Menu

తీవ్రవాదం పై రెండు అస్సామీ సినిమాలు

చిత్రోత్సవంలో నేను రెండు అస్సామీ సినిమాలు చూసాను. కాకతీళీయంగా రెండూ ఉల్ఫా తీవ్రవాదం గురించే. కానీ వాటిలో ఒకటి మామూలు సినిమా ఇంకోటి డాకుమెంటరీ. సినిమా కల్పితం, డాకుమెంటరీ మాత్రం ఉల్ఫాలోకి లాగబడ్డ ఒక వ్యక్తి నిజ జీవితాన్ని అతనే వివరిస్తాడు. రెండిటికీ పోలిక ఏంటంటే, రెండిటిలోనూ హీరో దయగలవాడు, కానీ ఉల్ఫా యొక్క హింసాత్మక పద్ధతుల్ని సమర్ధించే వాడు కాదు.

జతింగా ఇత్యాది

Jatinga et. al.హీరో మానబ్ కాలేజి పట్టభద్రుడు, ఉద్యోగ వేటలో లంచగొండితనం, అవినీతి ఎదుర్కొంటాడు. అప్పటి వఱకూ అతను వింటూ వచ్చిన మాట “బిప్లోబ్” (విప్లవం) అతని ఒక్కసారిగా, ఈ దుస్థితి నుండి బయటకు నడిపే దారిగా తోస్తుంది. గౌహాతి వదలి వూరు వచ్చేస్తాడు. అదే సమయంలో ఇద్దరు ఆంగ్లేయుల్ని కిడ్నాప్ చేసిన ULFA తీవ్రవాదులకు, ఆంగ్లం మాట్లాడే కుఱ్ఱవాడు కావలసివచ్చి మానబ్(మానవ)ని సహకరించమని కోరతారు. అలా తీవ్రవాదం వైపుకు వేసిన మొదటి అడుగు ఒక తిఱిగి రాలేని ప్రయాణమని అతనికి ఇంకా తెలియదు. ముందు ముందు ‘బిప్లోబ్’ పేరుతో ఉల్ఫా చేసే పనులకు ఇతని సిద్ధాంతాలకీ ఎలా విరుద్ధం ఏర్పడుతుంది అన్నది కథ.

సినిమా పరంగా చూస్తే చిన్న మొత్తంతో తీసిన సినిమా, కాబట్టి కాల్పుల సన్నివేశాలలో శబ్దం తప్ప ఇతర చమక్కులు వుండవు. రక్తం చిమ్మడం, తూపాకి నుండి మెఱుపులు వుంటివి, కనీసం బులెట్లు కూడా ఎక్కడా కనిపించవు. నటన పరంగా అస్సామీ నటులు బాగా చేసినా, విదేశీయులు మాత్రం నటనలో ఎలాంటి శిక్షణా లేనివారిలా (తెలుగు సినిమా హీరోయిన్లలా) అనిపించారు. ఎంతైనా భారతీయ సినిమాలలో ఎక్సట్రాల నటన దయనీయమనుకోండి. ఇక అస్సాం, మేఘాలయాలలోని ప్రకృతి అందాల్ని ఇంకా బాగా తెర కెక్కించ వచ్చని పించింది. ఇక్కడ కూడా తక్కువ వ్యయం వల్ల చేయలేకపోయుంటారు. కథలో కొన్ని భాగాలు నాకు అర్థం కాలేదు. మొత్తానికి సినిమా క్వాలిటీ అంతంత మాత్రం. కానీ సినిమా దర్శకుడు ‘సంజీవ్ సభాపండిత‘ ప్రముఖంగా ఒక సంఘ సంస్కర్త్త. సినిమా అతనికి ఒక మాధ్యమం మఱియూ ఆయుధం మాత్రమే. కాబట్టి కొంత వఱకూ క్షమించవచ్చు.

