Menu

తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!

ఉపోద్ఘాతోపోద్ఘాతము

ఈ టపా నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఈ టాపా ఎంత హిట్టైయ్యిందంటే, ఇది చూసి ‘నవతరంగం వేంకట్’ గారు నాకు నవతరంగంలో వ్రాయడానికి అవకాశం ఇచ్చారు. హాస్యాన్ని ప్రక్కన పెడితే, నేను అప్పట్లో అమెరికా నుండి తిఱిగి వచ్చాక తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తున్న కాలంలో వ్రాసిన టపా ఇది. అసలు వ్రాసింది ౧౬-౦౯-౨౦౦౭, అప్పటికీ ఇప్పటికీ కొన్ని విషయాలు మారవచ్చు. కానీ నేను ఎటువంటి మార్పులూ చేయకుండా యథాతథం ఇక్కడ ప్రచురిస్తున్నా. ఆఖరి వాక్యం కొద్దిగా పరుషంగా అనిపిస్తే క్షమించగలరు. దీనికి రెండవ భాగం కూడా వుంది అది తొందరో వస్తుంది.

ఉపోద్ఘాతము
ఈ మధ్య నేను చాలా టీవి చూస్తునాను. టీవి చూస్తుంటే అందులోని కొత్త సినిమా ప్రకటనలు, ‘కామేడి బిట్లు’ కూడా చూడాల్సివస్తుంది. కాని నా అంతటనేను ఇష్టపడి చూసే సినిమాలు మాత్రం పాత తెలుగు సినిమాలు, మంచి ఆంగ్లల సినిమాలు. కొత్త సినిమా ప్రకటనలకంటే పాత సినిమాలలోని మెలోడ్రామానే నచ్చుతుంది. దాని బట్టి అర్థఁవవుతుంది, తెలుగు సినిమా నేడు ఎంత అధ్వాన స్థితిలో వుందో. దానికి తోడు మన జానతా అంతా “మన తెలుగు నాట కళలకేం తక్కువ లేదు, ఎన్నో గొప్ప కళలు వెలసిన చోటిది. అలానే, గత యాభై ఏళ్ళగా మనము సినిమాని బాగా పోషించాం” అనడం దయనీయకం. అంటే తెలుగునాట ఇప్పుడు ఎగురుతున్న కళా బావుటా సినిమా మాత్రమే, తోలు బొమ్మలాట, హరికథ, బుఱ్ఱకథ, యక్షగానం అన్నీ సచ్చిన తురువాత, మిగిలిన ఏకైక ‘కళ’, ఏ పాతాళంలో ఉందో వివరించడానికీ టపద్వయం.

తండ్రి నుండి తనయుని వఱకూ
ఈ మధ్య పాత తెలుగు సినిమాలు టీవీలో వచ్చినవి వచ్చినట్లే చూసేస్తున్నా. వాటిలో మొన్న వచ్చిన, నాకు చాలా నచ్చిన సినిమా, ‘నేరము శిక్ష’. ఈ కృష్ణ సినిమా ఇప్పటికి నాలుగైదు సార్లు చూసా. చాలా చాలా మంచి కథ, చలా మంచి కథనం. ధర్మానికీ అర్ధకామాలకీ మధ్య జరిగే సంఘర్షణలో మానవులు పావులై, తమతో తాము ఆడుకునే ఆటలో నుంచి, తీయబడ్డ మూడుఘంటల మంచి నమూనా. ఆనాటి సంఘానికో మంచి ప్రితిబింబం. కథ అష్టవంకర్లు తిరగకుండా దాని మూలం చుట్టూ చాలా బాగా తిరుగుతుంది. నటనలో నాటకీయం ఉన్నా అది అప్పుడే నాటకాలనుండి విడిపోయి, సినిమా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని సమకూర్చుకుంటున్న రోజులు కాఁవట్టి. క్షమించవచ్చు.
అది ఆనాటి సినీతత్వం మాత్రమే.

దానితో పోల్చనున్నాం, ఈనాడు తెలుగు నాట అతి సంచలనం సృష్టించిన సినిమా, పోకిరి! నా బ్లాగు లో ఈ సినిమా ప్రస్థావించినందుకు ఇప్పుడే పశ్చాత్తాప పడుతున్నాను. రంగుల తెర, అద్భుతమైన గ్రాఫిక్సు, కొట్టీ కొట్టని బీట్లు, దాగీ దాగని వళ్ళు. హూఁ! సినిమా అంతా మతి లేని, హింసాఖాండ, నిజ జీవితంలో వీలు కూడా కాని విన్యాసాలు, తెలుగు రాని అమ్మాయిలూ, నటన అంతకన్నారాని నటీనటులు, పాటులు చెండాలం, కథ చెండాలం. ఇలా ఇంకా ఎంత కాలమైనా చెప్పుకు పోవచ్చు. ఎప్పుడూ ఒకేరకంగా విసిగేత్తినట్టు ముఖాఁన్ని పెట్టే కథానాయకుడు. చీమల మందలా ఒకడు చచ్చిన తరువాత ఇంకో విలను వస్తూనేవుంటాడు.
‘నేరమూ-శిక్ష’నీ, ఈ సినిమాని ఒకే వాఖ్యంలో ప్రస్థావించడం కూడా పాపమే.

