Menu

తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగానే వస్తున్నాయా?

ఉపోద్ఘాతోపోద్ఘాతము

దీని ముందు భాగం లానే ఈ టపా సైతం నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఇది చదివే ముందు ఆ ఒకటవ భాగాన్ని చదివితే చాలా మంచిది. తెలుగు సినిమా పరిస్థుతుల పై నేను వ్రాసిన టపద్వయంలో రెండవది ఇది. అసులు టపా వేసిన తారీఖు ౨౧-౦౯-౨౦౦౭. అప్పటికి హ్యాపీడేస్ ఇంకా వ్రాలేదు అని గుర్తు పెట్టుకోగలరు. దీనికి పొడిగింతగా ఇంతకు ముందు వ్రాయని మూడవ భాగం కూడా త్వరలో వీలును బట్టి వ్రాయ ఆలోచనలు వున్నాయి.

ఉపోద్ఘాతం
ఇది తెలుగు సినిమా పరిస్థితి శీర్షికతో వేస్తున్న టపద్వయంలో రెండవది. ఒకటే పెద్దది, వ్రాస్తే మీకు సోదనిపించవచ్చని రెండుగా విడదీయడమైనది. మొదటిది సినిమా పతనం గురించి, రెండవది, దాని పనరుత్కృష్టం గురించి మనము కనగలిగిన కలలకు కల కరాణాల గురించి వ్రాద్దామని నిశ్చయించాను. కానీ అలా చేసిన విభజనలో, నిరాశతో కూడినది ౯౦ శాతం, ఆశతో కూడినది ౧౦ శాతంగా కనిపించాయి! (దానిలో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు). అందుకే రెండు సగాలుగా విభజింజడం జరిగింది. క్రిత టపాకి తరువాయిగా దీన్ని పరిగణించగలరు.

కాపీ రాజులు
నాకు భగవంతుడు పనికిరాని ప్రజ్ఞ ఒకటి పెట్టాడు. అది ఎఁవటంటే, ఒక సినిమాని అరనిమిషం చూసినా అది దేనినుండి కాపీ కొట్టారో, లేద దేనికది కాపీనో చెప్పగలను. మొన్న ఒక రోజు ‘ఎ షాట్ ఇన్ ది డార్క్’ చూస్తుంటే, అరే ఇది చంటబ్బాయే అని అనుకున్నాను. ఇన్స్‌పెక్టర్ జాక్వస్ క్లసో ని కొట్టడం ఎవరి తరమూ కాదు, మన చంటబ్బాయి తరం అసలు కాలేదు. అప్పటి వఱకూ చంటబ్బాయి మీద చాలా అభిమానవుండేది. కానీ ఆ రోజు, సాంటా క్లాజ్ లేడని అర్థవఁయ్యింది. చంటబ్బాయి పూర్తగా కాపీకాదులెండి, అందులోని చాలా మంచి భాగాలు మాత్రమే కాపీలు. మిగిలిన మెలోడ్రామా అంతా, మన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రచించిన ఒక నవల మీద ఆధారం. నానా రకాలు కలిపితే కుడిత తయారైనట్టు, రెండు మూడు సినిమాలు కలిపి ఒక తెలుగు సినిమా తియ్యడంచాలా సార్లు జరుగుతుంది. అలాంటిదే ఇంకో ప్రయోగం ‘మైఁ హూఁ నా’ కి ‘ది డిపార్టెడ్’ కలిపితే వచ్చిన కషాయం ‘ఖతర్నాక్’.

మీకో మలయాళీ మిత్రుడుంటే అడగండి, మలయాళంలో అతి మంచి సినిమా ఏదని? చాలా మంది ‘మణిచ్చిత్రత్తాೞು’ అనే చెబుతారు. దాన్ని తెలగుతమిళాల్లో ‘చంద్రముఖి’గా తీసి కంపుచేయడం జరిగింది. అసలు సినిమాలో మోహన్ లాల్ సినిమా సగంలో వస్తాడు, (రజనీలా ముందు వచ్చి మళ్ళీ వెళ్ళడం వుండదు). ఇప్పుడు అదే సినిమాని హిందీలో తీస్తున్నారు. అన్ని హిందీ సినిమాల్లోలాగ ఇందులో కూడా అక్షయకుమారు, విద్యాబాలన్ నటిస్తున్నారు. సినిమా పేరు ‘బూలుబులయ్యా’. నాకు మామూలుగా సినిమా ప్రకటన చూస్తేనే అది దేని కాపీనో అర్థమవుతుంది, కానీ ఈసారి అలా జరగలేదు. దానికి కారణం. “హరే రాం, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే రాం” అనే పాట వుంది ఆ సినిమాలో. అందులో, నిక్కర్లేసుకున్న ఫారిన్ అమ్మయుల వెనుక భాగం తూగుతూ చూపించబడినది. సినిమా కథకీ, సినిమా లోగోగా వాడుతున్న ఆంగ్ల భూతం బొమ్మకీ, పాటలో భగవన్నామ స్మరణకీ, మారుతున్న దుస్తులకీ, ఆ అమ్మాయిల వెనుకలకూ గల సంబంధం నాకు గోచరించలేదు.

