Menu

దేవత-కథ,కథనాల్లో వైవిధ్యం

devata-s.jpgనిర్మాణం:వాహినీ ఫిలింస్

కాలం: 1941

కథ,స్క్రీన్‍ప్లే,ఫోటోగ్రఫీ:కె.రామ్‍నాథ్

మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య

సంగీతం:నాగయ్య

కళ,శబ్దగ్రహణం:ఎ.కె.శేఖర్

ఎడిటింగ్:నారాయణన్

నటీనటవర్గం:నాగయ్య,కుమారి

కథాసంగ్రహం:

ఇంగ్లండ్ లో బారిస్టర్ చదువు పూర్తి చేసుకుని సొంతవూరు వస్తాడు వేణు . తల్లి, చెల్లెలు సీత ఆనందానికి అవధులు లేవు. లక్ష్మి వాళ్ళింట్లో పనిమనిషి. కానీ, ఇంట్లో వాళ్ళంతా ఆమెను సొంతమనిషిగానే చూస్తుంటారు.లక్ష్మి తమ్ముడు కూడా ఆమెతోటే ఆ ఇంటిలో పనిచేస్తుంటాడు. మద్రాసులో వుంటున్న వేణు మేనమామకు అతన్ని తన అల్లుడిని చేసుకోవాలని ఆశ.అతనికి ఒక్కతే కూతురు. పేరు విమల.ఆ పిల్లకు కవిత్వం, సంగీతాల పిచ్చి.సుకుమార్ అనే స్వార్థపరుడు ఆ ఇంటచేరి విమలనూ, ఆమె తండ్రినీ మెప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కులహీనురాలయినా లక్ష్మి అందం వేణును వివశుడుని చేస్తుంటుంది. ఒకరోజు తల్లీ చెల్లెలు ఇంట్లో లేని వేళ బలవంతంగా ఆమెను అనుభవిస్తాడు.ఆవేశం చల్లారాక పెళ్ళి చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు.నమ్ముతుంది లక్ష్మి. వేణు మద్రాసు వెళ్ళి బారిస్టరుగా ప్రాక్టీసు ఆరంభిస్తాడు. అతన్ని చూడడానికి తల్లీ చెల్లెలు కూడా వస్తారు. కూడా లక్ష్మి, ఆమె తమ్ముడు వస్తారు. లక్ష్మిని చూడగానే మళ్ళి వేణులో సంఘర్షణ మొదలవుతుంది. డబ్బిచ్చి ఆమెను వదిలించుకోచూస్తాడు. ఖిన్నురాలైన లక్ష్మి బాధతో తమ్ముడిని వెంటపెట్టుకుని పల్లెకు వెళ్ళిపోతుంది. అప్పటికే ఆమె గర్భవతి. తండ్రికి ఈ విషయం తెలిసి ఉగ్రుడవుతాడు. భయంతో తమ్ముడిని తీసుకుని లక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది.అక్కడ వేణు మీద వైముఖ్యం పెంచుకున్న విమల ఓ రోజు సుకుమార్ తో లేచిపోతుంది. కళ్ళు తెరిచిన వేణు తల్లికి నిజం చెబుతాడు. లక్ష్మిని అన్వేషిస్తూ తిరుగుతుంటాడు. మద్రాసు చేరిన లక్ష్మి ఒక వ్యభిచార గృహంలో ఇరుక్కోబోయి తెలివిగా తప్పించుకుంటుంది. అయితే, బిడ్డకు ఆనారోగ్యం విషమించడంతో మళ్ళి ఆ ఇంటికే వెళ్ళి యజమానురాలిని డబ్బు సాయం అడుగుతుంది. ఇంతలో అంతరాత్మ ఎదురు తిరగడంతో వెళ్ళిపోబోతుంది. అడ్డుపడిన యజమానురాలి తల పగలగొడుతుంది. వ్యభిచార గృహం నిర్వాహకురాలు తన మరణవాంగ్మూలంలో లక్ష్మి తప్పేమీ లేదని, నిజానికి ఆమె దేవత అని పోలీసులకు చెబుతుంది. లక్ష్మి విడుదలవుతుంది. వేణు, లక్ష్మి ఒకటవుతారు.

నిర్మాణ విశేషాలు:

“దేవత” సినిమా కథ ఎత్తుగడలోనే ఒక సాహసం కనిపిస్తుంది. ఇందులోకథానాయకుడు కొన్ని సందర్భాల్లో విలన్ లాగా ప్రవర్తిస్తాడు. ఒక కన్నెపిల్లను అనుభవిస్తాడు.ఆ పిల్ల పెళ్ళి కాకుండానే బిడ్డకు తల్లి అవుతుంది. అరవై ఐదేళ్ళ నాటి సినిమా ఇది. మరి ఇవన్నీ అప్పటికి చాలా సాహసోపేతమయిన అంశాలే. అందుకే ఈ సినిమాకు జనం విరగబడ్డారు. వాహినీకి పోయిన కాసులు మళ్ళీ ఈ సినిమా ద్వారా పుష్కలంగా అందాయి. “దేవత” చిత్ర కథ తయారుచేసిన రామ్‍నాథ్ మద్రాసు విశ్వవిద్యాలయం పట్టభద్రుడు. ఆంగ్ల సాహిత్యం మీద ఆయనకు అభిరుచి, పశిమ దేశాల నాటకరంగం గురించి అవగాహన వుండేవి. “దేవత” సినిమా టైటిల్స్ లో తారలను పాత్రధారులుగా మనకు పరిచయం చేస్తారు. “దేవత” సినిమాలో తారల క్లోజప్ లు కనిపిస్తాయి. ముఖ్యంగా హీరో చెల్లెలిగా వేసిన సూర్యకుమారిని ఈ సినిమాలో రామ్‍నాథ్ ఎంతో అందంగా చూపించారు. సన్నివేశాన్ని కెమెరాతో పండించడంలో రామ్‍నాథ్ చూపిన ప్రతిభ అనితరం. లక్ష్మికి అన్యాయం చేసిన వేణు పశ్చాతాపంతో తల్లికి నిజం చెప్పేందుకు వస్తాడు. అక్కడ తల్లి దేవుడి గదిలో హారతి ఇస్తుంటుంది. తప్పు చేసిన వేణు మనకు ఆ షాట్ లో చీకట్లో దోషిగా కనిపిస్తాడు. క్షమాగుణంగల తల్లి వెండి వెలుగులో దేవతల్లే మెరిసిపోతుంటుంది.

One Response
  1. మంజుల February 29, 2008 /