సంభాషణలు
మొన్న చూసిన ఒక సినిమాలో కైకాల, తన కొడుకులను మట్టి కఱిపించవద్దని నందమూరిని బ్రతిమాలడానికి వచ్చి,
“నీవు నా కొడుకువే బాబూ, తమ్ములని చంపొద్దు, ఆస్తి నీదే నువ్వే తీసుకో” అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.
“నా మీద నీకు ఎటువంటి మమకారమూ లేదు, నీ ప్రియ కొడుకులని రక్షంచుకోడానికి కుంతీ రాయబారానికి వచ్చావా?” అంటాడు తారక. అలా కుంతీ రాయబార రూపకంగా వేడిగా సంభాషణ జరుగుతుంది.
అలా రాయబారం విఫలఁవైం తరువాత, పోతూ పోతూ కైకాల,
“ఏ శాస్త్రమూ పని జేయనప్పుడు, పెద్దలు కౌటిల్యుడి రాజ నీతి తియ్యమన్నారు, అందులో బంధాల గురించి, ప్రీతి గురించి, ఎక్కడా ప్రస్థావన లేదు. ఇక ఆ పుస్తకం తెరవాల్సిందే, ఆ తురువాత నువ్వు కన్న కొడుకువని కూడా లెక్క చెయ్యను . ఖబడ్దార్.” అన్న సారంశం ఉన్న డైలాగు చెప్పి నిష్క్రమిస్తాడు.

ఇక ఈనాటి పరిస్థితి
“ఎవరు డైలాగ్ కొడితే, దిమ్మదిఱిగి, మైండు చెడుపోయి, వాంతి వస్తుందో వాడేరా ఈనాటి తెలుగు సినీ నాయకుడంటే” అన్నట్టుంది!
నిన్ననే ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ అన్న సినిమా చూస్తున్నా, అందులో ప్రేమ అనే పదం గాని జీవితం అన్న పదం గానీ ఎక్కడా వాడలేదు. (ఆ సినిమాలో మిగిలిన అంశాలతో పోల్చుకుంటే ఇది ఒక మంచి అంశంగా పరిగణించవలసి వస్తుందన్నది వేరే విషయం). ఈనాటి రచయితలకి వచ్చిందల్లా ఓ కొజ్జా భాష! అందు వ్రాయగలిగినోడే ఘనుడు.

పరిశోధన (దర్శకత్వం)
సినిమా తీస్తే, దాన్ని ఏ కాలస్థలాల నేపధ్యంతో తీసారో వటిని బాగా పరిశోధించి కథలో, కథనంలో వాటిని బాగా ఇమడ్చాలి. కన్యాశుల్కం తియ్యడానికి అఱవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సొచ్చినా, మోసగాళ్ళకి మోసగాడుకి (కథలో, స్కిరిప్టులో) ఖండాతరం వెళ్ళాల్సివచ్చినా వెళ్లేవారు. అదే ఈవాళ ఏ వెంకటేశ్ సినిమా తీసుకున్నా, అందులో అదే వైజ్ యాస్ వ్యాఖ్యలు. ఎప్పుడూ హీరోదే ఆఖరి మాట. అన్ని సినిమాలలోనూ, అదే మాట్లాడే తీరు. బిఎ ఫెయిలైనా కోనసీమ కుఱ్ఱాడైనా, చాలా సమర్థుడైన కంప్యూటరు ఇంజనీరైనా, ఒకటే మాటచందం. అన్ని పరిశ్రమలలో జనాలు మసులు తీరు సినిపరిశ్రమలో లానే ఉంటుందని వారి సౌకర్యార్థం తప్పుగా అనేసుకోవడం.