కాపీ కొడితే తప్పేంటి ?
అందరూ అడిగే ప్రశ్న “కాపీ కొడితే తప్పేంటి? ఆఖరున సినిమా బాగుంటే” అని. చాలా తప్పులున్నాయి.
గమనికః హక్కులు కొని సినిమాని తీయ్యడం కాపీకాదు.

నైతికంగా
సినిమాలో కాపీ అనేది సంఘంలో కాపీకి ఒక నిదర్శనం మాత్రమే. ఈవాళ ఆంధ్ర దేశం నైతికంగా ఎంత దిగజారిపోయిందో, తెలియాలంటే, పెద్ద పెద్ద రెసిడెన్షియల్ స్కూళ్లలో, పదో తరగతి పరీక్షల కిచ్చే శిక్షణ గురించి తెలుసుకోండి. కాపీ కొట్టమని చెప్పి మరీ పంపుతారు పిల్లల్ని. అలా ఆఖరుకి ఎవరైతే వ్యవస్థని వంచి, పెడదారి వెంట పిల్లలందరినీ పాస్ చెయిస్తారో వారే ఘనులు. అలా పాసైనోళ్లు, రేపు దొంగ రెస్యూమేలతో అమెరికా ఉద్యోగ వ్యవస్థపై పడతారు, వారే కలక్టర్లు, వారే కాంట్రాక్టర్లు, వారే రాజకీయవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, ఇంక చెప్పేదేఁవుంది ?
బొట్టూ బొట్టూ కలిస్తే వరదౌతుంది, ఆ వరదలో దేశం మునకెత్తుతుంది.
మన కంపు ప్రపంచమంతా ప్రసరిస్తుంది.

సృజనాత్మకత పరంగా
మన సృజనాత్మకత నుండి జనించిన కళ మనకు మనోరంజనం మాత్రమే కాదు. అది మర్త్యులైన మనము మన భావి తరాలకందించే సంపద. ప్రస్తుతము మన భావితరాలకి “మన ముందు తరాలవారు చేతగాక, ఇతర భాషలనుండి కాపీకొట్టి, మన సంఘానికి దర్పణం పట్టని సినిమాలు తీసార”నే భావం కలిగిస్తున్నాం. అది మీకు సమ్మతవైఁతే “అదృష్టవంతులు మీరు, వడ్డించిన విస్తరి మీ జీవితం”.

సంఘానికీ సినీ దర్పణవేఁది
ఈ విషయ ప్రస్తావన మొదటి భాగంలో కూడా జరిగింది. నేటి సమాజంలో జరిగే రీతిలో ఒక్క విషయాన్ని కూడా తెరకెక్కించరు.
సంఘంలో చోటు చేసుకునే మార్పులు, విస్తరించిన అన్యాయాలు, వ్యాపించిన వ్యత్యాసాలు, బురదలోని పందుల మధ్య వికసించిన పుండరీకములు, సాధారణ జీవన అసాధారణందాలు, ధైర్యవంతుల అపజయాలు, మోసగాళ్ల అంతశ్శూన్యాలు. ఇలా ఎన్నింటి మీదైనా తీయవచ్చు. అవేవి లేవు.

కనీసం నిజ జీవితం లో జరుగు విధంగా ‘మామూలు మనుషులు ధైర్యం వహించి, చివరకి ఏ ప్రయోజనం లేకుండ మట్టి కఱచిన వైనం’ వంటివి కూడా సినిమాలలో లేవు. అలాంటివి తీసినా చూసే వారు లేరు. ఏ కేరళలోనో తప్ప. అక్కడంతా చదువుకున్నవారు కాబట్టి, నిజాన్ని తెరమీద చూడగలరు. తెరమీద నిజాన్ని చూపనపుడు వారు పసిగట్టగలరు.
ఇది మన తెలుగు సినిమా తప్పుకాదు. సంఘం మారే కొద్ది ఇవి కూడా మారతాయి.

