Menu

లండన్ చిత్రోత్సవం – నా అనుభవాలు – part 2

ఆదివారం ఉదయాన్నే ప్రెస్ స్క్రీనింగ్లో The Band’s visit అనే ఇజ్రాయిల్ సినిమా చూసాను.అవకాశం దొరికితే ఈ సినిమా తప్పక చూడండి. మానవ సంబంధాలను అధ్భుతంగా తెరకెక్కించారీ సినిమాలో. ఆ తర్వాత ఒంటిగంట కు మన Big B నటించిన The Last Lear సినిమా ప్రదర్శన జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్ళే సరికి మన జనాలు తండోపతండాలుగా అక్కడికి చేరి వున్నారు. ఎలాగో కష్టాలు పడి ఒక టిక్కెట్టు సాధించి లోపలికెళ్ళాక అమితాబ్ చాలా సేపు ఈ సినిమా గురించి పొగిడారు. సినిమా బాగానే వుంది. కానీ చివరలో డ్రాగింగ్ గా అనిపించింది. సినిమా అయ్యాక అమితాబ్ తో ప్రశ్నా కార్యక్రమంలో ఎవరూ పెద్దగా ఏమీ అడగలేదు. ఒకమ్మాయి- ఈ కార్యక్రమం అయ్యాక మీతో ఫోటొ తీసుకోవచ్చా? ఒకబ్బాయి- మీతో షేక్ హేండ్ చెయ్యొచ్చా? అని అడిగారు. ఇదంతా చూసి నాక్కొంచెం ఆవేశమొచ్చి ఒక వేళ మీరే ఈ సినిమాలో లేకుందా వుంటే ఇంత మంది జనాలీ సినిమాకొచ్చే వారనుకుంటున్నారా అని అడిగాను. ఎందుకు రారు మంచి సినిమాకి ఎప్పుడూ ఆదరణ వుంటుంది అన్నారాయన. అయితే ఇక్కడ మన దేశానికి చెందిన కొన్ని మంచి సినిమాలు ప్రదర్శిస్తుంటే ఈ జనాలందరూ అక్కడికి రారేం అని తిరిగి ప్రశ్నించాను. అందుకు సమాధానం అమితాబ్ నుంచి రాలేదు కానీ ప్రేక్షకులందరూ నన్నదోరకంగా చూసి ఒక స్థాయిలో గొడవపెట్టారు. ఆ గొడవకి అర్థం మూసుకుని కూర్చోమని నాకు బాగానే అర్థమయ్యింది. అయినా ఏమి నిరూపిద్దామనో నువ్వా ప్రశ్న అడిగింది? అని అంతరాత్మ కోపంగా అడిగింది. తప్పయిపోయిందనుకుని లెంపలేసుకుని బయటపడ్డాను.

Last Lear తర్వాత నేను Island of Lost Souls అనే సినిమా చూసాను. అసలా సినిమాని ఎవరు సెలెక్ట్ చేసారో అనిపించింది.సినిమాలో ఏమీ లేదు. ఈ చిత్రోత్సవంలో చూసిన సినిమాలన్నింటిలో చెత్త సినిమా అదే. ఆ సినిమా దెబ్బతో, ఇకనుంచి బాగా రీసెర్చ్ చేసి ఏయే సినిమాలు చూడాలో లిస్టు తయారు చేసుకోవాలనే నిర్ణయానికొచ్చాను.

