భారతీయ చలనచిత్రాల్లో కళాఖండాలు అన్నవి ఒక వంద లెక్కేస్తే ఆయన దర్శకత్వం వహించినవో ఆయిదు ఉంటాయి.తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్ర్రాలో ఒక పాతిక జాబితా రాస్తే ఆ మహనీయుడి చిత్రాలు అన్నీ ఉంటాయి.నా తదనంతరం ఇక ఇలాంటి సినిమలు రావూ అని నిశ్చయంగా తెలిసినట్లే తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల అన్నట్లు నిక్కమైన నీలాలే మనకిచ్చి మహానుభావుల్లో కలిసిపోయాడు.
తెలుగు సినిమాకో దిశానిర్దేశం చేసి, మంచి సినిమా అంటే తను తీసిన సినిమాల ద్వారా నిర్వచించి,గొప్ప చలన చిత్రాలకో గ్రామరూ, కళాఖండాలకో గ్లామరూ తయారు చేసి చూపాడు.సాహిత్యం లో తప్ప క్లాసిక్స్ అనేవి తెలుగుసినిమాల్లో రావూ అనే వాదాన్ని తుత్తునియలు చేశాడు. ఆయనే మల్లీశ్వరి, బంగారు పాప, పూజాఫలం, రాజమకుటం, వంటి అద్బుత చిత్రాలను మనకు అందించి తెలుగు సినిమా బావుటాను విశ్వవిఖ్యాతం చేసిన బి.యన్.రెడ్డి.
భారీ కాన్వాసు తీసుకుని అంత కన్నాపెద్ద తారాగణం వాటి మోజు లో పడి కధాకధనాలకు న్యాయం చేయలేకపోయిన ఆనాటి దర్శకులముందు బి.యన్. హిమాలయ శిఖర సమానుడు.పోయిన శతాబ్దపు మూడు,నాలుగు,అయిదు దశాబ్దాలలోకూడా హంగూ,ఆర్భాటాల మీద తప్ప కధలొ దమ్ము లేకుండా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి అనేది నమ్మశక్యం కాని నిజం.
“కళను వ్యాపార దృష్టితో చూడకూడదు. కళాకారునికి సమాజంపట్ల గురుతరమైన బాధ్యత ఉంది. అవాంచనీయ సన్నివేశాల ద్వారా, అశ్లీల సంభాషణల ద్వారా, అసభ్యమైన పాటలు, నృత్యాల ద్వారా ప్రేక్షకులలోని నీచాభిరుచులను రెచ్చకొట్టకూడదు. కళాత్మకమైన సంస్కృతి, సుసంపన్నమైన ఉత్తమ విలువలను ప్రతిబింబించే సామాజిక ఇతివృత్తం కలిగిన చిత్రాలనే నిర్మించాలి” అనే సంకల్పంతో సినీరంగ ప్రవేశం చేయడమే కాకుండా, జీవితాంతం అవే విలువలకు కట్టుబడిన బి.యన్ 1908 వ సంవత్సరం నవంబర్ 16 వ తేదీన కడపజిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి గ్రామంలో జన్మించారు. చిన్ననాటినుండే కళలపై అత్యంత ఆసక్తి కనబరచిన బి.యన్. యుక్తవయసులో నాటకాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు.