మన గొప్ప సంస్కృతినీ, పురాణాలనీ వాడుకుని సినిమాలు తీయడం చేతకావట్లేదు. ఏ మైథాలజీ లేని పాశ్చాత్యులు మాత్రమ పైరేట్స్, హ్యారీ పాటర్ వంటివి విరివిగా తీసేస్తున్నారు.

ఏ లోకాలలో ఉంది కళా
తెలుగునాట ఏకైక కళన్నారు సినిమా. దేనిలోనైనా ఒక్కటి మాత్రమే మిగిలి ఉండండం వల్ల వచ్చే సమస్యేమిటంటే, కొంత సేపటికి ఏమీ లేకుండా పోతాయి!
సమాజంలో వెలసిన కళంటే, ఎవరో కొందరు ఒక నగరంలో కూర్చుని విరచించేది, రాష్టమంతటా దాన్ని చూచి ఆనందించేదీ కాదు. కళంటే, నిత్యజీవితంలో అందరూ పాలుపంచుకునేది. కళ జీవన విధానం. డబ్బు విలువకు సమాజంలో నిలకడైన అభిప్రాయవేఁర్పడినప్పుడు, నిజానందాల వేట ఫలించగా దొరకిన అమృత భక్షణం.
లాటినమెరికాలో అందరూ ఆడే సాంబాసాల్సాలు, హార్లెంలో హిప్‌హాప్, న్యూయార్లెన్సులో జాజ్, మనూళ్ళలో కోలాటం, జపానులో హైకూ పద్యాలు, పాకిస్థానులో షాయరీలు, వియన్నాలో పిల్లవాడు లెక్కలతోబాటు నేర్చుకునే పియానో, కొరియాకెనడాలలోఅమ్మయిలు నేర్చుకునే ఫిగరు స్కేటింగు, ఇంగ్లాండులో యుద్ధయోదులు సైతం నేరిచిన వాల్‌ట్సు!
కళ కనులముందాడేది కాదు. మన మనసులో విరిసేది. ఆగష్టు పదిహేనున టీవీలో చూసే ప్రోగ్రాం కాదు, సంక్రాంతికి వూరి పడుచులు పెట్టే ముగ్గు.

అన్ని సినిమాలూ, కొన్ని సినిమాలు

సమరసింహారెడ్డి
మంచి సినిమా, దీనితో నిర్మాతలకు, ప్రేక్షకాభిరుచుల విశ్వరూప దర్శనవైఁయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ వచ్చిన ప్రతి తెలుగు సినిమాలోనూ దీని ప్రభావం కనబడుతూనే వుంది. ప్రక్షకులకు తమలోని నీచత్వం సంఘమనే అద్దంలో కనిపిస్తున్నది. దానిపై కలిగిన అసహ్యాన్ని హింసతో దులుపేసుకునే ఒక సదుపాయం చూపించిందీ సినిమా. ప్రతి కథానాయకుడు ఈ కథతో ఒక సినిమానైనా తీసాడు. నరసింహ నాయిడు, ఇంద్ర, సింహాద్రి, మాస్, లక్షీ, పోకిరీ… చిన్న చిన్న బదలాయింపులతో (సీమకక్ష్యల బదులు మాఫియా, రాయలసీమ బదులు విశాఖపట్నం).

నువ్వే కావాలి, ఖుషీ
ఈ రెండూ తెలుగు నాట కొత్తగా వచ్చిన ‘ప్రేమకీ, అన్నాచెల్లెల్ల సంబంధానికి మధ్య తూగే స్నేహ’మనే కొత్త అంశంమీద తీయబడ్డ సినిమాలు. అప్పట్నుంచి, వేలాది సినిమాలు వీటినుండి స్ఫూర్తి పొందాయి. ఇప్పటికీ కొత్త సినిమాలు, నిజజీవిత యువత యొక్క అంతర్లైంగిక సంబంధాలలోని వైవిధ్యాల కన్నా ఈ రెంటి సినిమాలనుండే ఎక్కువ ‘స్ఫూర్తి’ పొందుతున్నారు. చిత్రవేఁవిటంటే, ఒకటి మలయాళం నుండి, ఇంకొకటి తమిళం నుండి తీసుకోబడ్డాయి (అది తప్పేంకాదు). ఈ సినిమాలలో తెలుగు విశ్వవిద్యాలయ పంతుళ్లకు సరికొత్త అవతారమివ్వబడినది. విద్యాభ్యాసానికో కొత్త నిర్వచనం ఇవ్వబడినది.

పై రెండిటి ఛాయలూ లేని తెలుగు సినిమా ఈవాళ చాలా అరుదు.