అలానే రాయలసీమ నేపధ్యంగా కథ సాగుతున్నప్పుడు రౌడీలు రాయలసీమ యాసతో మాట్లాడతారు, కానీ కథానయకుడు మాత్రం ‘ఉత్తమఁవైన’ బెజవాడ తెలుగులో మాట్లాడతాడు. ఈ విషయంలో మన ‘అఆ రెడ్డి’, ‘ఉఊ నాయిడు’ సినిమాలకంటే, ఆరవం నుండి అనువాదించిన ‘పోతురాజు’ వంటి సినిమాలు చాలా మెఱుగు. సగం సినిమాలు హైదరాబాదులో జరిగినవిగా తీస్తారు. కానీ తెలంగాణ మాండలికం ఉండదు. కథానాయికలందరికీ డబ్బింగు చెప్పే కళాకారిణులు పరిశ్రమ మొత్తానికీ, ఐదాఱుగురుంటారు. వారిని కూడా ఎవరు ఎక్కువ నత్తి నత్తిగా మాట్లాడతారు, ఎవరు ఇప్పుడే అమెరికా నుండి దిగారు అన్న కొలమానులతో కొలచి ఎంపిక చెయ్యడం జరుగుతుంది. ఇక యమదొంగలో చిత్రగుప్తుడు బుక్కు బుక్కు అనడం విచారకరం.

కథానాయికలు
జమునా, విజయకుమారి, శారద, వాణిశ్రీ లాంటి వాళ్ళ ముందు, ఈనాటి కథానాయికలు (వారి పేరు చెప్పి బ్లాగు శీలం చెడగొట్టలేను) తలెత్తుకుని నిలువగలరా? వారిలో ఉండే వయ్యారం, నడక, నాట్యం, నటన, భాషాప్రావీణ్యం? “అప్పటి కథానాయికల నుండి ఆశించేది వేరు, ఇప్పటి కథానాయికలకు గ్లామరు చాలా ముఖ్యం, పైగా నాటకీయంగా ఉండే నటన కూడా సహజ నటనగా మారింది” అని మీరు వాదించినా. జయసుధ, విజయశాంతి లాంటివారు కూడా లేరుగా ఈనాడు. వాణిశ్రీలాంటిది పిచ్చిదానిగా చేసిందంటే, కృష్ణంరాజు వంటి వారు కూడా ప్రధాన పాత్రనుండి ద్వితీయ పాత్రకి వెళ్ళవలసిందే. ఈనాడు చిత్ర’మందిరం’ నుండి బయటకు వచ్చిన వారిని ‘దేవి’ పేరు చెప్పమంటే చెప్పలేరు. తెలుగంటారా రానేరాదు. ఇక అప్పుతెచ్చుకున్న కథానాయికలలోనైనా భానుప్రియ, శోభన వంటి వారైనా ఎక్కడ?

ఈనాటి సినిమా హీరోయిన్ల ఎంపికా ప్రక్రియ నాకు అస్సలు అర్థంకాకుండా ఉంది. స్త్రీసమానత్వవాదానికి తెలుగు కథానాయికల పతనం వెన్నులో ఒ పోటు.

కథానాయకులు
వీరి పతనం కంటే వీరి వల్ల మిగిలిన అంశాలకు జరిగిన పతనఁవే ఎక్కువనాలి. రామారావు, నాగేశ్వరరావుకీ ఈనాడు సరిసాటి లేరన్న విషయం అటుంచితే. ౪౦లలో నాయకులు కథలో భాగంగా ఉండేవారు, ౭౦లకల్లా కథకన్నా పెద్దవారిగా చెలామణీ అవ్వడం దురదృష్టకరం.
నిజంగా దిగజారింది, ‘కలసి వుంటే కలదు సుఖం’లో రామారావు, ‘దేవదాసు’లో నాగేశ్వరరావు! ఇక కమలహసన్, రాజేంద్రప్రసాద్ వంటి వారు కనుమఱుగే!

సంగీతం
నిజం? దీని గురించి వ్రాయాలంటారా?
సంగీతఁవనేది ఒక ప్రత్యేక కళ. ఇది సినిమాలో భాగం కాదు. కాబట్టి ‘తెలుగునాట సంగీతం’ గురించి ఒక ప్రత్యేక టపా వెయ్యాలి.
ఒక్క నిఁవిషం! తెలుగునాట వెలసిన ఏకైక కళ కదా సినిమా? నా మతిమఱపుమండా! ఇక మనము సంగీతం వంటి వాటి గురించి మాట్లాడడం నిరర్థకం. ఆఃక్లాండులో నల్లవారి ఆకలి కేకల నుండి పుట్టిన హిప్‌హాప్‌ని మనదిగా వాడేసుకుంటే పోలే. అది సరిపోకుంటే, లెటీనో సాల్సాలు, అరబీ పాటలు ఉండనే ఉన్నాయిగా. అది కూడా కష్టమైతే తోటి తెలుగు వాడే మళయాళ సినిమాలో కొట్టిన పాట ఉండనేవుంది. సామెత చెప్పినట్టు వండుకున్నవాడికి ఒక్క కూరైతే అడుకున్న వాడికి అఱవైయ్యాఱు కూరలు.

