Menu

చంద్రహారం (1954)

చంద్రహారం – 1954. ఈ సినిమా పేరు విన్నవాళ్ళు ఎంత మంది ఉన్నారు అన్నది అనుమానమే. నాకైతే మొన్నామధ్య సావిత్రి గురించి చూస్తున్నప్పుడు ఐఎండీబీ పేజీ చూసినప్పుడే తెలిసింది, ఆ పేరుతో ఓ సినిమా ఉంది, అందులో ఎన్‌టీఆర్ హీరో అని. ఇది విజయా వారి సినిమా. దర్శకత్వం కమలాకర కామేశ్వర రావు, సంగీతం ఘంటశాల. ఫొటోగ్రఫీ మార్కస్ బార్ట్లే. యాధృచ్ఛికంగా ఆ సినిమా చూసే అవకాశం వచ్చింది నిన్ననే. చూసాక దీని గురించి రాయడం అవసరం అనిపించింది. కొన్ని కారణాలు –
1. దీని కథ ని ఎక్కడా ఎవరూ ప్రస్తావించినట్లు లేరు. ఆన్లైన్ శోధనలో కనబడలేదు.
2. సావిత్రి ని ఇలా నెగిటివ్ పాత్ర లో చూడ్డం, ఆమె పూర్తి స్థాయి సంప్రదాయ నృత్య ప్రదర్శన ఇవ్వడం నేను చూడ్డం ఇదే మొదటిసారి.
3. ఈ సినిమా లో “ఆంగికం భువనం యశ్చ..” శ్లోకం చిత్రీకరించిన విధానం.
4. రేలంగి చెడ్డవాడు, సూర్యకాంతం మంచిది ఇందులో.
5. రేలంగి, సూర్యకాంతం, ఎన్‌టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి – అందరూ సన్నగా, చిన్నగా ఉన్నారు ఇందులో. 🙂 ఆలసించిన ఆశాభంగమన్నట్లు – తరువాత్తరువాత ప్రజలకి ఆ అదృష్టం పోయింది.

కథ విషయానికొస్తే – ఒక రాజు, ఒక రాణి. వాళ్ళకి మగసంతానం ఉండదు. వాళ్ళ కూతురు సూర్యకాంతం, అల్లుడు రేలంగి. ఒకానొక దశలో రాజు రేలంగి కి పట్టాభిషేకం చేయిద్దాం అనుకుంటున్న సమయం లో ఎవరో ముని రాజుగారికి పుత్రుడు పుట్టే వరం ఫలం రూపం లో ఇస్తాడు. రేలంగి పైకి నవ్వుతూ ఉన్నా లోలోపల ఏడుస్తూ ఉంటాడు – తనకి ఇక సింహాసనం దక్కదని. చివరికి రాజుకు కొడుకు పుడతాడు, పేరు చందనుడు. కానీ, అతనికో శాపం. అతని మెడలో ఎల్లప్పుడూ ఓ చంద్రహారం ఉండాల్సిందే. అది పోయిందా, అతనిలో ప్రాణం ఉండదు. చలనం లేకుండా ఉండిపోతాడు. అతనికి ఓ దేవకన్య వల్ల అపాయం ఉందని విజ్ఞులు అంటారు. అయితే, యుక్తవయస్సు వచ్చేసరికి పెళ్ళి చేసేస్తే అతనికింకే సమస్యా ఉండదని అంటారు. చందనరాజు పెద్దవాడౌతాడు – అతనే ఎన్‌టీఆర్. చందనరాజు ఒక యువతి బొమ్మ చిత్రిస్తాడు – తన ఊహాసుందరి. ఆమెనే పెళ్ళి చేసుకోవాలని అతని ఆశ. ఆమే గౌరి (శ్రీరంజని) – ఈ సినిమా హీరోయిన్. ఈ విషయం తెలుసుకున్న ధూమకేతు (రేలంగి) తన ఆంతరంగిక మంత్రి అయిన నిక్షేప రాయుడ్ని పంపి ఆ అమ్మాయి ఎక్కడున్నా ఆమెకీ చందనరాజుకీ పెళ్ళి జరక్కుండా చూడమంటాడు – అప్పుడు రాజు బ్రహ్మచారిగా ఉంటాడు, గండం వచ్చి మరణిస్తాడు, తను రాజు కావొచ్చు అన్న ఆలోచనతో. గౌరి సవతి తల్లి (ఋష్యేంద్రమణి) ఆమెని హింసలు పెడుతూ ఉంటుంది. గౌరిని ఒక పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళి చేద్దాం అని చూస్తూ ఉంటే ఆమె తండ్రి అది చూసి తట్టుకోలేక ఆమెని ఇంట్లోంచి ఎటైనా వెళ్ళమని సలహా ఇస్తాడు.