నా Blackberry ఫోనులో కొంచెం సేపు బ్రౌజింగ్ చేసి El Bano Del Papa మరియు La Zona సినిమాలు చూసి ఆరోజు ని ముగించాలని నిర్ణయానికొచ్చాను. అనుకున్నట్టూగానే ఆ రెండు సినిమాలు చూడడం జరిగింది. ఇందులో ఏల్ భనొ డెల్ ఫప అనేది ఉరుగ్వే కి చెందిన సినిమా. ఈ దేశం చాలా పేద దేశం. ఇక్కడ సినిమాలకి బడ్జెట్ చాలా తక్కువ. సినిమాల్లో నటించే నటులూ, పని చేసే సాంకేతిక నిపుణులూ చాలా సార్లు వుచితంగానే పనిచేస్తారట. ఇవన్నీ ఆ సినిమా మొదలయ్యే ముందు ఆ దర్శకుడే స్వయంగా చెప్పాడు. దాంతో పాటు ఆయన చెప్పిన మరో విషయం నన్ను కదిలించి వేసింది. ఆయన తన సినిమా లండన్ చలనచిత్రోత్సవానికి ఎన్నిక కావడం గురించి కృతజ్ఞతలు చెప్తూ, “ఇందాక ఇక్కడికి వస్తుంటేనూ, ఈ చల్లని సాయంత్రం, దూరంగా అస్తమిస్తున్న సూర్యుడు, చుట్టూ లండన్ నగరం చూసి నాకు చాలా దిగులేసింది. నేను దర్సకుణ్ణి కాబట్టి ఇక్కడి వరకూ రాగలిగాను. నాలాగే నాతో పాటు ఈ సినిమాకి పని చేసిన వాళ్ళందరూ ఈ అందమైన నగరంలో ఇక్కడుండుంటే ఎంత బావుండేదో అని అనిపిస్తుంది. కానీ అది కుదరదని నాకు తెలుసు. ఎందుకంటే మేము పేద వాళ్ళం.” అనడంతో నాకు చాలా బాధ కలిగింది. ఈ సినిమా తర్వాత నేను చూసిన సినిమా La Zona. ఈ సినిమాలో మెక్సికో లోని పేద ధనిక వర్గాల మధ్య ఏర్పడుతున్న బలమైన అడ్డుగోడల యొక్క ఫలితాలను కళ్ళకట్టినట్టుగా చూపిస్తుంది. అవకాశం దొరికితే ఈ సినిమా కూడా మిస్సవ్వకండి.

ఈ సినిమాతో నా వారాంతరమూ ముగిసింది. మళ్ళి పొద్దున లేస్తే ఆఫీసు, పని తలుచుకుంటూ దిగాలుగా మా ఊరి రైలెక్కి కూర్చున్నాను.60 గంటల్లో 11 సినిమాలు చూసిన ఎఫెక్టు ఆ రాత్రి నిద్రలో తెలిసింది. ఆ రాత్రంతా నా నిద్ర స్వప్నలోక విహారంలోనే సరిపోయింది.

ఆ తర్వాత నాలుగు ఐదు రోజులు ఎలా గడిచాయో నాకే తెలియదు. శుక్రవారం మధ్యాహ్నం వరకూ పని ఒత్తిడిలో మునిగిపోయి వున్నప్పటికీ వచ్చే వారం ఏయే సినిమాలు చూడాలో, ఎక్కడెక్కడ చూడాలో ప్లాను చేసుకుని ఎప్పటికప్పుడు మైల్స్ పంపిస్తూ గడిపాను. శుక్రవారం మూడింటికి పని మోడ్ లోనుంచి సినిమా మోడ్ లోకి వచ్చి పడ్డాను. అనుకున్నదే తడవుగా అర్జెంటుగా వెళ్ళి లండన్ రైలెక్కాను.

ముందుగానే టిక్కెట్టు రెక్వెస్టు పంపి వుండడం మూలాన శుక్ర, శని మరియు ఆది వారాలు ఏ సమస్యా లేకుండా 11 సినిమాలు చూడడం జరిగింది. ఆదివారం రాత్రి పదకొండింటికి మా వూరికి తిరిగొద్దామని బయల్దేరుతుంటే నాకొక ఆలోచన కలిగింది. వెంటనే ఆ అర్థరాత్రి మా ప్రోజెక్ట్ మేనేజర్ కి ఫోను చేసి నాకు నాలుగు రోజులు శెలవు కావాలని అడిగాను. ఈ ప్రోజెక్టు కి వచ్చిన సంవత్సరం రోజుల్లో ఒక్క రోజూ శెలవు పెట్టని కారణం చేత నా మాటను కాదనలేకపోయాడు. అయినా ఈ నాలుగు రోజులు శెలవుల్లో ఏం చేస్తావు, మీ ఉత్తమ సగం కూడా ఇక్కడ లేకపోయే అని సందేహం వ్యక్తం చేసాడు.

