Menu

నేను చూసిన సావిత్రి

savitri.jpgకొన్నాళ్ళ క్రితం వరకు నటి సావిత్రి అంటే – “పాత సినిమాల హీరోయిన్. ఎవర్ని ఇంటర్వ్యూ చేసి పేపర్లో వేసినా అభిమాన నటి అంటే సావిత్రి అంటారు. పొట్టిగా, లావుగా ఉంటుంది. అసలీవిడ హీరోయిన్ అయితే అయింది కానీపెద్ద హీరోయిన్ అయింది ఆ సినిమాలు బాగుండడం వల్ల.” అన్నట్లు అనుకునేదాన్ని. అలా అని సావిత్రి అంటే అయిష్టమేమీ కాదు. ఐఎండీబీ లో లిస్టు చూస్తుంటే అర్థమైంది..ఆవిడ నటించిన సినిమాలు చాలా మటుకు నేను చూసానని. వీటిలో నాకు బాగా నచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ..ఎందుకో గానీ నేను ఆ సినిమాలను బట్టి సావిత్రి మహానటి అన్న విషయం అర్థం చేసుకోలేకపోయాను అప్పట్లో. ఇదిలా ఉండగా, ఓ రోజు టీవీ లో కన్యాశుల్కంవచ్చింది. అక్కడ్నుంచి మొదలైంది నేను చూసిన సావిత్రిలో సెకండ్ ఇన్నింగ్స్. నాకు సినిమా అయిపోయాక కూడా సావిత్రే కనిపిస్తూ ఉండింది. సినిమా అంతా కూడా ఆవిడే కనిపించింది. సావిత్రి అంటేఇంత బాగా చేస్తుందన్న మాట అనుకున్నా. నిస్సందేహంగా ఆ సినిమా పాపులర్ అయిందంటే మూల కారణం సావిత్రే అని అనిపించింది ఆరోజు నాకు. యాధృచ్చికమో ఏమో కానీ, తరువాత నేను వరుసగా చూసిన ఒక్కో సావిత్రి సినిమా నాకు ఆమెలోని ఒక్కో కోణాన్ని చూపింది. ఆ సరికే నేను ఆమె అభిమానిని అయ్యాను. అప్పటికే చాలాసార్లు చూసినా కూడా, ఆ దశలో మరోసారి మాయాబజార్సినిమానీ, ముఖ్యంగా అహ నా పెళ్ళంటపాటనీ చూసాక నేను ఆమె వీరాభిమానిని అయిపోయాను. నా తరం వచ్చినా కూడా సావిత్రి ని అభిమానిస్తున్న వాళ్ళు ఉన్నారంటేనే అర్థమౌతోంది ఆమెలో ఉన్నదేమిటోసావిత్రి ని సమీక్షించేంత వయసు,అనుభవమూ,మేధస్సూ లేవు కానీసావిత్రి సినిమాల్లో నాకు నచ్చిన కొన్నింటి గురించి ఇక్కడ చెప్పడం ఈ వ్యాసం లక్ష్యం. అంటే, మిగితా పాత్రలు బాలేవని కాదు. ఇక్కడ చెబుతున్న పాత్రలు నన్ను బాగా కదిలించినవి అన్నది మొదటి కారణమైతే,స్థలాభావం రెండో కారణం. అఫ్కోర్సు, ఆవిడ గురించి ఎంత పొగిడినా కూడా అది చర్వితచరణం లా అనిపిస్తుంది అనుకోండి, అది వేరే సంగతి.”కన్యాశుల్కంచూసాక చూసిన సినిమా దేవదాసు“. సావిత్రి ని చూస్తే నిజంగా పార్వతి ఇలానే ఉండి ఉంటుంది ఏమో అనిపించింది. నేను అదో ట్రాన్స్ లో చూసాను ఆ సినిమాని, సావిత్రిని. సావిత్రి తో పాటే నవ్వాను, ఆవిడ తో పాటే ఏడ్చాను. దాదాపు ఓ సంవత్సరం క్రితం మొదటిసారి మిస్సమ్మసినిమా పూర్తిగా చూసాను. ఎన్ని సార్లు నవ్వానో లెక్కలేదు. అది సావిత్రి కోసమని తయారు చేసిన పాత్ర కాదు. “పడక్కుర్చీ కబుర్లులో అన్నట్లు భానుమతి గారి కోసం టైలర్ మేడ్పాత్ర. సాధారణంగా సావిత్రి అంటే ఇతర సినిమాలు చూసి మనకున్న భావనకి భిన్నంగా ఉంటుంది మిస్సమ్మ లో. అయినప్పటికీ కూడాఇప్పటికీ మిస్సమ్మచూస్తే సావిత్రి ఆ పాత్ర లోకి ఎంతగా ఒదిగిపోయిందో అర్థమౌతుంది. అక్కడెక్కడా సావిత్రి కనబడదు. మిస్సమ్మే కనిపిస్తుంది. తర్వాత గుర్తొచ్చేది – “గుండమ్మ కథ“. నేను ప్రధానంగా సూర్యకాంతం అభిమానిని. నాకు చాలారోజుల్దాకా గుండమ్మకథ అంటే ఆవిడే గుర్తొచ్చేది. సూర్యకాంతమ్మ ని గమనించడం లో మునిగి సావిత్రి ని చూడలేదు కానీ, ఆ కళ్ళతోనే ఎన్ని భావాలు పలికించిందో! అసలు ఆవిడ కళ్ళలోనే ఆ పాత్ర స్వభావమంతా ప్రదర్శించింది. ఆ కళ్ళలో పలకని భావం లేదు. కళ్ళు మాట్లాడతాయి అంటే అదే కాబోలు. “ఆరాధననాకు నచ్చిన మరో సినిమా. ఈ సినిమాలో సావిత్రి పాత్ర రకరకాల ఉద్వేగాలకు లోనౌతుంది. సావిత్రి గారికి అదెంతపని చెప్పండి, అవలీలగా చేసేసింది. “మంచి మనసులుసినిమాలో కూడా ఇలాంటిదే పాత్ర. “త్యాగం ఇదియేనా..”,”యేమండోయ్ శ్రీవారూ…” పాటలు రెండూ అసలు పూర్తి వ్యతిరేకమైన మనస్థితి లోవి. అసలు ఇదంతా ఎందుకండీసావిత్రి ఏం చేసినా అది ఆ పాత్రలా ఉంటుంది కానీ ఆమెలా ఉండదు. ఇప్పుడీ వ్యాసం రాస్తూ ఉంటే అనిపిస్తోంది, “వెలుగునీడలు“,”డాక్టర్ చక్రవర్తి“,”చదువుకున్న అమ్మాయిలు“, “తోడికోడళ్ళు” – ఇలా ఈ సినిమాల్లో సావిత్రి వేసిన పాత్రలన్నీ ఆమె కోసమే తయారు చేసారా? అని. అన్నీ దాదాపు ఒక తరహా పాత్రలే. అయినప్పటికీ మనకెప్పుడూ బోరు కొట్టలేదంటే, దానికి వేరే కారణాలెన్నున్నా కూడా, సావిత్రి ఓ ముఖ్య కారణం. అవి ఆమె చేసిన పాత్రలు కనుక బోరు కొట్టలేదు. “తల్లిదండ్రులు“,”మరో ప్రపంచం“- రెండింటిలో వేసిన మాత్రలు కూడా ప్రేక్షకురాలిగా నేను మర్చిపోలేని పాత్రలు.