ఇదిలా ఉండగా, తన ఊహాసుందరి దొరక్క దిగులుగా ఉన్న చందనరాజుని చూసి ఆకాశాన వెళుతున్న దేవకన్య చంచల (సావిత్రి) ప్రేమిస్తుంది. అతన్ని సమీపించి తన ప్రేమని వ్యక్తపరిస్తే అతను తిరస్కరించడం తో అతని చంద్రహారం తీసుకుని తనలోకం వెళ్ళిపోతుంది. విగతజీవుడైన చందనరాజుని చూసి అందరూ దిగులుచెందుతూ ఉంటే ధూమకేతు సంతోషిస్తాడు. చందనరాజు చంచల శాపం వల్ల రోజులో రెండు ఘడియలు మాత్రం చంద్రహారం అతని మెడను చేరడం వల్ల ప్రాణం పొందడమూ, మళ్ళీ దీర్ఘ నిద్రలోకి వెళ్ళడమూ జరుగుతూ ఉంటుంది. ఇది అతని మాలి కి(ఎస్వీఆర్) కి తప్ప ఇంకోళ్ళకి తెలీదు. ఈ సమయం లో దైవశక్తి వల్ల గౌరి చందన రాజు ఓ రాత్రి మేల్కునే సమయానికి అతని ముందు నిలుస్తుంది. అక్కడే మాలి వాళ్ళిద్దరికి గాంధర్వ వివాహం చేస్తాడు. గౌరి చంచల ను బ్రతిమాలుకుంటుంది – నా భర్త ను వదిలిపెట్టు అని. కానీ, చంచల వినదు. ఇలా గడుస్తూ ఉండగా ధూమకేతు, నిక్షేపరాయుళ్ళు చందనరాజు దేహాన్ని కాల్చేద్దాం అని కుట్ర చేస్తారు. ఈ సమయం లో గౌరి దేవతలను ప్రార్థిస్తే, ఆమె భక్తి వల్ల చందనుడి శాపం పోవడమూ, చంచల ని ఇంద్రుడు సిక్షించడం తో కథ ముగుస్తుంది.

ఈ కథ లో సంభాషణలు చాలా చోట్ల హాస్యస్పోరకంగా ఉన్నాయి. ఇప్పుడు టక్కుమని గుర్తొచ్చే డైలాగు – రేలంగి ఆ నిక్షేపరాయుడి పాత్రధారి తో అంటాడు – “నువ్వు నా ఆంతరంగిక మంత్రివి. నేను రాజునైతే బహిరంగ మంత్రివి”. మాటలు రాసింది పింగళి. బాగున్నాయి సంభాషణలు. పాత్రల ఆహార్యం విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నట్లు అనిపించింది. సెట్లు కూడా కొన్ని చోట్ల బాగున్నాయి. కళాధర్, గోఖలే – ఆర్ట్ డైరెక్టర్లు. దేవసభ లో సావిత్రి డాన్స్ ఒకటి ఉంది. అది యధావిధిగా – “ఆంగికం భువనం యస్య, వాచికం సర్వ వాఙ్మయం.. ఆహార్యాం చంద్ర తారాది… తం వందే సాత్వికం శివం.” అంటూ మొదలౌతుంది. ఇదివరలో స్వర్ణకమలం లో ఇది బోలెడు సార్లు విన్నాకానీ, ఎప్పుడూ “అంటే ఏంటి?” అని ఆలోచించలేదు. కానీ, ఇందులో, అది వస్తున్నప్పుడు, పక్కనే – భూమి, తాళపత్రాలు అవీ, చంద్రుడు, నక్షత్రాలు చూపిస్తూ ఉన్నారు – వాటి ప్రస్తావన వచ్చినప్పుడు. చివర్న నటరాజుని చూపారు. ఆ భాగం తీసినవిధానం నాకు చాలా నచ్చింది. ఇప్పుడిక ఆ శ్లోకం నోటికి వచ్చేసింది నాకు. ఇంకో విషయం – సూర్యకాంతం తరువాతి సినిమాల్లో గయ్యాళి నటన ఈ సినిమాలో ఋష్యేంద్రమణి ని చూసే నేర్చుకుందా అనిపించింది. నాకు ఆవిడ్ని చూసినంతసేపు గుండమ్మ కథ లో సూర్యకాంతం లానే అనిపించింది. అసలైతే, సూర్యకాంతం కన్నా కమాండింగ్ గా అనిపించింది ఈవిడ.

పాటలు కాస్త బోరు కొట్టించాయి తప్పితే ఈ సినిమా మిగితా అన్ని విధాలుగా మంచి ఎంటర్‌టైనర్. నాకు పింగళి నాగేంద్ర రావు మాటలు రాసిన సినిమాలన్నీ చూడాలనుంది. విజయా వారు తీసిన మిగితా సినిమాలు కూడా చూడాలని ఉంది.. 🙂

8 Comments
  1. Paruchuri Sreenivas January 2, 2008 /
  2. cbrao January 2, 2008 /
  3. కొత్తపాళీ January 3, 2008 /
  4. Chetana January 3, 2008 /
  5. రాజేంద్ర January 5, 2008 /
  6. Gauri February 17, 2008 /
  7. రానారె February 15, 2009 /