కధను గాలికి వదిలేసిన తెలుగు సినిమా

భారతీయ చలనచిత్రాల్లో కళాఖండాలు అన్నవి ఒక వంద లెక్కేస్తే ఆయన దర్శకత్వం వహించినవో ఆయిదు ఉంటాయి.తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్ర్రాలో ఒక పాతిక జాబితా రాస్తే ఆ మహనీయుడి చిత్రాలు అన్నీ ఉంటాయి.నా తదనంతరం ఇక ఇలాంటి సినిమలు రావూ అని నిశ్చయంగా తెలిసినట్లే తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల అన్నట్లు నిక్కమైన నీలాలే మనకిచ్చి మహానుభావుల్లో కలిసిపోయాడు.

తెలుగు సినిమాకో దిశానిర్దేశం చేసి, మంచి సినిమా అంటే తను తీసిన సినిమాల ద్వారా నిర్వచించి,గొప్ప చలన చిత్రాలకో గ్రామరూ, కళాఖండాలకో గ్లామరూ తయారు చేసి చూపాడు.సాహిత్యం లో తప్ప క్లాసిక్స్ అనేవి తెలుగుసినిమాల్లో రావూ అనే వాదాన్ని తుత్తునియలు చేశాడు. ఆయనే మల్లీశ్వరి, బంగారు పాప, పూజాఫలం, రాజమకుటం, వంటి అద్బుత చిత్రాలను మనకు అందించి తెలుగు సినిమా బావుటాను విశ్వవిఖ్యాతం చేసిన బి.యన్.రెడ్డి.

భారీ కాన్వాసు తీసుకుని అంత కన్నాపెద్ద తారాగణం వాటి మోజు లో పడి కధాకధనాలకు న్యాయం చేయలేకపోయిన ఆనాటి దర్శకులముందు బి.యన్. హిమాలయ శిఖర సమానుడు.పోయిన శతాబ్దపు మూడు,నాలుగు,అయిదు దశాబ్దాలలోకూడా హంగూ,ఆర్భాటాల మీద తప్ప కధలొ దమ్ము లేకుండా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి అనేది నమ్మశక్యం కాని నిజం.కాలక్రమంలో స్వర్ణయుగం అంతరించి ఆనాటి బంగారు కాంతులు పలచబడుతూ వస్తున్న వస్తున్న కాలంలో బి.యన్.ఒక సందర్భంలో తన మనోభావాలను పంచుకున్నారు.

“ఒకనాడు సినిమా తీస్తే ఆ సినిమాలో కధాంశం ఏమిటి?ఆదర్శం ఏమిటి?ఆశయం ఏమిటి?అదిచ్చే సందేశం ఏమిటి?అని కూలంకషంగా చర్చించేవాళ్ళం,ఆ విషయాలు తేలాక కధ రాసుకునేవాళ్ళం,పాత్రలను మలచుకునేవాళ్ళం.పాత్రలను బట్టి నటులను ఎన్నుకునేవాళ్ళం.ఆనాడు పాత్రల స్వభావానికి నటులు ఒదిగి ఉండేవాళ్ళు.భాషను కూడా పాత్రల స్వభావాన్ని బట్టే ఎంపిక చేసేవాళ్ళం ..మనకు అనేక ప్రాంతాలు,ఒకదానికొకటి అందికాపొందికా లేని మాండలిక ప్రత్యేకతలూ ఉన్నాయి.అందువల్ల మేము సినిమాలు తీసిన తొలినాళ్ళలో ఏ ప్రాంతపు భాష సార్వజనీనంగా ఉంటుదన్న విషయం గూడా తర్జనభర్జనలు జరిపి,ఉన్నవ లక్స్మీనారాయణ గారు “మాలపల్లి”లో వాడిన భాష ఆంధ్రదేశానికంతటికీ సరిపోతుందని భావించాం.

చిత్రంలో యధార్ధ జీవితాన్ని చిత్రించేటప్పుడు ఒక్క వాతావరణం మాత్రం చూపితే సరిపోదు.భాషలో,పాత్రల స్వభావంలో,వారి నటనారీతిలో అన్నిటా వాస్తవిక అనుభూతి కల్పించగలగాలి.దానికి దర్శకునికీ,రచయితకూ తెలుగు దేశ సాంఘిక జీవన సరళిపై మంచి పట్టు ఉండాలి.ఉదాహరణకు నేను తీసిన ’వందేమాతరం’చిత్రంలో రైతు కుటుంబాలను చిత్రీకరించాల్సివచ్చినప్పుడు నాకు తెలిసిన నా ప్రాంతపు (రాయలసీమ)రైతు కుటుంబాలను చిత్రించాను. నేను పుట్టిపెరిగిన వాతావరణాన్ని ముమ్మూర్తులా చలన చిత్రంలో ప్రతిబింబించాను.చలనచిత్రం సహజత్వానికి దగ్గరగా ఉండాలంటే ఏపాత్రలను,ఏప్రాంతాలను దృష్టిలో పెట్టుకున్నామో ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు,కట్టుబాట్లు,ఆయా వ్యక్తుల రాగదేషాలూ అన్నింటిలో దర్శకునికీ,కళాదర్శకునికీ పరిచయం ఉండటం అవసరం.ఆనాడు వీటిని తెలుసుకుని,కధాకధనం చెడకుండా చిత్రాలను నిర్మించాలనే జిజ్ఞాస ఉండేది .అందుకే ఒక చిత్రం నిర్మించాక మరో చిత్రం నిర్మించాలంటే ,ఇందులో ఏమి చెప్పాలనేది మాకు పెద్ద సమస్యగా ఉండేది. ” థీం ” కోసం చాలా కాలం ఆలోచించవలసి వచ్చేది.

