాల దృక్పథం ఉన్నవాడు అంటే నమ్మడం కొంచెం కష్టమనిపిస్తుంది.

ఇప్పటికే జోధ అనే రాజపుత కన్య ఉన్నదా లేదా అనేది చర్చనేయాంశమై కూర్చుంది, దాని వల్ల రాజస్ధాన్ రాష్ట్రంలో థియేటర్లు చిత్రాన్ని చూపడానికి జంకుతున్నాయి కూడా. జోధతో పాటు ఈ చిత్రంలో చూపబడిన అక్బరుడికి కూడా లగాన్-భువనుడికున్నంత చరిత్ర ఉన్నది అని మనం అనుకుని చూడగలిగితే మాత్రం చిత్రంలో అబ్బురపాటు కలిగించే పలు విషయాలు మనకి కనిపిస్తాయి. చిన్న అనుకోలు, మూడు గంటల ఆనందం కోసం. ఆ మాటకొస్తే బుఱ్ఱలు జేబులో పెట్టుకుని మనం ఎన్ని చిత్రాలు చూడట్లేదని.

తరచి చూడకనే, జోధ అక్బరులో అడుగడుగునా ఎంతోమంది ఎన్నో నెలలు చేసిన కృషి, పరిశోధనల ఫలితాలు తెలుస్తూ ఉంటాయి. ఆడంబరంగా తీసినా అది సంజయ్ లీలా భంసాలి తరహా మిరుమిట్లుగొలిపే తొత్తులా అనిపించదు, దర్శకుడు ఎంతో శ్రమించి ప్రేక్షకులకి ఓ మంచి చిత్రాన్ని అందించాలని కృషిచేసాడనే అనిపిస్తుంది. దర్శకత్వ నిజాయితీ అనుకోండి.

మొత్తం మీద నాకు చిత్రంలో నచ్చని వాటికంటే నచ్చినవే ఎక్కువ ఉన్నాయి. వివరాలివిగో.

నచ్చినవి:
1.దుస్తులు, ఆభరణాలు, కోటలు, అలంకారాలు, యుధ్ధాలు (పుచ్చకాయల్లా పేలే తలలు, పిసరంత అసహజత్వం తొంగి చూసిన పోరాట సన్నివేశాలు కలుపుని కూడా) – అన్నిటికీ ఎంతో గొప్పగా చిత్రీకరించారు. కెమెరా పనితనం అమోఘం. మొదట్లో ఒక యుధ్ద సన్నివేశంలో కెమెరా వెనక్కి శరవేగంతో కదిలిపోవడం 3-డి ఎఫెక్టు తలపించింది. సాంకేతికంగా ఎక్కడా ఎత్తిచూపలేని విధంగా మలచబడిన చిత్రమిది.
2.హృతిక్ ఐశ్వర్యలు. రాజదర్పం ఎంతో అలవోకగా ప్రదర్శించిన హృతిక్ ప్రధాన పాత్రకి చాలా చాలా బాగా నప్పాడు.ఇతనికి అన్ని విధాలా సరితూగింది ఐశ్వర్య. రెండవ ధూమ్ అనబడే చెత్త సినిమాలో జంట వీరేనా అని ఆశ్చర్యం కలిగించే రీతిలో ఉంది వారి ఒద్దిక ఇందులో. గౌవారికర్ కి మూసలో పడ్డ నటులనుంచి చక్కటి నటన రాబట్టడంలో నేర్పు ఉన్నదని తెలుస్తోంది. నిన్న స్వదేశ్ లో షారుఖ్, నేడు ఐశ్వర్య.
3.సంగీతము, పాటల చిత్రీకరణ. చిత్రం మొత్తంమీద ఒక్క పాట మినహా మిగతావేవి అనవసరంగా చొప్పించినట్టు అనిపించలేదు. ఓ పాటని చక్కగా మధ్యలోంచే నేపధ్యంలోకి పంపేయడం జరిగింది. “అజీమో షాన్ షహెన్షా” పాట తెరమీద అత్యద్భుతంగా ఉంది, పాటలో కొన్ని నాట్య రీతులు ఇంకా నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. కృష్ణుడి మీద జోధ పాడే “మన్ మోహనా” పాట చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. అక్బరుకి కోపం వచ్చినప్పడు కాని, హతాశుడైనప్పుడు కాని రెహ్మాను వాడిన నేపధ్య బిట్లు చాలా బావున్నాయి.
4.మాటలు వినడానికి సొంపుగా ఉన్నాయి. నటుల ఉఛ్చారణ బావుంది. విచిత్రంగా తెలుగు చిత్రాల్లో తరచూ వినబడే వాల్లు, వాన్ని లాంటి పంటికింద రాయిలకి సమాన ఉఛ్చారణలు హింది చిత్రాల్లో ఏరేస్తారు.

నచ్చనివి
1.నిడివి: మధ్యలో కొన్ని చోట్ల బోరు కొట్టిన తరుణాలు లేకపోలేదు. అక్బరు బావమరిది షరీఫుద్దీన్ సన్నివేశాలు కొన్ని కత్తిరించినా ఫర్వాలేదనిపించింది
2.అక్బరు పాత్ర: ముందే చెప్పానుగా, రాముడు మంచి రాజు అనే విధంగా అక్బరుని చూపడం కధకి సహకరించినా నమ్మశక్యంగా లేదు. జోధ అతని ఏకైక (మరియు తొలి) ప్రేమ అనిపించే విధంగా చూపించడం, వారి ప్రేమ, అటుపై కలయిక సన్నివేశాలు – కోటలో ప్రత్యేకమైన జనాన ఉంచుకునే చక్రవర్తి తాలుకు ప్రవర్తనలుగా అనిపించవు. వారి కలయిక పాట – “ఇన్ లమ్హోంకి దామన్” కత్తిరించిస్తే నిడివి తగ్గుతుందే కానీ, ప్రేక్షకులు ఏమీ కోల్పోరనిపించింది.

అర్ధం కానిది
1. పేర్లు పడేటప్పుడు శతృఘన్ సిన్హాకి ధన్యవాదాలు అని తెలిపారు నిర్మాత దర్శకుడు – మరి చిత్రంలో ఆయన మాట, ముఖం లేక మరేవిధమైన సహాయపు దాఖలాలు నాకు కనిపించలేదు. మరి ధన్యవాదాలెందుకో?

చివరగా, నాలుగు ముక్కల్లో చెప్పాలంటే..

ఉ. ఉల్లములెల్లనుల్లసమునొందగ, (భారత దేశమందు వ
ర్థిల్లిన రాచవీరుని గురించి నిజాలను కొంత మార్చినా)
తొల్లిటి వైభవాలు, కదనోద్యమ భేరులు, వీనువిందుగా
కళ్ళు జిగేలనే విధముగా తెరకెక్కెను జోధ అక్బరై

–గిరి లంక

6 Comments
  1. వెంకట్ February 17, 2008 /
  2. Gauri February 17, 2008 /
  3. రానారె February 19, 2008 /
  4. Giri February 23, 2008 /
  5. venkat November 27, 2008 /