యువకునిగా స్వాంతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్న బి.యన్. 1931-32 వ సంవత్సరంలో మద్రాసులోని కామర్సు కళాశాలలో జి.డి.ఏ (ఆడిట్ మరియు ఎకౌంట్స్) చదివి కొన్నాళ్ళు ఎప్రంటిస్ గా పనిచేసారు. ఆ రోజుల్లో ప్రముఖ జర్నలిస్ట్ ఎస్.జి.ఆచార్య పరిచయంతో జర్నలిజంపై ఆసక్తి పెంచుకున్నారు బి.యన్. ఆ ఆసక్తితోనే ప్రముఖ వారపత్రిక ’ప్రజామిత్ర’ కార్యాలయంలో ఎక్కువ సమయం గడిపేవారు. ప్రజామిత్ర కార్యాలయంలోనే గూడవల్లి రామబ్రహ్మం, తాపీ ధర్మారావు, సముద్రాల రాఘవాచార్యులు వంటి ప్రముఖులతో బి.యన్ పరిచయం పెంచుకున్నారు. వారి పరిచయం ఆయనలోని కళాతృష్ణ శైశవ దశను దాటింది. కళామతల్లికి తనవంతు కృషిచేయాదలచి, ప్రజామిత్ర ప్రచురణకు ఇబ్బందులు ఎదురైనప్పుడు వారికోసం కొత్త ప్రెస్ స్థాపించారు బి.యన్.
తెలుగు టాకీ పితామహుడు హెచ్.ఎం.రెడ్డి స్థాపించిన రోహిణి పిక్చర్స్ లిమిటెడ్ సంస్థలో భాగస్వామిగా చేరి గృహలక్ష్మి అనే చిత్ర విర్మాణంలో ప్రముఖ పాత్ర వహించడం ద్వారా చలనచిత్రరంగంలోకి తొలి అడుగు వేసారు బి.యన్. గృహలక్ష్మి చిత్ర నిర్మాణ సందర్భంలో చలనచిత్రరంగంలోని వ్యాపార ధోరణి నచ్చక ఉత్తమ ఆశయాలకు అనుగుణంగా, ఉత్తమ ప్రమాణాలతో కళాత్మకమైన సినిమాలు నిర్మించాలన్న ఉద్దేశంతో మిత్రుల ప్రోత్సాహంతో వాహినీ చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి వందేమాతరం చిత్రంతో దర్శకునిగా మారారు.
వందేమాతరం చిత్రం ద్వారా విరుద్యోగ సమస్యను అప్పటి యువత మనోభావాలను తెరకెక్కించిన బి.యన్. ఒక మంచి టీమ్ ను ఈ సినిమా ద్వారా ఏర్పరుచుకోగలిగారు.. తొలిచిత్రంతోనే విజయం సాధించిన బి.యన్ తన రెండో చిత్రంలో వితంతు సమస్యను నేపథ్యంగా మలచుకున్నారు. మొదటి చిత్రం వందేమాతరం ఇచ్చిన విజయంతో రెట్టింపు ఉత్సాహంతో రూపొందించిన సుమంగళి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టి విరాశకు గురిచేసినప్పటికీ విమర్శకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం వంటి వారు ఈ సినిమాను గొప్ప చిత్రమని ప్రశంశించారు. వందేమాతరం ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టనప్పటికీ ఆ తర్వాత బి.యన్. దర్శకత్వంలో వచ్చిన దేవత, స్వర్గసీమ సినిమాలు ఆయన్ని ప్రతిభగల దర్శకునిగా గుర్తింపు తెచ్చిపెట్టడమే కాకుండా వాహినీ సంస్థకు లాభాలనూ అర్జించిపెట్టాయి.
ఇదే సమయంలో తెలుగు చిత్ర నిర్మాతలకు చిత్రాలు నిర్మించడానికి సరైన సదుపాయాలు లేవని గ్రహించిన బి.యన్. చలనచిత్ర నిర్మాణానికి కూడా కొన్నాళ్ళు ఫుల్‍స్టాప్ పెట్టి వాహినీ స్టూడియో నిర్మాణంలో పాలుపంచుకున్నారు. తదుపరికాలంలో బి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆసియాలోనే అతిపెద్ద స్టూడియాగా విజయా-వాహినీ స్టూడియో పేరుపొందింది.