నేడు అదంతా ‘ మనవాళ్ళకు ‘ అపహాస్యంగా కనిపిస్తుంది.సినిమాకు కధేమిటి? హీరో కాల్షీట్లు ఇస్తే సరి- అన్నంత దూరం పయ నించింది మన చిత్ర పరిశ్రమ. చిత్రాన్ని వ్యాపార దృష్టితో తీసేటప్పుడు కధ, ఆదర్శాలు అనవసరం. కావలసిందల్లా ప్రజలను కవ్వించటం, గ్లామర్, పెద్దతారల పాపులారిటీ, పర్సనాలిటీ, అభిమానులు, అభిమాన సంఘాలు–వీళ్ళందరికీ సరిపడే పాళ్ళలో మసాలా వేసి వండడం -ఇలా ఏది చేస్తే అది ఘనకార్యం, ఏది తీస్తే అది అధ్భుతకళాఖండం!

చలనచిత్ర పరిశ్రమ నేడు ఫక్తు టోకు వ్యాపారం. ఎన్ని వారాలు నడిస్తే అంత కళాఖండం, చిత్రంలో ఏదీ లేకున్నా అలా రాయించుకుంటాం. ఈ వ్యాపార చిత్రాలకే ప్రభుత్వం ” ఆవార్డు” లు ఇస్తూ ఉంది. రాజు మెచ్చింది రంభగా కేమౌతుంది?

అవాస్తవికత వాస్తవికతగా రాజ్యమేలుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ,కొత్తగా కొన్ని పెద్దపెద్ద నినాదాలను వల్లిస్తూఉంది.ఇందులో హీరో ధనిక వర్గం నశించాలి అని నినాదం ఇస్తూ ఉంటాడు.ఆ హీరో నాలుగు వేళ్ళకూ ఉంగరాలు మెరిసి పోతుంటాయి.’అయ్యా హీరో గారూ మీరు వేస్తున్నది కార్మికుడి వేషం,ఒక పూట తింటే మరో పూట పస్తుండే వేషం,చేతులకు ఉంగరాలు ఉండగూడదని ఎవరైనా హీరో గారికి చెప్పే దమ్ములున్నాయా?హీరో,సాదాసీదాగా పాత్రకు అనుగుణ్యంగా కనిపిస్తే హీరో ఇమేజ్ దెబ్బ తింటుంది.అందుకే మన చలన చిత్రాలు సామ్యవాదాన్ని టోకున కొని చిల్లరగా అమ్మాలని ప్రయత్నిస్తున్నాయి.

నేడు మనచిత్ర పరిశ్రమ ఒక విష వలయం లో కొట్టుమిట్టాడుతుంది.భారీ తారాగణం,పంపిణీ వ్యవస్థా,థియేటర్ యజమానుల కభంధ హస్తాల్లో పడి నలిగిపోతూ ఉంది.దీనిని ఛేదించటమెలా?పంపిణీదార్లకు వ్యాపారరీత్యా హిట్ అయ్యే కధ కావాలి,ఫలానా తార కాని,తారడు కానీ కావాలి.ఆ ఫలానా తారడికి,తారకూ కధ తన చుట్టూ గిరి గీసుకుని మరీ తిరగాలి,ఇక థియేటర్ల యజమానులకు ఈ స్టార్ సిష్టం తో పాటు రంగుల హంగులూ కావాలి.ఈ ముగ్గురినీ సంతృప్తి పరచవలసి వచ్చేసరికి తెలుగు సినిమా పంచ కూళ్ళ కషాయం లా తయారౌతోంది.రచయితలు కూడా ఈ సినిమాలను చూసి చెడుతున్నారు. నాలుగు సినిమాలు చూసి ఒక నవలను వండే పరిస్తితికి నవలా రచయితలూ,పది సినిమాలలోని సన్నివేశాలను ఏరి ఒక సినిమా రాసే సినీ రచయితలూ తయారయ్యారు.ఇక ఈ పరిశ్రమ బాగుపడేదెట్లా?తెలుగు సినిమా బాగుపడాలంటే — పంపిణీ వ్యవస్థ జాతీయం కావాలి–థియేటర్ యజమానుల కంట్రోలు పోవాలి–స్టార్ సిస్టం రద్దు కావాలి.దర్శకునికి జాతి జీవితం గురించి తెలియాలి.రచయితలు సినిమాలు కాపీ కొట్టి రచనలు సాగించే పద్దతి అంతం కావాలి.ప్రేక్షకుడు కధకు ప్రాముఖ్యమిచ్చే స్థాయికి ఎదగాలి.ఇన్ని బాధలు తెలుగు సినిమా పడలేదు.అందుకే గ్లామర్ ని సర్వరోగనివారిణిగా ఎంచుకుంది!

–అభ్యుదయ మాసపత్రిక అక్టోబరు 1976 సంచిక లోని వ్యాసం ఆధారంగా