ఐతే ఈయన తను చెప్పాలనుకుంది ఏఁవిటంటే. అస్సామీ యువత, నిరుద్యోగం వల్ల అవినీతి వల్లా ఉల్ఫా ఇచ్చే ప్రాముఖ్యత(తుపాకీ) వైపూ, డబ్బు వైపూ ఎలా మక్కువ చూపి, సామ్యవాద సిద్ధాంతాల పేరిట రచ్చ చేస్తున్నరో అన్నది కథ. దర్శకుడు స్థాపించిన పుస్తక మండలి లానే ఈ సినిమా కూడా అక్కడి యువత అపోహలను తొలగించడానికే. అలా చేయడంలో కొంత వరకూ సినిమా సఫలమైనా, అయని సందేశం మాత్రం సినిమాలో కొంత మసకబారిపోయేవుందని చెప్పాలి.

అన్నట్టు జతింగా అనేది అస్సాంలోని ఒక లోయ. అక్కడికి పక్షలు వందలలో వచ్చి ఆత్మహత్య చేసుకుంటాయని పోకడ. నిజానికి అవి ఏదో భ్రమలో వేగంగా ఎగురుకుంటూ వచ్చి నేలను ఢీకొని చనిపోతాయంట. అలానే అక్కడి యువత కూడా ఎలా భ్రమలో వెళ్లి ULFA ని ఢీకొని చనిపోతారో అన్న రూపకం సినిమా పేరు.

Echoes of Sunshine

ఇది జుగల్ భూయాన్ జీవితం ఆధారంగా తీసిన డాకుమెంటరీ. జుగల్ కూడా చదువుకున్న యువకుడు. గౌహతీ విడిచి తన సొంత పల్లెటూరిలో వ్యవసాయం మొదలు పెడతాడు. అలా చేస్తూనే, పిల్లలకు చదువు చెప్పడం వగైరా చేస్తూండేవాడు. అతనిని ఉల్ఫా ఆశ్రయుంచినా వారిని తిరస్కరిస్తాడు. కానీ ఉల్ఫా వల పన్ని అతను కూడా వారిలో ఒకడని పోలీసులకు అనిపించేడట్టు చేస్తుంది. అలా ఇతను ఉల్ఫాలోనికి లాగ బడతాడు. ఉల్పా కాంపులో అతను యువకులు సామ్యవాద ఆదర్శాలను ప్రక్కన పెట్టి తూపాకీలవైపు మగ్గుచూపడం గమనిస్తాడు. పోలీసులకు పట్టుబడ్డ తరువాత అతను ఉల్ఫా వదిలి, స్కూలు పెట్టి సమాజ సేవ చేస్తూ బ్రతుకుతాడు. అతని మాటల్లోనే, తీవ్రవాదం యొక్క నిష్ప్రయోజనత్వం వివరిస్తాడు సినిమాలో.

సినిమా ఇప్పటికీ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో చూపించబడుతున్నా, స్కూలు మఱియు స్వచ్ఛంద సంస్థ జుగల్ కొత్త భార్య ఆధ్వర్యంలో బాగానే నడుస్తున్నా జుగల్ మాత్రం నరాల వ్యాధి మూలంగా సినిమా తీసిన కొంత కాలానికే మరణించారు.

మానబ్ లాంటి యువకులకు జగల్ జీవితం ఒక మార్గదర్శకం అవుతుంది. ఒక రకంగా రెండు సినిమాలు చెప్పాలనుకుంటుంది ఒక్కటే, అందులో ఏది బాగా సఫలమయ్యింది అని నన్నడిగితే డాకుమెంటరీనే అంటాను. ఎందుకంటే పై సినిమాలో చెప్పదలచుకుంది క్రింది దాంట్లో చేసి చూపించారు!

లంకెలు
సంజీవ్ యొక్క సినిమా మఱియు గ్రంథ బాంధవం గరించి

4 Comments
  1. మంజుల January 30, 2008 /
  2. వెంకట్ January 30, 2008 /
  3. Koresh March 15, 2008 /