వందేమాతరం షూటింగ్ సమయంలో హంపీ దర్శించినప్పుడు రాయలవారి కాలాన్ని కథా వస్తువుగా తీసుకుని ఒక చిత్రాన్ని నిర్మించాలని కోరిక కలిగింది బి.యన్.కు. ప్రముఖ రచయిత బుచ్చిబాబు భారతి సాహిత్య పత్రికలో ప్రచురించిన ఒక చిన్న రేడియో నాటికను, ఇలస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా వార పత్రికలో వెలువడిన మరో కథను ఆధారంగా చేసుకుని బి.యన్ మల్లీశ్వరి చిత్రాన్ని నిర్మించడంతో తన కోరికను తీర్చుకున్నారు. సెల్యులాయిడ్ పై మలచబడిన దృశ్యకావ్యం అని సినీ పండితులచే వర్ణించబడిన మల్లీశ్వరి చైనాలో జరిగిన తూర్పు ఆసియా ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడి అంతర్జాతీయ ఖ్యాతినీ సంపాదించుకున్నది.
మల్లీశ్వరి తర్వాత బి.యన్. జార్జి ఇలియట్ రచన ’సిలాస్ మార్నర్’ ఆధారంగా రూపొందించిన బంగారుపాప మానవ మనస్తత్వ చిత్రీకరణలో కొత్త పుంతలు తొక్కింది. ఈ చిత్రంతో బి.యన్. మరో సారి అంతర్జాతీయ ఖ్యాతిని ఘడించారు. చార్లీ చాప్లిన్ లాంటి అంతర్జాతీయ తారలచే ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డుల పోటిలో సైతం పథేర్ పాంచాలి చిత్రంతో పోటీపడి రజత పతకం గెలుచుకుంది. ఇంతటి గొప్పచిత్రం ప్రేక్షకాదరణ పొందక వాహినీ నిర్మాణ సంస్థకు నష్టాలు కొన్నితెచ్చిపెట్టడం చేదు నిజం. ఈ సినిమా అపజయం తో అప్పటివరకూ వాహినీ చిత్రాలకే దర్శకత్వం వహించిన బి.యన్. మొదటిసారిగా బయటి నిర్మాతలకోసం భాగ్యరేఖ సినిమాను రూపొందించారు. బి.యన్.కే ఆశ్చర్యం కలిగించేలా ఈ సినిమా విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత సన్నిహితుల ఒత్తిడికి తలఒగ్గి తన ఆశయాలను ఆదర్శాలను పక్కనపెట్టి రాజమకుటం సినిమాను కమర్షయల్ పంథాలోరూపొందించారు బి.యన్. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ అప్పటివరకూ ఆదర్శప్రాయంగా చలనచిత్రాలను రూపొందించిన బి.యన్. ఈ సినిమాతో తనకున్న కళాత్మక దర్శకుడన్న పేరుప్రతిష్టలు పోగొట్టుకున్నారని ఎంతో మధనపడ్డారు బి.యన్. ఇదే సమయంలో సంభవించిన తన పుత్రిక అకాలమరణం కూడా బి.యన్.ను ఎంతగానో కృంగతీసింది.
తదుపరి కాలంలో బి.యన్. రూపొందించిన మరో మూడు చిత్రాలు (పూజాఫలం, బంగారుపంజరం, రంగులరాట్నం) ప్రేక్షకులను అలరించినప్పటికీ పూర్వవైభవం మాత్రం ఆయనకు చేకూరలేదు. సినారె వ్రాసిన ప్రసిద్ధ గేయకావ్యం కర్పూరవసంతరాయలును, బీనాదేవి నవల పుణ్యభూమీ కళ్ళుతెరు! ను సినిమాలుగా తీయాలన్న కోరిక తీరకుండానే నవంబర్ 8, 1977 న బి.యన్. స్వర్గస్తులై తెలుగుచలనచిత్రసీమకు తీరని లోటు కలిగించారు.
–దేవరపల్లి రాజేంద్రకుమార్, పాటిబండ్ల దక్షిణామూర్తి, పరుచూరి శ్రీనివాస్ రచనల ఆధారంగా…
ఫేస్ బుక్ కామెంట్స్