నా సినిమా పిచ్చి ఆయనకి ముందుగానే తెలుసు కాబట్టి లండన్ చలన చిత్రోత్సవంలో ఈ నాలుగు రోజులు మరో 20 సినిమాలు చూడబోతున్నట్టుగా చెప్పాను. చూసి ఏం చేస్తావు అనడగాడు ఆయన. ఆయనడిగే వరకూ నాకీ అనుమానమే రాలేదు.ఇలా ఏడెనిమిది రోజుల్లో 40 సినిమాలు చూడడం వల్ల నాకేమొస్తుంది అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. చాలానే సమాధానాలు దొరకడంతో ఆ రాత్రి పూట నా ఆర్కుట్ మిత్రున్ని నిద్రలేపా.

సగం నిద్రలో లెయ్యడంతో అతనికి మళ్ళీ నిద్ర పట్టలేదు. ఇద్దరం కలిసి CS రావు కథల సంపుటిలోని ‘మంత్రసానీ కథను ఒక లఘు చిత్రంగా ఎలా మలచవచ్చో చర్చించుకున్నాము. సోమవారం ఉదయం లేవగానే చూసుకుంటే నా దగ్గర వేసుకోదగ్గ బట్టలేమీ కనబడలేదు. నా మిత్రుడు తన బట్టలేసుకోమన్నాడు గానీ మనసొప్పక అలాగే నలిగి పోయిన బట్టలతోనే వెళ్ళి Water Lilies అనే సినిమా దర్శకురాలు Céline Sciamma తో ఇంటర్వ్యూ చేయడం జరిగింది.

మూడేళ్ళ పాటు script writing చదివిన ఈమె ద్వార చాలనే విషయాలు తెలిసాయి.చాలా మంది script writers లాగే ఈమె కూడా Rober Mckee రాసిన Story అనే పుస్తకం చదవమని నాకు సలహా కూడా ఇచ్చింది. ఆ తర్వాత శివాజీ చంద్రభూషణ్ ని కూడా కలుసుకుని ఆయన తీసిన Frozen సినిమా గురించి చాలా సేపు చర్చించుకోవడం జరిగింది. కానీ సమయం చాలక ఆ ఇంటర్వ్యూ మధ్యలోనే ముగించాల్సి వచ్చింది.

ఆ రోజు Mahek అనే సినిమా చూస్తుంటే అక్కడ ప్రెస్ పాస్ తో కనిపించిన మరో వ్యక్తి మన వాడిలాగే కనిపిస్తే ఏ వూరు అనడిగాను. బంగ్లాదేశ్ అని చెప్పాడు. అతని పేరు పలాష్. అతను లండన్ లోని ఒక బంగ్లాదేశీ పత్రికకు సినిమా వ్యాసాలు రాస్తుంటాడని చెప్పాడు. అతనితో పరిచయం వలన నాకు వేరే చాలా మంది సినీ ప్రముఖలను కలిసే అవకాశం కలిగింది. నాక్కావలిసిన కొన్ని సినిమాలు ఆయన దగ్గర వుండడం, అతనికి కావలిసిన కొన్ని సినిమాలు నాదగ్గర వుండడమే కాకుండా సినిమాల గురించి మాఇద్దరి అభిరుచులూ ఒక్కటే కావడంతో మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. అతను నన్ను అంతర్జాతీయ సినిమా విమర్శకుల సంఘమైన FIPRESCI లో సభ్యత్వం కోసం నమోదు చేసుకోమని సలహా కూడా ఇచ్చాడు. నాకంతటి అర్హత వుందో లేదో అన్న అనుమానం నాకిప్పటికీ వుంది. అంతే కాకుండా అతను తీస్తున్న ఒక డాక్యుమెంటరీ చిత్రానికి నాకు ఎడిటర్ గా కూడా అవకాశం ఇచ్చాడు.

