మై డిన్నర్ విత్ ఆంద్రె (1981) - ఒక సమీక్ష
Feb 25th, 2008 | రచయిత: అతిథి | వర్గాలు: ప్రపంచ సినిమా • విశ్లేషణరచన:నాగరాజు పప్పు
షాజహానెక్కిన నెమలి సింహాసనం నుండీ బతకలేని బడిపంతులు నిట్టూర్పులూర్చే పేము కుర్చీ వరకూ - కుర్చీలు కొన్ని వేల రకాలు. కాని, చక్రవర్తైనా, చంఢాలుడైనా మనిషంటే ఒక ఆకారం ఉన్నట్టే, కుర్చీ ఎలాటిదయినప్పటికీ దానికో నిర్ధిష్టమైన ఆకారం ఉంది - బల్లపరుపుగా మన బరువు మోపడానికో బల్ల, వీపు ఆనించుకో్డానికి మరో బల్ల, నేల నుంచి ఎత్తు కోసం ఓ నాలుగు కోళ్ళు అనే మూడు భాగాలుంటేనే అది కుర్చీ అవుతుంది. వీటికే రకరాకాల హంగులు కూర్చి కుర్చీల రూపురేఖలు ఎన్నో రకాలుగా మార్చవచ్చు.
కుర్చీలకి ఇలాటి రూపోటి కుదురుకొని - ఇక వీటి గతి ఇంతే, వీటి రాతని ఇంకెవడూ మార్చలేడని నిశ్చయం అయిపోయిందనుకొంటున్న తరుణంలో, ఓ శుభ ముహుర్తాన, “కుర్చీ అంటే ఇలాగే ఎందుకుండాలి” అని ఓ పిచ్చి ప్రశ్న ఓ ఇంజనీరుగారి తలపు తట్టింది. ఎద్దుల బండీలో, గడ్డివాముమీద సుఖాసీనుడై కునికిపాట్లు పడుతున్న ఓ రైతన్నని చూసాడేమో - వెంటనే ఆయనగారి మదిలో ఓ మెరుపు తళుకులీనింది. ఇంకేముందీ - బీన్‌బాగ్ అనే ఓ కొత్తరకం సుఖాసనం తయారైంది. బీన్‌బాగ్‌ని కుర్చీ అనడానికి ఎవ్వరికీ మనసొప్పదు - ఎందుకంటే అది కుర్చీ అనే నిర్వచనానికి లొంగదు. కాని, మూడు గంటల పాటు హాయిగా కూర్చొని, టి.వి.లో మాంచి సినిమా చూడాలంటే మాత్రం దీనికంటే ఉత్తమమైన ఆసనమూ మరోటి దొరకదు.
1981 దాకా ప్రపంచంలో వచ్చిన సినిమాలన్నీ కుర్చీలైతే, మై డిన్నర్ విత్ ఆంద్రె అనే సినిమా, వాటన్నిటినీ సవాల్ చేసిన బీన్‌బాగ్ లాటిది. ఏ రకంగానూ, దీనిని సినిమా అని గాని, కథ అని గాని అనడానికి కుదరదు, అలా అని, అనకుండా ఉండటానికి కూడా వీల్లేదు. ఈ సినిమా ప్రత్యేకత గురించి చెప్పాలంటే, ముందుగా సినిమా అనే సాంకేతిక ప్రక్రియలోని ముఖ్యమైన అంశాలని ప్రస్థావించాలి.
కుర్చీలకి మూడు భాగాలున్నట్టే - అరిస్టాటిల్ కాలం నాటి నుండీ డ్రామాకి exposition, complication, conflict, climax అనే నాలుగు అంగాలున్నాయి. అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడ్డారు - ఇది ప్రస్థావన (exposition). అమ్మాయి పేదింటి పిల్ల, అబ్బాయి రాజకుమారుడు (అనార్కలీ సినిమా) - ఇది కథాంశం(Complication)[1] , అబ్బాయి తండ్రికి ఈ ప్రేమంటే ఇష్టం లేదు - ఇది సంఘర్షణ (Conflict) , చివరగా అమ్మాయి త్యాగమో, ఆత్మహత్యో చేసుకొంది, లేకపోతే - అమ్మాయి, అబ్బాయి కలిపి దేశాంతరాలు పారిపోయారు, ఇంకా కాకపోతే, కథ చివర్లో - అబ్బాయి తండ్రి ఉన్నట్టుండి మంచోడైపోయాడు - ఇది ముగింపు (Climax). సుమారుగా, 90% శాతం కథలన్నిటికీ - అది రామాయణమైనా, రోమియో-జూలియట్ అయినా - అమరిక, లేక ఆంగీకరణం [2] (organization) మాత్రం ఈ నిర్మాణాన్ని(structure) అనుసరించవలసిందే.