ఇక సూపరు డైరెక్టరు శంకర్ సినిమాలు చూస్తే. జెంటిల్‌మాన్‌కి, శివాజీకి తేడా పెద్దగా ఎఁవ్ లేదు. ఆమాట కొస్తే రామాయణానికీ, శంకర్ సినిమాలైన భారతీయుడు, ఒకేఒక్కడు, అపరిచితుడు వంటివాటికీ పెద్ద తేడా లేదు. అదే ప్రజ, అదే అసుర (రావణుడి బదులు అవినీతి), అదే యుగపురుషుఁడు (రాముని బదులు రజినీ), అదే పూజించే ఆచారం. అమెరికా వ్యక్తిత్వవాదానికి, రష్యా సమానవాదం విరుద్ధం అంటారు. కానీ అవి రెండూ ఒకటే, వాటికి విరుద్ధం, తమలోని రాముని చూడలేని, నేటి భారతీయం. భౌతికవాదానికి, మిథ్యావాదానికీ మన జవాబు సంతృప్తివాదం, సర్దుకుపోదాం.

హ్యాపీ డేస్ నిజంగా వస్తున్నాయా ?
ఆఖరుగా చెప్పుకోదగ్గవి, బొమ్మరిల్లూ, శేఖర్ కమ్ముల.

బొమ్మరిల్లు
నేటి యువత యొక్క మారుతున్న ఆలోచనావిధానం మీద ఆధారపడిన మంచి సినిమా. మొదటి సగం మాత్రం, నేటి తెలుగు సినిమా భుజంగకోరలలో చిక్కుకున్న మూషికమే. అదే వెకిలి కాలేజీ హాస్యం, అదే ఉపాధ్యాయలపై హాస్యం. కాని రెండవ భాగం మాత్రం తెలుగు సినిమా చరిత్ర మొత్తం ఇప్పటి వఱకూ నడిచిన దారిలో వేసిన ఓ ముందడుగు. రేపటి సినిమాలకో దిక్సూచి.

కమ్ముల
తెలుగు సినిమాలో ఎన్నడూ లేని (కనీసం ఈమధ్య కాలంలో), “attention to detail” ని ప్రవేశ పట్టారు. బొమ్మరిల్లు తెలుగు సినిమా నడిచిన బాటలో ముందడుగైతే. ఇది తెలగు సినిమాలకే కొత్త తరం. నాటకాల నుండి సినిమాకి లభించబోయే పూర్తి విముక్తి!

బొమ్మరిల్లు కథా గోదావరి (అదృష్టఁవుంటే హ్యాపీడేస్) కథనం కలిసినపుడు, తెలుగు నాట మంచి సాంఘిక సినిమా అవతరిస్తుంది. కాని చిక్కేవిఁటంటే, వీటిని కాపీ కొట్టలేం. కానీ అయ్యో మన వారికొచ్చిందదొకటేగా !

ఇక హారీ పోటర్, పైరేట్స్ అఫ్ కరీబీయన్ లాంటి సినిమాలు తెలుగునాట తీయ్యాలంటే, దానికోసం, ఇంకో యాభై ఏళ్ల తరువాత ఏ శైలేశ్వరో, దినేశ్వరో వారి బ్లాగులో వేసే టాపా, ‘తెలుగు సినిమా దుస్థితి’ (౧౦భాగలలో ౭వది) చూడండి.

(సినిమా అనే అంశం మీద నన్నో పుస్తకం వ్రాయమన్నా వ్రాయగలను, ఆ విషయానికొస్తే ఏ సాంఘిక అంశం మీదనైనా! కాని మాటలతో ఎఁవౌతుంది లోకంలో?)

కొన్ని ప్రతిసూచనలు

౧) నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు – కాలిపు కూర్మావతారం
౨) Interactivity in Art – కిరణ్ వారణాశి
౩) సంతోషం-మున్నాభాయ్-పోకిరి – వెంకట్ సిద్దరెడ్డి
౪) రీమేక్ సినిమాలు – కృష్ రేం

16 Comments
 1. వెంకట్ February 18, 2008 /
 2. sathish February 19, 2008 /
 3. sathish February 19, 2008 /
 4. kalhara February 21, 2008 /
 5. sathish February 21, 2008 /
 6. sathish February 21, 2008 /
 7. kakarla March 3, 2008 /
 8. వెంకట్ March 3, 2008 /
 9. KAMALAKAR March 12, 2008 /
 10. చక్రి March 21, 2008 /
 11. మంజుల March 22, 2008 /
 12. శిద్దారెడ్డి వెంకట్ March 22, 2008 /
 13. B Apparao June 11, 2008 /