ఇన్నిరాసి మాయాబజార్గురించి ఒక్క ముక్కేనా? అనుకుంటున్న వారికి కావాలనే రాయలేదు. చివర్న రాద్దాం అని. అహ నా పెళ్ళంటపాత ని ఎన్నిసార్లు చూసిఉంటానో. చూసిందే మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండిపోయిన సంధర్భాలు ఉన్నాయి. అసలు, అక్కడ ఒక మనిషి అలా ఇద్దరు మనుషులుగా లిప్త పాటు లో స్ప్లిట్ పర్సనాలిటీ లా ఎలా చేసిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సావిత్రికే సాధ్యం. “నవరాత్రిసినిమా కూడా మాయాబజార్లానే మర్చిపోలేను నేను. అవతలివైపు నాగేశ్వరరావు తొమ్మిది పాత్రలు వేయడం ఒక ఎత్తు. సావిత్రి కూడా తొమ్మిది రకాలుగా స్పందించింది ఒక్కో పాత్రతోనూ ఒక్కో రకంగా. ఇలా ఎందరూ చేయగలరు చెప్పండి? ఆ సినిమా అయిడియా నే విచిత్రంగా ఉంది నాకు ఇంకా. ఈ సినిమా టైటిల్స్ వేస్తున్నప్పుడు గాయకుల/గాయనుల జాబితా లో సావిత్రి పేరు కూడా వేసారు. నేనదే మొదటిసారి ఆమె పేరుని పాటలు పాడేవాళ్ళ పేర్లలో కూడా చూడడం. బహుశా, అదే ఆఖరేమో, నాకు తెలీదు.

ఈ సినిమాలన్నీ ఎన్నిసార్లు చూసినాకూడా బోరు కొట్టకపోవడానికి కారణం సావిత్రి మాత్రమే అని నేను అనడం లేదు. సావిత్రి కూడా అని మాత్రమే అంటున్నాను. ఆ హీరో హీరోయిన్లూ, కేరెక్టర్ ఆర్టిస్టులు, దర్శకులూ, సంగీత దర్శకులూ, గాయకులూ, రచయితలూ(మాటాపాటా రెండూనూ) – ఈ కాంబినేషన్లు తెలుగులో దొరకడం తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టమనే అనిపిస్తుంది నాకు. సావిత్రి అన్న పేరు తలుచుకోగానే అదోవిధమైన నొస్టాల్జియా కలుగుతుంది ఏదో నా తరం నటి అయినట్లు. నిజానికి ఎప్పటి మాయాబజార్, ఎప్పటి మిస్సమ్మ, ఎప్పటి దేవదాసు? అవి వచ్చి యాభై ఏళ్ళు డాతింది. ఇంకా మనం చూసి ఆనందిస్తున్నామంటే, ఈ తరం లో కూడా సావిత్రికి అభిమానులున్నారంటే అంతకంటే సాక్ష్యం ఏమి కావాలి సావిత్రి గొప్పదనానికి?

9 Comments
  1. వెంకట్ December 18, 2007 /
  2. ramakrishna January 2, 2008 /
  3. Manjula January 10, 2008 /
  4. kalcha March 8, 2008 /
  5. రాజేంద్ర కుమార్ దేవరపల్లి March 9, 2008 /
  6. kalcha March 10, 2008 /
  7. C.M.BOMMUL REDDY July 9, 2008 /
  8. M.Murali Krishna September 5, 2008 /
  9. M.Murali Krishna September 5, 2008 /