రచయితకాని, దర్శకుడు కాని - ఈ నిర్మాణ వ్యవస్థని (Structural Framework) అనుసరిస్తునే, తన సృజనాత్మకతని ప్రదర్శిస్తాడు. ఉదాహరణకి - కథని క్లైమాక్సుతో ప్రారంభించవచ్చు, లేదా కాంప్లికేషన్‌లోనే ఎక్కువ సమయం ఉపయోగించుకుని, కాన్‌ఫ్లిక్ట్, క్లైమాక్సులు కుదించవచ్చు. లేదా ఫ్లాఫ్-బాక్ లాటివి ఉపయోగిస్తూ - వెనక్కీ, ముందుకీ జరగవచ్చు. ఎంచుకొన్న కథాంశంలో ఈ నాలుగింటి మధ్యనున్న సంబంధాన్ని సృజనాత్మకంగా, కొత్తగా రూపొందించవచ్చు - ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణకాకుండా, ఒక వ్యక్తిలోనే జరిగిన సంఘర్షణని కాంప్లికేషన్, కాన్‌ఫ్లిక్ట్ గా ఎంచుకోవచ్చు.
[...] 1981 దాకా ప్రపంచంలో వచ్చిన సినిమాలన్నీ కుర్చీలైతే, మై డిన్నర్ విత్ ఆంద్రె అనే సినిమా, వాటన్నిటినీ సవాల్ చేసిన బీన్‌బాగ్ లాటిది. ఈ సినిమాపై నేను పంపిన ఒక సమీక్ష నవతరగంలో ప్రచురించారు. లింకు: మై డిన్నర్ విత్ ఏంద్రె (1981) - ఒక సమీక్ష [...]
నాగరాజు గారూ,
ఒక అధ్భుతమైన సినిమా గురించి అధ్భుతమైన వ్యాసం రాసి ఈ సినిమాని మరింత మందికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే స్క్రీన్ప్లే(డ్రామా) లోని వివిధ అంశాలనూ పరిచయం చేయడం బావుంది.నాకీ సినిమాలో నచ్చిన విషయం ఏంటంటే, ఈ సినిమాలో చాలా వరకూ థియేటర్ గురించి చర్చ నడుస్తుంది. ఒక విధంగా ఇది నాటకంగా ఉండాల్సిందేమో అనిపించింది.కానీ నాటకం కంటే సినిమా గొప్ప అని ఈ సినిమా ఋజువు చేసిందనిపించింది. సినిమాలో వున్న గొప్పతనం ఏంటంటే పాత్రలు ప్రేక్షకుల కళ్ళ ముందుకొస్తాయి. నాటకం అనే ప్రక్రియలోని లిమిటేషన్స్ ని సినిమా అధిగమించగలదు.
అలాగే మీరన్నట్టు ఈ సినిమాలో ఎటువంటి structure లేదు అని నాకూ అనిపించినా ఈ సినిమాలోనూ 3 act structure వుందని కొంత మంది అభిప్రాయం.
http://www.philfilms.utm.edu/1/mydinner.htm
ఈ సినిమా నచ్చితే విపరీతంగా నచ్చాలి, లేదా అస్సలు నచ్చదు. మధ్యస్థం వుండదని నా అభిప్రాయం. మరిన్ని వ్యాసాలు మీ దగ్గరనుంచి వస్తాయని ఆశిస్తున్నాను.
బెంగుళూరు బ్లాగర్లు,
లక్కీ ఛాన్స్ మిస్ కాకండి.ఈ నెల బ్లాగర్ల సమావేశం సందర్భంగా ఈ సినిమా నాగరాజు గారింట్లో చూడండి.
బాగుంది
మహాశయా! అద్భుతం!!
పనిలో పనిగా క్లాసికల్ డ్రమటిక్స్ మీద, మిస్సమ్మ సినిమా మీద మీ వివరణలు పెళ్ళి భోజనంలో గారెల్లా పాయసంలా ఉన్నాయి.
ఈ సినిమాని ఇప్పుడే నా నెట్ఫ్లిక్సు లిస్టులో చేరుస్తున్నాను.
ఈ సినిమా గురించి అసలేమీ తెలియని నాలాంటివాళ్లకు సైతం అదేంటో తెలిసేలా ఉంది మీరు ఈ సినిమాని పరిచయం చేసిన తీరు. పనిలో పనిగా సినిమాలోని టెక్నికాలిటీస్ చక్కగా వివరించారు. పనిలో పనిగా ఆంగీకరణంలోని రకాలను సోదాహరణంగా వివరించినందుకు నెనర్లు. ఈ సినిమాకు స్క్రిప్టు రాయడానికి సంవత్సరం పట్టిందంటే ఒక మంచి సినిమా లో స్క్రిప్టు పాత్ర ఎంత ముఖ్యమైనదో అర్థమౌతుంది. మనవాళ్ళు షూటింగ్ మొదలయ్యాక షాట్ గ్యాపుల్లో కూడా స్క్రిప్టులో వేలుపెట్టి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. మీరు రాసింది చదివాక ఈ సినిమా చూడాలని నేను కూడా ఉవ్విళ్ళూరుతున్నాను. మీరు చెప్పిన అర్థంలో Organization అనే మాటకు సాహిత్యంలో వాడే అర్థంలో శిల్పం అనే మాట సరిపోతుందా?
thanku for the stuff, u have done an excellent job iam overwhelmed by the structural analysis of drama and fortunate to have it . write more about those cinemaas ulike.