ప్రేక్షకమహాశయులు
“అలా ఐతే ఈ సినిమాలు ఇంత పెద్ద హిట్లెందుకవుతున్నాయి? జనాలు వెఱ్ఱాళ్ళనా మీ ఉద్ధేశం?”
వెఱ్ఱాళ్ళే కానీ అది వారు తప్పు కాదు. ఉండండుండండి. ప్రజాస్వామయం కదా, అయితే అన్నీ ప్రజల తప్పులే! వారి వెఱ్ఱతో సహా! కానీ ఆ అంశంలోకి పెడదారిన వెళ్ళక నవీన సినిమా ఎందుకు అంత విజయం పొందిందో చెప్పుకుందాం.

నేటి భారతీయులు, అన్ని విధాలాల విసుగెత్తి వున్నారు. అనినీతీ, న్యాయంలేక పోవడం, ఎవడు రౌడీలను మేపగలిగితే వాడిదే రాజ్యం, చేతగానితనానికి మారుపేరుగా నిజాయితీ. దాని మీద, ఎప్పుడూ నీడలా వెంటాడే మధ్య తరగతి భవసాగరాలు. ఏఁవైనా సాధిద్దాఁవను కుంటే అడ్డంకులు! లంచం, రాజకీయాలు, బందుప్రీతి, కుంభకోణాలూ, మీకు తెలియనిదేముంది? ప్రతి సినిమా హీరో వీటిగురించేగా వా’పోయేది’. వీటన్నిటి తలదన్నేలా, ప్రొద్దుట లేచి, రాత్రి నిద్రపోయేవరకూ, కనిపించే లక్షలాది మందిలో ఒకరు, అంటే ఒక్కరు కూడా తనకు గౌరవం ఇవ్వరు. అంతే! తమెవ్వరికీ ఇవ్వని గౌరవం తమకి దక్కాలనే తాపత్రయం.

అదే సినిమాకెళ్తే, హీరోకి అడ్డు వచ్చిన రౌడీని నరికి పారేస్తున్నాడు, చిరంజీవిని ఎవరూ ఎప్పుడూ చీదరించుకోరు, కొట్టరు. రజనీకాంత్ వచ్చి నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చేస్తున్నాడు, “ఒహో అవినీతిని అరికట్టడం మన బాధ్యత కాదన్నమాట, బెదరని వాడు రాలేరాలేరాలేదు, కాబట్టే అది ఉంది”. సినిమాలు మనోరంజనంతో పాటు మనం చెయ్యగలిగినదేఁవీ లేదనే ‘మనోలంజనం’ కూడా కల్పిస్తున్నాయి.

ఇక హీరో చేత తన్నులు తన్నించు కుంటున్న స్టంట్‌మెన్, సినిమా రౌడీలూ మనుషులుకారు, ప్రేక్షకుని నిజజీవితంలోని అడ్డంకులకు వెండి తెరపై రాతి ప్రతిబింబాలు. వాటిని హీరో చిత్తు చిత్తు చేస్తున్నాడు, మన ప్రేక్షకులు నిజజీవితంలో ఆశించినట్లే! అది సినిమా కాదు, ఒ ఫాన్టసీ, చాలా సుదూర ఫాన్టసీ. అది కళాభిమానం కాదు, మానసిక హస్తప్రయోగం (ఎమోషనల్ మాష్టర్బేషన్).

తరువాయి
తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగా వస్తున్నాయా? (కాపీ రాజులు, సంఘానికీ సినీ దర్పణఁవేది, హైజాకైన కళ, హ్యాపీ డేస్ నిజంగా వస్తున్నాయా, వగైరా)

25 Comments
 1. నవీన్ గార్ల February 15, 2008 /
 2. ప్రసాదం February 15, 2008 /
 3. వికటకవి February 15, 2008 /
 4. KRISHNA RAO JALLIPALLI February 15, 2008 /
 5. వెంకట్ February 15, 2008 /
 6. మంజుల February 15, 2008 /
 7. KRISHNA RAO JALLIPALLI February 18, 2008 /
 8. sathish February 18, 2008 /
 9. KRISHNA RAO JALLIPALLI February 19, 2008 /
 10. వెంకట్ February 19, 2008 /
 11. koresh March 13, 2008 /
 12. శిద్దారెడ్డి వెంకట్ March 13, 2008 /
 13. శంకర్ March 13, 2008 /
 14. Uttara April 29, 2008 /
 15. మంజుల May 1, 2008 /
 16. PokiRi Doddapaneni May 5, 2008 /
 17. veerablogudu June 23, 2008 /
 18. nageswar rao June 26, 2008 /