ఇలానే బుధవారం రోజు మరో ఆవిడని కలవడం జరిగింది. చూడ్డానికి బెంగాళి లా వుండడంతో వెళ్ళి పరిచయం చెసుకున్నాను. ఆవిడ సత్యజిత్ రే foundation ద్వారా మొదటి సినిమా దర్శకులకు ఇచ్చే సినిమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుందని తెలుసుకున్నాను. నా దృష్టిలో California Dreamin’ సినిమాకి తప్పకుండా ఆ అవార్డు దొరుకుతుందని అనిపించినా నా వంతు సాయంగా El Bano Del Papa సినిమాకి ఆ అవార్డు వచ్చేలా చూడండి అని ఉచిత సలహా ఇచ్చాను. కానీ చివరికి California Dreamin’ సినిమాకే అవార్డు వచ్చింది.

ఈ సినిమా హడావుడి మధ్యలో మంగళవారం ఒక రెండు గంటల సేపు బట్టలు కొనే కార్యక్రమం కూడా చేర్చుకున్నాను. చాలా సేపు తిరిగాక Primeark అనే షాపులో 5 పౌండ్లు పెట్టి ఒక జీన్సు ప్యాంటు, మరో రెండు పౌండ్లకు రెండు టిషర్ట్ లు కొన్నాను. ఆ షాపు వాళ్ళు బంగ్లాదేశ్ లో పనివారికి కనీస వేతనం చెల్లించకుండా బట్టలు కుట్టించి ఇక్కడ సరళమైన ధరలకి అమ్మేస్తున్నారని తెలిసి అక్కడెప్పుడూ కొనకూడదని అప్పుడెప్పుడో నిర్ణయం తీసుకున్నా మిగిలిన అన్ని షాపుల్లో 25 పౌండ్లు ఖర్చు చేస్తే గానీ ఒక ప్యాంటైనా రాదని తెలిసాక కక్కుర్తి పడి నియమాలకి వ్యతిరేకంగా అక్కడే కొనాల్సి వచ్చింది.

ఇక ఆఖరిరోజు Darjeeling Limited సినిమా చూసి బయటకొస్తుంటే అంతకు ముందు రోజు కలిసిన మన వాలెంటీర్ కురా
డు మరో సారి తారస పడ్డాడు. మాటల్లో ఎవరెవరిని కలిసానో చెప్తూ వుంటే తనూ పోటీ పడి ఎవెరెవర్ని కలిసాడో ఎవరెవరితో ఫోటోలు తీపించుకున్నాడో చూపించాడు. నువ్వెవెరితోనూ ఫోటోలు దిగలేదా అనడిగితే లేదని చెప్పి అక్కడ్నుంచి బయల్దేరాను.

సినిమా పండుగ ముగిసిందని ఒక వైపు దిగులిగానే వున్నా మరో వైపు జీవితంలో పూర్తి స్థాయిలో హాజరయిన మొదటి చిత్రోత్సవ జ్ఞాపకాలు మదిలో మెదిలి సంతోషం కలుగచేస్తుండగా మావూరికి బయల్దేరాను.

ఆ రోజు రైల్లో కూర్చుని రాబోయే ఐదేళ్ళలో నేను తీసిన సినిమా కూడా ఇక్కడ ప్రదర్శింపచేయాలని నేనొక నిర్ణయనికొచ్చాను.ఇంతలో రైలు బయల్దేరింది. నా ప్రయాణమూ మొదలయ్యింది.

7 Comments
  1. రాజశేఖర్ April 6, 2009 /
  2. గీతాచార్య April 6, 2009 /